27, మే 2013, సోమవారం

తెలంగాణతో ముడిపడిన టిడిపి భవితవ్యం... వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టి .. మూడవ తరం వారసునికోసం ముస్తాబవుతున్న తెలుగుదేశం

జీవితంలో సినిమాను మించిన మలుపులుంటాయి. రాజకీయాల్లో సైతం అంతే. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి ఇప్పుడు మూడవ తరం వారసుని కోసం ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల టిడిపి చరిత్రలో సగం కాలం ఎన్టీఆర్, ఆ తరువాత సగం కాలం చంద్రబాబునాయుడు నాయకత్వంలో పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఎన్నికల నాటికి 65 ఏళ్ల వయసుకు చేరుకునే చంద్రబాబునాయుడు అనివార్యంగా వారుసుడ్ని తీర్చిదిద్దుకోవలసిన పరిస్థితి. తొలిసారిగా మహానాడులో చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ వేదిక అలంకరించనున్నారు. దేశంలోని ఓటర్లలో దాదాపు సగం మంది యువతే. రాష్ట్రంలో సైతం అంతే. అనివార్యంగా యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి. అప్పటి వరకు తెర వెనుక టిడిపి రాజకీయాల్లో తన వంతుగా చిన్నపాటి పాత్రను పోషించిన నారా లోకేశ్ మహానాడుతో తన పాత్ర పరిధిని పెంచుకోనున్నారు.

 2009 ఎన్నికలకు ప్రచార వ్యూహంలో సినిమా ప్రముఖులతో పాటు లోకేశ్ భాగస్వామ్యం పంచుకున్నారు. అంతకు ముందు నగదు బదిలీ పథకం లోకేశ్‌దే అని చంద్రబాబు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లో ములాయంసింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి లోకేశ్ పేరు టిడిపిలో బాగా ప్రచారంలోకి వచ్చింది. రెండేళ్ల క్రితం గండిపేటలో జరిగిన మహానాడులో లోకేశ్ కటౌట్లను కొందరు అభిమానులు ఏర్పాటు చేశారు. దీని పట్ల హరికృష్ణ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ఇలా కటౌట్లు ఏర్పాటు చేయడం తగదు అంటూ చంద్రబాబు సున్నితంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈనెల 27,28 తేదీల్లో జరిగే మహానాడులో లోకేశ్ వేదిక అలంకరించనున్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు మహానాడుకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2009లో టిడిపి ఓడిపోయిన తరువాత జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. హరికృష్ణ మాత్రం ప్రతి మహానాడులో పాల్గొంటారు. కానీ ఈసారి ఆయన కనిపించరు, లోకేశ్ కనిపిస్తారు. మామా అల్లుడు బాలకృష్ణ, లోకేశ్ ఈసారి మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
మూడు దశాబ్దాల టిడిపి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనంత గడ్డు పరిస్థితిలో టిడిపి ఉంది. అయితే ప్రమాదాల్లో అవకాశాలు కూడా పొంచి ఉంటాయి. గడ్డు పరిస్థితి నుంచి గట్టేక్కెందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.


 ఇప్పటికి తెలంగాణ అంశం పరిష్కారం అయి ఉంటే టిడిపి పరిస్థితి మరోలా ఉండేది. కాంగ్రెస్, టిడిపిల మధ్య ముఖాముఖి పోరు సాగితే టిడిపి ప్రయాణం నల్లేరు మీద నడకలా ఉండేది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం, డిసెంబర్ తొమ్మిది 2009లో తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో ప్రకటన చేయడంతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు టిడిపికి సమస్యగా మారింది.
ఈ రెండు సమస్యలు లేకపోయి ఉంటే టిడిపి పరిస్థితి మరోలా ఉండేది. 2009 ఎన్నికల్లో ఓటమి టిడిపిని నిరాశ పరిచినా, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాంలే అనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉండేది. కానీ ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణ ఈ రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి ఏ పార్టీ భవిష్యత్తు ఏమిటో అంతు చిక్కని విధంగా మార్చేసింది.


సంక్షోభాలు టిడిపికి కొత్త కాదు ప్రతి సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడం టిడిపికి తెలుసు అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సంక్షోభాలు వేరు ఇప్పుడు తెలంగాణ రూపంలో వచ్చిన సమస్య వేరు. ఈ సమస్య ముగింపుతో టిడిపి భవిష్యత్తు ముడిపడి ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటిస్తే, రెండు ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి అవసరం అయిన యంత్రాంగం టిడిపికి ఉంది. ఒకవేళ తెలంగాణ ఇవ్వడం లేదు అని కేంద్రం ప్రకటించినా టిడిపి దానికి తగ్గట్టు పార్టీ పటిష్టతకు ముందడుకు వేసేది. కానీ కేంద్రం మాత్రం టిడిపిని దృష్టిలో పెట్టుకొనే అటు తెలంగాణ ఇవ్వడం లేదని చెప్పడం లేదు, అలా అని ఇస్తామని చెప్పడం లేదు. ఎటూ తేల్చకుండా ప్రమాదకరమై రాజకీయ క్రీడ ఆడుతోంది. ఈ రాజకీయంలో టిడిపిని దెబ్బతీస్తుందా? లేక తానే దెబ్బతింటుందా? అనేది కాలం తేల్చాలి.
టిడిపికి చంద్రబాబే ప్లస్, చంద్రబాబే మైనస్ అని ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టిడిపికి చంద్రబాబు కాకుండా మరెవరూ నాయకత్వం వహించలేరని చంద్రబాబు వ్యతిరేకించే వారు సైతం చెబుతారు.


2009 తరువాత వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం, సగం నియోజక వర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం టిడిపి శ్రేణులను బాగా కృంగ దీసిన అంశం. అయితే ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సైతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు శక్తి మేరకు కృషి చేశారు. 63 ఏళ్ల వయసులో 2800 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ పాదయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టినప్పుడు అంత దూరం నడవగలరా? అని పార్టీ నాయకులు సైతం అనుమానించారు. పార్టీని బతికించుకోవాలంటే నడవడం అనివార్యం అనుకున్నారు. అప్పటి వరకు జిల్లాల వారిగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు ఇతర పార్టీల వైపు వెళ్లసాగారు. యాత్ర సాగుతున్నప్పుడు సైతం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లారు. అలాంటి పరిస్థితులను సైతం ఎదుర్కొని పార్టీ శ్రేణుల్లో కొంత వరకు విశ్వాసం కలిగించడానికి పాదయాత్ర తొడ్పడింది. చంద్రబాబు అంత సులభంగా ఓటమి అంగీకరించరు, గెలుపు కోసం చివరి వరకు పోరాడుతారు అనే అభిప్రాయం కలిగించడానికి పాదయాత్ర దోహదం చేసింది.


ఎన్టీఆర్ మరణించిన విషయం తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఎన్టీఆర్ నివాసానికి జయప్రదతో పాటు కొందరు నాయకులు వెళ్లగా అభిమానులు రాళ్లతో దాడి జరిపారు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేసి ఆయన మరణానికి కారకులు అయ్యారనే ఆగ్రహంతో దాడులు జరిపారు. ఈ సమయంలో ఎన్టీఆర్ నివాసానికి చంద్రబాబు వెళ్లడం ఒక రకంగా సాహసమే. తగిన భద్రతా ఏర్పాట్లు జరిగిన తరువాతనే చంద్రబాబు ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ఒకవేళ పరిస్థితి ఉద్రిక్తతగా ఉందని చంద్రబాబు ఆ సమయంలో అక్కడకు వెళ్లి ఉండక పోతే ఎన్టీఆర్ మరణానికి బాబే కారణం అని ఎన్టీఆర్ అభిమానుల్లో చంద్రబాబుపై వ్యతిరేకత తీవ్రమయ్యేది. కానీ ఆ కీలక సమయంలో చంద్రబాబు సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనని తరువాత తేలింది. సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు తెలుసు అంటూ పార్టీ సీనియర్లు ఈ సంఘటనను ఉదహరిస్తుంటారు.


ఒక రకంగా ఇలాంటి సంక్షోభ సమయంలో నే చంద్రబాబు సాహసోపేతంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పరిపాలనా దక్షునిగా, రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా మధ్యతరగతి, విద్యావంతులు, నగర ప్రాంతాలు, యువతలో చంద్రబాబుకు ఉన్న అభిమానంపైనే టిడిపి ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ వర్గానిది ప్రచారం ఎక్కువ, ఓట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అధికారం నుంచి దిగిపోయి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఈ వర్గంలో టిడిపికి బాగానే పట్టు ఉంది. ఐటికి అత్యధికంగా ప్రచారం సాగించిన సమయంలోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. చంద్రబాబు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారనే ప్రచారానికి కరవు తోడే టిడిపిని బాగానే దెబ్బతీసింది.


ఎన్నికల సమయానికి ఈ సమస్యను గుర్తించినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. దాంతో 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, ఎన్నికల్లో ఓటమి తరువాత వెంటనే టిడిపి సైతం ఉచిత విద్యుత్ తామూ ఇస్తామని ప్రకటించింది. 2014 ఎన్నికలకు సిద్ధమవుతూ రైతుల రుణ మాఫీ పథకం ప్రకటించింది. అర్బన్ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి పరవాలేదు, గ్రామీణ ప్రాంతాల్లో గెలుపు అవకాశాలకు రుణ మాఫీ ఉపయోగపడుతుందని టిడిపి ఆశిస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ జైలులో ఉన్నాడు, వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడవ సారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పైగా రాష్ట్రంలో అన్నీ సమస్యలే, ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా టిడిపికే జనం అవకాశం కల్పిస్తారు అనేది టిడిపి వాదన. ఇక మరోవైపు సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎప్పుడు ఎక్కువ సీట్లు సాధించలేదు, ఇప్పుడూ అంతే ఇక మిగిలింది మేమే అని చెబుతున్నారు. టిడిపి ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ హయాంలో 89లో మాత్రమే టిడిపి ఓడిపోయింది. చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత 2004,2009లో రెండు సార్లు టిడిపి ఓడిపోయింది. పార్టీ భవిష్యత్తుకు ఈసారి విజయం అనివార్యం. కానీ పరిస్థితులు మాత్రం అయోమయంగా ఉన్నాయి.


వివిధ సర్వేలు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ వస్తే ఎవరు ఎవరితో కలుస్తారో ఆసక్తికరం. ఎన్నికలకు ముందు కలిసే పార్టీలు ఏవి? ఫలితాల తరువాత కలిసే పార్టీలు ఏవి? తెలంగాణ ఇస్తారా? జగన్‌కు బెయిల్ లభిస్తుందా? టిడిపి పుంజుకుంటుందా? కిరణ్ రానిస్తారా? అన్నీ ప్రశ్నలే. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. ఎవరి లెక్కలు వారివి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఊహలు వారివి.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం