3, మే 2013, శుక్రవారం

ఒక కుర్చీ - రెండు పాదయాత్రలు

విశాఖ గిరిజన ప్రాంతాల్లో రంగు రాళ్లు దొరుకుతున్నాయి, మా వీధి వాడికి దొరికాయి అని ఒకరు అనగానే గుంపులు గుంపులుగా అటు పరుగులు తీస్తారు. రంగురాళ్ల కోసం కుటుంబాలకు కుటుంబాలు  రోజుల తరబడి అన్వేషిస్తారు . రొయ్యల చెరువుల్లో రాజుగారు లక్షలు సంపాదించారు అని తెలిస్తే, వందలాది మంది తమ పచ్చని పొలాలను రొయ్యల చెరువులుగా మార్చేస్తారు. స్టాక్ మార్కెట్‌లో అప్పారావుగారి అబ్బాయి లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాడు అనగానే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియకపోయినా ఉన్న ఆస్తి అమ్ముకుని పెట్టుబడి పెట్టిన వారున్నారు. అది రొయ్యల చెరువులు కావచ్చు, ఇంజనీరింగ్ చదువు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు కావచ్చు, మద్యం వ్యాపారం కావచ్చు ఒకరు విజయం సాధించారనగానే పోలో మంటూ అటు పరుగులు తీయడం తెలుగువారి సంప్రదాయం .. ఈ సంప్రదాయం రాజకీయాల్లో సైతం కనిపిస్తోంది .  పాదయాత్ర ద్వారానే వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలుగు దేశం వారి గట్టి నమ్మకం. పోగోట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు వైఎస్‌ఆర్ పాదయాత్ర ద్వారా పోయిన అధికారాన్ని అదే పాదయాత్ర ద్వారా తిరిగి సంపాదించుకోవాలని చంద్రబాబు నడుం కట్టారు. పాదయాత్రతో వైఎస్‌కు కుర్చీ దక్కింది. పాదయాత్రతో బాబుకు దక్కుతుందా?


ఏడునెలల పాటు పాదయాత్ర చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక రికార్డు. దేశంలో రవాణా సౌకర్యాలు ఏ మాత్రం లేని కాలంలో మహాత్మాగాంధీ పాదయాత్రనే నమ్ముకుని దేశాన్ని ఏకం చేశారు. ఆ తరువాత దేశమంతా పాదయాత్ర చేసిన ఘనత చంద్రశేఖర్‌ది. ఆ రికార్డు ఆయనకు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే సమయంలో ఉపయోగపడింది. ఆ తరువాత పాదయాత్ర ద్వారా రాజకీయ ప్రయోజనం పొందింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. కాంగ్రెస్‌లో తనకు ఎదురు లేదని, ప్రత్యర్థులు లేరని వైఎస్‌ఆర్ నిరూపించుకోవడానికి పాదయాత్ర ఉపయోగపడింది.


నిజానికి 1999 ఎన్నికల్లోనే వచ్చే ఎన్నికల్లో టిడిపి పతనం ఖాయం అని తేలిపోయింది. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇది మరింత రూఢీ అయింది. వైఎస్‌ఆర్ కాదు పి జనార్ధన్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసినా కాంగ్రెస్ విజయం సాధించి ఉండేది. అది కాంగ్రెస్ విజయం కాదు. టిడిపి పరాజయం మాత్రమే. 2004లో టిడిపిని ఓడించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కాంగ్రెస్‌కు ఎవరు నాయకత్వం వహించినా టిడిపి ఓడిపోయి ఉండేది. కాంగ్రెస్‌కు నాయకుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తిన సందర్భంలో పాదయాత్ర ద్వారా తానే నాయకుడిని అని నిరూపించుకోవడానికి వైఎస్‌ఆర్‌కు ఉపయోగపడింది. 2009లో వైఎస్‌ఆర్ విజయం సాధించి ఉండవచ్చు, కానీ 2004లో మాత్రం అది ముమ్మాటికి టిడిపి పరాజయమే తప్ప వైఎస్‌ఆర్ విజయం కాదు.
ఒకరు బస్సు యాత్ర అని మరొకరు నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని మరొకరు హై కమాండ్ ద్వారా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్న సమయంలో తనకు దరిదాపుల్లో పోటీకి ఎవరూ లేరని నిరూపించుకోవడానికి వైఎస్‌ఆర్‌కు పాదయాత్ర ఉపయోగపడింది. 


ఇప్పుడు చంద్రబాబుకు ఇలాంటి నాయకత్వ సమస్య ఏమీ లేదు. రెండు సార్లు కాదు మూడవ సారి టిడిపి ఓడిపోయినా ఆయన నాయకత్వానికి వచ్చిన సమస్య ఏమీ ఉండదు. తనంతట తాను వారసుడిని నిర్ణయించాల్సిందే తప్ప ఆయన నాయకత్వాన్ని పార్టీలో సవాలు చేసే వారు లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లాంటి వారు బాబు నాయకత్వాన్ని సవాలు చేసే స్థాయిలో లేరు. గెలిపించినా, నిండా ముంచినా బాబుపైనే తప్ప ఇతరులపై ఆ పార్టీ నాయకులు ఆధారపడే పరిస్థితి లేదు. పార్టీ గెలవదు అనుకున్న వారు మరో పార్టీని చూసుకుంటున్నారు తప్ప పార్టీలోనే ఉండి నాయకత్వాన్ని మార్చాలనే వెర్రి ప్రయత్నాలను ఎవరూ చేయడం లేదు. టిడిపిలో అది సాధ్యం కాదు కూడా!


ఇలాంటి పరిస్థితుల్లో తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకోవడానికి చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో టిఆర్‌ఎస్, సీమాంధ్రలో జగన్ నుంచి వచ్చిన బలమైన సవాళ్లను తట్టుకోవడానికి పాదయాత్రకు మించిన ఉపాయం లేదని చంద్రబాబు భావించారు. గంటల తరబడి ఉపన్యసించడంలో రాష్ట్రంలో చంద్రబాబును మించిన వారు లేరు. సవాలు చేస్తే రోజుల తరబడి మాట్లాడగలరు కూడా. కానీ శారీరక శ్రమతో కూడిన సుదీర్ఘ పాదయాత్ర గురించి ఆయన ప్రకటించగానే చాలా మంది అనుమానించారు. బాబు వల్ల అవుతుందా? అని పాదయాత్రకు బదులు సైకిల్ యాత్ర మంచిదని కొందరు లేదు పాదయాత్రే బెటరని కొందరు సూచించారు. మీదేం పోయింది పాదయాత్ర చేయాల్సింది నేను కదా? అని బాబు సున్నితంగానే తన సమస్య వివరించినట్టు వార్తలు వచ్చాయి. చివరకు అనుకున్న రోజున పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 26న పాదయాత్ర ముగించాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున యాత్ర ముగిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా అనుకున్న దాని కన్నా మూడునెలల తరువాత యాత్ర ముగించారు.


యాత్ర సాగినన్ని రోజులు ఇక బాబు నడవలేరు, కాళ్లు బొబ్బలెక్కాయి, నడిస్తే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించారు అంటూ వార్తలు వచ్చాయి. ఒకసారి రెండు సార్లు కాదు వారానికోసారి ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ బాబు అలానే యాత్ర కొనసాగించారు. ముందుగా అనుకున్నట్టు జనవరిలో యాత్ర ముగించినా హైదరాబాద్ వచ్చి చేసేది ఏముంది అనే ప్రశ్న. తెలంగాణ సమస్య తేలితే కానీ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం స్పష్టం కాదు. ఇలాంటి పరిస్థితిలో యాత్ర ముగించి ఆ సమస్యలో తామూ భాగస్వాములం కావడం కన్నా యాత్ర పేరుతో జనం మధ్యలో ఉండడమే మంచిదని టిడిపి నాయకత్వం భావించింది. పాదయాత్ర వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు అని భావించడం సరికాదు. జగన్, తెలంగాణ ధాటికి పార్టీ చెల్లాచెదురు అయిందనుకున్న సమయంలో పాదయాత్ర ద్వారా బాబు పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక తీసుకు రాగలిగారు. స్తబ్ధతగా ఉన్న పార్టీ యంత్రాంగాన్ని కదలించగలిగారు. ఒక రాజకీయ పార్టీకి ఇది తక్కువ ప్రయోజనం ఏమీ కాదు.

 మీడియాలో వార్తల సైజు పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది అనుకున్న ప్రతిసారి టిడిపి దెబ్బతింటూనే ఉంది. 2009లో మహాకూటమికి వచ్చిన పబ్లిసిటీ మరే పార్టీకి లభించలేదు. కానీ తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మహాకూటమి చతికిలపడింది.  టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే బలమైన వర్గం పాదయాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించింది. జననేత అంటూ అకాశానికెత్తింది. ఒక ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘ పాదయాత్ర సాగించినప్పుడు ప్రచారం లభించడం సహజమే. అయితే నిజంగా ఈ యాత్ర ప్రభావం జనంపై అంతగా ఉందా? అంటే కొన్ని పరిణామాలను చూస్తే ప్రచారం లభించినంతగా జనంపై ప్రభావం చూపలేదు అనే సమాధానం వస్తుంది. విశాఖలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తే , ఆ వెంటనే ఉత్తరాంధ్ర టిడిపి ముఖ్య నాయకుడు దాడి వీరభద్ర రావు పార్టీ వీడి వెళ్లారు  .  బాబు పాదయాత్ర సాగుతుండగానే ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల్లో చేరారు. ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చి లాగేసుకుంటున్నారని పైకి టిడిపి ఎంత ప్రచారం చేసుకున్నా, వాస్తవం ఏమిటో ఆ పార్టీ నాయకత్వానికి తెలియకుండా ఎందుకుంటుంది? ఎన్టీఆర్ బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్నవారు, ఆయన రాకుండా మంగళసూత్రం కూడా కట్టేది లేదని భీష్మించుకున్న ఎమ్మెల్యేలు సైతం బాబునాయకత్వంలో ఎన్టీఆర్‌ను వీడి బయటకు వచ్చినప్పుడు ముందువరుసలో ఉన్నారు. ఎమ్మెల్యే తాను కోరుకునేది మళ్లీ అసెంబ్లీకి ఎన్నిక కావాలని, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని అంతే తప్ప బాబుకు నమ్మిన బంటుగా ఉండి మాజీగా మిగిలిపోవాలని కాదు. ఆ అంచనాల్లో భాగంగానే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. టిడిపి విజయం ఖాయం అనే నమ్మకం పాదయాత్ర కలిగించి ఉంటే ఎమ్మెల్యేలు పార్టీ వీడే వారు కాదు.


తెలంగాణ జిల్లాల్లో బాబుకు మంగళహారతులు, ఘన స్వాగతాలు అంటూ భారీగా ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజక వర్గాలు మూడింటికి ఎన్నిక జరిగితే, టిడిపికి వెయ్యి లోపు ఓట్లు మాత్రమే లభించాయి. పాదయాత్రలో బాబు ఆవేశంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు వీలులేదు, రైతులు గొడ్డళ్ళు పట్టుకొని వీధుల్లోకి రండి అంటూ ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చారు. విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి గైర్హాజరు కావడం ద్వారా ఇరుకున పడింది. బాబు పాదయాత్ర సాగిస్తున్న సమయంలోనే మరోవైపు వైఎస్‌ఆర్ కుమార్తె షర్మిల పాదయాత్ర మొదలుపెట్టారు. బాబు పాదయాత్రను ఆకాశానికెత్తిన మీడియాకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆమె యాత్రను పట్టించుకోవలసిన పరిస్థితి కల్పించింది.
పాదయాత్రలో బాబు కురిపించిన హామీలను ప్రజలు నమ్మారో లేదో కానీ చివరకు పార్టీ శ్రేణులకు సైతం అనుమానాలు కలిగించాయి. సార్ మీరిక ఉచిత హామీలు ఇవ్వకండి జనం మరోలా అర్ధం చేసుకుంటున్నారు అంటూ స్వయంగా పార్టీ కార్యకర్త పాదయాత్రలో చంద్రబాబుకు చెప్పారు. మనది సంక్షేమ రాజ్యం హామీలు తప్పవు అంటూ బాబు చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఎంత వ్యయం అవుతుందో పార్టీ ఇప్పటికీ లెక్క తేల్చలేదు. ఇక 2014 ఎన్నికల కోసం బాబు ఇచ్చిన హామీల అమలు మొత్తం ఎంతవుతుందో ఇప్పట్లో తేలదు. ఏడునెలల పాటు సాగిన యాత్ర మొత్తం ఎన్నికల ప్రచార యాత్రగానే సాగింది. ఆశించిన ప్రయోజనం నెరవేరిందా? లేదా? అనేది తేలాలంటే 2014 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే..

2 వ్యాఖ్యలు:

  1. ప్రస్తుతానికి కుర్చీ ఒక్కటే ఉంది.
    మన నాయకులు తలుచుకుంటే, తలో కాలు పట్టుకుపోయి నాలుగు కుర్చీలు చేయించుకోగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం