31, మే 2013, శుక్రవారం

తెలుగు సినిమా జర్నలిజానికి 75 ఏళ్ళు ..1938లో వచ్చిన తొ లి పత్రిక చిత్ర కళ .. గతమెంతో ఘనకీర్తి!

 
తెలుగు సినిమా పత్రికలకు 75 ఏళ్లు
తోలి తెలుగు సినిమా పత్రిక పుట్టి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది  . తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్ల లాద 1931 లో విడుదల అయితే , ఏడేళ్ళ తరువాత 1938 జూన్ లో తొ లి తెలుగు సినిమా పత్రిక చిత్రకళ వచ్చింది . ఇంటూరి వెంకటేశ్వర రావు దీని  సంపాదకులు . ప్రారంభ రోజుల్లో నటుడు  పేకేటి  శివ రాం  కుడా ఈ పత్రికలో కీలక  బాధ్యతలు నిర్వహించారు . 

తొలి తెలుగు పత్రిక ఏదీ? అనే అంశంలో వివాదం ఉన్నట్టుగానే తొలి తెలుగు సినిమా పత్రికపై కూడా కొంత వివాదం ఉంది. తొలి తెలుగు సినిమా పత్రిక గురించి 1939 సెప్టెంబర్ నెల భారతిలో ఒక సమీక్ష వచ్చింది. చిత్ర అనే పేరుతో సినిమా పత్రిక వచ్చిందని, దాని సంపాదకుడు కె.వి సుబ్బారావు అని తెలిపారు. ఇంగ్లీష్‌లో అనేక సినిమా పత్రికలు ఉన్నాయి, ఢిల్లీ నుంచి చిత్రపట మనే సినిమా పత్రిక వస్తోంది. తెలుగులో ఈ లోటు తీర్చడానికి చిత్ర సినిమా పత్రిక వెలువడిందని భారతి సమీక్షలో పేర్కొన్నారు. భారతి సమీక్ష ప్రకారం ఇదే తొలి తెలుగు సినిమా పత్రిక అని కొందరి అభిప్రాయం. అయితే ఈ సమీక్షలో ఎక్కడా ఇదే తొలి పత్రిక అని రాయలేదు. అయితే అప్పటికీ 1938లోనే ప్రారంభం అయిన చిత్రకళ పత్రిక వారి దృష్టికి వచ్చి ఉండక పోవచ్చు, వచ్చినా చిత్ర పత్రిక సమగ్రంగా ఇంగ్లీష్ భాషలోని సినిమా పత్రికల స్థాయిలో ఉందనే అభిప్రాయం భారతికి కలిగి ఉండవచ్చు.

చిత్రకళ(1938) చిత్ర(1939) ఏది ముందు ఏది తరువాత అనే వివాదం ఎలా ఉన్నా ఏది ముందు ఏది వెనుక అనుకున్నా తెలుగు సినిమా పత్రికలు ప్రారంభం అయి 75 ఏళ్లు గడిచాయనేది మాత్రం నిజం.

కినిమా అనే పత్రిక ఆ కాలంలో సంచలనం సృష్టించింది. ఆ పత్రికలోని వ్యాసాలు ఇప్పటికీ ఆణిముత్యాలే. కొడవటిగంటి కుటుంబరావు తన పేరు పేరు లేకుండానే ఈ పత్రికకు సంపాదకత్వం వహించే వారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌వి రంగారావు లాంటి నటులు కినిమాలో తమ తొలి సినిమా అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. ‘‘12వ ఏట నుంచే స్టేజిపై అనేక పాత్రలు వేశాను. వీటిలో 99 పాళ్లు స్ర్తిపాత్రలు. నా అన్న అక్కినేని రామబ్రహ్మం నన్ను ఎలా గైనా నటున్ని చేయాలని ప్రయత్నించారు. దర్శకుల చుట్టూ తిరిగారు. డబ్బులు చాలా ఖర్చుశారు. ఈ ప్రయత్నం ఫలితంగా 1938లో ధర్మపత్ని లో నటించే అవకాశం దొరికింది. అది చాలా చాలా చిన్న పాత్ర. 1940లో మరో అవకాశం వచ్చింది. తల్లిప్రేమ సినిమాలో నటించే అవకాశం రావడంతో మద్రాసు వచ్చాను. దీని కోసం ఐదు నెలలు మద్రాస్‌లో ఉన్నాను. సినిమాకు డబ్బు కూడా తీసుకున్నాను. కానీ వేషం మాత్రం వేయలేదు. దీంతో సినిమా అంటే విరక్తి కలిగి తిరిగి నా ఆడవేషాలు వేయడం ప్రారంభించాను. ’’ అంటూ అక్కినేని కినిమాలో తన అనుభవాలను 60 ఏళ్ల క్రితం వివరించారు. 

తొలి తరం సినిమా పత్రికల్లో సినిమా అభిమానులు చదవడానికి బోలెడు సమాచారం ఉండేది. ఇప్పుడు లెక్కలేనన్ని సినిమా పత్రికలు వస్తున్నాయి. కొత్త సినిమా వస్తుందంటే అది ఘన విజయం సాధించబోతుందని కరపత్రంలా సినిమా పత్రికను తయారు చేస్తున్నారు కానీ ఆసక్తికరమైన సమాచారం మాత్రం ఉండడం లేదు. పేజీలు తిప్పి చూస్తే ప్రకటనలు తప్ప ఏమీ ఉండవు. మహా అయితే ఆ ప్రకటనలు ఇచ్చిన వారి సినిమా విశేషాలు ఉంటాయి. 50-60 ప్రాంతాల్లో పలు తెలుగుసినిమా పత్రికలు అద్భుతంగా వచ్చాయి. సాంకేతిక నైపుణ్యం లేక పోవచ్చు. ఖరీదైన పేపర్ వాడి ఉండక ప పోవచ్చు కానీ సినిమా పాఠకున్ని మురిపించేవి, సినిమా జ్ఞానాన్ని అందించేవి. 1938 నుంచి దాదాపు ఒక దశాబ్దం వరకు తొలి తరం సినిమా పత్రికలు ఆణిముత్యాలుగా వెలుగొందాయి. 50 నుంచి 60వరకు వచ్చిన పలు సినిమా పత్రికలు సినిమా రంగం విశేషాలను వివరిస్తూనే సినిమా పెద్దల మధ్య సాగే రాజకీయాలను సైతం ధైర్యంగా ప్రచురించేవి. తొలి సినిమా పత్రిక చిత్రకళ మొదలుకుని దాదాపు అన్ని సినిమా పత్రికలు మద్రాస్ నుంచే వెలువడేవి. చిత్రకళ తరువాత ఎం.ఎస్. రామాచారి నటన పేరుతో ప్రారంభించిన సినిమా పత్రిక బాగానే ఆదరణ పొందింది. 1940లో రూపవాణి పత్రికను పి. సీతారామయ్య ప్రారంభించారు. అదే సమయంలో కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పత్రిక ప్రారంభించారు. అప్పటి వరకు ఉన్న పత్రికలకు భిన్నంగా కొత్త పుంతలు తొక్కుతూ వెలువడిన ఈ సినిమా పత్రిక, సినిమా రంగంలో సంచలనం సృష్టించింది. 

1954లో టి.వి రామనాథన్ మూడు భాషల్లో ఒకేసారి మూడు సినిమా పత్రికలు ప్రారంభించారు. తెలుగులో సినిమా రంగం పేరుతో ప్రారంభించిన సినిమా పత్రికకు జివిజి కృష్ణ సంపాదకులు. ఈ పత్రిక కోసం గ్రంధాలయంలో క్యూ ఉండేది. ఒకరి రువాత ఒకరం చదవేందుకు అంటూ ఆ కాలం నాటి వాళ్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రముఖ స్టూడియో అధినేత నాగిరెడ్డి సినిమా పేరుతో సినిమా పత్రిక ప్రారంభించారు. అప్పటి వరకు అన్నీ మద్రాస్ నుంచే వెలువడితే 1955లో రాజమండ్రి నుంచి గౌతమి పేరుతో సినిమా పత్రిక ప్రారంభించారు. గౌతం తన పేరు కలిసి వచ్చే విధంగా గౌతమి పేరుతో రాజమండ్రి నుంచి పత్రిక ప్రారంభించారు. తరువాత కాగడా శర్మ ప్రోద్బలంతో దీనిని మద్రాస్ తరలించారు. దాదాపు 70వ దశకం చివరి వరకు వెలువడిన కాగడా పత్రిక ధైర్యంగా సినిమా రంగంపై, నటీనటులపై వార్తలు ప్రచురించేది. 1950-60 మధ్య కాలంలో సినిమా రంగం గురించి మధురవాణి, ధ్వని, చిత్రాలయ, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్ర జగత్ పత్రికలు వచ్చాయి. చందమామను ప్రచురించే విజయానాగిరెడ్డి వారు 1966లో విజయచిత్ర వచ్చింది. అప్పటి వరకు సినిమా పత్రికలు ఎక్కువగా అంతగా నాణ్యత లేని న్యూస్ ప్రింట్‌ను ఉపయోగిస్తే, విజయచిత్ర మాత్రం నాణ్యమైన పత్రిక వాడేవారు. చిత్రాలు చూడ ముచ్చటగా ముద్రించే వారు. విజయచిత్రకు సినీ నటుడు రావికొండలరావు సంపాదకత్వం వహించారు. 1966లో బిఎవి శాండిల్య వెండితెర సినిమా పత్రికను తీసుకు వచ్చారు. ఇక హైదరాబాద్ నుంచి ప్రారంభమైన తొలి తెలుగు సినిమా పత్రిక సినీ హెరాల్డ్. ఠాకూర్ వి హరిప్రసాద్ 1975లో ఈ పత్రికను ప్రారంభించారు. ఇక 1976లో సితార ప్రారంభంతో సినిమా పత్రికలది కొత్త అంకం. 76లో సితార, 77లో జ్యోతి చిత్ర వచ్చింది.

 దాదాపుగా ప్రముఖ తెలుగు దిన పత్రికలన్నీ సినిమా పత్రికలను ప్రారంభించాయి. 84లో దాసరి నారాయణరావు ఉదయం దిన పత్రికతో పాటు శివరంజని పేరుతో సినిమా పత్రిక ప్రారంభించారు. ఆంధ్రభూమి తరఫున ఆంధ్రభూమి సినిమా పత్రిక, ఆంధ్రజ్యోతి వారి జ్యోతిచిత్ర, ఈనాడు తరఫున సితార సినిమా పత్రికలు. మద్రాస్ నుంచి వెలువడిన తొలి తరం సినిమా పత్రికల్లో మహతి ఒకటి. ప్రచురణ కర్త పద్మనాభరావు 1957 అక్టోబర్‌లో తొలి సంచికను తీసుకు వచ్చారు. సినిమా రంగం విశేషాలను ఆసక్తికరంగా ప్రచురించే వారు. సినిమా పత్రికలన్నీ సినిమాను సంకేతంగా వివరించే విధంగా పత్రిక పేరు నిర్ణయించే వారు మహతి మాత్రం దానికి భిన్నంగా నిలిచింది.

1940, 1950లలో సినిమా విశేషాల కోసం, సినిమా తారల బొమ్మల కోసం రూపవాణి, నటన, గౌతమి పత్రికల కోసం సినిమా అభిమానులు ఎగబడేవారు. రూపవాణి పత్రికలో స్టూడియో వార్తలు ఎక్కువగా ఉండేవి. సంపాదకులు వి సీతారామయ్య. నటన రెండు వారాలకు ఒకసారి వచ్చేది. ఎమ్.ఎస్ చారి సంపాదకులు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ పత్రికను తీసుకు వచ్చారు.
కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పేరుతో సినిమా పత్రికను 1940 ప్రాంతంలో తీసుకు వచ్చారు. చదివించే వార్తలతో పాటు నాణ్యమైన పేపర్ వాడాలని ఆయన భావించే వారు.
70వ దశకం మధ్య కాలం వరకు కూడా సినిమా పత్రికలు ప్రకటనలపై కాకుండా పాఠకులపైనే ఆధారపడేవి. అందుకే ఆసక్తికరమైన సమాచారం సినిమా పాఠకులకు అందించేందుకు ప్రయత్నించేవి. హంగు ఆర్భాటాలు తక్కువగా ఉన్నా రాతలు మాత్రం ఆకట్టుకునేవి. 80 తరువాత సినిమా పత్రికల వ్యాపారానికే పెద్ద పీట వేయడం ప్రారంభించాయి. సినిమా వాళ్లు ఇచ్చే ప్రకటనలే సినిమా పత్రికలకు జీవంగా మారిన తరువాత సినిమా పత్రికలు కళ తప్పాయి.

జ్యోతిచిత్ర తదితర పత్రికలు పాఠకులను పెంచుకోవడానికి అభిమానుల మధ్య పోటీ పెట్టేది. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ త్రిమూర్తులుగా వెలుగుతున్న కాలంలో వీరి అభిమానుల హడావుడిని సినిమా పత్రికలు క్యాష్ చేసుకోవడానికి నడుం బిగించాయి. బ్యాలెట్ పోటీ పెట్టాయి. అభిమాన నటున్ని అగ్ర స్థానంలో నిలపడానికి పత్రిక కొని అందులో కూపన్లు నింపి పంపించే వారు. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు నా అభిమానులు పత్రికలను పెద్ద సంఖ్యలో కొని కూపన్లు పంపేవారని ఈ మధ్య ఒక అవార్డుల కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. పాఠకులను నమ్ముకోవడం కన్నా ప్రకటన కర్తలను నమ్ముకోవడం మంచిదని ఎప్పుడైతే అనుకున్నారో సినిమా పత్రికల ప్రాభవం అప్పుడే మసక బారింది. ఇప్పుడు 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేసే న్యూస్ చానల్స్‌తో పాటు వార్తా పత్రికలు ప్రతి రోజు ఒక పేజీ ప్రత్యేకంగా సినిమా వార్తలను ప్రచురిస్తుండడంతో సినిమా వార్తల కోసం ప్రత్యేకంగా సినిమా పత్రికలను చూసే అలవాటు తగ్గిపోయింది. ఈనాటి సినిమా పత్రికలు ప్రకటనల సేకరణకే తమ శక్తియుక్తులు వ్యయం చేస్తున్నాయి. సినిమా చరిత్రను రికార్డు చేస్తున్నట్టుగానే సినిమా పత్రికల చరిత్రను సైతం రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాటి సినిమా చరిత్రను భవిష్యత్తు తరాలకు అందిచాల్సిన బాధ్యత సినిమా రంగంపై ఉంది. ప్రెస్ అకాడమీ ప్రచురించిన తెలుగు పత్రికల చరిత్రలో సినిమా పత్రికల సమాచారం అంతంత మాత్రంగానే ఉంది.

తొలి సినిమా ప్రింట్లనే పొగొట్టుకున్నాం మనం. అలాంటిది తొలి తరం సినిమా పత్రిక ప్రతులను భద్రపరచాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో! ఆనాటి పత్రిక ప్రతులు అక్కడక్కడ సినిమా అభిమానుల వద్ద ఉన్నాయి. కొన్ని పత్రికల్లోని కొద్ది పాటి వ్యాసాలను ఈ మధ్య సినిమా ప్రియులు అంతర్జాలంలో భద్రపరుస్తుండడం సంతోషకరం. ఇటీవల తెలుగు సినిమా నిర్మాతల చరిత్రపై ఒక బృహత్ గ్రంధాన్ని నిర్మాతలు వెలువరించారు. అభినందనీయం. అదే విధంగా తెలుగు సినిమా పత్రికల చరిత్రను సైతం రికార్డు చేయాలి. అక్కడక్కడ అభిమానుల వద్ద భద్రంగా ఉన్న పాత సినిమా పత్రికలను సంపాదించేందుకు సినీ పెద్దలు పూనుకోవాలి. సినిమా పత్రికల చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉంది.

8 వ్యాఖ్యలు:

 1. రూపవాణిలో మంచి విమర్శలు కూడా ఉండేవి.విజయచిత్ర గెటప్ బాగుండేది.ఇంగ్లిష్లో ఫిలంఫేర్,ఫిల్మిండియాల్లో విమర్శలు ఘాటుగా ఉండేవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కమనీయం గారు ఇప్పుడైతే సినిమా పత్రికలకు అభిమాన సంఘాల కరపత్రలకు తేడా లేకుండా పోయింది

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సినిమా రంగం మొదట బి. విశ్వేశ్వరరావు సంపాదకులుగా వెలువడేది దానికి రూపకల్పన చేసిందికూడా వారే.ప్ర్జజలేమనుకుంటున్నారో తెలుసా?నాకు నచ్చిన సన్నివేశాలు లాంటి శీర్షికలు ఉండేవి నేను కూడా అవీ ఇవీ రాసేవాడిని. ఆనక జీవిజి అనబడే గడియారం వేణుగోపాలకృష్ణ సంపాదకుడుగా వచ్చారు వీరు దేవదాస్ సినిమాలో కూడా నటించారు.ఆ group ఆంగ్లంలో picturepost అనే సినిమా పత్రిక కూడా వచ్చేది.రూపవాణి కి చివర్లో మాగాపు రామన్ సంపాదకులుగా పనిచేసేవారు.మధురవాణి మధురిమ అనేపత్రికలను గోటేటి శ్రీరామారావు సంపాదక ప్రచురణకర్తగా ఉండేవారు.సినిమా పత్రికకు ఇంటూరి వెంకటేస్శ్వరరావు సంపాదకులుగా ఉండేవారు.కాగడా సంపాదకులుగా శర్మ ఉండేవారు ఆయన కాలానికి చాలా బలం ఉండేది.సెక్సీగా sensational గా వ్యాఖ్యలు చదివించేవి.కొలను బ్రహ్మానంద రావు కూడా కొన్ని cinepatrikalaku సంపాదకులుగా పని చేసేవారు.ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పాలంటే నేనే ఒక పోస్ట్ రాయాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సూర్యప్రకాష్ గారు ధన్యవాదాలు .. నేను చదువుకునే రోజుల్లో కాగడా పత్రిక కొన్ని సార్లు చూశాను .. అంత దైర్యంగా రాయడం ఆశ్చర్యం కలిగించేది .... మీ మెయిల్ id ఇవ్వగలరా
   buddhamurali2464@gmail.com
   సూర్యప్రకాష్ గారు ఒక పోస్ట్ కాదు. ప్రత్యేకంగా ఆనాటి ముచ్చట్ల తో ఒక బ్లాగ్ ఏర్పాటు చేయవచ్చు .. పాత విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ..

   తొలగించు
  2. ఆ రోజులలో కాగడా అంతకు ముందు కలైనేషన్, ఆ తరవాత హిందూ నేషన్, అనే సినిమా పత్రికలు మద్రాసు నుంచి వచ్చేవి. వీటిలో చాలా మంది తెలుగు సినిమా నటుల గురించి గాసిప్ ఉండేది. యెల్లో జర్నలిజం ఆ రోజుల్లో నే ఉండేదనుకుంటా. మా వయసు బాగా చిన్నది అప్పటికి.

   తొలగించు
 4. ఆ రోజుల్లో ఎం.ఎన్.రాజం, టి.ఎ. మధురం అని ఇద్దరి హాస్య జంట ఉండేది, తమిళులు. చెప్పాలంటే కస్తూరి శివరావుకు ముందువారేమో!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. kastephale gaaru సినిమా రంగం లో చాల విషయాలు బయటకు రావు , వచ్చినా రాయలేని పరిస్థితి ..
  ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి సంబంధం గురించి తోలి సారి ఒక పత్రికలో వస్తే జిల్లలో ఉన్న ఆ పత్రిక ప్రతినిధి హైదరాబాద్ కు ఫోన్ చేసి అర్థం పర్థం లేకుండా ఎమిట రాతలు .. ఉహాగనలకు కుడా ఓ హద్దు ఉండాలని గొడవ చేశాడు .. చివరకు రామారావు తనతట తానూ ప్రకటించేంత వరకు ఎవరు నమ్మలేదు ... ఇప్పటికి అది నిజం కాదేమో అనే అనిపిస్తుంది .. కాలం గడుస్తున్న కొద్ది ఇలాంటివ్బి చాలానే తెలిశయి. గాసిప్స్ అన్ని నిజం కాకా పోవచ్చు నిజాలు గాసిప్స్ కన్నా బయంకరంగా ఉండవచ్చు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మురళీ గారు ... మీ ఆర్టికల్ బాగుంది . విజయ బాపినీడు నిర్వహించిన " విజయ "మాసపత్రికలో సినిమా అనుబంధం ఉండేది. అందులో సమీక్షలు నిష్పాక్షికం గా వచ్చేవి.గౌరిశంకర్ గారు వాటిని రాసేవారు. అందరూ దాని కోసం ఎదురు చూసేవారు.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం