5, ఫిబ్రవరి 2014, బుధవారం

చాయ్ కప్పులో మోడీ

ఉదయం లేవగానే చాయ్ లేందే గడవదు. బ్రిటీష్‌వాడు పోతూ పొతూ మనకు అంటించిన అలవాట్లలో ఒకటి ఇంగ్లీష్ రెండు టీ. ఆరు దశాబ్దాల క్రితమే మనకు స్వాతంత్య్రం లభించిందని అనుకుంటాం కానీ మనం జీవిత కాలమంతా ఈరెండింటికి బానిసలమే. అద్భుమైన మార్కెటింగ్‌కు పాఠం లాంటిది చాయ్. బ్రిటీష్ వాడి పాలనా కాలంలో తొలుత రోడ్లమీద టీ ఉచితంగా పంచేవారు. దాని కోసం కొన్ని సంవత్సరాల పాటు వాళ్లు తంటాలు పడ్డారు. మెల్లగా జనానికి టీ అలవాటైంది. టీ లేనిదే ఉండలేని స్థితికి వచ్చారు. అప్పడు చాయ్‌పత్తి అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశంలో కొన్ని కోట్ల మంది రోజూ కోట్లాది కప్పుల టీ తాగుతున్నారు. బ్రిటీష్‌వాడికి ఇప్పుడు టీ తాగే అలవాటు ఉందో లేదో కానీ వాడు వదిలేసినా మనం వదలలేకపోతున్నాం. బ్రిటీష్‌వాడు పాలించిన సీమాంధ్రలో కన్నా నిజాం పాలించిన తెలంగాణలోనే టీ అలవాటు ఎక్కువ ఉండడం వింతే.
టీ విదేశీయుడు అలవాటు చేసిందైనా స్వదేశీ పార్టీ బిజెపి దాన్నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోంది. చాయ్‌పై చర్చ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉదయం ఇంట్లో టీ తాగినా, హోటల్‌కు వెళ్లి టీ తాగినా టీ అనే మాట వినిపించగానే నరేంద్ర మోడీ కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యే విధంగా టీ అలవాటును మార్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. పెద్దపెద్ద పనులకు పెద్ద పెద్ద అధికారులు తలెత్తుకుని ముక్కు పిండి మరీ లంచాలు వసూలు చేస్తే, చప్రాసీ లాంటి సామాన్యులు చాయ్ పైసలు ఇవ్వండి సార్ అని చేతులు నలుపుకుంటూ అడుగుతాడు. చాయ్ అనగానే ఎవరైనా కరిగిపోవలసిందే కాదనలేరు.


షాయెద్ మేరీ షాదీకా ఖయాల్ ఆయాహై ఇసీ లియే మమ్మినే తుజే చాయ్‌పే బులాయా హై అంటూ హీరోతో కలిసి యుగళగీతం పాడుతుందో హిందీ సినిమాలో హీరోయిన్. ఈ అమ్మాయి పెళ్లి హీరోతో చేయాలనే ఆలోచన వచ్చినట్టుంది అందుకే అమ్మ నిన్ను టీకి పిలిచింది అని చెబుతుందా హీరోయిన్. హంస రాయబారంలా ప్రేమకు టీ రాయభారం అన్నమాట. పెళ్లి చూపుల్లో గతికితే అతకదు అని ఏమీ తినరు. టీ తాగితే పెళ్లి సంబంధం కుదరదు అనే నమ్మకం ఏమీ లేదు పైగా టీ తప్పనిసరిగా ఇస్తారు. కొన్ని కోట్ల మందికి టీ తాగందే దినం గడవదు. అలాంటప్పుడు ఆ టీనే మనం ప్రచార అస్త్రంగా వాడుకుంటే పోలే అనుకున్నారు మోడీ. మన రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు దేశం మొత్తం టీ చుట్టే తిరుగుతుంది. గత దశాబ్ద కాలం నుంచి కెసిఆర్ రాష్ట్ర ప్రజల ఆలోచనలను టీ చుట్టు తిప్పితే, ఇటీవల మోడీ టీ చుట్టు తిప్పేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ టీ, మోడీ టీ రెండు వేరువేరు టీలు. కానీ ఇది టీ కాలం అనేది మాత్రం నిజం.
ఆ కాలంలో టీ అలవాటు లేదు కాబట్టి ధర్మరాజును దుర్యోదనుడు పాచికల ఆటకు ఆహ్వానించాడు. లేకపోతే టీ విందుకు పిలిచేవాడు. ఎంత ఎక్కువ టీ తాగినా అయ్యేదేముంది. అన్నాదమ్ములు హాయిగా ఉండేవారు అసలు యుద్ధమే ఉండేది కాదు. కానీ అప్పుడు టీ లేకపోవడం వల్ల దుర్యోధనుడు జూదానికి ఆహ్వానిస్తే ఆనాటి ఆచారం ప్రకారం ధర్మరాజు వెళ్లక తప్పలేదు. చివరకు ఆ జూదంలో అంతా పొగొట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు మోడీ అందరినీ టీకి పిలుస్తున్నాడు. రాజకీయ నాయకులు తమ పాపులారిటీని పెంచుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. కంప్యూటర్ కనిపించగానే ఇది చంద్రబాబే కనిపెట్టారు అన్నంతగా ఆయన, ఆయన అభిమానుల ప్రచారం సాగింది. కంప్యూటర్ వాడే వారి కన్నా టీ తాగే వారి సంఖ్య కచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాబుకు కంప్యూటర్‌లు వర్కవుట్ కాకపోయినా మోడీకి టీ వ్యూహం బాగానే వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ బాబుకు పర్యాయ పదం అయినట్టు ఇప్పుడు టీ అనే ప్రస్తావన వస్తే చాలు అది మోడీకి ప్రచారంగా ఉపయోగపడాలనేది బిజెపి ఎత్తుగడ.


దేశం లో ఆల్కా హాలికుల కన్నా  చాయ్ హాలికులే ఎక్కువ . 
సైకిల్ తొక్కే వాడి ఓట్లన్నీ నాకే అని ఎన్టీఆర్ సైకిల్ గుర్తును ఎంపిక చేసుకున్నట్టుమోడీకి  తమపార్టీ గుర్తు చాయ్ కప్పును ఎంపిక చేసుకోవలని ఉండే ఉంటుంది ..  రోడ్డు మిద సైకిళ్ళు కనిపించడం లేదు.  టిడిపికి అధికారం దక్కడం లేదు . కాని చాయ్ అలవాటు అలా కాదు కదా?   మరుగుదొడ్లు, ఆలయాలు లేని గ్రామాలు ఉండొచ్చు కానీ టీ కొట్టు లేని గ్రామం కనిపించదు. అందుకే మోడీ టీ స్టాల్స్‌నే తమ ప్రచార కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా టీ స్టాల్స్‌లో రాజకీయ చర్చకు శ్రీకారం చుట్టనున్నారు. చాయ్‌పై చర్చ అంటూ దేశ వ్యాప్తంగా టీ స్టాల్స్‌లో రాజకీయ చర్చను మోడీ ప్రారంభించనున్నారు. టీ స్టాల్స్‌లో కూర్చొని ఆన్‌లైన్‌లో ప్రశ్నలు అడిగితే మోడీ వారికి సమాధానాలు చెబుతారు. టీస్టాల్‌లో అమర్చిన టీవిల్లో వాళ్లు మోడీని చూస్తూ ఆయన మాటలు వింటూ టీ తాగొచ్చు. టీ బిల్లు బిజెపి వాళ్లే చెల్లిస్తారు అది వేరే విషయం.
మహాకూటమి ఏర్పాటు సమయంలో కెసిఆర్ ఇంటికి చంద్రబాబు, రాఘవులు, నారాయణ బృందం టీ పార్టీకి వెళ్లింది. టీ తాగాక రాఘవులు మీడియాతో టీ కప్పులో తుఫాను సృష్టిస్తామని చెప్పుకొచ్చారు. తరువాత మహాకూటమి ఏర్పడింది అయితే తుఫాను మాత్రం రాలేదు. ఇప్పుడు చాయ్‌పై చర్చ అంటూ మోడీ భారత రాజకీయాల్లో టీ కప్పుతో తుఫాను సృష్టిస్తామని అంటున్నారు. ఈ తుఫాను మో డీని ప్రధానమంత్రిని చేస్తుందా? లేక టీ కప్పు లో తుఫానుగానే మిగిలిపోతుందా? అనేది కాల మే నిర్ణయిస్తుంది.


ప్రజాస్వామ్యాన్ని పూరి గుడిసెలోని టీ స్టాల్ వరకు తీసుకు వచ్చిన మోడీ మహానుభావుడని కొందరంటే... గిట్టని వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ, పార్లమెంట్లలో ఇప్పుడెలాగూ చర్చలు సాగడం లేదు. వాటి కన్నా కాలేజీ క్యాంటీన్ కావచ్చు, రోడ్డుమీదున్న ఇరానీ హోటల్ కావచ్చు టీ తాగుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై నిర్మొహమాటంగా చర్చలు సాగుతుంటాయి. ఇందులోనూ ఇప్పుడు రాజకీయ పక్షాలు ప్రవేశించాక ఇక చర్చలేం జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఇంత కన్నా నష్టమేముంది అని టీ స్టాల్‌లో రాజకీయ చర్చలు సాగించే  ఔత్సాహికుల ఆవేదన . 

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం