30, సెప్టెంబర్ 2014, మంగళవారం

మనీ.. మమత!


లక్ష రూకలు.
వెయ్యి రూపాయలు..
ఏది విలువైన మొత్తం
ఒక డాలరు.
ఒక రూపాయి.
రెంటిలో దేని విలువెక్కువ?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియని వాళ్లెవరైనా ఉంటారా? నిరక్షరాస్యులైనా ఠక్కున సమాధానం చెప్పగలిగే ప్రశ్నలివి. ఎందుకంటే నోట్ల విలువ నోట్లపైనే కాదు, నోటిపైనా ఉంటుంది కనుక. ఈ కాలంలో డబ్బు విలువ తెలియని వాళ్లెవ్వరు?
ధనం విలువ జనానికి బాగాబాగా తెలుసు. అందుకే -ఇలాంటివి చిక్కు లెక్కలుగా ఫీలవకుండా ఠక్కున సమాధానం చెప్పేస్తారు.
===========
రాఘవ. అతను కొన్ని వేల కోట్ల రూపాయల ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్‌కు సిఇఓ. ఏ కాలంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలో, ఏ కంపెనీ ఇనె్వస్ట్‌మెంట్ ఎంత లాభసాటిగా ఉంటుందో రాఘవకు కొట్టిన పిండి. వంద మిలియన్ డాలర్ల ఆస్తిపరుడు కూడా. రెండు ట్రిలియన్ డాలర్ల ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ నిర్వహించే కంపెనీకి సిఇఓ. డబ్బు విలువ, దాన్ని ఎప్పటికప్పుడు ఎలా పెంచవచ్చో పుట్టుకనుంచే నేర్చుకున్న వ్యక్తి. ఓసారి ఓ విషయంలో -పదేళ్ల కూతురితో వాగ్వాదం తలెత్తింది అతనికి. ‘డబ్బు విలువ నీకింకా తెలీదు. నేను ఈ మీటింగ్‌కు వెళ్లకుంటా చాలా నష్టం వస్తుంది. అర్జంట్ మీటింగ్, తప్పకుండా వెళ్లి తీరాల్సిందే’ అంటూ కూతురు వాదనను పెద్దగా పట్టించుకోకుండా బయటికెళ్లడానికి సిద్ధమయ్యాడు రాఘవ. తల్లి కూడా ప్రముఖ న్యాయవాది. ఆమె జీవితం కూడా చాలా బిజీ. బిజీ తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న కూతురు గదిలోకి పరిగెత్తింది. ఓ కాగితం తెచ్చి తండ్రి చేతిలో పెట్టింది. బయటికెళ్లేందుకు సిద్ధమవుతూనే -కూతరు అందించిన కాగితాన్ని విప్పి అందులో కూతురు మనసు చదివాడు. కాళ్లకింద నేల కదిలి కుప్పకూలినట్టయ్యింది రాఘవ పరిస్థితి. కరెన్సీ లెక్క కరతలామలకమైన తనకు, జీవితం లెక్క అస్సలు తెలీదని అర్థమైంది. ఇంకేమీ ఆలోచించలేదు. మరుక్షణం తన కంపెనీకి లెటర్ ఫార్వార్డ్ చేశాడు. ‘సిఇఓగా బాధ్యతలు నిర్వహించలేను. నాకు కొన్నాళ్లు విశ్రాంతి కావాలి’. అదీ కంపెనీకి పంపిన సమాచారం. చిన్ని కూతురు అందించిన చిన్న కాగితం ముక్క అతని జీవితంలో పెద్ద మార్పును తీసుకొచ్చిందంటే -అందులో ఏదో బలమైన అంశమే ఉండిఉండాలి. అదేంటి?
ఆ చిన్న కాగితంలో కూతురు నీతి బోధలేమీ రాయలేదు. తన మనసుకు తోచ్చిన మొత్తం 22 సందర్భాలు రాసింది. ‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన పది సందర్భాల్లో నువ్వు నా దగ్గర లేవు’ అంటూ తండ్రికి రికార్డు చూపించింది. నన్ను స్కూల్లో వేసిన తొలి ఏడాది జరిగిన వార్షికోత్సవానికి నువ్వు రాలేదు. ఇప్పటి వరకూ ఒక్క పేరెంట్స్ డే మీటింగ్‌కూ నువ్వు హాజరు కాలేదు. అన్నీ ఇలాంటి చిన్న చిన్న సందర్భాలే. తనకు తోచిన, గుర్తున్న 22 సందర్భాలు. వాటిని చూశాక రాఘవ ఆలోచనలోపడ్డాడు. మనీ మేనేజ్‌మెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న తాను ఫ్యామిలీ బాండ్స్ సంపాదించలేకపోయినట్టు గ్రహించారు. ఫ్యామిలీ లైఫ్ మేనేజ్‌మెంట్‌లో ఓనమాలు కూడా దిద్దలేకపోయానని పశ్చాత్తాపపడ్డాడు. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కూడా నేలమీదకు దిగి -సరిదిద్దుకుంటానని కూతురికి చిన్నపిల్లాడిలా ప్రామిస్ చేశాడు. ఇది కథ కాదు. యధార్థ సంఘటన. ఈ లైఫ్ స్టోరీకి హీరో -కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఇనె్వస్ట్‌మెంట్ కంపెనీ సిఇవో ఇఎల్ ఎరన్.
అతనొక్కడే కాదు. ఇలా కుటుంబానికి సంబంధించిన అంశాలను చాలా తేలిగ్గా తీసుకోవడంలో మనలో చాలమందే ఉంటారు. పెళ్లయిన కొత్తలో ఆఫీసు బిజీలో భార్యగురించి పట్టించుకోవడం మానేసి బోలెడు సంపాదించొచ్చు. కానీ ఆ సమయంలో భార్యకు భర్తనుంచి మానసిక మద్దతు కావాలి. గుర్తింపు కావాలి. ఆ సమయంలో పట్టించుకోకుండా కాలం గడిపేసి, బోల్డు సంపాదించిన తరువాత దగ్గరవుదామంటే విరిగిపోయిన మనసులు కలవడం సులభం కాదు. విడిపోతున్న యువ జంటల్లో అధికంగా కనిపించేది ఇదే సమస్య.
భార్యాభర్తలు ఇద్దరూ మంచి సంపాదనపరులే. అయినా ఒకరిపై ఒకరికి గౌరవం లేదు, ప్రేమ లేదు. ఎవరిదారి వారిదే. జీవితం అంటేనే చిన్న వయసులోనే నిర్లిప్తతకు చేరుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో నవ దంపతుల విడాకులు. తిండి కోసం కూడా పరితపించిన ఈ దేశంలో ఇప్పుడు సంపదకు కొదవ లేదు. కొరవడుతున్నది మానవ సంబంధాలే. సంపద ముఖ్యమే. అదే సమయంలో మానవ సంబంధాలూ అంతకంటే ముఖ్యం, ఆనందం.
పిల్లల కేరింతలను, ఆటలను చూసుకోలేనంత బిజీగా ఉండటం అదృష్టం కానే కాదు, దురదృష్టమే అవుతుంది. ఎంత సంపాదన ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అయినప్పుడు, ఆ సంపద ఏమాత్రం సంతోషాన్ని తెచ్చి పెట్టలేదు. డబ్బు లేనిదే ఏమీ లేదు. కచ్చితంగా ఇది వాస్తవం. అయితే అదే సమయంలో జీవితం అంటే డబ్బు మాత్రమే కాదు. జీవితావసరాలకు, భవిష్యత్ కోసం డబ్బు అవసరమే? శక్తిమేరకు సంపాదించాల్సిందే. అదే సమయంలో మానవ సంబంధాలు కలిగి ఉండడం కూడా సంపదగానే భావించాలి.
కోట్లు సంపాదించి వారసులకు ఇచ్చిన తండ్రులు ఉండొచ్చు. కానీ -మీరు చస్తేకానీ మేం సుఖపడం. యాసిడ్ తాగండి అని పిల్లల చేత అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇది నిజంగానే జరిగింది. కొడుకు యాసిడ్ తాగించడంతో తల్లిదండ్రులు మృతిచెందారు. కొడుకును అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సంఘటన ఇది. తప్పెవరిది? అంటే ఏమీ చెప్పలేం. కానీ -కుటుంబీకుల మధ్య సహజంగా ఉండాల్సిన ప్రేమానురాగాలు కరువవ్వడమే ఇలాంటి సంఘటనలకు కారణం అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అందరూ ఇలాగే ఉంటారని కాదు, ఉద్దేశం. అలాంటి పరిస్థితి ఒక్కటీ ఎదురుకాకూడదన్నదే ఆశ. కానీ మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తే అంతిమ ఫలితం ఇలానే ఉంటుందని గుర్తించాలి. అన్ని విలువలను కరెన్సీతో లెక్కకట్టలేం. మానవ సంబంధాల లెక్క కరెన్సీ లెక్కలకు ఎప్పటికీ అందదు. ఇది నిజం.

29, సెప్టెంబర్ 2014, సోమవారం

ఆ హీరో జీవితం విషాద గీతం



దేశంలో సంపన్న సెలబ్రిటీ షారూఖ్ ఖాన్ ఇల్లు మన్నత్  ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఎందుకంటే ఆ ఇంటి ఖరీదు అక్షరాలా రెండువేల కోట్ల రూపాయలు. ఆయన సినిమా రెండువందల కోట్ల రూపాయల వసూళ్ల రికార్డు సృష్టించింది. తన ఆదాయానికి తగ్గట్టు ముంభైలో రెండువేల కోట్ల రూపాయల ఖరీదైన ఇంటిలో నివసిస్తున్నారు. అదే ముంబైలో ఒకప్పుడు హిందీ సినిమా రంగాన్ని పాలించి, తన సినిమాల ద్వారా ఇప్పటికీ సజీవంగా ఉన్న భరత్ భూషణ్ ఒక చావిడిలో నివసించే వారు. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పేదరికంలో కన్ను  మూశారు. షారూఖ్ ఖాన్ కు ముందు చూపు ఉంది భరత్ భూషణ్ కు లేనిది అదే .. ముందు రతం వారి జీవితాలను గుణ పాఠం గా తీసుకోని నేటి తరం ముందు చూపుతో వ్యవహరిస్తోంది . 
 1950 ప్రాంతంలో రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్, దేవానంద్‌ల సమకాలీకుడైన భరత్ భూషణ్ మీనాకుమారి, నూతన్, మధుబాల వంటి వారితో నటించారు. హిందీ సినిమా గంధర్వులు మహమ్మద్ రఫీ, మన్నాడే, ముఖేష్ వంటి గాయకుల సూపర్ హిట్ పాటలు ఎన్నో భరత్ భూషణ్‌పై చిత్రించినవే.
***
బైజు బావ్రా విడుదలై 62 ఏళ్లవుతుంది. ఓ దునియాకే రఖ్‌వాలే ... ఈ పాటను ఆస్వాదించేందుకు మనకు భాషతో పనేముంది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ హిట్ సాంగ్స్‌లో టాప్‌లో ఉంటాయి. ఆ సినిమా హీరో భరత్ భూషణ్. అతను నటుడు, స్క్రిప్ట్ రైటర్, నిర్మాత. అనేక సినిమాలకు అతనే కథ రాసుకున్నాడు. సినిమా కథల రచనలో బిజీగా గడిపిన ఆయన తన జీవిత స్క్రిప్ట్‌ను మాత్రం సరిగా రాసుకోలేక నిరుపేదగా తనువు చాలించారు.
***
ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఒకరు తన ఇంటి తలుపునకు రెండు కన్నాలు చేశాడట! రెండు పిల్లులు బయటకు వెళ్లి రావడానికి అని సమాధానం. రంధ్రమే చేయాలనుకుంటే పెద్దది ఒకటే చేస్తే సరిపోతుంది కదా? చిన్నపిల్లి, పెద్ద పిల్లి దానే్న ఉపయోగించుకుంటుంది. నిరంతరం తమ పరిశోధనల్లోనే మునిగిపోయే శాస్తవ్రేత్తల గురించి ఇదో జోకు. ఇది జోకే కావచ్చు కానీ శాస్తవ్రేత్తలకు తమ రంగంలో అపారమైన పరిజ్ఞానం ఉండవచ్చు... వచ్చు కాదు ఉండి తీరుతుంది. అలా ఉండడం వల్లనే వారు గొప్పవారవుతారు. అయితే ఒక రంగంలో అపారమైన జ్ఞానం ఉన్న వారికి ఇతర రంగాల్లో సైతం ఉంటుందనే నమ్మకం లేదు. తమ ప్రపంచంలోనే మునిగిపోయి మిగిలిన ప్రపంచంపై కనీస అవగాహన లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో తగిన పరిజ్ఞానం లేకపోతే ఎంత గొప్ప మేధావినైనా, కళాకారుడినైనా రోడ్డున పడేస్తుంది జీవితం.
అలా రోడ్డున పడ్డ మరో మహానటుడు భరత్ భూషణ్..
***
దేశంలో అన్ని భాషల్లో రోజుకో డజను సినిమాలు తయారవుతున్నాయి. ఒక్క తెలుగులోనే రోజుకో సినిమా సెట్‌పైకి వస్తోంది. అలాంటిది సినిమాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన వంద సినిమాల జాబితా రూపొందిస్తే అందులో బైజుబావ్రా ఉంటుంది. వంద మరీ ఎక్కువ పది చాలు అనుకుంటే అందులోనూ బైజుబావ్రా ఉండి తీరుతుంది.
బైజుబావ్రా సినిమా ఎంతో మందికి స్టార్‌డమ్ తీసుకు వచ్చింది. హిందీ చలన చిత్ర సీమను ఏలిన భరత్ భూషణ్, మీనాకుమారి, సంగీత దర్శకులు నౌషాద్ అలీ, గాయకులు మహమ్మద్ రఫీ వంటి హేమా హేమీలకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా ఇది. విడుదలై ఆరు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. భారతీయ సినిమా చరిత్రలో బైజు బావ్రా ఒక సంచలనం. మీకు హిందీ రాకపోవచ్చు. ఆ భాషలో ఒక్క పదానికి కూడా అర్థం తెలియకపోవచ్చు. కానీ బైజు బావ్రాలోని పాటలు వింటే సంగీత సాగరంలో మునిగిపోయి మిమ్ములను మీరు మరిచిపోతారు.
భారతీయ భాషలన్నింటిలోనూ ముసలి హీరోలే రాజ్యం ఏలుతున్న కాలంలో హిందీ సినిమా అందగాడిగా భరత్ భూషణ్ గుర్తింపు పొందారు. చాక్లెట్ హీరో అంటూ ఇప్పుడు కొందరు బాలీవుడ్ హీరోలను ముద్దుగా పిలుస్తున్నారు కానీ ఆ గుర్తింపు 1955లోనే పొందిన నటుడు భరత్ భూషణ్.
భరత్ భూషణ్ ఎక్కువగా సంగీత ప్రధానమైన సినిమాల్లో నటించారు. అన్నీ విషాదాంతమైన కథలే. సంగీత ప్రపంచంలో మునిగి పోయిన మహనీయులు తమ వ్యక్తిగత కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. చివరకు అలాంటి పాత్రల్లో నటించిన భరత్ భూషణ్ జీవితం సైతం విషాదాంతమే. మీర్జాగాలిబ్, బసంత్ బహార్, కవికాళిదాసు, బర్సాత్‌కీరాత్, సంగీత్ ఇవి భరత్ భూషణ్ నటించిన కొన్ని సంగీత ప్రధానమైన సినిమాలు.
***
నువ్వు సినిమా రంగానికి వెళ్లడానికి వీలు లేదు అంటూ తండ్రి గర్జించాడు. కుమారుడి మీద కోపంతో కాదు. జీవితంపై భయంతో. స్థిరత్వం ఉండని సినిమా రంగంలోకి తన కుమారుడు వెళితే బతుకు ఏమవుతుందో అనేది ఆ తండ్రి భయం. నాపై నాకు నమ్మకం ఉంది సినిమా పరిశ్రమలో నాకు మంచి అవకాశాలు వస్తాయని అందరిలానే కుమారుడు వాదించాడు. అతను చెప్పినట్టే జరిగింది ఎవరూ ఊహించని విధంగా సినిమా రంగంలో రారాజుగా నిలిచాడు. కానీ ఆతని తండ్రి అనుమానించినట్టూ జరిగింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా దుర్భరమైన పేదరికంలో తనువు చాలించాడు ఆ మహానటుడు భరత్ భూషణ్.
అతని సినిమాల్లో పాత్రల్లానే భరత్ భూషణ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టిన భరత్ భూషణ్ తండ్రి రాయ్ బహుద్దూర్ మోతీలాల్ గవర్నమెంట్ ప్లీడర్. తన కుమారుడిని ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది అతని కోరిక. తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించి భరత్ భూషణ్ సినిమా రంగానికి వచ్చారు. అలీఘర్ యూనివర్సిటీలో డిగ్రీ పొంది ఉద్యోగంపై ఆసక్తి లేక సినిమా ప్రపంచంలో అడుగు పెట్టారు.
సంపన్న కుటుంబానికి చెందిన శారదను పెళ్లి చేసుకున్నారు. అనారోగ్యంతో ఆమె మరణించాక, తన సహ నటి రత్నను పెళ్లి చేసుకున్నారు. 1941లో చిత్రలేఖలో నటిస్తే, 1952లో వచ్చిన బైజుబావ్రా వరకు ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. బైజుబావ్రాతో ఆయనే కాదు హీరోయిన్ మీనాకుమారితో పాటు ఆ సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు అంతా స్టార్లు అయిపోయారు. బైజుబావ్రాలో జంటగా నటించిన మీనాకుమారితో అతను నిజంగానే ప్రేమలో పడిపోయాడు. ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు తప్పలేదు.

సంగీత సాహిత్యాభిమాని అయిన భరత్ భూషణ్ సొంత ఇంటిలో పెద్ద గ్రంథాలయమే ఉండేది.
హీరోగా సంపాదనకు కొదవ లేదు. భారీ అంచనాలతో కొన్ని సినిమాలు నిర్మిస్తే అవి భారీ నష్టాలు తెచ్చాయి. ఆస్తులు కళ్ల ముందే కరిగిపోయాయి. పెద్ద పెద్ద భవంతులు, కార్లు అన్నీ ఒకదాని తరువాత ఒకటి భరత్ భూషణ్‌తో అనుబంధాన్ని తెంపుకున్నాయి. జూదంలో ఎంతో ఆస్తి కరిగిపోయింది. వ్యసనాలకు ఎంత ఖర్చు అనే లెక్కలు లేవు కానీ చేతిలో చిల్లి గవ్వలేని దశకు చేరుకున్నారు అనేది మాత్రం నిజం.
భరత్ భూషణ్ 1992 జనవరి 27న ముంబైలో తనువు చాలించారు.
భరత్ భూషణ్ విషయంలో తండ్రి అనుమానం నిజమైంది. తన కోరిక నెరవేర్చుకున్నాడు. సినిమాను ప్రేమించిన భరత్ భూషణ్ తన జీవితాన్ని కూడా ప్రేమించుకొని ఉంటే బాగుండేది. తన సంపాదన ఎలా వస్తోంది? ఎలా పోతోంది అనే కొద్దిపాటి అవగాహన, రేపు ఎలా అనే ఇంకొంచం ముందు చూపు ఉండి ఉంటే భరత్ భూషణ్ లాంటి అందమైన హీరో జీవిత ముగింపు కూడా అందంగానే ఉండేది. జీవితం నుంచి మన నిష్క్రమణ అందంగా ఉండాలా? బాధాకరంగా ఉండాలా? అని నిర్ణయించుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది. మన చేతల్లో ఉంటుంది.
*

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

మార్స్ గ్రహం పై రింగురోడ్డు!.. రియల్ ఎస్టేట్

బ్రహ్మం చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. మనుషుల్లో ఇంత సంతోషం అరుదుగా కనిపిస్తుంటుంది. ఓ హీరో సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పుడు మరో హీరో అభిమానుల కళ్లలో కనిపించేంత సంతోషం అది. ఓ స్వామీజీ శృంగార రహస్యాల వీడియో బయటపడినప్పుడు ఆయన పోటీ స్వామీ కళ్లల్లో కనిపించే సంతోషం అది. డిపాజిట్లు గల్లంతయినప్పుడు గెలిచిన పార్టీ వారిలో కనిపించేంత సంతోషం అది. సంతోషానికి కారణం ఏమిటని పలకరించాను.


‘‘మార్స్ ప్రయోగం విజయవంతం కావడం’’ అని వాడి నోటిలో నుంచి విన్న సమాధానంతో నాకు తలతిరిగిపోయింది.
నిజమే మోదీ అధికారంలోకి వచ్చాక మనుషుల ఆలోచనలే మారిపోయాయి. బ్రహ్మం కూడా మార్స్ గురించి ఆలోచిస్తున్నాడు అంటే నాకూ సంతోషం వేసింది.


అది సరే నువ్వు మార్స్ గురించి ఆలోచించడం ఆశ్చర్యంగా ఉందిరా అస్సలు ఊహించలేకపోయాను. నిజంగా ఇది అద్భుతమైన విజయం, భారతీయుడిగా ప్రతి ఒక్కరు గర్వించాలి, నువ్వే కాదు నేనూ గర్విస్తున్నాను. ఇంతకూ ఈ విజయంపై నీ అభిప్రాయం ఏమిటి? అని అడిగేశాను.


అప్పటి వరకు నేను మాట్లాడుతున్నది వాడు పెద్దగా పట్టించుకోలేదని ముఖం చూస్తే అర్ధమైంది. మార్స్ గురించి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అన్నాడు.
చెబితే వింటా అని కూర్చున్నా


నీ అంచనా ప్రకారం మార్స్‌పై రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పటికి ప్రారంభం కావచ్చు నంటావు? అని బ్రహ్మం అడిగిన ప్రశ్న అర్ధం కానట్టుగా ముఖం పెట్టాను. బ్రహ్మం ఏదైనా రియల్ ఎస్టేట్ కోణంలోనే చూస్తాడు. ఏ సమస్యకైనా రియల్ ఎస్టేట్‌తోనే పరిష్కారం అంటాడు.
వాడి గురించి తెలియాలంటే వాడి కుమారుడి ప్రేమ కథ చెప్పాలి. అబ్బాయి ఇంజనీరింగ్ చదవరా అని పంపితే సొంతంగా ప్రేమ పాఠాలు నేర్చుకుని ఓ అమ్మాయిని ప్రేమించేశాడు. విషయం తెలిసిన బ్రహ్మం అందరిలా అస్సలు కంగారు పడలేదు. నాన్నా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెబితే తప్పకుండా బాబు ఆ అమ్మాయి కుటుంబానికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయో ఎక్కడున్నాయో తెలుసుకునిరా అని నింపాదిగా చెప్పాడు. అమ్మాయి నాన్న పెన్షన్ డబ్బులతో యాదగిరి గుట్ట దగ్గర రాయిగిరిలో ఇన్‌స్టాల్‌మెంట్‌లో 200 గజాల ప్లాట్లు రెండు కొన్నాడట!
మనలానే ఆ అమ్మాయి వాళ్లు బంజారాహిల్స్‌లో ఓ ప్లాట్ కొన్నాకే మీ పెళ్లి. దీని కోసం ఎంత కాలమైనా ఆగేందుకు నాకు అభ్యంతరం లేదని బ్రహ్మం ఉదారంగా కుమారుడికి వరమిచ్చాడు. 


రాక్షసుడు చిట్టడవిలో రాజకుమారిని దాచిపెట్టినా ఎలాగోలా తీసుకు రావచ్చు కానీ బంజారాహిల్స్‌లో ప్లాటు కొనడం అంటే మాటలా? ఆ అబ్బాయి, అమ్మాయి మళ్లీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు. పరువు హత్యలు చూసిన వారికి మన బ్రహ్మం చూపిన ప్లాట్ పరిష్కార మార్గం గురించి తెలిస్తే బాగుండు. అన్ని రోగాలకు జిందాతిలిస్మాత్ మందన్నట్టు ఒక్క కాశ్మీర్ సమస్యకు తప్ప అన్ని సమస్యలకు ప్లాట్లతో పరిష్కారం చూపవచ్చునంటాడు బ్రహ్మం. ఆ ఒక్క దానికి మినహాయింపు ఎందుకు? అంటే కాశ్మీర్‌లో ఇతరులు ప్లాట్లు కొనేందుకు రాజ్యాంగం ఒప్పుకోదు కదా అందుకు అంటాడు. కొత్త రాజధానికి నిధులెలా? భూములెలా అని అంతా ఆలోచిస్తుంటే భూములివ్వండి, ప్లాట్లు తీసుకోండి అంటూ కొత్త ప్రభుత్వం బంపర్ ఆఫర్ వెనుక బ్రహ్మం మార్కు కనిపిస్తోంది, కానీ దీనిలో తనకెలాంటి సంబంధం లేదంటాడు బ్రహ్మం.


‘‘శాస్తజ్ఞ్రుల పరిశోధనలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నవ్వు చూస్తూ ఉండు మార్స్‌పై ప్లాట్లు వేయడం ఖాయం. రింగురోడ్డు ఎక్కడొస్తుందో ముందె తెలుసుకుంటే మన పంట పండినట్టే ’’నని బ్రహ్మం చెబితే వినడం తప్ప ఏమీ అనలేకపోయాను. హైటెక్ సిటీ ఎక్కడొస్తుందో కొందరికి ముందే తెలిసిపోయినట్టు మార్స్‌పై రింగురోడ్డు ఎక్కడో ముందె తెలుసుకోవాలని బ్రహ్మం ప్రయత్నం.


నేటి బాలలే రేపటి పౌరులు అని అందరూ అంటే బ్రహ్మం మాత్రం నేటి పొలాలే రేపటి ప్లాట్లు అని నమ్ముతాడు. మరో అడుగు ముందుకేసి నేటి గ్రహాలే రేపటి పొలాలు, ఆ తరువాత ప్లాట్లు అంటాడు. తెలంగాణ కోసం ఉధృతంగా ఉద్యమం సాగుతున్నప్పుడు బ్రహ్మం ప్లాట్ల రేట్లు పడిపోతాయి మీ ఇష్టం అని హెచ్చరించాడు. విభజన తరువాత సంతోషంగానే ఉన్నాడు. విషయం ఏమిటిరా అంటే విభజన వద్దన్నాను నిజమే కానీ అనివార్యం అనీ తెలుసు,కొత్త రాజధాని ఎక్కడో ముందే తెలుసు అక్కడ ప్లాట్లు కొన్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఉండబట్టలేక సూర్య గ్రహంలో ప్లాట్ల గురించి ఎప్పుడూ ఆలోచించలేదా? అని అడిగితే లేదన్నాడు. అక్కడ వెంచర్లు చేసి ప్లాట్లు వేసినా సూర్యుడి వేడి వల్ల కరిగిపోతాయి అన్నాడు. వేడి లేకున్నా హైదరాబాద్ శివార్లలో చాలా వెంచర్లలో అమాయకులు కొన్నాక ప్లాట్లు కరిగిపోయి, తరువాత మాయం అయ్యాయి . కొన్ని వందల సంవత్సరాల నాటి తమ దేశాన్ని ప్లాట్ల రూపంలోనే ఇజ్రాయిలీలు సొంతం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నా పరిష్కారం కాని సమస్యకు ప్లాట్లే పరిష్కారం చెప్పాయని బ్రహ్మం గట్టిగా నమ్ముతాడు. విష్ణువు బ్రహ్మం ఇష్టదైవం. ఎందుకూ అంటే ఆకాశాన్నో ప్లాటు, భూమినో ప్లాటుగా చేసుకుని మూడో కాలు దానమిచ్చిన వాని తలపైనే పెట్టినందుకు. 

అభిమాన హీరో శోభన్‌బాబు అని చెప్పినప్పుడు బ్రహ్మం గురించి తెలియనప్పుడు ఏదో అనుకుని, కోడెనాగు సినిమా చూశాక నా? అని అడిగితే, కాదు సినిమా వారందరికీ ప్లాట్ల గురించి తొలిసారి అవగాహన కలిగించింది ఆయనే అని తెలిశాక అన్నాడు బ్రహ్మం. మార్స్ వైశాల్యం ఎంత? ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది, మొత్తం ఎన్ని ప్లాట్లు అవుతాయి, ఎన్ని రాజధానులు, ఎన్ని విమానాశ్రయాలు వస్తాయో లెక్కలు వేయడంలో బ్రహ్మం బిజీగా ఉన్నాడు. బ్రహ్మం ఎక్కడుంటాడు ? ఆయన్ని చూడాలని ఉంది అంటున్నారా ? పరీక్షగా చూస్తే మీ ఆఫీసులోనో, మీ మిత్రుల్లోనో, చివరకు మీలోనూ , ఎందెందు వెదికినా అందందు కనిపిస్తాడు బ్రహ్మం.

25, సెప్టెంబర్ 2014, గురువారం

చదువు కోసం విదేశం వెళ్ళాలనుకుంటు న్నారా ? జీ ఆర్ యి సరే .. మనస్సు సంగతేమిటి ?

పిల్లలలకు మంచి చదువు, పెద్ద ఉద్యోగం లభించాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేదు. అందుకోసం -ఏటా రెండు లక్షలు కట్టేసి ఎంసెట్‌తో కుస్తీ పట్టేందుకు కార్పొరేట్ కాలేజీల్లో కుక్కేస్తే సరిపోదు. విద్యార్థులు ఈ పోటీని తట్టుకోగలుగుతున్నారా? లేదా? అన్న విషయాన్ని పట్టించుకునే వాళ్లే లేరు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు అంతులేకుండా పోయింది. దీనిపై కదిలిన సర్కారు ఒక కమిటీ వేసింది. కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. అయిత, ఆత్మహత్యలు ఆగాయా? అని ఆతృతంగా చాలామందే ప్రశ్నిస్తుంటారు. ఈ చివరి ప్రశ్నకే సమాధానం ఎక్కడా దొరకదు. ఈ అంశంపై ఏం ఫలితం సాధించాం? అన్న ప్రశ్నలకు మీడియాలో ప్రచారం ఉండదు. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీల విద్యా వ్యాపారమే కమర్షియల్ మీడియాకు ప్రదాన ఆదాయం.ఎంసెట్‌కు ఎలా ప్రిపేర్‌కావాలో బోధించే కాలేజీలున్నాయి.

కానీ విద్యార్థులు ఇంటికి దూరంగా ఉండాల్సివస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే అంశాలపై పట్టు సాధించాలి, మానసిక ఇబ్బందులను ఎలా అధిగమించాలి? అన్న అంశాలను తల్లిదండ్రులు, పిల్లలకు చెప్పే ఇనిస్టిట్యూట్‌లూ లేవు. అదొక ప్రాధాన్యతాంశంగా ఎవ్వరూ గుర్తించడం లేదు కూడా. ఇంటికి దూరంగా ఉండాల్సివస్తే పిల్లలు మానసికంగా ఎలా సిద్ధంకావాలో చెప్పడానికి ప్రత్యేక సబ్జెక్టంటూ ఏదీ లేదు. ఇదే పరిష్కరించుకోలేని సమస్య అవుతోంది.
ఒక కంప్యూటర్‌ని ఎక్కడపెట్టినా అది చేయాల్సిన పని చేసుకుని పోతుంది. ఒక దేశంలో తయారైన ప్రింటింగ్ ప్రెస్‌ను మరో దేశంలో అమర్చినా -పనితీరు ఒక్కలాగే ఉంటుంది. చక్కగానే పని చేస్తుంది. ఎందుకంటే అది -యంత్రం. కానీ ప్రాణమున్న మనిషిని యంత్రంలా ఎక్కడంటే అక్కడ అమర్చడం సాధ్యం కాదు. పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఉండాల్సి
వచ్చినపుడు -అక్కడకూడా అంతే వేగంగా, ఉత్సాహంగా పరుగలు తీయడం కష్టం. కొంతకాలానికి గాని అక్కడ అలవాటుపడలేం.
***
చదువు, కెరీర్‌పట్ల ఆలోచనలు విస్తరిస్తూ, అవకాశాలు కూడా విస్తృతమవుతున్న ఆధునిక కాలంలో -ఇంటికి దూరమవుతున్న పిల్లల సంఖ్యా పెరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రాంతంలో ఎలా మనగలగాలి? అన్న విషయంలో పిల్లల్ని ముందు మానసికంగా సిద్ధం చేయాలి. కుటుంబానికి దూరంగా ఉండటం, అప్పటి వరకు ఉన్న వాతావరణానికి భిన్నమైన వాతావరణంలో ఉండాల్సి రావడం, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన స్నేహితులకు బదులు కొత్త దేశంలో కొత్త స్నేహితుల మధ్య కాలం గడపాల్సి వచ్చినపుడు ఆ ప్రక్రియను అంత సులువుగా డీల్ చేయలేం. అందుకు మానసిక పరిపక్వత, మానసిక సంసిద్ధత చాలా అవసరం.
అమెరికాకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ నుంచి వీసా వరకు ఎలా సంపాదించాలో బోధించే కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీలో చదువితే భవిష్యత్ ఎంత ఉజ్వలంగా ఉంటుందో చెప్పే ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. జిఆర్‌ఇలో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ఎలా చదవాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థలూ ఉన్నాయి. బ్యాంకు లోన్‌లనుంచి యూనివర్సిటీ చరిత్ర వరకూ చెప్పలేనంత సమాచారం అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది. కానీ మానసిక అంశాలను చర్చించడమే తప్ప, చెప్పి నేర్పించేవారు ఉండరు. అందుకే పొరుగు దేశాల్లోను, ప్రాంతాల్లోను ఉంటున్న చాలామంది విద్యార్థులు ఇంటిమీద బెంగతో అనారోగ్యం పాలవుతున్నారు. ఇంటికి దూరంగా స్వతంత్రంగా బతికేలా ముందుగా పిల్లల్ని మానసికంగా సంసిద్ధులం చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
విద్యార్థులకు ఆర్థిక పుష్టి ఉంటే సరిపోదు. మానసిక ధృడత్వం కావాలి. బందిఖానాలో ఇంటర్ చదువు ముగించి ఇంజనీరింగ్ కాలేజీలో స్వేచ్ఛ (చాలామంది విద్యార్థుల విషయంలో దీని అర్థం వేరు)ను సంపాదించుకోలేకపోతే విద్యార్థులుగానే గుర్తింపు ఉండదని భావించేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటిది విదేశాల్లోకి అడుగుపెడితే, అడిగేవాళ్లు, అనుపానులు చూసేవాళ్లూ ఎలాగూ ఉండరు కనుక వ్యసనాలకు అలవాటుపడుతున్న విద్యార్థుల సంఖ్యేమీ తక్కువ కాదు. విదేశాలకు ఎందుకోసం వెళ్తున్నాం, మన లక్ష్యం ఏమిటి? అనే ఆలోచన ఉంటే దారి తప్పే అవకాశం ఉండదు.
మీ లక్ష్యం విదేశాలకు వెళ్లి చదువుకోవడమే అయితే అక్కడి వెళ్లిన తరువాత కొత్త దేశంలో కొత్త వర్శిటీలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి. చదువే మీ లక్ష్యం అయినప్పుడు మీలానే చదువుపైనే ఆసక్తి ఉన్న బృందాలను తయారు చేసుకోండి. తెలుగు వారు ఎక్కడికి వెళ్లినా కొన్ని తెలుగు బృందాలను ఏర్పాటు చేసుకుని నూతిలో కప్పల మాదిరిగా ఆ బృందాల మధ్యనే ఉండాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఆ బృందంలో ఉంటూనే మరోవైపు విశ్వవిద్యార్థిగా అనేక దేశాల వారితో పరిచయాలు పెంచుకోవడం ఆ దేశాల గురించి తెలుసుకోవడం ద్వారా ఆలోచనా పరిధి విస్తృతం అవుతుంది.
మన కులమేనా? మన వాళ్ళేనా? వాళ్లు మన వాళ్లు కాదు, వాళ్లతో మాట్లాడవద్దు అనే మాటలు పక్కన పెట్టి మీపై ఎవరో ఆంక్షలు పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి నేను విశ్వవిద్యార్థిని అనుకోండి. పరిచయాలను పెంచుకోండి.
ఒక పని నేను చేయగలను అని ముందుగా మానసికంగా సిద్ధం కావాలి. మానసికంగా బలహీనంగా ఉంటే ఎదుటివారు మీపై మరింతగా పెత్తనం చెలాయించాలని చూస్తారు. నాకిలాంటి ఆంక్షలు నచ్చవు అని ముందే సున్నితంగా మీ వైఖరి మీరు స్పష్టం చేయొచ్చు. మీ వైఖరి నచ్చినవారే మీతో ఉంటారు. మీ ఆలోచనలపై ఇతరుల నియంత్రణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దు. ఇంటికి దూరంగా ఉన్నాననే బెంగ కలిగినప్పుడు ఇంట్లోవారితో కాస్సేపు కబుర్లు చెప్పుకుంటే కాస్త సాంత్వన కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో ఖండాంతరాల నుంచి కూడా మన పల్లెసీమ వారితో కనెక్టై ఉచితంగానే మాట్లాడుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు.

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

నాల్గవ స్తంభానికి మేస్ర్తి కావలెను!

‘‘సరే ఇప్పుడే వాడి సంగతి చూస్తాను’’ అని విప్లవ్ ఫోన్ పెట్టేశాడు. ‘‘మానవ హక్కులకు అస్సలు విలువ లేకుండా పోతుందోయ్ ’’అని ఎదురుగా ఉన్న పరమేశం ముందు విప్లవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాస్ మాటకు ఔను అనడమే ఉత్తమ ఉద్యోగి లక్షణం అనుకున్న పరమేశం ‘‘గాజాలో అమెరికా అండతో  సైన్యం పిల్లలు అమాయకులను ఊచకోత కోస్తోందట! అమెరికా వాడి గుండెలపై నిద్ర పోయేంత ధైర్యం మీకే ఉంది సార్. దీనిపై మన చానల్‌లో ఓ చర్చ నిర్వహించారంటే అదిరిపోతుంది ’’ అంటూ పరమేశం ఆవేశంగా చెప్పుకు పోతున్నాడు. 


‘‘బోడి గాజా గొడవ మనకెందుకోయ్. రేటింగ్ పెరగని పనులేమీ మనం చేయవద్దు’’ అన్నాడు.


ఆలోచనలో పడ్డ పరమేశం ‘‘ మీరెన్నన్నయినా చెప్పండి సార్ రాష్ట్ర విభజన అన్యాయం. మా కాలనీ కర్రీపాయింట్ వాడు రోజూ ఒకటే ఏడుపు.. రోజుకు రెండు వేల రూపాయల కర్రీలు అమ్మేవాడట! ఉమ్మడి రాష్ట్రం ఉంటుందని తప్పని సరి అయితే యూటి చేస్తారని వాళ్ల కేబుల్ కనెక్షన్ కుర్రాడు చెప్పాడట! నెల నెల కేబుల్ బిల్లు తీసుకుపోయేప్పుడు వాడితో మాట్లాడితే నిజం సార్ నమ్మండి అంటూ యూటీ గురించి చెప్పాడట! దాంతో వీడేమో పెద్ద మొత్తంలో కర్రీ పాయింట్ కోసమని వంట పాత్రలన్నీ కొనుకున్నాడు. ఇప్పుడేమో అలాంటిదేమీ లేకపోయే సరికి లబోదిబో మంటున్నాడు. కేబుల్ కనెక్షన్ ఇచ్చే కుర్రాడి మాటకే విలువ లేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంది? విలువలు ఎక్కడున్నాయి. 

కర్రీపాయింట్ ప్లాబ్లమ్స్‌ను హైలెట్ చేస్తూ రాష్టప్రతి పాలన విధించాలని మన చానల్ తరఫున ఉద్యమిస్తే ఎలా ఉంటుంది సార్! కాళిదాసును చూస్తే నిరక్ష్యరాస్యుడికి కూడా కవిత్వం వచ్చేదట! మీరు కూడా అంతటి వారే సార్! మిమ్ములను చూడగానే నా మట్టిబుర్రలో ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. మీరు చాలా గ్రేట్ సార్! నాలాంటి అనామకుడిలోనూ ఇన్ని ఆలోచనలు తెప్పిస్తున్న మీ బుర్రను మ్యూజియంలో ఉంచాలి ’’ అంటూ పరమేశం తన లీవ్ లెటర్‌ను ముందుకు జరిపాడు.


‘‘నీ ఆందోళన నిజమేనోయ్ ... మొన్న మన కేబుల్ ఆపరేటర్లు మన చానల్ వైర్లు కత్తిరించారని, కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్టప్రతి పాలనకు సిఫారసు చేసింది. ఆర్డర్ కాపీ ఆర్డినరీ పోస్ట్‌లో పంపినట్టున్నారు. ఇంకా చేరలేదు. ఆర్డర్ చేరగానే రాష్టప్రతి పాలన దానంతట అదే వచ్చేస్తుంది అంటూ విప్లవ్ అనునయించాడు.
ఔనుసార్ ఆప్పుడప్పుడు మనం పత్రికల్లో చూస్తూనే ఉంటాం కదా ఇండియన్ పోస్టల్ శాఖ ఘనకార్యాలు. పెళ్లికి రమ్మని ఉత్తరం రాస్తే పదేళ్లకు సరైన అడ్రస్‌కు ఉత్తరం చేరిందనే వార్తలు ఎన్ని చూడలేదు. కేంద్రం పంపిన ఉత్తరం ఏదో ఒక రోజు రాక తప్పుతుందా? అప్పటి వరకు మనం వేచి చూడాలి...ఐనా మన జవదేకర్ దేవుడు సార్ ’’ అంటూ హఠాత్తుగా టాపిక్ మారుస్తూ వౌనంగా ఉండిపోయాడు.
‘‘అదేంటయ్యా సగం చెప్పి ఆపేస్తావు. పూర్తి చేయ్’’ అని విప్లవ్ ఆసక్తిగా అడిగాడు.
‘‘ఎవరు కాదన్నా ఔనన్నా ఆయన దేవుడుసార్.. దేవుడు... మీకు తెలుసు కదా సార్... బ్రహ్మకు తన సృష్టి గురించి చెప్పినట్టు మీకు మేం చెప్పాలా.. మనుషులకు రోజు అంటే 24 గంటలు రెండు రోజులంటే రెండు 48 గంటలు. కానీ మనకు లెక్కలేనన్ని రోజులు అయితే దేవుళ్లకు ఒక రోజు అవుతుంది. అలాంటిది రెండు రోజులు కావాలంటే మాటలా? ’’ అని చెబుతుంటే
నసగకుండా విషయం చెప్పవయ్యా అని విప్లవ్ గద్దించాడు.
అదే సార్ కేబుల్ వైర్లు బిగించే వారి గొంతును రెండు రోజుల్లో బిగించేస్తాను అని అప్పుడెప్పుడో జవదేకర్ చెప్పారు కదా? సామాన్య మనుషులు రెండు రోజులు కాగానే ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు కానీ ఆయన దేవుడని ఆయన లెక్కలు వేరుగా ఉంటాయని వారికి తెలియదు’’ అని పరమేశం చెప్పుకొచ్చాడు.


ఏంటీ వీడు మామూలుగానే చెబుతున్నాడా? లేక వ్యంగ్యమా? అని విప్లవ్ పరమేశం ముఖంలోకి పరీక్షగా చూశాడు.
వీడి బొంద బానిసకు యజమానిపై వ్యంగ్యాస్త్రాలు విడిచేంత ధైర్యమా? ఏదో నన్ను మస్కా కొట్టాలని కాకపోతే అని సంతృప్తి చెంది విప్లవ్ తల ఆడించాడు.


నా బాధ అదికాదయ్యా మీడియా అంటే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం కదా? నాలుగవ స్తంభాన్ని చిన్నచూపు చూడడం తగునా? మా అబ్బాయి ర్యాగింగ్ చేస్తే అడ్డుకుంటారా? సర్లే తెలియకుండా చేశారని క్షమించేశాను. తాగి కారు నడిపితే పట్టుకుంటారా? ఎక్కడికెళుతున్నది సమాజం. ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. నాలుగవ స్తంభంలో నేనో ఇటుక లాంటి వాడిని అని మా అబ్బాయి చెబుతున్నా వినకుండా బ్రీతింగ్ టెస్ట్ చేశారట! ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే అని విప్లవ్ వాపోయాడు. ఇటుకలు లేనిదే స్తంభం ఉండదు. ఒక్కో ఇటుక బలహీన పడితే ఇక స్తంభం ఎక్కడుంటుంది ?’’ అని విప్లవ్ బాధగా చెప్పాడు.
‘‘విషయం ఇదే అనుకున్న పరమేశం అవును సార్ మనం మంచి మేస్ర్తిని చూడాల్సిన తరుణం ఆసన్నమైంది. గోల్కొండ కోటలోని రాళ్లను ఇళ్లు కట్టుకోవడానికి పీక్కెళ్లినట్టు నాలుగవ స్తంభం ఇటుకలను ఎవరికి వారు పీకేశారు. ఇప్పుడు నాలుగవ స్తంభాన్ని మీరే పునర్నిర్మించాలి సార్. మన వాళ్లలో ఎంతో మంది బ్రహ్మాండమైన కాంట్రాక్టర్లు ఉన్నారు. నిజానికి రాజ్యాంగంలో పార్లమెంటు, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ అనే మూడు స్తంభాలే ఉంటే ఎంత కష్టపడి మన స్తంభాన్ని కూడా భవనం లోనికి దూర్చేశాం. మొన్నటి మొన్న ఒక కామన్ మ్యాన్ ఏమన్నాడో తెలుసా సార్! మీడియాకు ప్రత్యేకంగా భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ఏమీ ఉండదు. ప్రజలకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛనే మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ అనేశాడు సార్. ఆ మాటలు వినగానే నా రక్తం ఉడికిపోయింది. మనకున్న ప్రత్యేక స్వేచ్ఛను కోన్‌కిస్కా సామాన్య ప్రజల స్వేచ్ఛతో పోలుస్తారా?’’ అని పరమేశం ఊగిపోయాడు.


కలికాలం బ్రదర్ కలి కాలం అంటూ విప్లవ్ ఫోన్ తీసుకొని సిఐ గారా సారీ సార్ మీకు ట్రబుల్ ఇస్తున్నాను, వాడు మా వాడే ఏదో తెలియక ... దాందేముంది మీరు రండి సార్  హృదయం  విప్పి మాట్లాడుకుందాం... మీ పిల్లల ముచ్చట తీర్చే విధంగా ఒక ప్రోగ్రాం చేద్దాం దాందేముంది సార్ ’’ అంటూ విప్లవ్ ఫోన్ పెట్టేశాడు. పరమేశం నాలుగవ స్తంభాన్ని బాగు చేసేందుకు మేస్ర్తిని వెతికేందుకు వెళ్లాడు.

అందాల కాంచనకు కన్నీరే మిగిలింది.. - ధనం మూలం-10

ఆమె అందాన్ని చూడాలంటే భక్తతుకారం సినిమా  లోని ఆ ఒక్క పాటలో ఆమెను చూస్తే చాలు . ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తుకారాంగా నటించారు. తన అందాలతో తుకారాం ను ఆకర్షించాలని కాంచన ప్రయత్నిస్తుంది. కాంచన అందాలను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. పూజకు వేళాయెరా అంటూ అతన్ని కవ్విస్తూ తన తాపాన్ని ప్రదర్శిస్తూ, తన అందాన్ని వర్ణిస్తూ పాడుతుంది. ఆ పాట రచయిత కాంచన అందాలను దృష్టిలో పెట్టుకొనే ఆ పాట రాసి ఉంటాడు. ఆ పాటలో అందాల వర్ణనకు ప్రతిరూపంగా ఉంటుంది ఆమె అందం. .
ఆమె కవ్విస్తూ పాడితే..  చివరకు అతను....... 

దువ్వుకున్న ఆ నీలి ముంగురులే దూది పింజలై పోవునులే
నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే
వనె్నలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే
పాలు పొంగు ఆ కలశాలే తోలు తిత్తులై పోవునులే
నడుము వంగగా, నీ ఒడలు కుంగగా
నడువలేని నీ బడుగు జీవితం .. వడవడ వణుకునులే
ఆశలు రేపే సుందర దేహం ఆస్థిపంజరబౌనులే .....
అంటాడు.
నిజంగా ఇప్పుడు కాంచన పరిస్థితి అలానే ఉంది. భవిష్యత్తులో కాంచన ఇలా ఉంటుంది అని ఆ పాట రచయిత  ఊహించి ఉండరు. కాంచనే కాదు ఎంత అందమైన యువతి అయినా చివరకు ఇలా మారాల్సిందే నిజమే కానీ వైవాహిక జీవితం అనుభవించకుండానే అందమైన నటి జీవితం ఇలా మారింది అదే కాంచన జీవితంలోని విషాదం .
***
తనను అర్థం చేసుకుని గౌరవించే మంచి మొగుడు.. ప్రేమించే పిల్లలు... ఉండేందుకు నీడ.. చక్కని కుటుంబం అమ్మాయి అయినా దేవున్ని మనసులోనే కోరుకునే కోరికలు ఇవే. సగటు అమ్మాయి మొదలుకొని సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి వరకు ఆశించేది ఇదే. పూరిగుడిసెలో జీవితం గడిపే అమ్మాయి అయినా, సంపన్నరావు కుమార్తె అయినా కోరుకునేది వైవాహిక జీవితమే. కానీ ఆ రాజకుమారికి సామాన్య ఈ కోరిక సైతం తీరిన కోరికగానే మిగిలి పోయి ఒంటరి జీవితమే గడుపుతోంది. .
ఆకలి, పేదరికం వంటి వాటిని అష్టకష్టాలు అంటూ కష్టాల జాబితాను మన పూర్వీకులు రూపొందించారు. నిజానికి వీటన్నింటిని మించిన కష్టం కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు లేకపోవడం, కన్న తల్లిదండ్రులు పిల్లలను సంపాదన యంత్రాలుగా చూడడం, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోక పోవడం. పూర్వం ఇలాంటి దారిద్య్రాలు కూడా ఉంటాయని ఊహించలేదు కాబట్టి అష్ట దారిద్య్రాల్లో వీటిని చేర్చలేదు కానీ వీటిని ముందు వరుసలో చేర్చాల్సిన తరంలో మనమున్నాం.
***
అభిమన్యు సినిమాలో రాజకుమారి శశిరేఖ గుర్తుందా? అచ్చం రాజకుమారిలా అందంతో మెరిసిపోయిన ఆమె నిజంగానే రాజకుమారి. ఆధునిక కాలం రాజకుమారి. అందగత్తె కాబట్టే ఎయిర్ హోస్టెస్‌గా ఆకాశంలో విమానంలో విహరించింది. ఆ రాజకుమారి పురాణం కాంచన ఈ తరం వారికి ఆమె తెలియకపోవచ్చు. కానీ మన జీవితం కోసం మనం తెలుసుకుందాం.
1965లో వీరాభిమన్యు సినిమాతో తెలుగు నాట ఒక వెలుగు వెలిగిన కాంచన జీవితమంతా చీకటే. మంచి అందగత్తె. చూడగానే ఆకర్షించేంత అందగత్తె. ప్రేమించిన వారికి కొదవేమీ లేదు. ఎంతో మంది పెళ్లికి ముందుకు వచ్చారు. ఆ కాలం నాటి ప్రసిద్ధ దర్శకుడు శ్రీ్ధర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారు. కానీ కరెన్సీని ముద్రించే డబ్బు యంత్రంగా కనిపిస్తున్న కాంచనను పెళ్లి చేసి అత్తారింటికి పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు.
కాంచన ఒక సంపన్న కుటుంబంలో పుట్టింది. ఏమీ కొరత లేకుండా ఉన్న తనకు చివరకు పెళ్లి కొరత ఏర్పడుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండరు. సంపన్న కుటుంబంలో బాల్యం నుంచి ఆమెది ఒంటరి జీవితమే. తండ్రి ప్రముఖ న్యాయవాది. సంపాదనకు కొదవ లేదు. ఏ వ్యాపారంలో ఏం జరిగిందో తెలియదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తలక్రిందులైంది. చదువుకు పుల్‌స్టాప్ పెట్టి ఎయిర్ హోస్టెస్ కాంచన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. జరిగిందేదో జరిగిపోయింది అమ్మాయి తన జీవితం తాను హాయిగా గడిపితే చాలు అని తల్లిదండ్రులు అనుకుంటే బాగుండేది కానీ వారికి ఆ ఆలోచనే రాలేదు. కాంచన అందాన్ని సినిమా రంగం ఆహ్వానించింది. ఈ రోజుల్లో అయితే హీరోయిన్లు బట్టలు వేసుకుంటేనే ఓ సంచలనం. కానీ ఆ రోజుల్లో కాంచన స్విమ్మింగ్ డ్రెస్‌లో తన అందాలతో ఆనాటి యువత మతులు పోగొట్టింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1964లో తమిళ సినిమా నుంచి దాదాపు పదేళ్ల కాలం ఆమె హీరోయిన్‌గా వెలిగిపోయారు. ఆ తరువాత క్రమంగా తెర వెనక్కి వెళ్లారు. హఠాత్తుగా కాంచన కనిపించకుండా పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమె ఉందో లేదో, ఉంటే ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో పట్టించుకున్న వారు లేరు.

కాంచన ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం కాంచన ఒక ఆలయంలో సేవికగా జీవితం వెళ్లదీస్తోంది అనే వార్త తెలుగు సినిమా అభిమానులను కలిచివేసింది...
ఆ వార్త ఎలా ప్రచారంలోకి వచ్చిందో కానీ అది నిజం కాదు. ఆమె ఆలయంలో సేవ చేస్తున్నది నిజమేకానీ జీవనోపాధి కోసం కాదు. మానసిక ప్రశాంతత కోసమే. కాంచన సంపాదనపై తల్లిదండ్రులదే పెత్తనం. ఎంత సంపాదనో, సంపాదించిన సొమ్మును తల్లిదండ్రులు ఎలా ఇనె్వస్ట్ చేస్తున్నారో కాంచన పట్టించుకోలేదు.
బహుశా బాల్యం నుంచి ఒంటరి జీవితం గడపడం వల్ల కావచ్చు కాంచన కుటుంబ సభ్యుల అనుబంధాన్ని కోరుకుంది. పెళ్లికి అడ్డు చెప్పినా, సంపాదనపై పెత్తనం చెలాయించిన తల్లిదండ్రులతో ఆమె అనుబంధాన్ని కోరుకుంది కాబట్టి ఎవరెంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పినట్టే నడుచుకుంది. వారు కోరుకున్నట్టే జీవించింది. వారు చెప్పిన చోట సంతకాలు పెట్టింది. ఆస్తులకు సంబంధించి కాంచనకు, అమె తల్లిదండ్రులకు మధ్య కోర్టులో వివాదాలు. వాదోపవాదాలు. ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదు. 


న్యాయమూర్తిగా తండ్రి, ముద్దాయి కొడుకు, కేసును వాదించే న్యాయవాదిగా తల్లి ఇలాంటి దృశ్యం సినిమాల్లో చూసేందుకు బాగుంటుంది కానీ జీవితంలో పగవాడికి సైతం అలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఆస్తులు, కేసుల తరువాత కాంచనకు డబ్బుపైన విరక్తి కలిగింది. వైరాగ్యం ఏర్పడింది. ఒంటరిగా ఉన్న మహిళ వయసులో ఉంటే ఆమె శరీరాన్ని అపహరించాలని, సంపన్నురాలైతే ఆస్తిని కొట్టేయాలని చూస్తారు. చెన్నైలోని విలువైన కాంచన భవనాల్లో అద్దె కుండేవారు అదే చేశారు. తన ఆస్తులను కాంచన తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు .

పెళ్లి చేసుకున్నా కుటుంబ బాగోగులను చూసుకుంటాను నాదీ బాధ్యత అని కాంచన గట్టిగా చెప్పి ఉంటే ఆమె ఈ పరిస్థితిలో ఉండేవారు కాదేమో! కానీ ఆ మాటలతో తల్లిదండ్రుల అండ కోల్పోతానేమో అనే భయం ఆమె జీవితాన్ని ఇలా మార్చింది. జీవితమంతా ప్రేమా ఆప్యాయతల కోసం పరితపించిన కాంచనను వైరాగ్యం ఆవహించింది. డబ్బు గొడవలతో చివరకు డబ్బుపైన విరక్తి కలిగింది. నా జీవితం ఇలా ఎందుకు రాశారు దేవుడా! అని దేవున్ని నిలదీయాలని ఆమెకు ఎప్పుడూ అనిపించి ఉండదు. అందుకే ఆస్తిని దేవుడి పేరు మీద రాసి జీవితాన్ని దేవుడి సేవతో గడిపేస్తోంది బెంగళూరులో....

భానుప్రియ, అంజలి, స్మిత అంటూ పేర్లలో తేడా ఉండొచ్చు. బాల నటులు మొదలుకుని హీరోయిన్ల వరకు చాలా మంది హీరోయిన్లకు ఇదే శాపం. వాళ్లు కరెన్సీ ముద్రించే యంత్రాలు కాదు వాళ్లకూ మనసుంటుంది, వాళ్లూ కుటుంబం నుంచి ప్రేమా ఆప్యాయతలను కోరుకుంటారు అనే విషయం కుటుంబ సభ్యులే గ్రహించక పోతే ఇంకెవరు గుర్తిస్తారు... ఈ రోగం ఇప్పుడిప్పుడే మధ్యతరగతిలో సైతం అక్కడక్కడ కనిపిస్తోంది. ఐటి ఉద్యోగం చేసే అమ్మాయి శాశ్వతంగా ఇంట్లోనే ఉండాలని కోరుకునే కుటుంబాలు సైతం అక్కడక్కడ పిచ్చిమొక్కల్లా కనిపిస్తున్నాయి. డబ్బు ముఖ్యమే కానీ దానితో పాటు కుటుంబ విలువలు ముఖ్యం అని గ్రహించకపోతే జీవితం విషాదంగా మారుతుంది. *  

15, సెప్టెంబర్ 2014, సోమవారం

నాయకుడు- ఓటరు- ఒక ప్రేమ కథ

‘‘రాజులో విష్ణు అంశ ఉంటుందని అంటారు. కానీ నాకెందుకో పాలకుల్లో విష్ణు అంశ కన్నా ఇంద్రుడి అంశే ఎక్కువ అనిపిస్తోంది. ’’
‘‘ ఎందుకలా? ’’
‘‘ఇంద్రుడు పతీ పత్నీ ఔర్ ఓ కేసు కదా.. నాయకలు కూడా అంతే కదా.. అందుకే..’’
‘‘ జోకులు ఆపి సీరియస్‌గా చెప్పు ’’
‘‘నాయకుల్లో విష్ణు అంశ కాకుండా ఒక గొప్ప ప్రేమికుడి అంశ కనిపిస్తుంది. రౌడీ ముదిరితే నాయకుడు అవుతాడని అంటారు కానీ నేను మాత్రం ప్రేమికుడు ముదిరితే నాయకుడు అవుతాడనుకుంటాను’’
‘‘నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు అనుకో తప్పు లేదు కానీ, అలా అనుకోవడానికి ఓ బలమైన కారణం ఉండాలి. ’’
‘‘ లేకేం బోలెడు కారణాలు ఉన్నాయి. కామి కాని వాడు మోక్షగామి కాడన్నట్టు, ప్రేమికుడు కాలేని వాడు నాయకుడు కాలేడని బల్లగుద్ది చెప్పగలను.’’
‘‘ అదే అడుగుతున్నాను? ఎలా చెప్పగలవు అని? ’’
‘‘ నువ్వు సినిమాలు చూస్తావా? ముగింపులో ఏ ముంటుంది? ’’
‘‘శుభం’’
‘‘ సినిమా శుభం కార్డుతోనే ముగుస్తుంది. చివర్లో భంశు అని కార్డు పడితే ఇంత కంగాళీ సినిమా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పే బాపూ కార్టూన్ గుర్తుంది కానీ శుభం కన్నా ముందు, సినిమా ముగింపులో ఏ ముం టుంది అని’’
‘‘ గ్రూప్ ఫోటో ఉంటుంది’’


‘‘పాతాళా భైరవిలో రాజకుమారిని ప్రేమించిన తోట రాముడి కథ నుంచి నిన్నమొన్నటి మెగాస్టార్ కొడుకు చరణ్ సినిమా, నటశేఖర్ కృష్ణ సాక్షి సినిమా మొదలుకొని ఆయన కొడుకు సినిమా, అల్లుడి సినిమా, ఎన్టీఆర్ మనవడి కుమారుడి సినిమా, అక్కినేని కుమారుడి మేనల్లుడి సినిమా ఏ సినిమా అయినా’’
‘‘చాల్లే సినిమా వారి వంశ వృక్షం మనకెందుకు కానీ అసలు విషయానికి రా! ’’
‘‘కొనే్నళ్ల తరువాత వందేళ్ల ఉత్సవాలు జరుపుకోనున్న తెలుగు సినిమాలన్నీ హీరో హీరోయిన్‌లు పెళ్లి చేసుకోగానే శుభం కార్డు పడుంది. అంతే కదా?’’
‘‘అవును.. టూరింగ్ టాకీసుల కాలం నుంచి మల్టీప్లెక్స్‌ల కాలం వరకు ఈ సంగతి అందరికీ తెలిసిందే ? ’’
‘‘ సినిమా కథ హీరో హీరోయిన్ల పెళ్లితో ముగిసిపోతుంది కానీ నిజ జీవితంలో కథ పెళ్లితోనే మొదలవుతుంది. పెళ్లి తరువాత కథలకు శుభం కార్డు ఎబ్బెట్టుగా ఉంటుంది అందుకే పెళ్లితోనే కథ ముగిస్తారు’’.
‘‘ఇంతకూ రాజకీయ నాయకుల ప్రేమికులనే వాదన ఎలా సమర్ధించుకుంటావో చెప్పనే లేదు? ’’


‘‘అక్కడికే వస్తున్నాను. రాజకుమారిని రాక్షసుడు గుహలో దాచిపెట్టినా హీరో నానా కష్టాలు పడి కొండలు గుట్టలు దాటి, మారువేశాలు వేసి హీరోను హతమార్చి హీరోయిన్‌ను తన దాన్ని చేసుకుంటాడు. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా అంతే కదా కాలేజీకి ఫీజు కట్టి సర్వర్ కన్నా ఎక్కువ సమయం క్యాంటిన్‌లో నిరీక్షించి హీరోయిన్ దృష్టిలో పడతాడు. చిల్లర పనులన్నీ చేసి ఛీ కొట్టించుకుని చివరకు ఎలాగైతేనేం హీరోయిన్ మనసు దోచుకుంటాడు. శుభం కార్డు పడుతుంది. అంతే కదా? ’’
‘‘ అంతే అంతే కానీ అసలు విషయం... ’’
‘‘ ఒక్కసారి ఊహించుకో ప్రేమికులుగా హీరో హీరోయిన్‌లు చెట్ల వెంట పుట్టల వెంట పరిగెత్తుతూ పాటలు పాడుకుంటుంటే చూసేందుకు ఎంత బాగుంటుంది. వాళ్లిద్దరి మధ్య పెళ్లయ్యాక ఒక రేషన్ షాపు క్యూలో నిల్చుంటే మరొకరు ఆర్టీసి బస్సు కోసం పరిగెత్తి ఆఫీసర్ చేత చివాట్లు తింటూ ఆఫీసులో ఓ మూలన కూర్చోని పని చేస్తుంటే చూసేందుకు ఏమన్నా బాగుంటుందా?
నీలవేణి అలివేణి మీనాక్షి అంటూ రకరకాల పేర్లతో ప్రేయసి అందాన్ని వర్ణించి కవిత్వం రాస్తారు. రాయడం రాకపోతే ఎవడో ఒకడికి క్యాంటిన్‌లో టిఫిన్లు పెట్టించి కవిత్వం రాయించుకుని రక్తంతో రాశాను ప్రేమ లేఖ అంటూ ప్రేయసికి చెప్పిన ప్రియుడు పెళ్లి కాగానే ఏం చేస్తాడు. ఆఫీసుకు వెళ్లేందుకు టైం అవుతుంది, ఆ బోడి కూర వండేందుకు ఇంకెంత సేపు అంటూ గర్జిస్తాడా? లేక నువ్వు వంట వండుతుంటే ఎంత అందంగా ఉన్నావు శశి అంటూ బాపుగారి సినిమాలో హీరో హీరోయిన్‌తో మాట్లాడినట్టు మాట్లాడతాడా? నువ్వే చెప్పు ’’


‘‘ ఇంత మాట్లాడినా నువ్వు విషయంలోకి రావడం లేదు’’
‘‘ఆకాశం దించాలా? నెలవంకా తుంచాలా? అంటూ ప్రేయసి మనసు దోచేందుకు ప్రేమికుడు ఏం మాట్లాడతాడో, సరిగ్గా రాజకీయ నాయకుడు కూడా అదే మాట్లాడతాడు. ఆకాశమంతా రాజధాని కడతానంటాడు. చేసిన అప్పులు, చేయబోయే అప్పులు, పూర్వ జన్మలోని అప్పులు ఈ జన్మలోని అప్పులు అన్నీ తీర్చేస్తాను అంటాడు. ప్రేయసిని కలల్లో విహరింపజేసినట్టుగానే ఓటరును నాయకుడు ఊహాలోకంలో విహరింపజేస్తాడు. ’’
‘‘ఔను నిజమే దేశానే్నలే వారి నుంచి మా గల్లీ కార్పొరేటర్ వరకు ఇలానే అంటారు. ’’
‘‘మనం చదువుకునేప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య అని చెప్పేవారు గుర్తుందా? రుచికరమైన పదార్థాన్ని చూడగానే నోటిలో నీరు ఊరడం వంటివి మనకు సంబంధం లేకుండానే జరిగిపోతాయి. అసంకల్పిత ప్రతీకార చర్యలా ఆ చిన్న వయసులోనే మనలో నాయకత్వ లక్షణాలు సహజంగా అబ్బుతాయి. ఐదో తరగతి క్లాస్ లీడర్‌గా పోటీ చేస్తూ మన తరగతిని యూనివర్సిటీగా మార్చేస్తాం అనే హామీలు ఇచ్చేస్తాం. ’’
‘‘ఔను నిజమే ఇప్పుడు గుర్తుస్తోంది. మొన్న ఓ యూనివర్సిటీ ఎన్నికలు చూశాను. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తామని కల్చరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న విద్యార్థి ఎంత బాగా చెప్పాడో? కానీ ప్రజలేంటి అంత అమాయకంగా నమ్మేస్తారు? అదే అర్ధం కాదు ’’


‘‘పిచ్చోడా? కొన్ని సార్లు ఎదుటి వారు మాట్లాడేది అబద్ధం అని తెలిసినా ఆ మాటలు వినేందుకు బాగుంటాయని వింటారు. ప్రపంచంలో నీ అంత అందగత్తె లేదని ప్రియుడు అనే మాటలతో ఆమె బుగ్గలు ఎరుపెక్కుతాయి. అతను జీవితంలో తన ఊరు దాటి ఉండడు కానీ ప్రపంచంలోని అందగత్తెలందరినీ చూసి ఆమెనే అందగత్తె అని తేల్చేస్తాడు. అతను చెప్పేది అబద్ధం అని ఆమెకు అందరి కన్నా బాగా తెలుసు. అబద్ధం అయినా సరే అలాంటి మాటలు వినేందుకు బాగుంటాయి. అందుకే రాజకీయ నాయకులు, ఓటర్లది ప్రేయసీ ప్రియుల సంబంధం అంటున్నాను. నాయకుల మాటలూ అబద్ధాలే అని ఓటర్లకూ తెలుసు కానీ వినడానికి బాగుంటాయి కదా?’’

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

ఆ సినిమా మీకు డబ్బు విలువ నేర్పిస్తుంది

అనవసరమైనవి కొంటే అవసరం అయినవి అమ్ముకోవలసి వస్తుంది. తెలిసిన వ్యాపారమే చేయి తెలియని దానిలో వేలుపెట్టకు వారెన్ బఫెట్ చెప్పిన జీవిత సూత్రాల్లో కొన్ని మచ్చుతునకలు. స్టాక్ మార్కెట్ ద్వారానే ప్రపంచంలో రెండవ సంపన్నుడిగా నిలిచినా సాధారణ జీవితం గడుపుతూ కోట్లాది మంది ఇనె్వస్టర్లకు కనిపించే దైవం లాంటి వారు వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ గురించి ప్రపంచానికి తెలియక ముందే ఇంత కన్నా అద్భుతమైన జీవిత సత్యాలతో, కనులు తెరిపించే విధంగా జీవితానికి ఉపయోగపడే ఆర్థిక పాఠాలు చెప్పిన అద్భుతమైన సినిమా లక్ష్మీనివాసం.

వారెన్ బఫెట్ నాలుగైదు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆర్థిక పాఠాలన్నింటి సారం ఒక్క పాటలో చెబుతుంది ఈ సినిమాలోని ధనమేరా అన్నిటికీ మూలం పాట. ఆర్థిక అంశాల గురించి మరే భాషలోనూ, మరే కాలంలోనూ ఇంత అద్భుతమైన పాట మరోటి వచ్చిన దాఖలాలు లేవు.

కంటి చూపుతో శత్రువులను చంపేసే హీరోల సినిమాలను చూడడంలో బిజీగా ఉండే తరం ఇది. మనకు నాలుగు కోట్ల అశ్లీల వెబ్‌సైట్లన్నాయి. వీటన్నిటినీ చూసేందుకు జీవిత కాలం సరిపోదు. అయితే జీవితం ముగిసే సరికి వీలైనన్ని చూసేయాలని తపించే తరం. చాటింగ్‌లతో కాలం గడిపే నవతరాన్ని రెండున్నర గంటల పాట ఈ సినిమాను చూపించడం అంటే కష్టమే. కానీ మీరు మీ భవిష్యత్తు కోసం ఓ రెండున్నర గంటల సమయాన్ని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైతే, డబ్బుకు సంబంధించి కచ్చితంగా మీ ఆలోచనల్లో మార్పు తీసుకు వచ్చే సినిమా, మీ జీవితానికి ఉపయోగపడే సినిమా. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడగలిగితే మీరు మరింత అదృష్టవంతులు. ఈ సినిమా తీసిన వారి కోసమో అందులో నటించిన వారి కోసమో కాదు మీ కోసం మీరు ఈ సినిమా చూడాలి.

కన్నడంలో 1966లో దుడ్డె దొడ్డప్ప పేరుతో వచ్చిన సినిమా ఘన విజయం సాధించడంతో ’68లో లక్ష్మీనివాసం పేరుతో తెలుగులో తీశారు. తెలుగులోనూ ఆ కాలంలో ఈ సినిమా సూపర్ హిట్టయింది. కథ కన్నడందే అయినా డబ్బు విలువ తెలియజెప్పే మాటలు, పాట, దృశ్యాలు కన్నడ సినిమాను మించి తెలుగులో అద్భుతంగా ఉన్నాయి.
ఎస్వీఆర్ పాత్ర ప్రవేశమే గొప్ప పాఠం. ఆఫీసులోకి వస్తూనే వృధాగా తిరుగుతున్న ఫ్యాన్‌ను ఆఫ్ చేస్తాడు. అటు భార్య అంజలీ దేవి స్నేహితురాళ్లకు ఖరీదైన చీరలు కొనిపెడుతుంటారు. ఏమీ చెప్పకుండానే ఈ సినిమాలో పాత్రలను ప్రవేశపెట్టిన తీరే వారేంటో చెబుతుంది. కృష్ణ సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలో కాబట్టి ఇలాంటి పాత్రకు ఒప్పుకున్నారేమో. బికాం ఆనర్స్ అంటూ స్నేహితులతో జులాయిగా తిరిగే కొడుకుగా కృష్ణ, నాటకాలు వేస్తూ డబ్బు ఖర్చు చేసే నాటకాల రాయుడిగా మరో కొడుకు పద్మనాభం. భోజనం చేస్తుంటే పై నుంచి ఈగ ఫ్లై అయిందని కోపంతో అన్నం వదిలివెళ్లే కృష్ణ ఆస్తంతా పోయాక ఈగ ఉందని టిఫిన్‌ను పార్క్‌లో పారేస్తే వెళ్లి అది తింటారు. కళ్లకద్దుకుంటే కలకాలం ఉంటానని, విసిరికొడితే ఇంట్లో ఉండను అంటుందట లక్ష్మీదేవి. పనిమనిషి ద్వారా ఈ మాట చెప్పించి డబ్బును విసిరికొట్టిన వారి పరిస్థితి తరువాత ఏమవుతుందో చూపిస్తారు. సినిమాలోనే కాదు జీవితంలో ఇలా డబ్బును విసిరికొట్టిన ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారాయి.

కృష్ణ జన్మదినం రోజున సినిమా హాలుకు వెళితే టికెట్ దొరక్కపోతే థియేటర్‌లో మొత్తం షో బుక్ చేసుకుంటాడు. ఇది సినిమా కథ మాత్రమే కాదు ఈ సంఘటన నిజంగానే జరిగింది. ఇలాంటి వారు ఇంకా కనిపిస్తూనే ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ ఒక మాట చెప్పారు. కారు కొనే అర్హత ఉన్నప్పుడు స్కూటర్ కొనాలని, స్కూటర్ కొనే అర్హత ఉన్నప్పుడు సైకిల్ కొనాలని అంటారు. కానీ ఈ కాలంలో అంతా రివర్స్ స్కూటర్‌కు పెట్రోల్ ఖర్చును భరించడం కూడా కష్టంగా ఉన్నవారు స్టేటస్ కోసం కారు కోసం తహతహలాడుతున్నారు. స్థోమత లేకపోయినా అప్పు చేసి కారు కొనడమే సోషల్ స్టేటస్. ఇఎంఐ కట్టక పోతే ఫైనాన్స్ కంపెనీ వాడు రోడ్డుపైనే దించేసి కారును తీసుకెళ్లిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. డబ్బులు తగిలేయడం గొప్పకాదురా? ఆర్జించిన డబ్బు నిలబెట్టుకోవడం గొప్ప అని ఎస్వీ రంగారావు అంటే అవకాశం వస్తే నేనూ సంపాదిస్తాను అంటాడు కృష్ణ. సంపాదించే వాడు అవకాశాలు వచ్చేంత వరకు ఎదురు చూడడు అని ఎస్వీఆర్ చెబుతాడు. ఈ సినిమాలో ఎస్వీఆర్ ప్రతి డైలాగు జీవితానికి ఉపయోగపడే పాఠం చెబుతుంది. సంభాషణలు ఆరుద్ర రాశారు.
కష్టపడి డబ్బు సంపాదించిన తండ్రి తన పిల్లలు అలా కష్టపడొద్దని ప్రతి తండ్రిలానే అనుకుంటాడు. కానీ భార్యా పిల్లలు డబ్బు విలువ తెలియక విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండడంతో వ్యాపారంలో దివాళీ తీసి రోడ్డున పడతారు. విలాసవంతమైన జీవితం గడిపిన ఆ కుటుంబం తలో దారిలో వెళుతుంది. ఆకలి అంటే ఏమిటో డబ్బు విలువ ఏమిటో తెలుసుకుంటుంది. వారిలో పరివర్తన రావడంతో మీలో మార్పు తెచ్చేందుకే ఈ నాటకం ఆడానని, డబ్బు ఎక్కడికీ పోలేదని తండ్రి చెబుతాడు. ఈ సినిమా కథ, సినిమాలోని దృశ్యాలు, ఏవీ అసహజంగా ఉండవు. లక్ష్మీదేవిని చిన్నచూపు చూసి రోడ్డున పడ్డ ఎన్నోకుటుంబాల కథను తెరపై చూస్తున్నట్టుగా ఉంటుంది కానీ సినిమా అనిపించదు. 

ఈ సినిమాలో చిత్తూరు నాగయ్య, రాంమోహన్, పద్మనాభం వంటి వారు నటించారు. ఈ ముగ్గురూ తమ పొరపాట్ల వల్ల చివరి దశలో దుర్భర జీవితం గడిపిన వారే కావడం విశేషం. తొలి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య దాన ధర్మాలకు పెట్టింది పేరు. సినిమాలో నాటకాల్లో పద్మనాభం ఆస్తంతా ఊడ్చుకుపోతుంది. సరిగ్గా ఆయన నిజ జీవితంలో సైతం అదే విధంగా ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. కృష్ణ, రాంమోహన్ ఒకేసారి సినిమా రంగంలోకి వచ్చారు. కృష్ణ కన్నా రాంమోహన్‌కే సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ కాలంలో ఊహించారు. కానీ రాంమోహన్ తన జీవితాన్ని తానే చేజేతులా నాశనం చేసుకున్నారు. ఈ సినిమాలో నటించారు కానీ ఈ సినిమా సారాన్ని పద్మనాభం లాంటి వారు జీర్ణం చేసుకోలేకపోయారు. హెర్ ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న కృష్ణ ప్రింటింగ్ ప్రెస్‌వాడు పోస్టర్ల ముద్రణకు అలస్యం అవుతుంది అంటే ఏకంగా ప్రెస్ కొనేయడానికి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. చివరకు అతని వ్యాపారం ప్రారంభం కాకముందే అడ్వాన్స్‌ల పేరుతో ఉన్నదంతా ఖర్చవుతుంది. వ్యాపారం ఎలా చేయకూడదో చెప్పే విధంగా ఉంటుంది బికాం ఆనర్స్ కృష్ణ పాత్ర.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఆనే మాటకు దృశ్యరూపకం. డబ్బు లేకపోతే కన్న పిల్లలు సైతం కసాయిగా మారిపోతారనే జీవిత సత్యాన్ని చెప్పిన సినిమా.

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
ఆయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం


ఈ పాటలోని సారాన్ని అర్థం చేసుకుంటే ధనలక్ష్మి మీ వెంటే ఉంటుంది.
సినిమా అంటే ఒక్కడు.. దూకుడు అనుకునే వారికి ఈ సినిమా చూడడం చాలా కష్టమే కావచ్చు కానీ జీవితాన్ని ప్రేమించే వారికి చూపించాల్సిన సినిమా. యూట్యూబ్‌లో సైతం అందుబాటులో ఉన్న సినిమా ఓ ఆదివారం ఆర్థిక పాఠం నేర్చుకోవడానికి ఇంటిల్లిపాది చూసేయండి. చూసిన మంచిని జీవితంలో ఆచరించండి.
***
యూ  ట్యూబ్ లో లక్ష్మి నివాసం లింక్ 
https://www.youtube.com/watch?v=qv0Y1caS5Wk*

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

వంద రోజుల తెలంగాణా - ఉద్యమ నేత నుంచి పాలకుడిగా కెసిఆర్

వంద రోజుల తెలంగాణ పాలన సాధారణ తెలంగాణ ప్రజలకు సంతోషాన్నే కలిగిస్తోంది. ఒక ప్రభుత్వానికి వంద రోజుల పాలన పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది కొత్త ప్రభుత్వానికి వంద రోజుల పాలన కాదు. కొత్త రాష్ట్రానికి వంద రోజుల ఉత్సవం.


దొర అనే మాటను గౌరవంగా వాడుతారు. ధవళేశ్వరం బ్యారేజీ కట్టినందుకు కాటన్‌ను కాటన్ దొర అని, తెలుగుభాషకు సేవ చేసినందుకు బ్రౌన్‌ను బ్రౌన్ దొర అని అభిమానంగా పిలుచుకుంటారు. దేశాన్ని పాలించిన బ్రిటీష్‌వారిని తెల్లదొరలు అని గౌరవించుకుంటాం. అలానే తెలంగాణలో పాలించిన స్థానిక పాలకులను దొరలు అనే వారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా సాధారణంగా దొర అనే మాట గౌరవంగా ఉపయోగించేదే. కానీ కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించాక ఆ పదానికి అర్థాన్నే మార్చేశారు. తెలంగాణ ఏర్పడితే దొరల గడీల పాలన వస్తుందని, నక్సలైట్లు విజృంభిస్తారని, దేశమంతా చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరుగుతాయని, మొత్తం మీద దేశం చిన్నాభిన్నం అవుతుందని తేల్చి చెప్పేశారు. ఎంతగా భయపెట్టినా అడ్డుకున్నా తెలంగాణ ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చి వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది కూడా. ప్రత్యర్థి పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందేమో కానీ గడీల పాలన మాత్రం రాలేదు. దేశం విచ్ఛిన్నం కాలేదు. సముద్రాలు పొంగలేదు. హాయిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. తెలంగాణలో చంద్రశేఖర్ రావు, ఆంధ్రలో చంద్రబాబు, దేశంలో నరేంద్ర మోదీలు ఎవరి స్టైల్‌లో వారు పాలన అందిస్తున్నారు. ఆంధ్రలో చంద్రబాబుకు తొమ్మిదేళ్ల పాలనా అనుభవం ఉంది. నరేంద్ర మోదీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ముఖ్యమంత్రి విషయం వచ్చే సరికి ఎలా పాలిస్తారు అనే సందేహం బలంగా ఉండేది. ఉద్యమ నాయకునిగా అనుభవం, మంత్రిగా పాలనానుభవం తప్ప ఒక రాష్ట్రాన్ని పాలించిన అనుభవం కెసిఆర్‌కు లేదు. బలంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వారికి సైతం తెలంగాణ ఏర్పడిన తరువాత పాలన ఎలా ఉంటుంది అనే భయం ఉండేది. తెలంగాణ నేతలు పాలించలేరు అనే విమర్శ ఇతర ప్రాంతాల వారిలో ఉంటే మనం పాలించలేమేమో అనే అనుమానం కొందరు తెలంగాణ నాయకుల్లో బలంగా ఉండేది. తెలంగాణ సాకారం కాదు అంటూ తెలంగాణ ఉద్యమకారులు సైతం నమ్మిన కాలంలో అట్లెట్ల సాధ్యం కాదు సాధ్యం చేసి చూపిస్తాను అంటూ రంగంలోకి దిగిన కెసిఆర్ తెలంగాణ కలను నిజం చేసి చూపించారు. తెలంగాణ సాధించుకున్నారు కానీ ఫాంహౌస్‌లో పడుకునే వారికి పాలించడం ఏమొస్తుంది అని ఎగతాళి చేశారు. రోజుకు 18గంటల పాటు శ్రమించే ముఖ్యమంత్రిగా మీడియా గుర్తింపు పొందిన బాబు ఒకవైపు, ఫాంహౌస్‌లోనే కాలం వెళ్లదీస్తాడు అని ముద్ర పడిన కెసిఆర్ ఒకవైపు. ఉద్యమకారుని నుంచి పాలకునిగా తన కొత్త బాధ్యతను విజయవంతంగా నిర్వహించడంలో కెసిఆర్ విజయం సాధించారు.


చంద్రబాబు సహా పలువురు ఆంధ్ర మంత్రులు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడినా కెసిఆర్ వాటికి సమాధానం చెప్పలేదు. 13 ఏళ్లపాటు ఉద్ధృతంగా ఉద్యమాన్ని నడిపిన నాయకుడిలో అలాంటి సంయమనం కెసిఆర్ వ్యతిరేకులకు సైతం విడ్డూరంగా అనిపించింది. నిజానికి ఇందులో కూడా రాజకీయ వ్యూహం ఉంది. ఎన్టీఆర్ భవన్‌లోనే భోజనం చేస్తూ పార్టీ సిబ్బంది రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం రోజూ కెసిఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు నాయకులు తమకు తెలియకుండానే కెసిఆర్‌కు, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు సహకారం అందించారు. వారి తిట్లు తెలంగాణ కోసం పోరాడేది కెసిఆర్ ఒక్కరే అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడేందుకు ఉపయోగపడ్డాయి. బాబు కోసం వారు తిట్టిన తిట్లు కెసిఆర్‌కు నిచ్చెనగా ఉపయోగపడ్డాయి. ఎదుటివాడు విసిరే ఒక్కో రాయిని మెట్టుగా ఉపయోగించుకుని పైకి వచ్చినట్టుగా ఆ తిట్లు కెసిఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాయి.
ఒకరు తెలంగాణ ఇచ్చే స్థాయిలో ఉన్నవారు, ఒకరు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీ, వీళ్లందరినీ కాదని తెలంగాణ ప్రజలు కెసిఆర్‌నే తెలంగాణ ముఖచిత్రంగా భావించడానికి కారణం దాదాపు అన్ని పార్టీలు కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడమే. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఈ పార్టీలు అదే ధోరణిలో వెళ్తున్నాయి. ఇదే కెసిఆర్‌కు శ్రీరామ రక్ష.
తెలంగాణ ఉద్యమం సాగినంత కాలమే కెసిఆర్ హవా, తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఎన్నికలకు ముందు ఉన్న బలమైన అభిప్రాయం. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కెసిఆర్ ఇంటి ముందు వాళ్ల అబ్బాయి, అల్లుడు, కుమార్తె తప్ప నాలుగో వ్యక్తి ఉండరు అంటూ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు చాలెంజ్ చేశారు. కానీ చిత్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత కెసిఆర్ బలం మరింతగా పెరుగుతోంది. ఎంతగా అంటే ఖమ్మం జిల్లా పరిషత్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అసలు పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ జిల్లా పరిషత్తు సైతం టిఆర్‌ఎస్ ఖాతాలో పడిపోయింది. నల్లగొండ జిల్లాలో తప్ప తెలంగాణలో అన్ని జిల్లా పరిషత్తులు టిఆర్‌ఎస్ కైవసం అయ్యాయి.


ఒకవైపు పాలన సాగిస్తూనే చాపకింద నీరులా తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ను బలంగా తయారు చేసేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారానికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎంతటి వాడినైనా తన వైపు తిప్పుకుంటుంది. రాజకీయ నాయకులు నైతిక విలువల గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ఆంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరుతున్నారు. తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో సీన్ ఒకటే. బాబు నైతిక విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతారు. కెసిఆర్ మాట్లాడరు. అంతే తేడా. రాజకీయ నాయకులు విలువల గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే ఉత్తమం. రాజు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించుకోవాలంటుంది రాజధర్మం. అలా చేయకపోతే కేజ్రీవాల్‌లా నవ్వుల పాలవుతారు. ఉద్యమ బలంతో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పాలనా బలంతో తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మీడియా సమావేశాలు, హడావుడి ప్రచారం లేకుండానే చాపకింద నీరులా అన్ని జిల్లాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. చివరకు ఖమ్మం జిల్లాలో సైతం పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తోంది.


రాజకీయ వ్యూహాల్లో కెసిఆర్ తానేంటో ఎప్పుడో నిరూపించుకున్నారు. పాలనలో తానేమిటో ఇప్పుడు చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు మాత్రమే అవుతోంది. కొత్త రాష్ట్రంలో ఇప్పటికీ కనీసం పూర్తి స్థాయిలో ఉద్యోగుల కేటాయింపు సైతం జరగలేదు. తాత్కాలికంగా సమస్యలు ఉంటాయి. సహజమే వాటిని ప్రజలు అర్థం చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయకముందే విపక్షాల విమర్శలు ఎప్పుడూ ఉండేవే. ప్రజల మూడ్‌ను గమనించకుండా విమర్శలు చేస్తున్న విపక్షాలు తమంతట తామే ప్రజలకు దూరం అవుతున్నాయి. అయితే ఉద్యమ ప్రభావం శాశ్వతంగా ఉంటుందని భావించేంత అమాయకుడేమీ కాదు కెసిఆర్. ఆ సంగతి తెలుసు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకొచ్చింది. ఇక చెప్పింది అమలులో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి చేసి చూపించాలి. తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయ. హైదరాబాద్ చల్లగా ఉంటే తెలంగాణ పల్లెలు బాగుంటాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం బాగానే గుర్తించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెట్టడమే కాదు ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలు బాగున్నాయి. అవి అమలులోకి రావాలి. వంద రోజుల పాలనలో విజన్ ఉన్న నాయకుడిగా కెసిఆర్ తెలంగాణ ప్రజల్లోనే కాదు సీమాంధ్రలో సైతం ఎంతో కొంత గుర్తింపు పొందారు. ప్రత్యర్థుల విమర్శలు, తిట్లకు తిట్లతో సమాధానం కాదు పని తీరుతో సమాధానం చెప్పాలి. తిట్టిన తిట్లు గాలిలో కలిసిపోతాయి. తిట్టిన వారు సోదిలో లేకుండా పోతారు. చేసిన పనులు జనం మనసులో ఉండిపోతాయి.


వంద రోజుల్లో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే సమాచార శాఖ వంద పనుల జాబితా ఇమ్మన్నా ఇస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే, ఇది తెలంగాణ ప్రభుత్వం అని ప్రతి దానిలో తెలంగాణ ముద్రను చూపడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతం అయింది. గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఇది తెలంగాణ ప్రభుత్వం అనే బలమైన ముద్ర వేశారు. త్వరలోనే మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ఐటిఐఆర్ ప్రాజెక్టు అమలులోకి వస్తే హైదరాబాద్ రూపురేఖలే కాదు తెలంగాణ భాగ్యరేఖ మారిపోతుంది. తెలంగాణ సాధ్యం అని కెసిఆర్ చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించిన తెలంగాణ ప్రజలు, బంగారు తెలంగాణ సాకారం చేసి చూపిస్తాను అని చెబుతున్న మాటలను అంతే విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది. 

8, సెప్టెంబర్ 2014, సోమవారం

మేనేజ్‌మెంట్ గురు చింతామణి!

‘ఏమి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు’’ అంటూ భాస్కరం నవ్వుతూ అడిగాడు.
‘‘నా చింత చింతామణి గురించి ’’అని కుటుంబరావు బదులిచ్చాడు. ‘‘ఎవరన్నా వింటే నవ్వుతారు. ఇంట్లో వాళ్లు విన్నారా? అంటే తన్ని బయటకు తగలేస్తారు? సిగ్గులేకపోతే సరి ఈ వయసులో చింతామణి గురించా ఆ రోజుల్లో అయితే వేరు’’ అంటూ భాస్కరం ఊహల్లోకి వెళ్లిపోయాడు. ‘‘తప్పులో కాలేశావోయ్ భాస్కరం నువ్వు ఆలోచిస్తున్న దాని గురించి కాదు నేను ఆలోచిస్తున్నది. నా ఆలోచన సూపర్ హిట్టయిందంటే నాకు డబ్బే డబ్బు, నీతో ఇలా కబుర్లు చెప్పడానికి సైతం సమయం ఉండదు’’ అంటూ కుటుంబరావు చెప్పుకుపోతున్నాడు.


‘‘అబ్బో చింతామణి గురించి మాకు తెలియదనుకోకు ఆ నాటకంలో ప్రతి డైలాగు నాకు కంఠతా వచ్చు, వదలమంటావా? ఎప్పుడో మంచి వయసులో ఉన్నప్పుడు విన్న నాటకం. చింతామణిని చూడకపోయినా చింతామణి అబ్బలాంటి వారి గురించి నాకు తెలుసు. ఒకరా ఇద్దరా ఇంత మందిని చూసుంటాను అని తలవెంట్రుకలు చూపించాడు భాస్కరం. ‘‘ఇదిగో కటుంబరావు అనుభవంతో చెబుతున్నాను విను, ఈ వయసులో నీకు చింతామణి మీద మనసు పడడం మంచిది కాదు. అయినా వాళ్లు జేబులు ఖాళీ చేస్తారు కానీ వాళ్లతో నీకు డబ్బులు రావడం ఏమిటోయ్. గోడకు కొట్టిన సున్నం తిరిగి వస్తుందంటే నమ్మేంత అమాయకుడిననుకున్నావా?’’ అంటూ భాస్కరం అడిగాడు. ‘‘నేనసలు విషయం చెప్పక ముందు నువ్విలా తీర్పులిచ్చేయడం ఏమీ బాగాలేదోయ్.. చింతామణి గురించి ఆలోచిస్తున్నాను అంటే డబ్బంతా ఆమెకు తగలబెట్టాలని కాదు. ఆమె జీవితంపై ఓ పుస్తకం రాయాలని ఆలోచిస్తున్నాను’’ అంటూ కుటుంబరావు చెప్పాడు.


‘‘హవ్వ నవ్విపోతారు. చింతామణిని తలుచుకోవడమే తప్పు అంటే ఆమె జీవిత కథ రాస్తావా? ఇంకెవరూ దొరకలేదా ? ఏమిటి? జీవిత కథ రాసి చింతామణి జీవితంలోకి ప్రవేశించి ఆమె సొమ్ము కాజేయాలనుకుంటున్నావేమో, నీలాంటి వాళ్లను చింతామణి ఎంత మందిని చూసి ఉంటుంది. కస్టమర్ల జేబులు ఖాళీ చేయడమే కానీ ఆమె నుంచి సంపద ఆశించేవాడిని నినే్న చూస్తున్నాను’’ అని భాస్కరం అనుమానంగా ముఖం పెట్టాడు.


‘‘హమ్మయ్య ఇప్పుడు కొంత దారిలోకి వచ్చావు. చూశావా? నువ్వు కూడా చింతామణి శక్తిసామర్ధ్యాలను కథలు కథలుగా చెబుతున్నావు. నాకు కావలసింది అదే... చింతామణి సామ ర్ధ్యం పై చింతామణి మేనేజ్‌మెంట్ గురు అంటూ ఇంగ్లీష్‌లో ఓ బుక్ రాయాలనుకుంటున్నాను’’ అని కుటుంబరావు చెప్పాడు. ‘‘ఏంటో ఏమీ అర్ధం కావడం లేదు. వివరంగా చెప్పు’’ అని భాస్కరం అడుగడంతో అప్పుడు కుటుంబరావు మనసులోని ఆలోచన బయటపెట్టాడు.


‘‘ఇదిగో ఇటు రా ఇంటర్‌నెట్‌లో చూడు’’ అంటూ గూగుల్‌లో క్లిక్ చేయగానే కొన్ని వందల మహాభారత పుస్తకాలు కనిపించాయి. ‘‘చూశావా? మహాభారతంలో మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయంటూ వాటిని వెలికి తీసి ఈ నాటి కార్పొరేట్ కంపెనీలకు మేనేజ్‌మెంట్ పాఠాలు చెబుతూ వందల పుస్తకాలు వచ్చాయి. ఆ గ్రంథాలను చూసి భాస్కరం విస్తుపోయాడు. ‘‘బహుశా మహాభారతాన్ని రచించినప్పుడు వ్యాస మహర్షికి కూడా మహాభారతంలో మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయని తెలిసి ఉండకపోవచ్చు. మహాభారతంలో అన్నీ ఉంటే ఉండొచ్చు కానీ రాజ్యాధికారం కోసం రాజకుటుంబాల మధ్య సాగిన యుద్ధం నేటి కార్పొరేట్ కంపెనీలకు మేనేజ్‌మెంట్ పాఠాల రూపంలో చూపడం విడ్డూరమే’’ అనుకున్నాడు భాస్కరం.


అంతేనా ఇది చూడు అని కుటుంబరావు గూగుల్ సెర్చ్‌ను మళ్లీ క్లిక్ చేయగానే కార్పొరేట్ కంపెనీ నాయకత్వ లక్షణాలు- రామాయణం అంటూ బోలెడు పుస్తకాలు దర్శనమిచ్చాయి. కుటుంబరావు వాటిని చూపిస్తూ, ‘‘్భర్యాభర్తల అనుబంధం, అన్నా తమ్ముళ్ల అనుబంధం, స్నేహ ధర్మం, పర స్ర్తి వ్యామోహం ఎలా పతనం చేస్తుందో జీవిత విలువల కోణంలోనే రామాయణం కొన్ని శతాబ్దాల నుంచి ప్రపంచాన్ని ముఖ్యంగా భారతీయుల హృదయాల్లో నిలిచింది. కానీ రామాయణంలో సైతం నేటి కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయట! రామాయణం రచయిత, రామాయణంలో ఓ పాత్ర ధారి అయిన వాల్మీకి కూడా ఈ ఆలోచన వచ్చి ఉండదు. ఎందుకంటే అది సత్య కాలమే కానీ వ్యాపార కాలం కాదు కదా? ఇది ఫక్తు వ్యాపార కాలం కాబట్టి ధర్మాన్ని, సత్యాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని సైతం వ్యాపార కోణంలోనే చూస్తున్నారు ’’ అని కుటుంబరావు చెప్పుకొచ్చాడు. వీళ్లని చూసి మేమేమన్నా తక్కువ తిన్నామా? అని మేనేజ్‌మెంట్ గురు చాణక్య అంటూ పుస్తకాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. మేమేమన్నా తక్కువనా అని స్వామి వివేకానందుణ్ణి రంగంలోకి దించారు. తన జీవితాన్ని విలువల బోధనకు, హిందూమతానికే అంకితం చేసిన వివేకానందుణ్ణి కార్పొరేట్ వ్యాపారంలోకి లాక్కొచ్చి వివేకానంద కార్పొరేట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. లాభాలే ధ్యేయంగా పని చేసే కంపెనీలకు విలువలు బోధించే మహాభారతం, రామాయణం, వివేకానందుని బోధనల కన్నా చింతామణి సూక్తులే సరిగ్గా సరిపోతాయి. 

అందుకే చింతామణి కార్పొరేట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అని ఓ పుస్తకం రాయాలనిపిస్తోంది. దాని గురించే ఆలోచిస్తున్నాను. కస్టమర్‌ను ఎలా బోల్తా కొట్టించాలో, ఎలా నమ్మించాలో, ఉన్నదంతా ఏలా ఊడ్చేయాలో చింతామణి తల్లి ఎంతో చక్కగా చెబుతుంది ఈ నాటకంలో. మద్యం, ధూమపానం శరీరాన్ని గుల్ల చేస్తుందని తెలిసినా కోకా కోలా మరుగుదొడ్లను చక్కగా కడిగేందుకు ఉపయోగపడుతుందని ఎవరెంత ప్రచారం చేసినా, బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి హాని కరం తినొద్దు అంటూ స్వయంగా వాటి ఉత్పత్తి దారులే ఉద్యోగులకు చెప్పినా, వాటిని ఎగబడి కొంటున్నారంటే కారణం ఏమిటి? కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ టెక్నిక్. చింతామణి టెక్నిక్ కూడా ఇదే. కస్టమర్‌ను ఆకట్టుకోవడానికి కార్పొరేట్ కంపెనీల కన్నా ముందు ఆ టెక్నిక్‌ను అమలు చేసింది చింతామణి కుటుంబమే కదా? ఇక్కడ బిల్వమంగళుడు అయితే అక్కడ కస్టమర్ అంతే కదా? అందుకే నేను చింతామణి పాఠాలను కార్పొరేట్ లీడర్లకు పరిచయం చేయాలనకుంటున్నాను ’’ అని కుటుంబరావు చెప్పాడు. మేనేజ్‌మెంట్ గురు చింతామణి కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుందేమో!

రజనీష్ చెప్పిన ఓ కథ - తెలంగాణా


రజనీష్ చెప్పిన ఓ కథ సక్షిప్తంగా  ఓ సంపన్నుడికి పట్టలేని ఆగ్రహం వచ్చి   భార్య తల నరికేస్తాడు . తరువాత   వెంటనే  ఓ స్వామి వద్దకు వెళ్లి .. నేను సన్యాసం స్వికరించాలనుకుంటున్నాను అని చెబుతాడు .. స్వామి నవ్వి  సన్యాసం స్వీకరించడం అంత సులభం  కాదు అది నీ వల్ల  సాధ్యం కాదు నీది విలాసవంతమైన జీవితం .. నీ  కారు .. ఖరీదైన దుస్తులను ఒక్క సారి చూసుకో  అని చెబుతాడు .. ఆ మాట వినగానే సంపన్నుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా  ఖరీదైన తన దుస్తులను పరపరా  చింపేసి .. నగ్నంగా నిలబడి .. ఖరీదైన నా దుస్తులను వదిలేశాను  ఇప్పుడు చెప్పండి .. నేను సన్యాసం తీసుకుంటాను అంటాడు 
స్వామి చిరునవ్వుతో నీలో  ఏ మార్పు రాలేదు .. భార్య తల నరికినప్పుడు ఒక రూపం లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు మరో  రూపం లో చుపుతున్నావు అంతే అంటాడు ... 
అది సరే ఈ కథకు తెలంగాణకు ఏం సంబంధం ?
తెలంగాణా ప్రజాప్రతినిధులను కల్లు తాగిన .... మడిచి ఎక్కడ ... అంటూ అసహ్యంగా తెలంగాణా పై తన వ్యతిరేకత చూపిన చానల్ ఇప్పుడు తన మరో చానల్ కు జై తెలంగాణా అని పేరు పెట్టింది ..  దీనికి ఓషో  రజనీష్ చెప్పిన ఆ సంపన్నుడి కథ సరిపోయింది 
తెలంగాణాను ప్రేమించే వాడి హృదయం నుంచి వచ్చే నినాదం జై  తెలంగాణా 
చివరకు ఆ నినాదాన్ని కుడా వానికి లేకుండా చేయవద్దు అని కోరుకోవడం మినహా మరో  ఉద్దేశం లేదు 

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

అమితాబ్ జీవితం ఓ ఆర్థిక పాఠం ... పడి లేచిన కెరటం

‘‘అది 2000 సంవత్సరం. ప్రపంచమంతా నూతన శతాబ్ది సంబరాల్లో మునిగితేలుతోంది. నేను మాత్రం కుప్పకూలిన నా భవిష్యత్తు గురించి ఆలోచనలో మునిగిపోయాను. నా చేతిలో సినిమాలు లేవు, నా దగ్గర డబ్బులేదు. నా కంపెనీ లేదు. కోట్లాది రూపాయలకు సంబంధించిన కేసులు. ఆదాయం పన్ను బకాయిలు. చివరకు నా సొంత ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి నోటీసు అందింది’’ ఇది అమితాబ్ తన గురించి తాను చెప్పుకున్న మాటలు.

నమష్కార్

మై అమితాబ్ బచ్చన్ బోల్ రహహూ కౌన్ బనేగా కరోడ్‌పతి సే అంటూ ఆయన మాటలు వినిపిస్తే, ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. తన మాటలతో జీవితం పట్ల ఉత్సాహాన్ని నింపుతాడు ఈ 72 ఏళ్ల యువకుడు. 20 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను మరిచిపోయి వారున్న ఈ కాలంలో 72 ఏళ్ల వయసులో ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవిత్వాన్ని వినిపిస్తారు.
యంగ్రీ యంగ్ మెన్‌గా భారతీయ సినిమా రంగాన్ని ఏలిన బాద్‌షా ఒక సందర్భంలో సొంతింటిని తాకట్టు నుంచి విడిపించలేక బ్యాంకుకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన లేకపోవడమే దానికి కారణం.
మొదటి నుంచి నాకు డబ్బుకు సంబంధించిన అవగాహన లేదు. నాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యులు, మేనేజర్లే చూసుకునే వారు అంటూ ఆర్థిక వ్యవహారాల్లో తనకు అవగాహన లేదని ఆయనే చెప్పుకున్నారు.

1975లో హిందీ సినిమా రంగంలో ఒక సంచలనం దీవార్..
‘‘ఆజ్ మేరేపాస్ బిల్డింగ్ హై, ప్రాపర్టీ హై, బ్యాంక్ బ్యాలెన్స్ హై, బంగ్లా హై, గాడీ హై క్యాహై.. క్యా హై తుమారీ పాస్ అని అమితాబ్ అంటే
శశికపూర్ నెమ్మదిగా మేరీ పాస్ మా హై అంటాడు. సినిమాలో ఈ డైలాగు చెప్పడానికి బాగుంటుంది కానీ ఒక సంపన్నుడు, సెలబ్రిటీ చివరకు ఇల్లు కూడా లేని స్థాయికి పడిపోవడాన్ని తట్టుకోవడం చెప్పినంత ఈజీ కాదు.
సినిమా రంగంలో ఇలా దెబ్బతిన్నవారికి కొదవ లేదు. అవకాశాలు దక్కనప్పుడు అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన వారు మారిన పరిస్థితిని జీర్ణం చేసుకోలేక తమ నుంచి తాము పారిపోతూ వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని చీకటిగా మార్చుకున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. మారిన పరిస్థితిని అవగాహన చేసుకొని తిరిగి తామెలా నిలదొక్కుకోవాలో ఆలోచించే వారు తక్కువ. అమితాబ్ ఆ కోవకు చెందిన వారు కాదు. ఆయన జీవితం ఆత్మవిశ్వాసం పాఠం. అమితాబ్ పడి లేచిన కెరటం. అతని వద్ద ఏమీ లేని స్థితిలో కూడా బోలెడంత ఆత్మవిశ్వాసం ఉంది. కావలసినంత ఆరోగ్యం ఉంది. అవే ఆయన్ని తిరిగి నిలబెట్టాయి. పడిపోయిన వారికి జీవితంలో తిరిగి లేవడానికి కావలసింది అదే.

53 ఏళ్ల వయసు. సాధారణంగా ఈ వయసులో రిటైర్‌మెంట్ లైఫ్ గురించి ప్రణాళికలు రూపొందించుకుంటుంటారు. కానీ ఆ వయసులో అమితాబ్ నిండా అప్పుల్లో కూరుకుపోయి కేసులో చిక్కుకుపోయారు. హిందీ సినిమా రంగాన్ని ఏలిన అమితాబ్‌కు వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనిపించింది. 1995లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. విశ్వసుందరి పోటీల ఈవెంట్ నిర్వహించడం, టీవి కార్యక్రమాలు మొదలుకొని సినిమాల నిర్మాణం వరకు అన్నింటిలో వేలు పెట్టిందీ కార్పొరేషన్. ఏం జరిగిందో అర్ధం చేసుకునే లోపే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. అమితాబ్ అప్పుల్లో కూరుకుపోయారు. 1982లో కూలీ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడి మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన ఆయన్ని ఆత్మవిశ్వాసమే బతికించింది. ఆర్థిక పరమైన దెబ్బ అంత కన్నా తీవ్ర ప్రభావం చూపింది. కూలీ సినిమాలో గాయపడితే కోలుకోవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు చేశారు. ఎలాంటి వ్యక్తి అయినా ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నప్పుడు కోలుకోవాలనే పూజలను, దీవెనలను ఆశించలేం. సక్సెస్ ఉంటేనే అంతా వెంటుంటారు... అప్పుల్లో కూరుకుపోయిన వారిని పలకరించేవారు కూడా ఉండరు. అన్నీ పోయినా ఆత్మవిశ్వాసం తన వెంటే ఉందనే ఆనందం అమితాబ్‌ది. ఏం తప్పు చేశాను ఎక్కడ తప్పటడుగు వేశాను, ఇప్పుడేం చేయాలి, నా జీవితం ముగిసిపోయిందా? మళ్లీ లేచేందుకు అవకాశం లేదా? అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. 

1996లో బెంగళూరులో నిర్వహించిన మిస్ వరల్డ్ అమితాబ్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. 1999 నాటికి ఎబిసిఎల్ పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఎబిసిఎల్ ఖాయిలా పడ్డట్టు ప్రకటించారు. అమితాబ్ సొంతిల్లు ప్రతిక్ష, మరో రెండు ప్లాట్లు లోన్ రికవరీ కింద కెనరా బ్యాంకుకు అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ దశలో చాలా మంది ఆర్థిక నిపుణులు, సన్నిహితులు ఎబిసిఎల్‌ను ముగించేసి కొత్త సినిమాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చారు. కానీ అమితాబ్‌కు ఇది నచ్చలేదు. అమితాబ్ అనే తన పేరు మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అలాంటి వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ చేతులెత్తేయడం ధర్మం కాదనుకున్నారు.

‘‘ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒక రోజు తెల్లవారు జామునే లేచి యష్ చోప్రా ఇంటికి వెళ్లాను. నేను దివాళా తీశాను. నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నా ఇల్లు, ఢిల్లీలోని ఆస్తులను అటాచ్ చేశారు. నేను చెప్పిందంతా యష్ చోప్రా ప్రశాంతంగా విన్నారు. మొహబతే సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కోలుకున్నాను ’’ అంటూ అమితాబ్ తన ప్రయాణాన్ని చెప్పుకున్నారు. జీరోతో రెండవ ఇన్నింగ్ ప్రారంభించిన అమితాబ్ 90 కోట్ల రూపాయల అప్పును తీర్చేశారు. 2012 నాటికే దాదాపు నాలుగు వందల కోట్లరూపాయల ఆస్తి ఉన్నట్టుగా చూపించారు. విశ్వసుందరి ఐశ్వర్య ఆయన కోడలు. కొడుకు అభిషేక్ హీరో. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనురాగం. చక్కని కుటుంబం. ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు అమితాబ్‌కు ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే నేడీ స్థాయికి చేరుకునే వారే కాదు.

మొహబతే సినిమా తరువాత అమితాబ్ వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవి షోల్లో బిజీ అయ్యారు.
2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్‌పతి ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకసారి దెబ్బతినగానే అంతా అయిపోయింది అంటూ మత్తులోనో, వ్యసనాల్లోనో మునగడం కాదు. తప్పు ఎక్కడ జరిగిందో నిజాయితీగా సమీక్షించుకోవాలి. ఎక్కడ తిరిగి నిలబడే అవకాశం ఉందో తెలుసుకోవాలి. అమితాబ్ చేసింది అదే. కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఆయన వద్దకు వచ్చినప్పుడు అంతా వద్దు వద్దు అని సలహాలు ఇచ్చిన వారే. కుటుంబ సభ్యులతో సహా అంతా వద్దన్నా అమితాబ్ ఆ కార్యక్రమాన్ని తాను విజయవంతం చేయగలను అనే నమ్మకంతో అంగీకరించారు. రాజీవ్ స్నేహితునిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి బోఫోర్స్ కుంభకోణంలో తన పేరు ఇరికించడంతో ఈ రంగానికి తాను సరిపోనని గ్రహించి బయటపడ్డ అమితాబ్ తానే రంగానికి సరిపోతాడో తనను తాను సరిగ్గానే అంచనా వేసుకున్నారు. కౌన్‌బనేగా కరోడ్‌పతి విజయంతో ఐసిఐసిఐ వంటి ప్రముఖ బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ను ఎంపిక చేసుకుంది. అప్పుల నుంచి బయటపడి తిరిగి నిలదొక్కుకోవడానికి ఈ కార్యక్రమం అమితాబ్‌కు ఉపయోగపడింది. అమర్‌సింగ్ లాంటి రాజకీయ నాయకుడు, కొందరు పారిశ్రామిక వేత్తలు అమితాబ్‌కు అండగా నిలిచి ఉండవచ్చు. కానీ ఆయన విజయం వెనుక వారి సహకారం మాత్రమే కాదు. మొక్కవోని ఆత్మవిశ్వాసమే అమితాబ్‌ను తిరిగి సగర్వంగా నిలబడేట్టు చేసింది. తిరిగి ఎబి కార్పొరేషన్‌ను ప్రారంభించి కొన్ని సినిమాలను నిర్మించారు. తాను దేనికి సరిపోతాను అని సరిగ్గా అంచనా వేసుకున్న వారినే విజయం వరిస్తుంది.

 దేహమే దేవాలయం అనే భావన మనది. ఏ కార్యమైన నిర్వహించాల్సింది ఈ దేహంతోనే. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎన్ని కష్టాలనైనా తట్టుకుని తిరిగి నిలబడగలుగుతుంది. కింద పడిపోయినప్పుడు అదే నీ జీవితంలో చివరి అవకాశం అనుకోక మళ్లీ లేచి నిలబడడానికి అవకాశం ఉందని గ్రహించమంటోంది, సంపాదించడమే కాదు సంపద గురించి అవగాహన అవసరం అని చెబుతోంది అమితాబ్ జీవితం.

నీకు అవగాహన ఉన్న వ్యాపారమే చేయాలంటారు వారన్ బఫెట్. అవగాహన లేని వ్యాపారంలో అడుగు పెడితే ఏమవుతుందో చెబుతుంది అమితాబ్ అనుభవం.