9, సెప్టెంబర్ 2014, మంగళవారం

వంద రోజుల తెలంగాణా - ఉద్యమ నేత నుంచి పాలకుడిగా కెసిఆర్

వంద రోజుల తెలంగాణ పాలన సాధారణ తెలంగాణ ప్రజలకు సంతోషాన్నే కలిగిస్తోంది. ఒక ప్రభుత్వానికి వంద రోజుల పాలన పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది కొత్త ప్రభుత్వానికి వంద రోజుల పాలన కాదు. కొత్త రాష్ట్రానికి వంద రోజుల ఉత్సవం.


దొర అనే మాటను గౌరవంగా వాడుతారు. ధవళేశ్వరం బ్యారేజీ కట్టినందుకు కాటన్‌ను కాటన్ దొర అని, తెలుగుభాషకు సేవ చేసినందుకు బ్రౌన్‌ను బ్రౌన్ దొర అని అభిమానంగా పిలుచుకుంటారు. దేశాన్ని పాలించిన బ్రిటీష్‌వారిని తెల్లదొరలు అని గౌరవించుకుంటాం. అలానే తెలంగాణలో పాలించిన స్థానిక పాలకులను దొరలు అనే వారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా సాధారణంగా దొర అనే మాట గౌరవంగా ఉపయోగించేదే. కానీ కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించాక ఆ పదానికి అర్థాన్నే మార్చేశారు. తెలంగాణ ఏర్పడితే దొరల గడీల పాలన వస్తుందని, నక్సలైట్లు విజృంభిస్తారని, దేశమంతా చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరుగుతాయని, మొత్తం మీద దేశం చిన్నాభిన్నం అవుతుందని తేల్చి చెప్పేశారు. ఎంతగా భయపెట్టినా అడ్డుకున్నా తెలంగాణ ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చి వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది కూడా. ప్రత్యర్థి పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందేమో కానీ గడీల పాలన మాత్రం రాలేదు. దేశం విచ్ఛిన్నం కాలేదు. సముద్రాలు పొంగలేదు. హాయిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. తెలంగాణలో చంద్రశేఖర్ రావు, ఆంధ్రలో చంద్రబాబు, దేశంలో నరేంద్ర మోదీలు ఎవరి స్టైల్‌లో వారు పాలన అందిస్తున్నారు. ఆంధ్రలో చంద్రబాబుకు తొమ్మిదేళ్ల పాలనా అనుభవం ఉంది. నరేంద్ర మోదీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ముఖ్యమంత్రి విషయం వచ్చే సరికి ఎలా పాలిస్తారు అనే సందేహం బలంగా ఉండేది. ఉద్యమ నాయకునిగా అనుభవం, మంత్రిగా పాలనానుభవం తప్ప ఒక రాష్ట్రాన్ని పాలించిన అనుభవం కెసిఆర్‌కు లేదు. బలంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వారికి సైతం తెలంగాణ ఏర్పడిన తరువాత పాలన ఎలా ఉంటుంది అనే భయం ఉండేది. తెలంగాణ నేతలు పాలించలేరు అనే విమర్శ ఇతర ప్రాంతాల వారిలో ఉంటే మనం పాలించలేమేమో అనే అనుమానం కొందరు తెలంగాణ నాయకుల్లో బలంగా ఉండేది. తెలంగాణ సాకారం కాదు అంటూ తెలంగాణ ఉద్యమకారులు సైతం నమ్మిన కాలంలో అట్లెట్ల సాధ్యం కాదు సాధ్యం చేసి చూపిస్తాను అంటూ రంగంలోకి దిగిన కెసిఆర్ తెలంగాణ కలను నిజం చేసి చూపించారు. తెలంగాణ సాధించుకున్నారు కానీ ఫాంహౌస్‌లో పడుకునే వారికి పాలించడం ఏమొస్తుంది అని ఎగతాళి చేశారు. రోజుకు 18గంటల పాటు శ్రమించే ముఖ్యమంత్రిగా మీడియా గుర్తింపు పొందిన బాబు ఒకవైపు, ఫాంహౌస్‌లోనే కాలం వెళ్లదీస్తాడు అని ముద్ర పడిన కెసిఆర్ ఒకవైపు. ఉద్యమకారుని నుంచి పాలకునిగా తన కొత్త బాధ్యతను విజయవంతంగా నిర్వహించడంలో కెసిఆర్ విజయం సాధించారు.


చంద్రబాబు సహా పలువురు ఆంధ్ర మంత్రులు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడినా కెసిఆర్ వాటికి సమాధానం చెప్పలేదు. 13 ఏళ్లపాటు ఉద్ధృతంగా ఉద్యమాన్ని నడిపిన నాయకుడిలో అలాంటి సంయమనం కెసిఆర్ వ్యతిరేకులకు సైతం విడ్డూరంగా అనిపించింది. నిజానికి ఇందులో కూడా రాజకీయ వ్యూహం ఉంది. ఎన్టీఆర్ భవన్‌లోనే భోజనం చేస్తూ పార్టీ సిబ్బంది రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం రోజూ కెసిఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు నాయకులు తమకు తెలియకుండానే కెసిఆర్‌కు, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు సహకారం అందించారు. వారి తిట్లు తెలంగాణ కోసం పోరాడేది కెసిఆర్ ఒక్కరే అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడేందుకు ఉపయోగపడ్డాయి. బాబు కోసం వారు తిట్టిన తిట్లు కెసిఆర్‌కు నిచ్చెనగా ఉపయోగపడ్డాయి. ఎదుటివాడు విసిరే ఒక్కో రాయిని మెట్టుగా ఉపయోగించుకుని పైకి వచ్చినట్టుగా ఆ తిట్లు కెసిఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాయి.
ఒకరు తెలంగాణ ఇచ్చే స్థాయిలో ఉన్నవారు, ఒకరు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీ, వీళ్లందరినీ కాదని తెలంగాణ ప్రజలు కెసిఆర్‌నే తెలంగాణ ముఖచిత్రంగా భావించడానికి కారణం దాదాపు అన్ని పార్టీలు కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడమే. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఈ పార్టీలు అదే ధోరణిలో వెళ్తున్నాయి. ఇదే కెసిఆర్‌కు శ్రీరామ రక్ష.
తెలంగాణ ఉద్యమం సాగినంత కాలమే కెసిఆర్ హవా, తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఎన్నికలకు ముందు ఉన్న బలమైన అభిప్రాయం. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కెసిఆర్ ఇంటి ముందు వాళ్ల అబ్బాయి, అల్లుడు, కుమార్తె తప్ప నాలుగో వ్యక్తి ఉండరు అంటూ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు చాలెంజ్ చేశారు. కానీ చిత్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత కెసిఆర్ బలం మరింతగా పెరుగుతోంది. ఎంతగా అంటే ఖమ్మం జిల్లా పరిషత్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అసలు పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ జిల్లా పరిషత్తు సైతం టిఆర్‌ఎస్ ఖాతాలో పడిపోయింది. నల్లగొండ జిల్లాలో తప్ప తెలంగాణలో అన్ని జిల్లా పరిషత్తులు టిఆర్‌ఎస్ కైవసం అయ్యాయి.


ఒకవైపు పాలన సాగిస్తూనే చాపకింద నీరులా తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ను బలంగా తయారు చేసేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారానికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎంతటి వాడినైనా తన వైపు తిప్పుకుంటుంది. రాజకీయ నాయకులు నైతిక విలువల గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ఆంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరుతున్నారు. తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో సీన్ ఒకటే. బాబు నైతిక విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతారు. కెసిఆర్ మాట్లాడరు. అంతే తేడా. రాజకీయ నాయకులు విలువల గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే ఉత్తమం. రాజు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించుకోవాలంటుంది రాజధర్మం. అలా చేయకపోతే కేజ్రీవాల్‌లా నవ్వుల పాలవుతారు. ఉద్యమ బలంతో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పాలనా బలంతో తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మీడియా సమావేశాలు, హడావుడి ప్రచారం లేకుండానే చాపకింద నీరులా అన్ని జిల్లాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. చివరకు ఖమ్మం జిల్లాలో సైతం పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తోంది.


రాజకీయ వ్యూహాల్లో కెసిఆర్ తానేంటో ఎప్పుడో నిరూపించుకున్నారు. పాలనలో తానేమిటో ఇప్పుడు చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు మాత్రమే అవుతోంది. కొత్త రాష్ట్రంలో ఇప్పటికీ కనీసం పూర్తి స్థాయిలో ఉద్యోగుల కేటాయింపు సైతం జరగలేదు. తాత్కాలికంగా సమస్యలు ఉంటాయి. సహజమే వాటిని ప్రజలు అర్థం చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయకముందే విపక్షాల విమర్శలు ఎప్పుడూ ఉండేవే. ప్రజల మూడ్‌ను గమనించకుండా విమర్శలు చేస్తున్న విపక్షాలు తమంతట తామే ప్రజలకు దూరం అవుతున్నాయి. అయితే ఉద్యమ ప్రభావం శాశ్వతంగా ఉంటుందని భావించేంత అమాయకుడేమీ కాదు కెసిఆర్. ఆ సంగతి తెలుసు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకొచ్చింది. ఇక చెప్పింది అమలులో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి చేసి చూపించాలి. తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయ. హైదరాబాద్ చల్లగా ఉంటే తెలంగాణ పల్లెలు బాగుంటాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం బాగానే గుర్తించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెట్టడమే కాదు ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలు బాగున్నాయి. అవి అమలులోకి రావాలి. వంద రోజుల పాలనలో విజన్ ఉన్న నాయకుడిగా కెసిఆర్ తెలంగాణ ప్రజల్లోనే కాదు సీమాంధ్రలో సైతం ఎంతో కొంత గుర్తింపు పొందారు. ప్రత్యర్థుల విమర్శలు, తిట్లకు తిట్లతో సమాధానం కాదు పని తీరుతో సమాధానం చెప్పాలి. తిట్టిన తిట్లు గాలిలో కలిసిపోతాయి. తిట్టిన వారు సోదిలో లేకుండా పోతారు. చేసిన పనులు జనం మనసులో ఉండిపోతాయి.


వంద రోజుల్లో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే సమాచార శాఖ వంద పనుల జాబితా ఇమ్మన్నా ఇస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే, ఇది తెలంగాణ ప్రభుత్వం అని ప్రతి దానిలో తెలంగాణ ముద్రను చూపడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతం అయింది. గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఇది తెలంగాణ ప్రభుత్వం అనే బలమైన ముద్ర వేశారు. త్వరలోనే మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ఐటిఐఆర్ ప్రాజెక్టు అమలులోకి వస్తే హైదరాబాద్ రూపురేఖలే కాదు తెలంగాణ భాగ్యరేఖ మారిపోతుంది. తెలంగాణ సాధ్యం అని కెసిఆర్ చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించిన తెలంగాణ ప్రజలు, బంగారు తెలంగాణ సాకారం చేసి చూపిస్తాను అని చెబుతున్న మాటలను అంతే విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం