28, సెప్టెంబర్ 2014, ఆదివారం

మార్స్ గ్రహం పై రింగురోడ్డు!.. రియల్ ఎస్టేట్

బ్రహ్మం చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. మనుషుల్లో ఇంత సంతోషం అరుదుగా కనిపిస్తుంటుంది. ఓ హీరో సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పుడు మరో హీరో అభిమానుల కళ్లలో కనిపించేంత సంతోషం అది. ఓ స్వామీజీ శృంగార రహస్యాల వీడియో బయటపడినప్పుడు ఆయన పోటీ స్వామీ కళ్లల్లో కనిపించే సంతోషం అది. డిపాజిట్లు గల్లంతయినప్పుడు గెలిచిన పార్టీ వారిలో కనిపించేంత సంతోషం అది. సంతోషానికి కారణం ఏమిటని పలకరించాను.


‘‘మార్స్ ప్రయోగం విజయవంతం కావడం’’ అని వాడి నోటిలో నుంచి విన్న సమాధానంతో నాకు తలతిరిగిపోయింది.
నిజమే మోదీ అధికారంలోకి వచ్చాక మనుషుల ఆలోచనలే మారిపోయాయి. బ్రహ్మం కూడా మార్స్ గురించి ఆలోచిస్తున్నాడు అంటే నాకూ సంతోషం వేసింది.


అది సరే నువ్వు మార్స్ గురించి ఆలోచించడం ఆశ్చర్యంగా ఉందిరా అస్సలు ఊహించలేకపోయాను. నిజంగా ఇది అద్భుతమైన విజయం, భారతీయుడిగా ప్రతి ఒక్కరు గర్వించాలి, నువ్వే కాదు నేనూ గర్విస్తున్నాను. ఇంతకూ ఈ విజయంపై నీ అభిప్రాయం ఏమిటి? అని అడిగేశాను.


అప్పటి వరకు నేను మాట్లాడుతున్నది వాడు పెద్దగా పట్టించుకోలేదని ముఖం చూస్తే అర్ధమైంది. మార్స్ గురించి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అన్నాడు.
చెబితే వింటా అని కూర్చున్నా


నీ అంచనా ప్రకారం మార్స్‌పై రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పటికి ప్రారంభం కావచ్చు నంటావు? అని బ్రహ్మం అడిగిన ప్రశ్న అర్ధం కానట్టుగా ముఖం పెట్టాను. బ్రహ్మం ఏదైనా రియల్ ఎస్టేట్ కోణంలోనే చూస్తాడు. ఏ సమస్యకైనా రియల్ ఎస్టేట్‌తోనే పరిష్కారం అంటాడు.
వాడి గురించి తెలియాలంటే వాడి కుమారుడి ప్రేమ కథ చెప్పాలి. అబ్బాయి ఇంజనీరింగ్ చదవరా అని పంపితే సొంతంగా ప్రేమ పాఠాలు నేర్చుకుని ఓ అమ్మాయిని ప్రేమించేశాడు. విషయం తెలిసిన బ్రహ్మం అందరిలా అస్సలు కంగారు పడలేదు. నాన్నా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెబితే తప్పకుండా బాబు ఆ అమ్మాయి కుటుంబానికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయో ఎక్కడున్నాయో తెలుసుకునిరా అని నింపాదిగా చెప్పాడు. అమ్మాయి నాన్న పెన్షన్ డబ్బులతో యాదగిరి గుట్ట దగ్గర రాయిగిరిలో ఇన్‌స్టాల్‌మెంట్‌లో 200 గజాల ప్లాట్లు రెండు కొన్నాడట!
మనలానే ఆ అమ్మాయి వాళ్లు బంజారాహిల్స్‌లో ఓ ప్లాట్ కొన్నాకే మీ పెళ్లి. దీని కోసం ఎంత కాలమైనా ఆగేందుకు నాకు అభ్యంతరం లేదని బ్రహ్మం ఉదారంగా కుమారుడికి వరమిచ్చాడు. 


రాక్షసుడు చిట్టడవిలో రాజకుమారిని దాచిపెట్టినా ఎలాగోలా తీసుకు రావచ్చు కానీ బంజారాహిల్స్‌లో ప్లాటు కొనడం అంటే మాటలా? ఆ అబ్బాయి, అమ్మాయి మళ్లీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు. పరువు హత్యలు చూసిన వారికి మన బ్రహ్మం చూపిన ప్లాట్ పరిష్కార మార్గం గురించి తెలిస్తే బాగుండు. అన్ని రోగాలకు జిందాతిలిస్మాత్ మందన్నట్టు ఒక్క కాశ్మీర్ సమస్యకు తప్ప అన్ని సమస్యలకు ప్లాట్లతో పరిష్కారం చూపవచ్చునంటాడు బ్రహ్మం. ఆ ఒక్క దానికి మినహాయింపు ఎందుకు? అంటే కాశ్మీర్‌లో ఇతరులు ప్లాట్లు కొనేందుకు రాజ్యాంగం ఒప్పుకోదు కదా అందుకు అంటాడు. కొత్త రాజధానికి నిధులెలా? భూములెలా అని అంతా ఆలోచిస్తుంటే భూములివ్వండి, ప్లాట్లు తీసుకోండి అంటూ కొత్త ప్రభుత్వం బంపర్ ఆఫర్ వెనుక బ్రహ్మం మార్కు కనిపిస్తోంది, కానీ దీనిలో తనకెలాంటి సంబంధం లేదంటాడు బ్రహ్మం.


‘‘శాస్తజ్ఞ్రుల పరిశోధనలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నవ్వు చూస్తూ ఉండు మార్స్‌పై ప్లాట్లు వేయడం ఖాయం. రింగురోడ్డు ఎక్కడొస్తుందో ముందె తెలుసుకుంటే మన పంట పండినట్టే ’’నని బ్రహ్మం చెబితే వినడం తప్ప ఏమీ అనలేకపోయాను. హైటెక్ సిటీ ఎక్కడొస్తుందో కొందరికి ముందే తెలిసిపోయినట్టు మార్స్‌పై రింగురోడ్డు ఎక్కడో ముందె తెలుసుకోవాలని బ్రహ్మం ప్రయత్నం.


నేటి బాలలే రేపటి పౌరులు అని అందరూ అంటే బ్రహ్మం మాత్రం నేటి పొలాలే రేపటి ప్లాట్లు అని నమ్ముతాడు. మరో అడుగు ముందుకేసి నేటి గ్రహాలే రేపటి పొలాలు, ఆ తరువాత ప్లాట్లు అంటాడు. తెలంగాణ కోసం ఉధృతంగా ఉద్యమం సాగుతున్నప్పుడు బ్రహ్మం ప్లాట్ల రేట్లు పడిపోతాయి మీ ఇష్టం అని హెచ్చరించాడు. విభజన తరువాత సంతోషంగానే ఉన్నాడు. విషయం ఏమిటిరా అంటే విభజన వద్దన్నాను నిజమే కానీ అనివార్యం అనీ తెలుసు,కొత్త రాజధాని ఎక్కడో ముందే తెలుసు అక్కడ ప్లాట్లు కొన్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఉండబట్టలేక సూర్య గ్రహంలో ప్లాట్ల గురించి ఎప్పుడూ ఆలోచించలేదా? అని అడిగితే లేదన్నాడు. అక్కడ వెంచర్లు చేసి ప్లాట్లు వేసినా సూర్యుడి వేడి వల్ల కరిగిపోతాయి అన్నాడు. వేడి లేకున్నా హైదరాబాద్ శివార్లలో చాలా వెంచర్లలో అమాయకులు కొన్నాక ప్లాట్లు కరిగిపోయి, తరువాత మాయం అయ్యాయి . కొన్ని వందల సంవత్సరాల నాటి తమ దేశాన్ని ప్లాట్ల రూపంలోనే ఇజ్రాయిలీలు సొంతం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నా పరిష్కారం కాని సమస్యకు ప్లాట్లే పరిష్కారం చెప్పాయని బ్రహ్మం గట్టిగా నమ్ముతాడు. విష్ణువు బ్రహ్మం ఇష్టదైవం. ఎందుకూ అంటే ఆకాశాన్నో ప్లాటు, భూమినో ప్లాటుగా చేసుకుని మూడో కాలు దానమిచ్చిన వాని తలపైనే పెట్టినందుకు. 

అభిమాన హీరో శోభన్‌బాబు అని చెప్పినప్పుడు బ్రహ్మం గురించి తెలియనప్పుడు ఏదో అనుకుని, కోడెనాగు సినిమా చూశాక నా? అని అడిగితే, కాదు సినిమా వారందరికీ ప్లాట్ల గురించి తొలిసారి అవగాహన కలిగించింది ఆయనే అని తెలిశాక అన్నాడు బ్రహ్మం. మార్స్ వైశాల్యం ఎంత? ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది, మొత్తం ఎన్ని ప్లాట్లు అవుతాయి, ఎన్ని రాజధానులు, ఎన్ని విమానాశ్రయాలు వస్తాయో లెక్కలు వేయడంలో బ్రహ్మం బిజీగా ఉన్నాడు. బ్రహ్మం ఎక్కడుంటాడు ? ఆయన్ని చూడాలని ఉంది అంటున్నారా ? పరీక్షగా చూస్తే మీ ఆఫీసులోనో, మీ మిత్రుల్లోనో, చివరకు మీలోనూ , ఎందెందు వెదికినా అందందు కనిపిస్తాడు బ్రహ్మం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం