‘‘మొన్నటి దాక ఒక మాటన్నవాళ్లు ఇప్పుడు మాటమార్చి మరో మాట అంటున్నారు. ఈ పెద్దల మాట అస్సలు అర్థం కాదు ’’
‘‘ఏంటో ఇప్పుడు పెద్దలతో నీకొచ్చిన సమస్య’’
‘‘గురువు గారూ నా సందేహానికి నాన్చకుండా సూటిగా సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టమా? లాభమా? ’’
‘‘ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ సందేహం నీకెందుకొ చ్చింది? నువ్వు తెలంగాణకు చెందిన వాడివా? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాని వా? రాయలసీమనా? ఉత్తరాంధ్రనా? రాజధాని జిల్లాలా? అధికార పక్షమా? విపక్షమా? ’’
‘‘గురువు గారూ నేనడిగిన సందేహానికి మీరడిగిన ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉందా? ’’
‘‘ముందు సమాధానాలు చెప్పు తరువాత సంబంధం ఉందో లేదో నేను చెబుతాను. ప్రత్యేక హోదా వల్ల లాభం నష్టం ఏదనుకుంటే అదే. యద్భావం తద్భవతి అంటూ సీరియస్‌గా మేధోముఖం పెట్టి వెళ్లిపోతే సరిపోతుంది. వివరంగా చెప్పాలంటే నేనడిగిన వివరాలు చెప్పాలి ’’
‘‘మొన్నటి వరకు ఒక్కో చానల్ ఒక్కో నటుణ్ణి అద్దెకు తీసుకుని మరీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు సాగించాయి కదా! హఠాత్తుగా అధికార పక్షంతో పాటు మీడియా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రకు లాభం కన్నా నష్టం ఎక్కువ అని చెబుతుంటే గందరగోళంలో పడిపోయాను. ప్రత్యేక హోదా వల్ల నష్టమే అయితే జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, వెంకయ్యనాయుడు లాంటి మహానేత పార్లమెంటులో అప్పటి అధికార పక్షం మెడలు వంచి ప్రత్యేక హోదా ఎందుకు సాధిస్తారు. నష్టం అయితే దేశంలోని అనేక రాష్ట్రాలు మాకూ ప్రత్యేక హోదా కావాలని ఎందుకు ఆందోళన చేస్తాయి? సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు కల్పిస్తుంది? అవన్నీ సరే ఆంధ్ర ప్రయోజనాల కోసం నిరంతరం తపిస్తున్నామనే మీడియా ఆంధ్రకు ప్రత్యేక హోదా లేకపోతే ఊపిరి ఆగిపోతుందని వాళ్లే చెప్పి ఇప్పుడు వాళ్లే దీని వల్ల నష్టం అంటున్నారు. అదే అర్ధం కావడం లేదు.’’
‘‘ఇంతకూ నువ్వేమనుకుంటున్నావో చెప్పు? లాభమా? నష్టమా? ’’
‘‘ సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్సులు చేసేందుకు ఆ కాలంలో ఎంత కష్టపడేవారో వేషాలు లేని నట శివాజీ టీవి కోసం ఆవేశాన్ని తెచ్చిపెట్టుకోవడానికి అంత కన్నా ఎక్కువ కష్టపడి ప్రత్యేక హోదా డిమాండ్ చేసినప్పుడు ప్రత్యేక హోదా కావలసిందే అనిపించింది.
ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రకు ఎంత నష్టమో ఇప్పుడు మీడియా సామూహికంగా చెబుతుంటే కొంపదీసి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? అని భయం కూడా వేస్తోంది. ’’
‘‘యద్భావం తద్భవతికి కొనసాగింపు స్థితి అన్నమాట ఇది.’’
‘‘ ఎలా?’’
‘‘ మహాభారతం చదివావా? రామాయణం విన్నావా? ’’
‘‘ గురువుగారూ మీరు నన్ను అవమానిస్తున్నారు. మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నవాళ్లు ఆ కథలు వినకుండా ఉంటారా? చెవిటి వాళ్లు తప్ప.. రంగనాయకమ్మ కూడా ఆమూలాగ్రం చదివిన తరువాతనే కదా? విషవృక్షాన్ని ఎక్కింది. ’’
‘‘మహాభారతంలో, రామాయణాల్లో హీరో ఎవరో చెప్పు ?’’
‘‘మహాభారతంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా శ్రీకృష్ణుడిని మించిన హీరో లేరు. తండ్రి మాటను జవదాటని మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఏ కాలానికైనా హీరోనే కదా? ’’
‘‘ ఈ నిర్ణయానికి నువ్వు ఫిక్స్ అయి పోయావా? ’’
‘‘ ఫిక్సున్నర ఫిక్స్ అయిపోయాను. లాక్ చేసేయండి. ’’
‘‘ నేనేమడిగినా ముందు దానికి సమాధానం చెప్పు, ఎదురు ప్రశ్నించకు, దానవీర శూరకర్ణ చూశావా? రావణుడిగా ఎన్టీఆర్ న భూతో నభవిష్యత్ అనిపించేట్టుగా నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి చూశావా?’’
‘‘గురువు గారూ మీరు నన్ను మళ్లీ అవమానిస్తున్నావు. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ నటనలో జీవించిన డివికె సినిమాను చూశావా అని అడుగుతున్నారా? ఎన్నిసార్లు చూశావు అని అడిగాలి. ఏమంటివేమంటివి? డైలాగులు చెప్పమంటావా? ’’
‘‘ వద్దులేవోయ్ ప్రతి డైలాగు నాకూ కంఠతా వచ్చేసింది. ఇప్పుడు చెప్పు ఆ సినిమాలు చూసినప్పుడు నీకు హీరో ఎవరనిపించింది? ’’
‘‘ దుర్యోధుడికి అన్యాయం చేశారు, అంతా కలిసి వెన్నుపోటు పొడిచారు కానీ నిజంగా మహాభారతంలో హీరో అతనే. ఆ రాజసం, ఆత్మవిశ్వాసం అబ్బో హీరో అంటే దుర్యోధనుడే ఇందులో అనుమానమే లేదు. ఇక రావణుడిగా ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ నభూతో న భవిష్యత్ అంటే నమ్మండి. హీరో అంటే రావణుడే. సీతను వదిలేస్తే, రాజ్యం దక్కేది. ఆత్మ గౌరవం కోసం ప్రాణాలైనా వదిలాడు కానీ లొంగిపోలేదు. హీరోయిజం అంటే అది. అన్నా దమ్ముళ్ల మధ్య చీలిక తెచ్చి లంక రహస్యాలు తెలుసుకుని శ్రీరాముడు విజయం సాధించాడు కానీ.. ఓడినా సరే రావణుడిలా ఉండాలనిపించింది ఎన్టీఆర్ రాజసం ఉట్టేపడే విధంగా రావణుడి పాత్రలో చూసినప్పుడు ’’
‘‘అదేంటోయ్ ఇంతకు ముందే శ్రీకృష్ణుడు, శ్రీరాముడే హీరోలన్నావు, ఇప్పుడు ప్రతి నాయకులను హీరోలంటున్నావు. ఇదే యద్భావం తద్భవతి రెండవ దశ. రామాయణం, మహాభారతం అసలు రచయితలు రాసింది ఒక్కసారే. కానీ దాన్ని చూసే వారి దృష్టిమారింది. కొత్త కొత్త కోణాల్లో రాసేశారు. వ్యాసుడు, వాల్మీకి వారిని హీరోలుగా చూపించినప్పుడు నీకు హీరోలుగా కనిపించారు. అదే కథను ఎన్టీఆర్ విలన్లను హీరోలుగా మార్చి చూపిస్తే నీకు విలనే్ల హీరోలుగా కనిపించారు. అంటే నీవు ఎది అనుకుంటే అదే జరుగుతుంది అనేది నాటి పెద్దల మాట. నువ్వు ఏది అనుకోవాలో ఈనాటి పెద్దలు నిర్ణయిస్తారు. అదే యద్భావం తద్భవతి రెండో దశ.
హిట్లర్ ప్రపంచానికి కిరాతకుడిగా కనిపిస్తే చార్లీ చాప్లిన్‌కు కమెడియన్‌లా కనిపించారు. అన్నగారు అటువైపు దృష్టిసారించలేదు కానీ వేలాది సంవత్సరాల నుంచి విలన్లుగా చూస్తున్న దుర్యోధనుడు, రావణుడిని హీరోలుగా చూపినప్పుడు హిట్లర్‌ను ప్రపంచ హీరోగా చూపడం ఓ లెక్కా ? ఎన్టీఆర్ లాంటి సినీ వాలా , మన లాంటి మహా మీడియా జర్మనీకి ఉంటే హిట్లర్ ను అ విశ్వ దైవం గా చూపించే వారు .. ఇప్పుడర్ధమైందా? దేన్నయినా నువ్వు ఎలా చూడాలో పెద్దలు నిర్ణయిస్తారు. ప్రత్యేక హోదా అయినా మరోటైనా వాళ్లు ఎలా చూపాలనుకుంటే నువ్వు అలా చూడాలి అంతే ....
yada drusti tada shrushti
రిప్లయితొలగించండి