4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

రిజర్వేషన్ ల సమస్యకు రాజకీయ పక్షాల నుంచి పరిష్కారం సాధ్యమా ?







గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం, ఢిల్లీలో నిర్భయ ఉద్యమం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం. వీటిలో ఒక్క తెలంగాణ మాత్రం లక్ష్యాన్నిసాధించే వరకు    ఉద్యమించి విజయం సాధించింది. మిగిలిన ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. కొంత కాలానికి చల్లబడ్డాయి. కొన్ని నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. దేశంలో మోదీ హవా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ గాలి సైతం ఈ కోవలోనిదే. ఈ ఉద్యమాలన్నీ ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేకపోవచ్చు. కానీ సమాజంలో తీవ్రమై అసంతృప్తి ఉందని, ప్రస్తుత పరిస్థితి పట్ల ప్రధానంగా దేశ యువత అసంతృప్తితో రగిలిపోతోంది అనే దానికి ఈ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలే కారణం. 

అతని వయసు 22 ఏళ్లు కనీసం ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు. కానీ దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్నాడు. అతనేమీ వివేకానందుడు కాదు, దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా వీరోచిత కార్యమేమీ చేయలేదు. గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లను కోరుతూ అతను సాగిస్తున్న ఉద్యమాన్ని రెండేళ్ల క్రితం దేశాన్ని ఊపేసిన మోదీని సైతం వణికించేసింది.
పటేళ్లు గుజరాత్‌లో ఆర్థికంగానే మంచి స్థితిలో ఉన్న వర్గం. తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్నారు. రాజస్థాన్‌లో గుజ్జర్లు ఉధృతంగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించినా అది రాజస్థాన్ సమస్యగానే మీడియా చూసింది. కానీ పటేళ్ల ఉద్యమం గుజరాత్‌కే పరిమితం అయ్యేట్టుగా కనిపించడం లేదు. అలా అని పటేళ్ల ఉద్యమం వల్ల అన్ని రంగాల్లో ముందున్న ఆ వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారని అనిపించడం లేదు. గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 22 ఏళ్ల హార్దిక్ పటేల్ మాటలు చూసినా, ఉద్యమ పోకడ గమనించినా నిజానికి అది పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం అనిపిస్తోంది.

 దేశంలో 95శాతం మంది పేదలే ఉన్నారు, పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలని అనేది హార్దిక్ పటేల్ డిమాం డ్. అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం, రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేయడం రెండింటి అర్ధం ఒకటే.
తాను దేశమంతటా పర్యటిస్తానని, అన్ని రాష్ట్రాల్లోని పటేళ్లు తమ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని పటేల్ చెబుతున్నాడు. 27 కోట్ల మంది మద్దతు కూడగడతానని అంటున్నాడు. మరో వైపు ఇదే సమయంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని వామపక్షాలు సదస్సులు ప్రారంభించినా పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. స్వాతంత్య్రం సిద్ధించిన ఆరున్నర దశాబ్దాల తరువాత కూడా తమను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని రోజు రోజుకు డిమాండ్లు పెరగడం విశేషం. ప్రస్తుతం తెలుగునాట రిజర్వేషన్లపై ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బిసి రిజర్వేషన్లను ముట్టుకుంటే సహించేది లేదని బిసి సంఘాలు హెచ్చరిస్తే, ఓసి సంక్షేమ సంఘం రిజర్వేషన్లపై గుజ్జర్లు, పటేళ్లు, జాట్‌లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించడానికి సిద్ధమయింది. అన్నా హజారే ఉద్యమంలా ఉవ్వెత్తున ఎగిసిపడి తాత్కాలిక ప్రయోజనంతో పటేళ్ల ఉద్యమం చప్పపడి పోవచ్చు. ఈ ఉద్యమం వెనుక ఎవరి లక్ష్యాలు వారికి ఉండవచ్చు. కానీ పటేళ్ల ఉద్యమ ప్రభావం దేశంలో యువతపై అంతో ఇంతో పడుతోందనేది మాత్రం వాస్తవం. 
తెలంగాణ ఉద్యమ సమయంలో బలమైన అంశం ఉంది  మైదానం ఖాళీగా ఉంది, నాయకత్వం వహించేవారే కరువయ్యారు. ఆ విషయా న్ని సరిగ్గా గుర్తించిన కెసిఆర్ ఆ స్థానాన్ని భర్తీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు రిజర్వేషన్లపై ఉద్యమానికి సరిగ్గా అదే విధంగా మైదానం ఖాళీగా ఉంది. దేశ వ్యాప్తంగా బలమైన అంశం ఉంది ,,, నాయకత్వం వహించే వారే లేరు .. ఇప్పుడు కావలసింది వారే . అయితే అదంత సులభం కాదు. ఏ రాజకీయ పార్టీ ఈ ఉద్యమానికి నేరుగా మద్దతు ప్రకటించదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల ఓట్లు అవసరం. ఏదో ఒక పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి మా మద్దతు అని ప్రకటిస్తే, ఆ పార్టీ తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నట్టే. నిజానికి దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న కీలక నేతలు వ్యక్తిగతంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారే కావచ్చు. రిజర్వేషన్ ల వల్ల నష్ట పోతున్నాము అని భావించే సామాజిక వర్గాలకు చెందిన  వారె..  కానీ ఏ ఒక్కరూ కూడా ఆ మాట పైకి చెప్పరు. హార్దిక్ పటేల్ దేశంలో ఎంతో మంది నాయకుల పేర్లు చెప్పి వీళ్లంతా తమ వర్గమే అని చెబుతున్నా, వాస్తవానికి ఒక్క నాయకుడు కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించరు.
దేశంలో రిజర్వేషన్ల అంశం చిత్రమైన సమస్యగా మిగిలిపోయింది. పదేళ్ల కోసం అని తొలుత రిజర్వేషన్లను ఏర్పాటు చేశా రు. చివరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరే స్వయంగా రిజర్వేషన్లు తాను ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చలేక పోయాయని, కొద్ది రోజుల్లోనే గ్రహించారు. రిజర్వేషన్ల వ్యవహారాన్ని ముట్టుకుంటే ఏ పార్టీ అయినా మాడిమసైపోతుంది .అం దుకే ప్రస్తుత విధానం పట్ల ఎవరూ సంతృప్తికరంగా లేకపోయినా ఈ విధానానే్న కొనసాగించేందుకే అన్ని పార్టీలు మొగ్గు చూపుతాయి. ఆరున్నర దశాబ్దాల తరువాత కూడా రిజర్వేషన్లపై సమీక్షకు రాజకీయ పక్షాలు సాహసించడం లేదు కానీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన అర్థదశాబ్దం లోపై బిఆర్ అంబేద్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో తాను ఊహించిన ప్రయోజనం కలగలేదని, ఏ వర్గాలైతే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందారో వారు మిగిలిన తమ వారికి చేయూత నిస్తారని ఆశించానని అలా జరగలేదని అన్నారు. ఇదో విచిత్రమైన సమస్య, పరిష్కరించడానికి ఎవరూ సాహసించని సమస్య. పరిష్కరించడం మాట అటుంచి సమస్యను గుర్తించినట్టు ప్రకటిస్తే చాలా రాజకీయంగా సమాధి అవుతారు.అందుకే అందరికీ తెలిసిన సమస్యపై రాజకీయ పక్షాలు వౌనంగానే ఉంటాయి.
ఈ దేశంలో ఇప్పుడు ఒకటి కాదు అనేక దేశాలు ఉన్నాయి. సంపన్న భారత దేశం, పేద భారత దేశం. ఈ రెండే కాదు రిజర్వేషన్లు పొందే పౌరుల దేశం, రిజర్వేషన్లు లేని వారి దేశం. రిజర్వేషన్లు లేని వారు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే. కానీ రిజర్వేషన్లు పొందే వర్గం సైతం అసంతృప్తితోనే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని, ప్రస్తుత విధానం వల్ల తాము నష్టపోతున్నామని ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఎస్టీలు సైతం వర్గీకరణ కోరుతూ కొద్దిమేరకు ఆందోళ చేశారు. ఇక బీసీల్లో కొత్త కులాలను చేర్చాలని కొందరు ఉద్యమిస్తుంటే, కొత్త కులాలను చేర్చితే సహించేది లేదని మరి కొన్ని కులాల ఆందోళన. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో టిడిపి హామీ ఇస్తే, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. మైనారిటీ రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు కానీ బీసీల్లో చేరిస్తే ఒప్పుకోమని బీసీ నాయకులు తెగేసి చెప్పారు.
దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లపై ఇలాంటి అసంతృప్తే. ఈ అసంతృప్తి నుంచి పుట్టిందే పటేళ్ల ఉద్యమం. పైకి పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమమే అయినా అసలు లక్ష్యం మాత్రం రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమం. దేశంలో 95శాతం పేదలే ఉన్నారు, పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి అంటూ పటేళ్లు ఉద్యమిస్తున్నారు. అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం అంటే పరోక్షంగా రిజర్వేషన్లును తొలగించాలని డిమాండ్ చేయడమే. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఒకవైపు డిమాండ్ చేస్తూనే మరోవైపు రిజర్వేషన్ల వల్ల ఎంతగా నష్టపోతున్నారో ఉద్యమ కారులు వివరిస్తున్నారు. పటేళ్ల ఉ ద్యమం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని కొందరు ఆరోపిస్తూంటే, ఆప్ నేతల హస్తం ఉందని భాజపా వర్గీయుల ఆరోపణ. పార్టీల కన్నా రిజర్వేషన్ల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే 22ఏళ్ల యువకుడు హార్దిక్ పటేల్ ఉద్యమానికి కారణం. ప్రజల్లో వ్యతిరేకత లేనప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ తెర వెనుక ఉండి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉంటే జనం నుంచి ఇంత స్పందన ఉండదు.
గుజరాత్ నుంచి మోదీ దేశాన్ని ఒక ఉర్రూత లూగిస్తే, ఏడాదిలోనే అదే గుజరాత్ నుంచి పటేళ్ల ఉద్యమం మోదీని సైతం కలవరపెడుతోంది. మహాత్మాగాంధీకి పోటీగా పటేల్‌ను రంగంలోకి దించడానికి నరేంద్ర మోదీ ఐక్యతకు చిహ్నాంగా పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అదే పటేళ్లు మోదీకి సవాల్‌గా మారారు. రాజకీయ పార్టీలు లేని ఉద్యమం ఎక్కువ రోజులు నిలువదు. రిజర్వేషన్లపై జనంలో ఉన్న అసంతృప్తి చల్లారదు, అలా అని ఉద్యమం తమ లక్ష్యాన్ని చేరుకునే అవకాశమూ లేదు. ఆరు ఆరున్నర దశాబ్దాల తరువాతైనా రిజర్వేషన్లపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. సమీక్షించడం అంటే తొలగించడం అని భావించాల్సిన అవసరం లేదు. మంచి చెడులు సమీక్షించుకుని మరింత మెరుగ్గా అమలు చేసుకోవడం కోసమైనా సమీక్షించుకోవచ్చు. రిజర్వేషన్లు పొందుతున్న వారు, పొందని వారు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవలసిన పరిస్థితిని తప్పించడం కోసమైనా ఆలోచించాలి.

 కానీ రాజకీయ పక్షాలు ఆ పని చేయడానిక సాహసించవు. సాధారణంగా ఎక్కడైనా చిన్న సమ స్య ఉన్నా రాజకీయ పక్షాలు అక్కడ వాలిపోతాయి. సమస్య లేకున్నా సృష్టించి వాలిపోతాయి. కానీ దేశాన్ని కుదిపేస్తున్న రిజర్వేషన్ల సమస్యను రాజకీయ పక్షాలు అసలు సమస్యగానే గుర్తించడం లేదు. గుర్తిస్తే తమ ఉనికికే ప్రమాదం. రిజర్వేషన్ల తేనె తుట్టెను కదిపే సాహసం చేయలేరు, ప్రభు త్వ రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడమే దీనికి పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందనేది కొందరి వాదన. రిజర్వేషన్ల సమస్యకు కాలమే సమాధానం చెబుతుంది కానీ రాజకీయ పక్షాల నుంచి  ఈ సమస్యకు పరిష్కారం ఆశించలేం.-

మళ్లీ రిజర్వేషన్ చిచ్చు

  • - బుద్దా మురళి
  •  
  • 04/09/2015

2 కామెంట్‌లు:


  1. >>>>>>గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం, ఢిల్లీలో నిర్భయ ఉద్యమం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం. వీటిలో ఒక్క తెలంగాణ మాత్రం లక్ష్యాన్ని సాధించే వరకు ఉద్యమించి విజయం సాధించింది. <<<<

    ఇంకో చిన్నమ్మ తల్చుకుంటే రిజర్వేషన్లు రద్దు చేయడం ఎంత సేపు ?


    రిప్లయితొలగించండి

  2. ఏదో ఒక పార్టీయే కదాప్రభుత్వంలో ఉండేది .రిజర్వేషన్ లు ప్రస్తుతం ఏ ప్రభుత్వమూ తీయడానికి సాహసించలేదు.అది జరిగే పని కాదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం