20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఆత్మ చరిత్ర!

‘‘చూస్తుండు బాబాయ్ చరిత్ర సృష్టిస్తాను’’
‘‘ ఏరా వాడెవడో గడ్డంతో లారీ లాగి చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించాడట! వాడికి పోటీగా ముక్కులోని వెంట్రుకలతో లారీ లాగి కొత్త చరిత్ర సృష్టిసావా? ఏంటి? ’’
‘‘అది కాదు ’’
‘‘మరింకేం చేస్తావు. కాళ్లకు అడ్డం తగలలేనంతగా గోళ్లు పెంచడం, రోడ్లను ఊడ్చేంతగా జుట్టు పెంచడం, తల క్రిందులుగా నడవడం’’
‘‘అది కాదు బాబాయ్ చరిత్ర సృష్టించినా, తిరగ రాసినా మా వంశం వల్లే అవుతుంది’’


‘‘ఆ తెలిసిందిలే ఆ హీరో ఎవరో ఇలాంటి డైలాగులు చెప్పి సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే పోస్టర్లకు పాలాభిషేకాలు చేయడం, హీరో నడిచిన రోడ్డును శుభ్రం చేయడం ఇవే కదా మీ రికార్డులు. మహా అయితే ఆ సినిమాను అందరి కన్నా ఎక్కువ సార్లు చూసి రికార్డు సృష్టిస్తావేమో ? ’’
‘‘నేనే పరీక్ష రాసినా ఎందుకు ఫేయిల్ అవుతానో, ఏ ఉద్యోగానికి ఎం దుకు ఎంపిక కావడం లేదో తెలుసా బాబాయ్’’
‘‘నీ బుర్రలో మట్టితో పాటు ఇంకేమన్నా ఉంటే పాసయ్యేవాడివి ఇందులో తెలియందేముందిరా అబ్బాయ్’’


‘‘జోకులు తరువాత బాబాయ్ నేను సీరియస్‌గా చరిత్ర గురించి చారిత్రాత్మక విషయాలు చెబుతున్నాను. మధ్యలో జోకులొద్దు. యదార్థవాది లోక విరోధి అంటారు. నేను అన్నీ నిజాలే రాస్తున్నాను... చెబుతున్నాను కాబట్టే ఏ ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదు. ఏ పరీక్ష పాసవడం లేదు’’
‘‘నిజమా? ఏంటో ఆ చారిత్రక సత్యాలు’’
‘‘అసలు స్వాతంత్య్ర పోరాటానికి మూలం మా తాత. నిరాయుధీకరణను ఆయుధంగా చేసుకుని మహాత్ముడు జరిపిన స్వాతంత్య్ర పోరాటం వల్ల ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని చరిత్రను తప్పుదోవ పట్టించారు. కానే కాదు.. అసలు చరిత్ర వేరుగా ఉంది. నేనది రాసినందుకే నన్ను పాస్ చేయడం లేదు’’


‘‘ ఏంటో ఆ చరిత్ర ’’
‘‘తింగరి బుచ్చయ్య అని మా తాత స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి ఆయనే. ఓ రోజు ఆయన తాగి ఇంటికి వస్తే మా అవ్వ తిండి పెట్టలేదు. ఇంట్లోకి రానివ్వలేదు. రెండు రోజుల పాటు తిండి తిప్పలు లేక ఇంటి బయ ట అలానే పడి ఉన్నాడు. ఏ పనీ చేయలేదు. ఎవరింటికి వెళ్లలేదు. మందు తాగలేదు. మాట్లాడలేదు. దాంతో మా ఆవ్వ దెబ్బకు దిగి వచ్చింది. సహాయ నిరాకరణ ఉద్యమానికి, సత్యాగ్రహ ఉద్యమానికి ఇదే స్ఫూర్తి.. కానీ చరిత్రలో మా తింగరి బుచ్చయ్య తాతకు స్థానం కల్పించకుండా కాంగ్రెస్ కుట్ర పన్నింది. ’’
‘‘దీంతో కాంగ్రెస్ కేం సంబంధంరా అబ్బాయ్ ’’
‘‘అక్కడే ఉంది సమస్య అంతా. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అని విన్నా వా? ’’
‘‘ఏదో చరిత్ర రచయితల సంఘం అని చదివినట్టు గుర్తు. ’’
‘‘ఇక్కడే అసలు మతలబు ఉంది. చరిత్ర రాసుకునే వాళ్లు కూడా కాంగ్రెస్ అని ఒక పార్టీ పేరుతో సంస్థ పెట్టుకున్నారంటే చూడు బాబాయ్ వీళ్లు ఎంతకు తెగించారో. మా తింగరి బుచ్చయ్య తాత ఇండిపెండెంట్. ఏ పార్టీకి చెందని వాడు. ఇండిపెండెంట్‌గానే దేశానికి ఇండిపెండెన్స్ సాధించాలని ఉద్యమించాడు. మా తాత కాంగ్రెస్ సభ్యుడు కాదు కాబట్టి కాంగ్రెస్ చరిత్ర కారులు మా తాతను చిన్నచూపు చూశారు. ’’


‘‘చరిత్ర రచయితల సంఘానికి కాంగ్రెస్‌కు సంబంధం లేదనుకుంటారా? అది ఎప్పుడో 1935లో ఏర్పాటు చేశారురా అబ్బాయ్’’
‘‘బాబాయ్ కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయకు. చివరకు వాళ్లు అమెరికా పార్లమెంటుకు కూడా కాంగ్రెస్ అని తమ పార్టీ పేరే పెట్టించుకున్నారు. అమెరికాలోనే పలుకుబడి చూపించినోళ్లు మన దేశ చరిత్రను రాసుకోవడంలో ప్రభావం చూపించలేదంటావా? ’’
‘‘ఏమోరా నాకు అయోమయంగా ఉంది.. ఇంతకూ ఇప్పుడు నువ్వేమంటావు’’
‘‘అక్కడికే వస్తున్నా... ఫేస్‌బుక్ గురించి విన్నావు కదా! సరికొత్త చరిత్ర సృష్టిస్తాను’’


‘‘అవును విన్నాను. కాలేజీకెళ్లే ముగ్గురు కుర్రాళ్లు కారు షెడ్డూలోనే ఫేస్‌బుక్‌ను స్థాపించి ప్రపంచంలోనే సంచలనం సృష్టించారు. 125 కోట్ల మంది ఫేస్‌బుక్ చూస్తారట నిజంగానే ఇది చరిత్ర రా అబ్బాయి’’
‘‘అది కాదు నేను చెప్పేది విను. వాడి సంస్థను వాడు కారు షెడ్డులో ప్రారంభిస్తే నాకేం ఇరానీ హోటల్‌లో ప్రారంభిస్తే నాకేం కానీ నేను చెప్పేది ఫేస్‌బుక్ ఓనర్ గురించి కాదు. ఫేస్‌బుక్‌ను ఉపయోగించి కొత్త చరిత్రను సృష్టిస్తాను దాని గురించి చెబుతున్నాను. ’’
‘‘కాస్త వివరంగా చెప్పు’’
‘‘నీకీ రహస్యం తెలుసా? నెహ్రూ, జిన్నా, ఫరూఖ్ అబ్దుల్లా ముగ్గురు దగ్గరి బంధువులు. వేలువిడిచిన మేనమాట, పినతల్లి చిన్నత్త కొడుక్కు తాత అవుతాడన్నమాట ’’


‘‘నిజమా? నెహ్రూ హిందువు, జిన్నా, అబ్దుల్లా ముస్లింలు బంధువులు ఎలా అవుతారు. అయినా ఇలాంటి తిక్క విషయాలు నీకెవడు చెప్పాడురా?’’
‘‘ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఇలాంటి అద్భుతమైన చరిత్రను ఇంకా ఎంతో చదవ వచ్చు బాబాయ్. అందుకే నాకీ చరిత్రపై నమ్మకం లేదు. సామాజిక మాధ్యమాల్లో నేను సరికొత్త చరిత్ర రాస్తాను. తింగరి బుచ్చయ్య తాతకు నివాళిగా చరిత్ర పాఠాలు రాస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడతాను, ఫేస్‌బుక్‌లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ’’
‘‘ బాగా ఎదిగిపోయావురా అబ్బాయ్... ఆయనెవరో నదులను నేనే అనుసంధానం చేశాను, ఇక సముద్రాలను అనుసంధానం చేయడమే తరువాయి అని చెబుతుంటే... నువ్వేమో ఏకంగా చరిత్రనే హైజాక్ చేసేస్తున్నావు’’
‘‘ ఆధారాలు చూపిస్తే, మేం పట్టించుకోం. మేం రాసే చరిత్రను అంగీకరించేవారే మా చరిత్ర గ్రూపులో ఉండాలి. ’’


‘‘ విజయం సాధించిన వాడు చెప్పిందే చరిత్ర అని నిన్నటి మాట. సామాజిక మాధ్యమాలు చూశాక ఎవడి చరిత్ర వాడిదే అనిపిస్తోంది. ఎవరి ఆత్మకథ వాళ్లు రాసుకున్నప్పుడు ఎవరికి తోచిన చరిత్ర వాళ్లు రాసుకుంటే వద్దనెదేముంది. వీటికి ఆత్మ చరిత్ర అని పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది!

2 కామెంట్‌లు:

  1. Interesting topic presented humorously :)

    Not sure if people should maintain some restrain but the social media is rotting with misinformation. The danger is, if you spread this misinformation over a period of time, people may believe it is true. Unfortunate days for India :(

    రిప్లయితొలగించండి
  2. ఓహో!అటు తిప్పి ఇటు తిప్పి బాబు గారు నదుల అనుసంధానం తొలిసారి తనే చేశానని డప్పు కొట్టుకోవడాన్ని యేకిపారేశారు.కానీ విషయం కొంచెం సీరియస్ వ్యవహారం కదా,ఇతనే మొదటివాడు కాదని నిరూపిస్తూ ఇంతకుముందు జరిగిన వాటి వివరాలు తేదీల వారీగా సాక్ష్యాదహారలతో విశ్లేషణాత్మకంగా రాస్తే బాగుండేది,కాదా?

    ఇప్పుడేమైంది,ఇతను తెలంగాణ వాది కాబట్టి పొరుగు రాష్ట్రం తను సాధించిన దాన్ని చెప్పుకుంటుంతే ఓర్వలేని తనం కనపడటం లేదూ!

    సానియా మీర్జా తెలంగాణ రాష్ట్ర ఎంబాసిడర్ అయ్యాక నేను మరిన్ని విజయాలు సాధిస్తున్నాను అన్నపూడూ తను వింబ్ల్డన్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడూ మేము మన్సారా ఆశీర్వదించాము,మరి విడిపోయి క్లైసుందాం అన్న్న మీరెందుకు ఇలా వెక్కిరిస్తున్నారు?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం