26, సెప్టెంబర్ 2015, శనివారం

కాంగ్రెస్ టిడిపి లను ఏకం చేస్తున్న తెలంగాణా


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్య మం లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసింది. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం అన్ని పార్టీల నాయకులను ఏకం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్, టిడిపిలను తెలంగాణ ఏకం చేస్తోంది. బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే ఏదో ఒక రూపంలో కలిసి అడుగులు వేయక తప్పదని కాంగ్రెస్, టిడిపిలు భావిస్తున్నాయి.

 ప్రస్తుతానికి టిడిపి ముందడుగు వేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ అక్కడక్కడ కలిసి పని చేస్తున్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం టిడిపి సాగించిన పాదయాత్రలో కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొ ని ఒకే స్వరం వినిపించారు. వైఎస్‌ఆర్ ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ అంటూ ఏ కార్యక్రమమైనా సబితా ఇంద్రారెడ్డి అప్పుడు ప్రాతినిధ్యం వహించిన చేవెళ్ల నుంచి ప్రారంభించేవారు. తెలంగాణలో కాంగ్రెస్,టిడిపిల మధ్య స్నేహం చేవెళ్ల చెల్లెమ్మ సమక్షంలో మొగ్గ తొడిగింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్నేహం ఎంత వరకు వెళుతుంది అనేది వేచి చూడాలి.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. విచిత్రం కాదు... ఏదైనా సాధ్యమే. సినిమా లే తప్ప రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి కావడం ఒక వింత. తన జీవితంలో ఎక్కువ భాగం మద్రాస్‌లోనే గడిపిన ఆయన పార్టీని స్థాపించాకే తెలుగు నాడుకు వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవం అని ఇచ్చిన నినాదానికి జనం నీరాజనం పలికారు. అలాంటి పార్టీని చివరకు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన అల్లుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడే ఆ పార్టీకి నాయకత్వం వహించడం విశేషం. మన దేశంలో రాజకీయ పార్టీలకు సిద్ధాంతం అంటే ప్రధానంగా ఆర్థిక విధానాలు, లౌకిక వాదమా? మతాభిమానమా? అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడమే ప్రధాన సిద్ధాంతగా ఆవిర్భవించిన పార్టీ టిడిపి. కాంగ్రెస్ వ్యతిరేకతే మా విధానం అని ఎన్టీఆర్ మొదలుకొని బాబు వరకు టిడిపి నాయకులంతా సగర్వంగా ప్రకటించే వారు. కానీ ఇప్పుడు చిత్రంగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టిడిపి కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఒకవైపు కాంగ్రెస్‌తో పోరాడుతూనే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తోంది.
94లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ ఇంటికి లక్ష్మీపార్వతి ఒకసారి కాంగ్రెస్‌కు చెందిన టి సుబ్బిరామిరెడ్డిని భోజనానికి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ నేత ఇంటికి కాంగ్రెస్ నాయకుడు భోజనానికి రావడమా? అని చంద్రబాబు వర్గం ఊగిపోయింది. ఎన్టీఆర్‌ను దించేసే రాజకీయ క్రీడలో మొదటి ఎత్తు ఆ భోజనంతోనే మొదలైంది. సుబ్బిరామిరెడ్డిని ఇంటికి భోజనానికి పిలవడం అంటే ఒక దేవుడిగా పూజలందుకుంటున్న నాయకుడిని సైతం అధికారం నుంచి దించేయాల్సినంత ఘోరమైన తప్పిదంగా భావించారు. సుబ్బిరామిరెడ్డిని భోజనానికి పిలవడంతో టిడిపి అపవిత్రం అయినట్టుగా భావించారు. అంత గొప్ప నిష్టగల టిడిపి తెలంగాణలో ఇప్పు డు ఏకంగా కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని నడుస్తునడుస్తున్నది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్, టిడిపిలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు టిడిపి సభలో గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. వైఎస్‌ఆర్ ఎంతో అభిమానంతో భారీ నిధులు కేటాయించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని టిడిపి, కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు ఒకే స్వరం వినిపించారు. జలయజ్ఞం కాదు ధన యజ్ఞం అంటూ తొమ్మిదేళ్లపాటు వైఎస్‌ఆర్‌పై తీవ్రంగా విమర్శలు సాగించిన టిడిపి నాయకులే ఆ సభలో ప్రాణహిత చేవెళ్లప్రాజెక్టుకు వైఎస్‌ఆర్ కృషిని పొగిడారు.
అంతకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు సమావేశంలో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పక్షం దాడిపై గన్‌పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టిడిపి సభ్యులు అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. కెసిఆర్ విధానాల వల్లనే కాంగ్రెస్, టిడిపి కలిసి పోరాడాల్సి వస్తోందని టిడిపి నాయకులు చెబుతున్నారు. సభ భయటే రెండు పార్టీలు వివిధ అంశాలపై క్రమంగా దగ్గరవుతున్నాయి. ఇక సభలో విపక్షాల మధ్య ఐక్యత అనేది సహజం. దేశంలో బిజెపికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఆంధ్రలో టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం. కేంద్రంలో ఎన్‌డిఏలో టిడిపి మంత్రులు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి ఆందోళనల కోసం అయి నా వేదికను పంచుకోవడం రాజకీయాల్లో విడ్డూరంగానే ఉంటుంది.
నిజానికి రాష్ట్రంలో విపక్షాలను ఏకత్రాటిపైకి తీసుకు వచ్చి టిఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిశక్తిని నిలపాలని వామపక్షాలు ప్ర యత్నిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో గద్దర్‌ను ఉమ్మడి అభ్యర్థిగా నిలపడం ద్వారా విపక్షాల మధ్య ఐక్యత కోసం వామపక్షాలు ప్రయత్నించాయి. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు సైతం మద్దతు ఇస్తే గద్దర్ పోటీ చేసేందుకు కొంత వరకు అవకాశం ఉండేది. కానీ ప్రధాన పార్టీల మద్ద తు లేకుండా వామపక్షాల అభ్యర్థిగా పోటీకి గద్దర్ ఇష్టపడలేదు. ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను నిలిపేందుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, టిడిపిలను వామపక్షాలు కోరా యి. అయితే ఆ పార్టీలు అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ బలమైన శక్తి. టిడిపి, కాంగ్రెస్‌లు విడివిడిగా ఆ పార్టీని ఎదుర్కోలేని పరిస్థితి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం అంత సులభం కాదు. ఉద్యమాల కోసం ఏకం కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కానీ సాధారణ ఎన్నికల్లో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం అంత సులభం కాదు.
టిడిపితో పొత్తు తెలంగాణ బిజెపి నాయకులకు మొదటి నుంచి ఇష్టం లేదు. పొత్తు సమయంలో బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అలిగివెళ్లిపోతే పది జిల్లాల అధ్యక్షులు ఏకంగా రాజీనామా చేశారు. మిత్రపక్షంగా బిజెపి టిడిపిలు కలిసి ఉద్యమించాలి కానీ అలా కనిపించడం లేదు. బిజెపి సొంతంగానే కార్యక్రమాలు చేస్తుంటే టిడిపి మాత్రం క్రమంగా కాంగ్రెస్‌తో కలిసి కార్యక్రమాలు చేస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కోసం టిడిపి ఉద్యమిస్తే బిజెపి నాయకులను పిలవలేదు, వాళ్లు రాలేదు. కానీ కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి పెద్ద పీట వేశారు. ఈ పరిణామాలపై బిజెపి నాయకులు పైకేమీ చెప్పక పోయినా వారికిది సంతోషకరమైన విషయమే. తెలంగాణలో టిడిపితో తెగతెంపులు చేసుకోవడమే వారికి కావలసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు కొంత బలం తక్కువైతే బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, టిడిపిల మధ్య ఒప్పందం కుదిరిందన్న రహస్యాన్ని టిడిపి వర్గీయులే బయటపెట్టారు.

 గతంలో కేంద్రంలో బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అనుభవం టిడిపికి ఉంది. అదే విధంగా అవసరం అయితే తెలంగాణలో బయటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఉండేది. అప్పటికప్పుడు దానికో సిద్ధాంతాన్ని చెప్పడం టిడిపికి పెద్ద కష్టమేమీ కాదు. దుష్ట కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెట్టేందుకు బిజెపికి మద్దతు ఇచ్చానని, మతతత్వ బిజెపిని అధికారానికి దూరంగా ఉంచేందుకు కేంద్రంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానని గతంలో సమర్ధించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉంది. అదే తరహాలో దుష్ట టిఆర్‌ఎస్‌ను అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చానని చెప్పుకునే వారు. అయితే ఆంధ్రలో బిజెపితో, తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుండడమే విచిత్రం. ఉభయ రాష్ట్రాల్లో మరే పార్టీకి లేని ప్రచార శక్తి టిడిపికి ఉంది. చంద్రబాబు ఒకే రోజు తెలంగాణలో తన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, అదే రోజు ఆంధ్రలో మాత్రం ఏకపక్షంగా అడ్డగోలుగా విభజించారని ప్రకటించారు.
వామపక్షాలను పక్కన పెట్టి బిజెపితో కలిసిన సమయంలో తిరిగి బిజెపిని వదిలి వామపక్షాలతో చేతులు కలిపిన సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా బలమైన వాదన వినిపించారు. ఆ తరువాత వామపక్షాలను పక్క న పెట్టి 2014లో బిజెపితో చేతులు కలిపినప్పుడు తిరిగి అంతే బలంగా తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ బలమైన వాద న వినిపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని సైతం అంతే బలంగా సమర్ధించుకునేంత యంత్రాంగం టిడిపికి ఉంది.
రెండు పార్టీల మధ్య అనుబంధం కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ అవసరం. ఆంధ్ర, తెలంగాణల్లో రెండు పార్టీల వ్యవస్థనే ఉంటుంది. ఆంధ్రలో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎప్పుడూ రెండు పార్టీల మధ్యనే బలమైన పోటీ సాగింది. ఎంఐఎం పార్టీ పాతనగరానికి పరిమితం అయినట్టు విభజన తరువాత టిడిపి కొత్త నగరంలో కొన్ని నియోజక వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. వివిధ అంశాల్లో ఆంధ్ర తెలంగాణలో మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉం టాయి. ఆ వివాదాల్లో టిడిపి ఒకవైపు తమ పార్టీ నేత చంద్రబాబు నిర్ణయాలను సమర్ధిస్తూ మరోవైపు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలి. 

ఈ డబుల్ రోల్‌లో కొత్త నగరంలో టిడిపి అభిమానులున్న నియోజక వర్గాలకే పరిమితం కావలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్, టిడిపి చెట్టాపట్టాలేసుకుని ఉద్యమాల్లో పాల్గొంటే కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ ప్రయోజనం. తెలంగాణ టిడిపి నాయకులు విజయవాడ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన తరువాతనే టిడిపి ఎమ్మెల్యే పాదయాత్ర, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టిడిపి సభలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పోరాటాల్లో టిడిపితో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నా, రెండు పార్టీల అనుబంధంపై కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో టిడిపి సభలో మీరెందుకు పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ నాయకత్వం ప్రశ్నించలేదు. ఈ రెండు పార్టీల అనుబంధం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శాసన సభ సమావేశాల్లో ఈ బంధం మరిం త గట్టిపడే అవకాశం ఉంది.
  • -బుద్దా మురళి

  • 26/09/201
    5
  • కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    మీ అభిప్రాయానికి స్వాగతం