25, ఏప్రిల్ 2018, బుధవారం

వారికీ మనకూ తేడా అదే..!వారెన్ బఫెట్

‘‘అబ్బాయికి ఐటి కంపెనీలో జాబ్ వచ్చింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలు అవుతోంది. ప్రారంభ జీతమే నెలకు 60 వేలు. మొనే్న కొత్త కారు కొన్నాం పది లక్షలు. నెల నెలా కిస్తు చెల్లించాలి. పోతే పోయింది. పిల్లల సంతోషం కన్నా మనకింకేం కావాలి?’’
***
హైటెక్ సిటీలో ఉద్యోగమాయె. వాడి స్థాయికి తగ్గట్టు ఇల్లు ఉండాలి కదా? అందుకే మాదాపూర్‌లో కోటి రూపాయల ఫ్లాట్ కొన్నాం. అబ్బాయి ముచ్చట పడ్డాడని కొన్నాను. వాడి జీతం మొత్తం ఇఐంఐలకు పోతోంది. నా జీతంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలు కళ్ల ముందు ఎదుగుతుంటే ఇంత కన్నా సంతోషం ఏముంటుంది?’’
***
‘‘మంచి ఉద్యోగం కావడంతో మంచి సంబంధాలు వచ్చాయి. పోతే పోయింది కానీ పెళ్లి ఆర్భాటంగా చేశాం. అప్పు ఇప్పుడు కాకపోతే రేపు తీరుస్తాం కానీ జీవితంలో పెళ్లి ఒకేసారి కానీ మళ్లీ మళ్లీ రాదు కదా? నేనైతే మా పిల్లల మాట ఎప్పుడూ కాదనను. బర్త్‌డేనే ఆర్భాటంగా చేసే నేను పెళ్లి ఖర్చుకు వెనకాడుతానా? ’’
***
కొంచెం అటూ ఇటూగా మధ్య తరగతి కుటుంబరావుల ఇళ్లల్లో ఇలాంటి మాటలే వినిపిస్తాయి. అప్పు చేసైనా ఆనందం అనుభవించాలి.. నా డబ్బు, నా ఇష్టం.. నా అప్పు నేను కట్టుకుంటాను మధ్యలో మీ సలహా ఏంటి? అనే మాట కూడా వినిపించవచ్చు ఎవరైనా సలహాలు ఇవ్వాలని ప్రయత్నిస్తే... కానీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వారి అలవాట్లను పరిశీలిస్తే మనకు చిత్రంగా అనిపించవచ్చు. కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుంది. అన్నట్టు చిన్న చిన్న అలవాట్లలోనే ఆ పెద్దవారి ఎదుగుదల కనిపిస్తుంది.
రిటైర్ అయ్యేనాటికైనా సొంత ఇల్లు సమకూర్చుకుంటే అదే మనం సాధించిన ఘన విజయంగా చాలా మంది భావిస్తారు. ఇంటి విలువే జీవితంలో తాను సంపాదించిన ఆస్తి చాలా మందికి. మహానగరంలో ఒక సొంత ఇల్లు ఉంది అంటే- కొంచెం అటూ ఇటూగా అర కోటీశ్వరుడన్న మాట.
స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వారు వారెన్ బఫెట్ పేరు వినకుండా ఉండరు. ఇనె్వస్ట్‌మెంట్ గురువుగా ప్రపంచంలో కోట్లాది మంది ఆయన్ని ఆరాధిస్తారు. ప్రపంచంలో పది మంది సంపన్నుల జాబితాలో తప్పని సరిగా కనిపించే వారెన్ బఫెట్ ఇంటి ఖరీదు ఈ లెక్కన ఎంత ఉండాలి? మన ఆస్తిలో వంద శాతం ఇంటి విలువే అయితే ఈ అంకెను తలకిందులుగా తిప్పితే ఎంత అవుతుందో బఫెట్ ఇంటి విలువ సరిగ్గా అంతే. ఆయన ఆస్తిలో 001% మాత్రమే ఆయన ఇంటి విలువ. నెబ్రస్‌కాలోని 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేశారు. ఐదు పడక గదులున్న ఈ ఇంటినే బఫెట్ అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రపంచంలో కెల్లా సంపన్నుడిగా మారినా, ఇంటిని మాత్రం మార్చలేదు. ఇప్పుడు దాని విలువ 250,000 డాలర్లు. తాను పెట్టిన పెట్టుబడుల్లో మూడవ అత్యున్నతమైన పెట్టుబడి ఈ ఇల్లే అంటారాయన నవ్వుతూ. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి, డబ్బుకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఇనె్వస్టర్లకు ఉపనిషత్తు సూక్తుల వంటివి. సంపన్నులు పైలోకం నుంచి ఊడిపడరు. వాళ్లు కూడా మొదట్లో సామాన్యులే. వారి అలవాట్లు, ఆలోచనలే వారిని సంపన్నులుగా మారుస్తాయి.
గంటకో సిగరెట్, రోజుకో ప్యాకెట్ సిగరెట్లు తాగడం ద్వారా ఒక్కో దమ్ముకు బోలెడు సంతోషం కలుగుతుంది. ఇది అప్పటికప్పుడు కనిపించే కిక్కు. కానీ పొగ తాగడం వల్ల రోజుకు ప్యాకెట్, నెలకు 30 ప్యాకెట్లు లెక్క పెడితే డబ్బు, ఆరోగ్యం ఎంత పాడు చేసుకుంటున్నామో చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు ఊపిరి తిత్తులు రిపేరింగ్‌కు వచ్చి ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నప్పుడు లెక్కిస్తే అలాంటి అలవాట్లు ఉన్నవారికి వారి మీద వారికే కోపం వస్తుంది. ఓ రెండు దశాబ్దాల పాటు పీల్చిన సిగరెట్లు గుండెలకు తూట్లు పొడుస్తుంది. అదే డబ్బును రెండు దశాబ్దాల పాటు ఇనె్వస్ట్ చేస్తే రిటైర్‌మెంట్ జీవితం ప్రశాంతంగా గడిచేట్టు చేస్తుంది.
అప్పు దేని కోసం చేస్తున్నామనేదే ముఖ్యం. అలవాట్లు, ఆడంబరాలకు అప్పులు చేసి రోడ్డున పడే జీవితాలు ఎన్నో కనిపిస్తాయి. సంపన్నుల జీవితాలను గమనిస్తే ఇలాంటి చిన్న చిన్నవే వారిని ఎక్కడికో ఏ విధంగా తీసుకు వెళుతుందో అర్థమవుతుంది. వారెన్ బఫెట్‌కు ఉన్న సంపదతో విశాలమైన భవనాలు నిర్మించుకోవచ్చు కానీ ఇప్పుడున్న ప్రాంతంలో సంతోషంగా ఉండగలుగుతున్నప్పుడు మరో చోటకు వెళ్లి సంతోషం వెతుక్కోవలసిన అవసరం ఏముంది? అంటాడతను. చివరు బఫెట్ వాడే కారు సైతం ఇలాంటిదే. ఆయన తలుచుకుంటే కారు కాదు ఏకంగా కార్ల కంపెనీని కొనగలరు. లాభసాటి అనుకుంటే కార్ల కంపెనీ కొంటారు. కార్ల కంపెనీల షేర్లు కొంటారు. కారు మార్చరు. 2014లో క్యాడిలాక్ కారును 45వేలకు కొనుగోలు చేశారు. అంతకు ముందే ఇదే కంపెనీ 2006 మోడల్ కారు ఉండేది. ఈ కారులో వెళుతుంటే ఇబ్బందిగా ఉందని కుమార్తె చెబుతుంది. ఏడాదికి 3500 కిలో మీటర్లకు మించి తిరగను, తరుచుగా కార్లు మార్చాల్సిన అవసరం ఏముంది అంటారాయన. బ్రేక్‌ఫాస్ట్‌కు 3.17 డాలర్లకు మించి ఎప్పుడూ ఖర్చు చేయనంటారు.
మరీ ఇంత పిసినారా? నాకే గనుక అంత ఆస్తి ఉంటే పెద్ద భవనంలో రాజభోగాలు అనుభవించే వాణ్ణి. విలాస వంతమైన కార్లలో తిరిగే వాణ్ణి అని చాలా మంది అనుకుంటారు. ఆలోచనల్లో ఇలాంటి తేడానే ఒకరిని పేదవారిగా నిలిపితే , మరొకరిని సంపన్నుడిగా మారుస్తుంది. ఎవరో అన్నట్టు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. పేదవాడిగానే ఉండిపోవడం తప్పు. చిత్రంగా మన దేశంలో రాజకీయాలు కూడా పేదరికాన్ని గ్లామరైజ్ చేసేశాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంపన్నులు పేద, మధ్యతరగతి లో పుట్టిన సామాన్యులే తమ ఆలోచనలతో అవకాశాలు అందిపుచ్చుకుని సంపన్నులు అయ్యారు. మన భవిష్యత్తును మన ఆలోచనలే నిర్ణయిస్తాయి.
-బి.మురళి(Published Sunday, 22 April 2018 భూమి )

3 కామెంట్‌లు:

  1. అమెరికాలో క్రెడిట్ అనేది ఓ పెద్ద రాకెట్. ప్రతీదానికి క్రెదిట్ హిస్టరీ అవసరం. దాన్ని మొదలు పెట్టు అని చెబుతుంది వ్యవస్థ. ఓసారి మొదలుపెడితే ఊబిలోకి లాగేస్తుంది అప్పు.

    క్రెడిట్ కార్డ్ గీకేప్పుడు సమ్మగా కట్టేప్పుడు మహాప్రళయంగా ఉంటుంది

    రిప్లయితొలగించండి
  2. నడమంత్రపు సిరి, అవినీతి ధనం ఈ ఆర్భాటాలకి కారణాలు.

    రిప్లయితొలగించండి
  3. బావుంది. వారి వారి ఆలోచనా ధోరణే వారి జీవితాలని నిర్ణయిస్తుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం