2, జూన్ 2018, శనివారం

ప్రత్యర్థులకు ‘విరామం’!

ఉమ్మడి రాష్ట్రంలో ‘క్రాప్ హాలిడే’ అనే మాట తరుచుగా వినిపించేది. అనావృష్టి, ఎరువులు దొరక్క పోవడం, విద్యుత్ కోత వంటి సమస్యలతో పంటలకు విరామం ఇవ్వడం అప్పట్లో ఒక సంప్రదాయంగా మారింది. చాలా చోట్ల పంటలు వేయకుండా ‘క్రాప్ హాలిడే’ అంటూ రైతులు ఆందోళన చేసేవారు. తెలంగాణలో ఈ నాలుగేళ్ల తెరాస పాలన చూస్తే ప్రత్యర్థులకు ‘రాజకీయ విరామం’ ప్రకటించినట్టుగా ఉంది. కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిష్ఠించాక నాలుగేళ్లలో సాధించిన ప్రగతి, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికార తెరాస పార్టీకి పెద్దగా పోటీ కనిపించడం లేదు.
కాగా, మహారాష్టల్రోని నాంధేడ్ ప్రాంతానికి చెందిన 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపివేయాలని తీర్మానం చేశారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఈ గ్రామాల ప్రజల డిమాండ్‌కు అక్కడి నాయకులు సైతం మద్దతు పలికారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి తీర్మానాల గురించి విన్నామా? కన్నామా? తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటూ ఒడిశాలో కలిసిపోయిన బరంపురం వంటి కొన్ని ప్రాంతాలను తిరిగి ఆంధ్రలో కలిపేయాలని ఉమ్మడి రాష్ట్రంలో కొన్నిసార్లు డిమాండ్లు వినిపించాయి. తెలుగు వారు ఎక్కువగా ఉన్నందున భాష ప్రాతిపదికగా ఆ ప్రాంతాలను ఏపీలో కలపాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ, అభివృద్ధి పథకాల అమలు తీరును చూసి, తమ గ్రామాలను తెలంగాణలో కలిపేయాలని వారు కోరడాన్ని చూస్తే కేసీఆర్ సర్కారు ఏం సాధించిందో అన్నది అర్థమవుతుంది. ఆ గ్రామాలవారు తెలుగు వారేమీ కాదు. వారి మాతృభాష మరాఠీ. తెలంగాణలో కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అని మీడియా ప్రశ్నిస్తే- నిరంతర విద్యుత్, రైతుబంధు పథకం కింద లభిస్తున్న పెట్టుబడి సహాయం గురించి ఆ రైతులు వివరించారు.
తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు.
‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను అధిగమించి దేశానికి దారి చూపే విధంగా తెలంగాణ ప్రగతి పథాన పరుగులు తీస్తోంది. రాజకీయ విమర్శలు, ఎత్తులు- పైఎత్తులు , విజయాలు పక్కన పెట్టి తెలంగాణ కోణంలో ఈ ప్రాంతవాసులకు ఈ నాలుగేళ్లలో మేలు జరిగిందా? లేదా? అని చూస్తే, సాధారణ ప్రజలు ఊహించిన దాని కన్నా ఎక్కువే మేలు జరిగింది.
తెలంగాణ ఆవిర్భవించే సమయంలో ఎనె్నన్ని శాపాలు..? తెలంగాణ కల సాకారం అవుతున్న వేళ టీజీ వెంకటేశ్ లాంటి పెద్దలు- ‘రాష్ట్ర విభజన జరిగితే ఆరు నెలల సమయానికే మమ్ములను తిరిగి ఆంధ్రలో కలిపేయండి అని తెలంగాణలో ఉద్యమం వస్తుంది’ అన్నారు. విభజన తర్వాత ఒక అధికారిక సమావేశంలో ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ‘ఆంధ్రకు నిధుల కేటాయింపులు, మేం సాధించిన అభివృద్ధి చూసి తెలంగాణలో ఉద్యమం వస్తుంద’ని అన్నారు. తెలంగాణ పాలకులు ఏమీ మాట్లాడలేదు. నాలుగేళ్లలో తమ చేతలే సమాధానం అనుకుంటూ ముందుకు వెళ్లారు.
‘ఏపీలో ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్‌లా మారుస్తాను, జిల్లాకో విమానాశ్రయం’ అని హామీలు ఇచ్చిన వారు నాలుగేళ్లు గడిచాక కేంద్రం మోసం చేసిందని గగ్గోలు పెడుతుండగా, తెలంగాణ మాత్రం తన ఆదాయ వనరులను పెంచుకుని, ప్రాధాన్యతా రంగాలను నిర్ణయించుకుని సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యిత ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. హైటెక్ సిటీ పేరుతో ఒక ఏరియాలో భూముల ధరలు పెరగడమే అభివృద్ధి కాదు, మారు మూల పల్లెల్లో ఉండే సామాన్యుడు సైతం బాగుపడినప్పుడే అభివృద్ధి అనే కోణంలో తెలంగాణ పథకాలు చేపట్టింది. కొన్ని రాజకీయ పక్షాలు సాంప్రదాయ రాజకీయ ఆలోచనలకే పరిమితమైతే, అధికార పక్షం మాత్రం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి ప్రాధాన్యిత ఇస్తూ విజయం సాధించడం కాదు, ప్రత్యర్థికి డిపాజిట్లు కూడా దక్కని ఎత్తుగడలతో ముందుకు వెళుతోంది.
రాజకీయ ఎత్తుగడలతో విజయం సాధించడం ముఖ్యం కాదు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందాలి, వాళ్లు మనస్ఫూర్తిగా అధికార పక్షానికి అండగా నిలవాలనే కోణంలో తెలంగాణలో రాజకీయం సాగుతోంది. ఏ రాజకీయ పక్షమైనా దాని అంతిమ లక్ష్యం అధికారం. ఆ ఎత్తుగడలు తెలంగాణకు మేలు చేసేవిగా ఉంటే సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుంది. తెలంగాణలో అధికార పక్షం చేస్తున్నది అదే. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ వంటి పథకాల ప్రభావం రాజకీయ పక్షాలకు అర్థం కాకపోవచ్చు. ఇవి గ్రామాల్లో కలిగించే ప్రభావం తరువాత అర్థమవుతుంది. గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టం కావడంతో పాటు రాజకీయంగా బలమైన పునాదులు పడేందుకు ఇవి దోహదం చేస్తాయి.
అధికార పక్షం సాధారణ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడానికి ఒక్క ‘ఆసరా’ పథకం చాలు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల స్థితిగతులను పూర్తిగా మార్చేస్తుంది. రైతు బంధు పథకంపై ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేస్తే అధికార పక్షానికి అంత మేలు చేసిన వారవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు సాధారణ ఎన్నికలకు ముందే కనిపించి తీరుతాయి. సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాజెక్టులకు పెద్దపీట అంటూ సమైక్యపాలకులు రోజూ పాడిన పాట దశాబ్దాల పాటు విన్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఏదైనా కళ్లతో చూస్తే తప్ప నమ్మరు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ ఫలాలు త్వరలోనే చూడనున్నాం. రైతుల పొలాలను తడపడంతో పాటు వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యర్థుల కిందకు రాజకీయంగా నీళ్లు తేవడం కోసం కూడా కాళేశ్వరం పూర్తి కావడం అధికార పక్షానికి అవసరం.
ఉద్యమ కాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి చెందిన ఏ చిన్న నాయకుడు మాట్లాడినా మీడియా అతన్ని ఆకాశానికెత్తేది. విజయశాంతి పార్టీ పెట్టినా, గద్దర్ గళమెత్తినా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే మీడియా వారిపై కోటి ఆశలు పెట్టుకునేది. ఫలానా వారి అన్న, ఫలానా వారి తమ్ముడు అంటూ సొంత గుర్తింపు లేని వ్యక్తులు తెలంగాణ పేరుతో పార్టీ పెట్టినా ఆకాశానికెత్తేవారు. అలాంటి ఆశాకిరణం కోసం మీడియా ఇప్పుడు కూడా ఎదురు చూస్తోంది. కోదండరామ్ రూపంలో వారికో ఆశాకిరణం కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలంలోనే ఎన్నో పార్టీలు పెట్టారు. వివిధ పార్టీల్లోని తెలంగాణ నాయకులు టిఆర్‌ఎస్‌ను మించి మీడియా ముందు తెలంగాణ వాదం గట్టిగా వినిపించారు. తెలంగాణ ప్రజలు మరీ అంత అమాయకులేం కాదు. ఎవరు తెలంగాణ కోసం ఆలోచిస్తున్నారు, ఏ పార్టీతో మేలు అనే ఆలోచన ఇక్కడి ప్రజలకు స్పష్టంగా ఉంది. ఉద్యమ కాలంలో తమ పరిణతి చూపించారు. నాలుగేళ్ల పాలనా కాలంలోనూ చూపించారు. తెలంగాణకు ఏది మేలో ప్రజలకు బాగా తెలుసు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ రాజకీయ పరిణామాలను చూస్తుంటే 2019 ఎన్నికలు తెలంగాణకు మేలు చేసే విధంగానే ఉంటాయి.
2019 పరిణామాలు ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణలో అధికారంలో ఉన్న పక్షం 2014 ఫలితాలతో పోలిస్తే, తన బలాన్ని 50 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షం కనీసం 50 శాతం బలాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కేంద్రంలో ఏక పార్టీ అధికారంలో ఉన్నా , మిత్రపక్షం కాకపోయినా సామరస్యంగా తెలంగాణకు మేలు కలిగే విధంగా కేంద్రంతో కేసీఆర్ మంచి సంబంధాలు కొనసాగించారు. రాబోయే కాలంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమైతే- అప్పుడు తెలంగాణకు మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆరు దశాబ్దాల తరువాత తెలంగాణకు కాలం కలిసొస్తోంది. ఇప్పుడు తెలంగాణ వేగాన్ని ఎవరూ ఆపలేరు. ఇది తెలంగాణ కాలం.
-మౌర్య 
(ఆంధ్ర భూమి ఎడిట్ పేజీ 2-6-2018)