24, ఆగస్టు 2018, శుక్రవారం

ముసుగు వీరులు!

‘‘చాలా గొప్పవారు అని మనం కొందరి గురించి అనుకుంటాం.. కానీ అదేం కాదు. అదో ముసుగట!’’
‘‘ఎవరి గురించి?’’
‘‘ఇంకెవరి గురించి.. వాజపేయి గురించి. భాజపాకి అతను ఓ ముసుగు అని చాలా మంది మేధావులు అంటున్నారు’’
‘‘ఔను.. ఈ మేధావులే ఈ మధ్య కరుణానిధికి అవినీతి ఒక ముసుగు మాత్రమేనని, నిజానికి ఆయనో మహాత్ముడు అన్నారు’’
‘‘ అంటే కరుణానిధి అవినీతి నిజం కాదా? ముసుగు మాత్రమేనా?’’
‘‘అంటే వాజపేయి గొప్పతనం నిజం కాదా? ముసుగు మాత్రమేనా?’’
‘‘ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నేను కరుణానిధి ముసుగు గురించి అడిగాను. దాని గురించి చెప్పు’’
‘‘నేనడిగిన దానికి నువ్వు చెబితే... నువ్వడిగిన దానికి నేను చెబుతా.’’
‘‘వాళ్ల గురించి మనకెందుకు గొడవ కానీ.. నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది. కొత్త బాస్ ఎలా ఉన్నాడు. పాత బాస్‌లా లేడు కదా?’’
‘‘ఆ రోజులను మళ్లీ గుర్తు చేయకు బాస్. వాడి దగ్గర పని చేసినన్ని రోజులు నరకంలో ఉన్నట్టే ఉండేది. కొత్త బాస్ దేవుడు’’
‘‘పాత బాస్‌కు ధర్మామీటరో, ధర్మవీరుడు అనో ఏదో బిరుదు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నాయి. మరేంటోయ్.. ఇప్పుడలా అంటున్నావు’’
‘‘పొట్టతిప్పలు బాస్. వాడెంత దుర్మార్గుడైనా దేవుడు అనక పోతే ఉద్యోగం ఊడుతుంది. అలాంటి రాక్షసుడి వద్ద అనే్నళ్లు ఎలా పని చేశానా? అని ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ’’
‘‘ ఆ బిరుదేదో ఇవ్వడానికి పైరవీ చేసిన దాంట్లో నువ్వు మధ్యవర్తిత్వం వహించినట్టున్నావ్’’
‘‘ఔను.. ఖర్చు కూడా నేనే భరించా. వాడికి ఇంత కృతజ్ఞత కూడా లేదు.’’
‘‘మా బాస్ కనిపించే దైవం అంటూ ఆ రోజు నువ్వు చేసిన ఉపన్యాసం నాకింకా గుర్తుంది. మనసులో ఇంత కోపం పెట్టుకుని ఆ రోజు అంత తన్మయంగా ఎలా మాట్లాడావు’’
‘‘మళ్లీ మళ్లీ గుర్తు చేయకు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. చెప్పాను కదా? కడుపు తిప్పలు’’
‘‘తన్మయంగా ఎలా మాట్లాడానా? దీన్నే  ముసుగు అంటారు బాస్. మనసులో ఎంత కోపం ఉన్నా ముసుగు వేసుకుని మీ బాస్‌ను పొగిడావు. ప్రతిక్షణం మనం రకరకాల ముసుగులతోనే జీవనం సాగిస్తాం. ప్రతీవాడూ ముసుగు వేసుకునే జీవిస్తాడు. ఇప్పుడు కూడా నువ్వూ నేనూ అలానే ముసుగు వేసుకునే మాట్లాడుకుంటున్నాం.’’
‘‘అవేం మాటలు.. మనం చిన్ననాటి స్నేహితులం.. మన దగ్గర దాపరికాలేముంటాయ్?’’
‘‘ముసుగు తీసి సహజంగా మాట్లడితే నిన్ను నేను భరించలేను. నన్ను నువ్వు భరించలేవు. ఏ ఒక్కరినీ మరొకరు భరించలేరు. ఆక్సిజన్ లేకుం టే ప్రాణాలు పోతాయనేది ఎంత నిజమో! ముసుగులు లేకపోతే మనం ఉండలేం అనేది అంతే నిజం. వాజపేయి ముసుగు గురించి మాట్లాడుకోవడం మనకు ఆసక్తిగా ఉంటుంది కానీ మన ముసుగు గురించి మాట్లాడుకోవడానికి మనసొప్పదు. అంతే తేడా!’’
‘‘రేపు హాలిడేనే కదా? మన పాండు గెస్ట్‌హౌస్‌లో పార్టీ ఇస్తానంటున్నాడు’’
‘‘వస్తా.. కానీ చిన్న హెల్ఫ్ చేయాలి. నేను ఇంటికి వెళ్లాక నువ్వు కాల్ చేసి అర్జంట్ మీటింగ్ ఉంది, టూర్‌కు వెళ్లాలని మా బాస్ ఫోన్ చేసినట్టు చెయ్యి. ఇలాంటి పార్టీలంటే ఇంట్లో వాళ్లు పంపించరు. నీకు తెలుసు కదా?’’
‘‘నీ ఒక్కడికే ఇల్లు- ఇల్లాలు ఉంది. మా ఇంట్లో వాళ్లు మాత్రం బలాదూర్‌గా తిరిగి తాగి తందనాలాడి రమ్మని మంగళహారతి పట్టి వీర తిలకం దిద్ద పంపిస్తారనుకున్నావా? మీ ఇంటికి నేను ఫోన్ చేస్తాను. మా ఇంటికి నువ్వు ఫోన్ చేయి. మా ఆయన బంగారం అని ఇంట్లో వాళ్ల ముందు ఉన్న మన ముద్రను చెరిగి పోకుండా చూసుకుంటేనే కాపురాలు నిలుస్తాయి. మన ముసుగు తొలగిపోతే అంతే సంగతులు’’
‘‘మనల్ని- రాముడు మంచి బాలుడు అని ఇంట్లో వాళ్లు నిజంగా నమ్ముతారంటావా? లేక నమ్మినట్టు కనిపించే ముసుగును ధరిస్తారంటావా?’’
‘‘చూడోయ్.. మనం ముసుగు వీరులం అని నీ అంతట నువ్వే ఒప్పుకున్నావ్. భార్య ముందు భర్త, తల్లిదండ్రుల ముందు పిల్లలు, పిల్లల ముందు తల్లిదండ్రులు, బాస్ ముందు ఉద్యోగులు, ఉద్యోగుల ముందు బాస్, ప్రేయసి ముందు ప్రియుడు, ప్రియురాలి ముందు ప్రియుడు అంతా.. ముసుగులోనే ఉంటారు. మనమేదో స్వచ్ఛంగా ఉన్నట్టు వాజపేయికి ముసుగు అని చర్చించుకోవడం హాస్యాస్పదంగా ఉంది కదూ!’’
‘‘మన సంగతి వేరు. వాజపేయి లాంటి వారు కూడా ముసుగుతో ఉండడం ఏమిటి? ఆయనకూ, మనకూ తేడా లేదా? ఐతే ఆయన కూడా మనలాంటి సామాన్యుడేనా?’’
‘‘ముసుగు లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేని మనం వాజపేయినేంటి? మహాత్మా గాంధీని కూడా తీవ్రంగా విమర్శిస్తాం. రావణాసురుడికి పది తలలున్నాయంటే నిజంగా పది తలలతో కనిపిస్తాడని కాదు. ఒక్కో సందర్భంలో మన ముఖం ఒక్కో ముసుగు ధరించి కనిపిస్తాం. అన్ని ముసుగులు ఒకే సారి ధరిస్తే మనం కూడా రావణాసురుడిలా పది కాదు అంత కన్నా ఎక్కువ తలలతో కనిపిస్తాం. మనల్ని మనమే భరించలేం. రావణుడు, రాముడు అందరూ మనలోనే ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు బయటకు వస్తారు. ’’
‘‘ముసుగు లేనిదే బతకలేమా?’’
‘‘అదేదో సినిమాలో- పోలీస్ స్టేషన్‌లో అలీని విచారణకు పిలిపిస్తారు. అప్పుడే స్టేషన్‌కు ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ఊపిరి ఆడనివ్వకుండా అలీ ముద్దు పెడతాడు మనసులోనే. పైకి అమాయకంగా కూర్చుంటాడు. అది సినిమా అయినా మనిషి వాస్తవ రూపం. ముసుగులో మర్యాద కనిపిస్తుంది. ముసుగు తీస్తే అసలు రూపం భరించలేం..’’
‘‘అంటే శవం తప్ప- బతికున్నవాళ్లంతా ముసుగుతోనే ఉంటారంటావు’’
‘‘రసాయనాలు అనే ముసుగు లేకపోతే- శవం అసలు రూపాన్ని చూసి భరించలేం. అందుకే శవానికి రసాయనాల పూత పూస్తారు. ’’
‘‘ముసుగు లేని స్వచ్ఛమైన మనిషిని అని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు. తమ ముసుగు తమకే తెలియకుండా దాచిపెడుతున్న వాళ్లే అలా అనగలరు’’
*బుద్దా మురళి (జనాంతికం 24-8-2018)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం