3, ఆగస్టు 2018, శుక్రవారం

లంచమిస్తే శిక్ష!

తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో?’’
‘‘నిన్ను ఎవరు తన్నారు? ఎక్కడ పడ్డావు?’’
‘‘నా సంగతి కాదు. ఇకపై లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమేనట! లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏడేళ్లపాటు జైలు శిక్షనట! లంచగొండులకు పండగే పండుగ.. ఇక నిర్భయంగా లంచాలు తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే, లంచం ఇవ్వడానికి వచ్చాడని ఎదురు ఫిర్యాదు చేయవచ్చు.’’
‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. లంచాలకు అలవాటు పడ్డ రాజోద్యోగి ఒకరి గురించి రాజుగారికి తెలిసి, చాలా వార్నింగ్‌లు ఇచ్చాడట! ఐనా ఎలాంటి మార్పు లేదు. ప్రాధాన్యత లేని, ప్రజలతో సంబంధం లేని పని అప్పగిస్తే చచ్చినట్టు మారతాడనుకున్న రాజు అతనికి సముద్రం ఒడ్డున పని అప్పగించాడు. అలలు లెక్కపెట్టి సముద్రంలో రోజుకు ఎన్ని అలలు వస్తున్నాయో చెప్పాలి. కొంత కాలానికి రాజుగారికి ఆ ఉద్యోగి ఎలా మారాడో, ఎలా ఉన్నాడో చూడాలనిపించి మారువేషంలో వెళ్లి చూశాడు. రాజోద్యోగి గతంలో కొలువులో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు మరీ ఎక్కువ ఉత్సాహంగా కనిపించాడు. సముద్రంలో అలలు లెక్కించడంలో పై ఆదాయం ఏ విధంగా సాధ్యం అని రాజుగారు అడిగితే- అతను చెప్పిన సమాధానం కళ్లు తెరిపించింది. సముద్రం అన్నాక సరకులతో కూడిన భారీ పడవలు రావడం సహజమే. అవి వచ్చినప్పుడు రాజోద్యోగి వారిని అడ్డగించి సముద్రంలో అలలు లెక్కించే కీలకమైన బాధ్యతలను రాజు నాకు అప్పగించారు. మీ పడవలు ఆగడం వల్ల అలలు లెక్కించే పనికి ఆటంకం అవుతోందని అడ్డగిస్తుండగా, రాజోద్యోగితో మనకెందుకు గొడవ అని అడిగినంత ఇచ్చి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడే ఆదాయం ఎక్కువగా ఉందని రాజోద్యోగి సంతోషంగా చెప్పుకొచ్చాడు’’
‘‘ఈ కథకు, దీనికి సంబంధం ఏముంది?’’
‘‘అధికారంలోకి వచ్చిన ప్రతి రాజు కూడా తనదైన శైలిలో అవినీతిని నిర్మూలించాలనుకుంటాడు. కానీ అది మనుషుల జీవితంలో భాగంగా మారిపోయింది. ‘ఆత్మను నాశనం చేయలేరు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అవినీతి అనేది మన వ్యవస్థ ఆత్మ. ఈ ఆత్మను అంగీకరించాల్సిందే తప్ప నిర్మూలించలేం అంటున్నాను. అలలు లెక్కించే పని అప్పగిస్తే, అవినీతి పరుడు మారిపోతాడని ఆ రాజు భావిస్తే, లంచం ఇచ్చేవారిని సైతం శిక్షిస్తే లంచాలు కనిపించకుండా పోతాయని ఈ రాజు భావిస్తున్నారు.. అందుకే ఈ కథ చెప్పాను’’
‘‘మరీ అంత నిరాశావాదం అయితే ఎలా? అమెరికా లాంటి దేశాల్లో అవినీతి అస్సలు ఉండదు తెలుసా? ’’
‘‘బల్లకింద చేతులు పెట్టడం అనే పదానికి ఆ దేశం వారికి అస్సలు అర్థం తెలియదు. కన్సల్టెన్సీ ఫీజు అని వాళ్లు దానికి ముచ్చటగా పేరు పెట్టుకుని చట్టబద్ధం చేశారు.’’
‘‘మన దేశంలో కూడా ప్రతి పనికి లంచం ఎంతో నిర్ణయించి దానికి ఇలానే ఓ ముద్దు పేరు పెట్టుకుంటే లంచం సమస్య తీరిపోతుంది కదా? ’’
‘‘పోదు.. ఆ మధ్య ఒకరు జీతాలు పెంచితే లంచాలు ఉండవన్నారు. జీతాలు బాగా నే పెరిగాయి. మరి లంచాలు మాయం అయ్యాయా? కావు. కన్సల్టెన్సీ ఫీజు అని నిర్ణయించినా.. కన్సల్టెన్సీ ఫీజు చెల్లించావు మరి నా వాటా అనే మాట వినిపించి తీరుతుంది. నీకు పెళ్లయిందా?’’
‘‘నా పెళ్లికి, లంచాలకు సంబంధం ఏంటోయ్’’
‘‘నిజాయితీగా చెప్పు .. నీకు పెళ్లయినా పక్క చూపులు చూస్తావా? లేదా?’’
‘‘నేను మగాణ్ణి’’
‘‘కదా! పక్క చూపులు చూడడం మగాడి జన్మహక్కు అని నువ్వు భావించినట్టే. బల్లకింద సంపాదన మా జన్మహక్కు అని కొందరి గట్టి నమ్మకం. ’’
‘‘ సరదాగా అన్నా... పక్కచూపులు చూస్తే మా ఆవిడ ఊరుకుంటుందా?’’
‘‘మీ ఆవిడ లేనప్పుడు నువ్వు పక్కచూపులు చూసినట్టే ఎవరూ చూడనప్పుడు వాళ్లు బల్లకింద చేయి పెడతారులే’’
‘‘లంచం ఇచ్చే వాడుంటేనే కదా? తీసుకునే వాళ్లుంటారు.. అందుకే లంచం ఇచ్చేవాళ్లను కూడా శిక్షించడం ద్వారా లంచాల సంస్కృతికి చరమగీతం పాడాలని ప్రయత్నం’’
‘‘ఇంకా నయం బల్లలు ఉన్నాయి కాబట్టి బల్లకింద చేతులు పెడుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు బల్లలు లేకుండా చేసేయలేదు’’
‘‘ఇదేదో బాగుందోయ్ ఐడియా. అసలు బల్లలు లేకుండే చేస్తే ఇక బల్లకింద చేతులు ఎలా పెడతారు?’’
‘‘చేతులు లేకుండా చేసేస్తే చేతులు తడపడం ఉండదు ఏమంటావు?’’
‘‘ఈ ఐడియా బాగానే ఉంది.. పాలకులకు చెప్పాలి. అదేదో దేశంలో తప్పు చేస్తే.. తప్పు చేయడానికి కారణం చేతులే కదా? అని చేతులు నరికేస్తారట! బల్లకింద చేతులు పెట్టేందుకు వీలు లేకుండా అసలు చేతులే లేకుండా చేశాకే ఉద్యోగ బాధ్యతలు అప్పగించాలి’’
‘‘చూడోయ్.. మనుషులందరికీ ఏదో ఒక సమస్య ఉంది. మనుషులందరికీ మనుషులతోనే సమస్య. సమస్యలు లేకుండా చేయాలంటే అసలు మనుషులే లేకుండా చేస్తే ఎలా ఉంటుందంటావు’’
‘‘తల నరికేసి.. చుండ్రు సమస్య పరిష్కరించానని మురిసినట్టుంది.’’
‘‘ఏం చేసినా విమర్శించడమేనా?’’
‘‘సమస్య పరిష్కరించడం కన్నా ఏదో చేసినట్టు నటించడం చాలా?’’
‘‘పోనీ- నువ్వు చెప్పు.. అవినీతి లేకుండా చేయాలంటే ఏం చేయాలో.. సిటిజన్ చార్టర్ అని ప్రతి కార్యాలయంలో ఏ పని ఎన్ని రోజుల్లో అవుతుందో రాస్తారు కదా? అలానే ఏ పనికి ఎంత ముట్ట చెప్పాలో రాస్తే బాగుంటుందా?’’
‘‘అది కాకుండా- నాకెంతిస్తావ్? అని అడుగుతారు అప్పుడు’’
‘‘రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే లబ్దిదారులకు పది పైసలు చేరేవనేవారు..’’
‘‘ఔను.. అప్పటి నుంచి ఈ పది పైసల విలువ పెంచాలని ప్రయత్నాలు ప్రారంభిస్తే, రూపాయి విలువే తగ్గింది కానీ పది పైసల విలువ పెరగనేలేదు. ’’
‘‘నీతో మాట్లాడుతుంటే నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. కరెన్సీ ఉండడం వల్లనే కదా? ఈ అవినీతి సమస్య. అసలు కరెన్సీ మొత్తాన్ని రద్దు చేసి, బార్టర్ సిస్టం ప్రవేశపెడితే...’’
‘‘గట్టిగా అనకు విన్నారంటే మన్‌కీ బాత్ అంటూ అవినీతి నిర్మూలనకు కరెన్సీని రద్దు చేసినా చేస్తారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఏదో అద్భుతం చేసి చూపించాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 3-8-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం