11, మే 2011, బుధవారం

వీరీవీరీ గుమ్మడి పండు వీరి పేరేమి?....చెప్పుకోండి చుద్దాం .......

పూర్వం పాఠశాలకు , కళాశాలలకు ఆటస్థలాలు ఉండేవని , చదువుకునేప్పుడు మధ్యాహ్నాం ఆడుకునేవాళ్లమని ఓ కార్పోరేట్ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థికి చెబితే, అతగాడు ‘సీరియస్’గా ముఖం పెట్టి మరీ మీరిలాంటి అభూతకల్పనలు చెప్పడం ఏమీ బాగాలేదు బాబాయ్ అని నిలదీశాడు.
 మీరింకా చందమామ కథలను చెబితే నమ్మేంత అమాయకులమేమీ కాదు మాకన్నీ తెలుసు అని నెట్‌లోకి వెళ్లిపోయాడు. ఎవరైనా నెట్‌లోకి వెళితే నాకు సాలెగూటిలోకి వెళ్లినట్టుగానే అనిపిస్తుంది. ‘‘కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆటస్థలాలు ఉన్నట్టు నాకు తెలిసింది కావాలంటే నాతో రా చూపిస్తాను’’ అని సవాల్ చేశాను. నగరం నడిబొడ్డులో ‘కమర్షిల్‌కాంప్లెక్స్’లో నిర్వహించే ఒక కార్పొరేట్ కాలేజీలో ఇతగాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాంప్లెక్స్ మొదటి అంతస్థులో వైన్ షా పు, బారు; రెండో అంతస్థులో ఇతగాడి కాలేజీ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో బారుషాపో, వైన్ షాపో ఉంటుంది కానీ ప్లే గ్రౌండ్ ఉండడం ఏమిటనేది అతడి వాదన.
 నిజమే మరి , రోజూ కనులతో చూసిందే నమ్ముతాడు కానీ మనం చెప్పింది ఎందుకు నమ్ముతాడు? ‘ ప్లే గ్రౌండే’ తెలియని ఈ తరానికి పిల్లలు ఆటలు పాటలు ఏం తెలుస్తాయి. టీవిలు లేని సమాజం ఇంత ‘నాగరికత’ సంతరించుకోనప్పుడు పిల్లలకు బోలెడు ఆటలుండేవి. ఆటలతోనే మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలివి తేటులు అబ్బేవి. ఇప్పు ఇంకా భూమి మీదికి రాకముందే తల్లికడుపులోనే ఐఐటికి కోచింగ్ ఇప్పించేస్తుంటే ఇక పిల్లలకు ఆటలెలా తెలుస్తాయి.
 ఈ మధ్య జి చానల్‌లో తల్లి కడుపులో ఉండగానే శిశువు నేర్చుకుంటాడని తల్లి మాటలు వింటాడని ఒక స్టోరీ ప్రసారం చేశారు. అదృష్ట వశాత్తు ఈ స్టోరీ ఇంకా ఐఐటి కోచింగ్ కాలేజీల వారి దృష్టిలో పడలేదు కానీ గర్బస్థ శిశువుల కోసం గర్బీణీ స్ర్తిలకు ప్రత్యేక ఐఐటి కోచింగ్ ప్రారంభించేవారు. పిల్లలకు ఆటల అదృష్టం ఎలాగూ లేదు కానీ కనీసం ఆటల గురించి తెలుసుకోవడానికి ఒక మ్యూజియమైనా ఏర్పాటు చేస్తే బాగుండేది. వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి అనే చిన్నప్పుడు ఆడారు కదా!


 ఇప్పుడీ ఆట పిల్లలకు తెలియదు కానీ టీవిల్లో జేబులు ఖాళీ చేసేందుకు ఇలాంటి తరహా ఆట మొదలు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ లేదా మహేశ్ బాబు బొమ్మ చూపి వీరెవరో చెప్పుకోండి చూద్దాం చెబితే పాతిక వేలు మీవే అంటూ కవ్వించే దుస్తులతో ఓ అమ్మాయి అడుగుతుంది. ఒక్క ఫోన్ కాల్‌తో పాతిక వేలు కొట్టేయవచ్చని ఫోన్ చేస్తే మనం క్యూలో ఉంటాం, వెయ్యి రూపాయల బిల్లవుతుంది కానీ బహుమతి రాదు. ఇది పిల్లలాట కాదు జగత్ కిలాడి ఆట అని ఫోన్ బిల్లు కట్టేప్పుడు తెలుస్తుంది. సరే ఆ ఆటను వదిలేసి మనం వీరివీరి గుమ్మడి పండు ఆటతో నేటి ప్రముఖుల గురించి తెలుసుకుందాం.


 ‘మురికి వాడలో చింపిరి జుట్టు పిల్లను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. గుడిసెలోకి వెళ్లి కుండలోని నీటిని అమృతం తాగినంత ఆనందంగా తాగాడు. అపరిశుభ్రంగా ఉన్నవాళ్లు మీద మీద పడుతున్నా ఏ మాత్రం చిరాకు పడకుండా ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నాడు. ఇచ్చిన దరఖాస్తులన్నీ తీసుకుని మీ సమస్య పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.ప్రజలకే నా జీవితం అంకితం అని ప్రకటించాడు. వీరివీరి గుమ్మడి పండు ఈ జీవి పేరేమి. ఆ మాత్రం తెలియదా? రాజకీయ నాయకుడు అని నవ్వుకుంటున్నారా?... లక్షణాలను బట్టి వీరివీరి గుమ్మడి పండు వారిపేరేమి తేల్చుకోండి చూద్దాం.

****
నేను దారిన పోయే దానయ్యను. ఈసారి నిన్ను పార్లమెంటుకు పంపిస్తాను. నా చిన్నప్పుడు మా ఊళ్లొ ఇలాంటి పనికి మాలిన వాడే ఉండేవాడు. నేను హై కమాండ్‌కు విశ్వాస పాత్రున్ని సోనియా మేడం ఏం చెబితే అది చేస్తాను. ముఖ్యమంత్రిగా ఉండమన్నారు ఉన్నాను. ఇప్పుడు సాధారణ కార్యకర్తగా ఉండమంటే ఉంటాను. మరి నేనెవరిని?

*****


తెలంగాణ కాంగ్రెస్, టిడిపి నాయకులు దద్దమ్మలు, చేతకాని చవటలు. ఏమన్నా అంటే అన్నానంటారు కానీ ఇలాంటి వారిని దద్దమ్మలు అనకుంటే ఇంకేమనాలి. చంద్రబాబు బూట్లు నాకటమే వీరి పని. ఇంకెంత కాలం ఆ బానిసత్వం. బయటకు రండి. తెచ్చిన తెలంగాణను నిలబెట్టుకోలేని దద్దమ్మలు ఇప్పుడు తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అంటున్నారు. చచ్చేది కూడా మీరే బిడ్డా గుర్తుపెట్టుకోండి- తెలిసిపోయిందా నేనెవరినో?

*****
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేది. ఇప్పుడు హైదరాబాద్‌కు ఎవరూ రావడం లేదు. నేను లేని రాష్ట్రంలో అడుగుపెట్టేది లేదని ప్రపంచంలో ఉన్నవాళ్లంతా నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం. నేను అన్నింటికి విలువను పెంచేశాను. గత ఏడేళ్లలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన వల్ల చివరకు ఓజోన్‌పొర కూడా కరిగిపోతోంది. నేనూ, క్లింటన్, టోనీ బ్లేయర్ కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దామనుకున్నాను. కంప్యూటర్‌ను కనిపెట్టింది నేనే అని చాలా మంది నమ్మకం. నా నటనకు మా మామ ఆశ్చర్యపోయాడు- నేను నేనే...
****

మా నాన్న నాకు పది కోట్ల మంది ప్రజలున్న పెద్ద కుటుంబాన్ని అప్పగించి పోయారు. మీకోసం ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టి మీకు సేవ చేయాలా? అని ఎదురు చూస్తున్నాను. ఇటలీ సోనియమ్మకు భారతీయత ఏం తెలుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యత ఇక నాది కాదు’- బెంగళూరువెళ్లి మళ్లీ వస్తా..
****

మా నాన్నగారు.. అన్నగారు... అంటే అన్నగారు నాకు నాన్నగారు. మన తెలుగుదేశం... బావగారి కోసం పని చేయాలని అంతా అనుకున్నాం. మా సోదరి ఇంటి ముందు తొడ గొట్టానని అంతా తిడుతున్నారు కానీ మరి వేరేవారి ఇంటి ముందు తొడకొడితే ఊరుకుంటారా? సరే బావగారు పిలుస్తున్నారు మళ్లీ వస్తా-నేనెవరినో?

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం