14, సెప్టెంబర్ 2011, బుధవారం

మరక మంచిదే............పుట్టుమచ్చ లేని మనిషుండడు. ఏదో ఒక మరక లేని గొప్పవారు లేరు

ఛీ...చీ...చీ... వెదవ బతుకు. దేవుడా! ఇంత చాతకాని మొగుడ్ని నాకెందుకు ప్రసాదించావురా దేవుడా! వచ్చే జన్మలోనైనా నేను గర్వంగా తలెత్తుకుని తిరిగే జీవితాన్ని ప్రసాదించు’’ అంటూ సుభద్ర మొగుడికి వినిపించేట్టుగానే తనను తాను తిట్టుకుంది. పాపం సుభద్రకే కాదు ఎవరికైనా అలానే ఉంటుంది. పక్కింటి మీనాక్షి ఇంటిపై సిబిఐ వాళ్లు దాడి చేశారు, రోజూ ఐటి శాఖ ఇడి శాఖ అంటూ ఇంగ్లీష్‌లోని అన్ని అక్షరాల శాఖల వాళ్లు దాడులు జరుపుతున్నారు. తమ ఇంటికేమో ఎవరూ రావడం లేదు దాంతో సుభద్రతో పాటు చుట్టుపక్కల వారికి తలకొట్టేసినట్టుగా ఉంది . అప్పటి వరకు అందరితో స్నేహంగా మెలిగే మీనాక్షి దాడుల తరువాత నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టు, నేనెక్కడ మీరెక్కడ అంటూ కాలనీలో అందరినీ పురుగుల్లా చూస్తోంది. మాకూ మంచి రోజులొస్తాయని సుభద్రతో పాటు ఇరుగు పొరుగు వారు పైకి అంటున్నా మనకంతా అదృష్టమా? అనే ఆవేదన వారిలో ఉంది. నిజమే మరి మరక లేని జీవితం నరక ప్రాయం కదా!

***


ఏరా షర్ట్ మీద ఈ మరకలేమిటి? ఉతకలేక చస్తున్నాను అని అమ్మ చిన్నప్పుడు తిట్టే తిట్లతో జీవితం మొదలవుతుంది. మరీ చిన్నపిల్లాడిలా షర్ట్‌మీద మరకలేమిటి? అని పెద్దయ్యాక భార్య వేసే ప్రశ్నలతో జీవితం సాగుతుంది కుటుంబరావులకు. అందుకేనేమో కుటుంబ రావులకు మరక పరమ చిరాకుగా ఉంటుంది. మరక మంచిదే అని గ్రహించిన వాళ్లు జీవితంలో ఎదిగిపోతుంటే, మరకకు భయపడేవారిని బతుకు భయపెడుతుంది. చిన్నప్పటి నుండి మరక మంచిది కాదు అనే మాటలకు ఎడిక్ట్ అయిపోయి సామాన్యులుగా బతికేస్తున్నాం.


 మనలానే సర్ఫ్ ఎక్సెల్ వాడు కూడా మరకకు భయపడితే మార్కెట్‌లో నిలిచేవాడా? మరక మంచిదే అని ఎప్పుడైతే గ్రహించాడో అదే నినాదంతో మార్కెట్‌లోకి వెళ్లి ప్రత్యర్థులు లేకుండా చేసుకున్నాడు. షర్ట్‌పైన చిన్న మరక ఉంటే అంతా మన మరకనే చూస్తున్నారేమో అని రోజంతా ఏ పనీ చేయలేం, కానీ పెద్దవాళ్లకు మాత్రం మరకే అలంకారంగా నిలుస్తోంది. ఎన్ని మరకలుంటే జీవితంలో అంత ఉన్నత స్థాయిలోకి వెళతారు.

లక్ష కోట్ల మరక లేకుంటే జగన్‌కు అంత జనాదరణ ఉండేదా? అప్పరావు, సుబ్బారావుల కొడుకుగానే ఆయన జీవితం గుట్టుచప్పుడు కాకుండా సాగేది. అదృష్టం బాగుంటే ఆ మరకలే ఆయనకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తును అదృష్టరేఖలవుతాయి. మరక ఉంటేనే రాజకీయాల్లో అదృష్టం కలిసొస్తుంది.


 74 ఎళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఎన్టీఆర్ జీవితంలో మరక అని అభిమానులు అంటారు. కానీ ఆ మరక వల్లనే కదా94 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష స్థానంకూడ దక్కకుండా చేసింది.
 నాకున్నవి రెండే మరకలు ఒకటి వెన్నుపోటు, రెండోది రెండెకరాల నుండి రెండువేల కోట్ల ఆదాయం అని బాబుగారే స్వయంగా చెప్పుకున్నారు.
 రెండువేల కోట్లు లేవు నాకున్నది 39లక్షలు మాత్రమే అని ఒక మరకను కనిపించకుండా తుడిపేసుకునే ప్రయత్నం చేశారు. మేకప్‌తో కంటికింద చారలు, ముడతలు కనిపించకుండా చేసినట్టే నాయకులు మన కంటికి కనిపించని మేకప్‌తో మరకలు కనిపించకుండా చేసుకుంటారు. నాకు 39లక్షల రూపాయల ఆస్తి మాత్రమే ఉందని చెప్పుకోవడం లాంటి మేకప్ అన్నమాట! మరక లేని నాయకులు మాజీలుగా ఉంటారేమో కానీ ప్రస్తుత రాజకీయాల్లో కనిపించరు. మరకలు ఎక్కువగా ఉన్నవారే మచ్చలేని నాయకులం అని ప్రచారం చేసుకుంటారు. తెల్లబట్టలపై నల్లచుక్క అయినా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం బురదలో కూరుకుపోతే మరకలెక్కడ కనిపిస్తాయి. ఇలాంటి వారే దమ్ముంటే నాకు మరకలున్నట్టు నిరూపించండి అని సవాల్ విసురుతారు.


 జుట్టుపై తెల్ల వెంట్రుక కనిపించగానే నల్లరంగేసేస్తాం. కొంత కాలం తరువాత మన జుట్టులో తెల్లవెంట్రుకలెన్నో, నల్లవెన్నో మనకే తెలియదు. మన జుట్టు లోగుట్టు మనకే తెలియనప్పుడు నాయకుల లోగుట్టు కనిపెట్టగలమా? బురదలో ఉన్నవారి మరకలను పట్టగలమా? 1999 ఎన్నికల సమయంలో లోక్‌సత్తా పార్టీగా మారక ముందు రాష్ట్రంలో పోటీ చేస్తున్న వారిలో మరకలున్న అభ్యర్థుల జాబితా ప్రకటించి సంచలనం సృష్టించింది. అయితే ప్రజలు ఆ మరకలున్న నాయకులందరినీ గెలిపించి మరింత సంచలనం సృష్టించారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి కాంగ్రెస్ తరఫున జక్కం పూడి రామ్మోహన్‌రావు ఒక్కరే గెలిచారు. లోక్‌సత్తా నేరాల మరకల జాబితాలో అతని పేరూ ఉంది, మరకకు భయపడి అతనికి టికెట్ ఇవ్వకపోతే గోదావరి జిల్లాల నుండి అప్పుడు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే ఉండకపోయేది.


 జగన్ అరెస్టవుతాడా? అని అభిమానులు కంగారు పడుతున్నారు. అరెస్టయితే అతని కీర్తికిరీటంలో మరో మరక చేరి, రాజకీయాల్లో అతని ఉజ్వల భవిష్యత్తుకు తోకచుక్కలా మారుతుంది. పత్రికల్లో అప్పుడప్పుడు కనిపించే, కూలీ పని చేసుకొని బతుకుతున్న మాజీ ఎమ్మెల్యే భార్య, దిక్కులేని జీవితం గడుపుతున్న మాజీ ఎంపి అంటూ వచ్చే వార్తలన్నీ మరకలేని జీవితం గడిపిన నాయకుల గురించే. వీరిని చూశాక మరక లేని జీవితం గడపాలని ఏ నాయకుడైనా అనుకుంటారా?

చంద్రడికి అందం వచ్చింది మరకతోనే కదా? ఒక్క మరక ఉంటేనే దేవుడు. శరీరం మొత్తం మరకలే ఉన్న ఇంద్రుడు దేవాది దేవుడు .. ఒక రాత్రి ఆయన కాలు జారి తప్పు పని చేస్తే పాపం ఆయన శరీరం మొత్తం మరకల మయం కావాలని శపించారు. మరకల్లాంటి ఆ కళ్లు అందరి కళ్లకు కనిపించకుండా అతను వరం పొందాడనుకోండి. మరకలు లేని వాళ్లు వోటర్లుగా మిగిలిపోతే, మరకలున్నవాళ్లు నాయకులవుతున్నారు, పాలకులవుతున్నారు, దేవతలవుతున్నారు. పుట్టుమచ్చ లేని మనిషుండడు. ఏదో ఒక మరక లేని గొప్పవారు లేరు.



4 కామెంట్‌లు:

  1. జనం అవినీతిని ఎందుకు సహిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదివితే చాలు. ఇట్టే అర్థమైపోతుంది

    రిప్లయితొలగించండి
  2. మొదటి పేరా వ్యంగ్యంగానే రాసినా ఆలోచిస్తే నిజం కూడా అలాగేవుందండీ . అవినీతి అనేదాన్ని అందరూ అతి సామాన్యం అన్న అర్ధంతో చూస్తున్నారు . రోజూ పట్టుబడుతున్న అవినీతి అధికారులకు వాళ్ళ కుటుంబాలకు సమాజంలో గౌరవం ఏం తగ్గటం లేదు . సాటి వారిలో వాళ్ళపట్ల అసూయే తప్ప , అసహ్యం కలగటం లేదు . పైగా వాళ్ళ ఆస్తిపాస్తులు బయటికి తెలీటం వాళ్ళకే ఉపయోగపడుతుంది . అందుకే అనుకోవాల్సి వస్తుంది మరక మంచిదే అని

    రిప్లయితొలగించండి
  3. "పుట్టుమచ్చ లేని మనిషుండడు. ఏదో ఒక మరక లేని గొప్పవారు లేరు." -- బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం