27, సెప్టెంబర్ 2011, మంగళవారం

చానల్స్ పై చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ ... ప్రత్యక్ష పోరుకు దిగుతున్న చానల్స్

కంచే చేను మేస్తే పాత సామెతలానే మీడియానే తప్పు చేస్తే అనే సామెత కూడా పాతపడిపోయినట్టుంది. చానల్స్ మధ్య గతంలో కోల్డ్‌వార్ సాగింది. ఇప్పుడు మొహమాటాలేమీ లేవు ప్రత్యక్ష యుద్ధానికే దిగుతున్నారు. కొన్ని చానల్స్ ఒకరిపై ఒకరు స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించుకుంటున్నారట! పలు చానల్స్‌లో జరిగే అంతర్గత వ్యవహారాలపై ప్రత్యర్థులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, త్వరలోనే ఇవి ప్రసారం కానున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రచారం. 
కందుకూరి వీరేశలింగం దాదాపు 130 ఏళ్ల క్రితం వివేకవర్థిని అనే పత్రిక నడిపారు. న్యాయవ్యవస్థను విమర్శించడానికి మీడియా భయపడుతుంది. జన లోక్‌పాల్ పరిధిలో న్యాయవ్యవస్థ సైతం ఉండాలని జన లోక్‌పాల్ కోరుతోంది. కందుకూరి వీరేశలింగం 130 ఏళ్ల క్రితమే అప్పటి న్యాయవ్యవస్థలోని తప్పులను ఆధారాలతో సహా ఎండగట్టారు.
 దానికి వీరేశలింగానికి నోటీసు ఇస్తే, కోర్టుకు వెళ్లిన వీరేశలింగం తన వాదనను వినిపించారు. తప్పు చేశారని ఎవరిపైనైతే నేను రాశానో వాళ్లు నన్ను విచారించడం ఏమిటి? నాకు న్యాయవ్యవస్థ అంటే గౌరవమే కానీ కక్షదారునికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని వాదన వినిపించారు. వీరేశలింగం వాదనతో ఆ న్యాయమూర్తికి దిమ్మతిరిగిపోయిందట!
జాతీయ స్థాయిలో జన లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటుకై ఉద్యమాలు సాగుతున్న సమయంలోనే కర్నాటక లోకాయుక్త ఇచ్చిన తీర్పుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత లోకాయుక్తగా శివరాజ్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంటి స్థలం పొందడంలో అవకవతకలకు పాల్పడినందుకు చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌పాల్ పరిధిలోకి లోక్‌పాల్‌ను, లోకాయుక్త పరిధిలోకి లోకాయుక్తను సైతం చేర్చాలి అనే జోకులు వినిపించాయి అతని రాజీనామా తరువాత.
ఈ విషయాలు ఎందుకంటే సమాజంలోని తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత మీడియాది. కానీ చివరకు మీడియా తప్పులను ఎత్తిచూపడానికి ప్రత్యేకంగా ఒక చానల్ ఏర్పడుతుందేమో అనిపిస్తోంది. కొన్ని సంఘటనలను చూస్తుంటే ... తప్పు చేసిన మిరేమిట్ నన్ను ప్రశ్నించేది అని ఇప్పుడు అందరి నుండి 
 మీడియా ప్రశ్న లు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది 


చానల్స్ వార్తలను ప్రసారం చేయాలి కానీ కొన్ని చానల్స్ తామే వార్తలను సృష్టించి గందరగోళంలో పడిపోతున్నాయి . ఒక చానల్ ఆవిర్భవించడానికి ముందు ఏదైనా సెనే్సషన్ చేద్దామని ఉస్మానియా మార్చురీలో అనాధ శవాలను కొనుగోలు చేసి మూసీలో పారేసింది. శవాలు కొట్టుకొస్తున్నాయని స్టోరీ చేయడం కోసం. పోలీసుల విచారణలో అసలు వ్యవహారం బయటపడింది.

 ఇక తాజాగా ఒక చానల్- ఒక రాజకీయ నాయకుడు ఆ పార్టీ మహిళలను వేధిస్తున్నాడని, పార్టీ అధ్యక్షుడ్ని కలవాలనుకునే వారు తన వద్దకు రావాలని వేధిస్తున్నాడనేది కథ. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఆ చానల్‌కు మద్దతుగా ఒక పార్టీ రంగంలోకి దిగింది. కొత్త పార్టీకి చెందిన నాయకుడు ఒక అమ్మాయితో శృంగార భరితంగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఊ.... ఊ... అంటూ రెచ్చగొట్టే విధంగా శబ్దం చేస్తుంది తప్ప మాటల్లో ఎక్కడా దొరకడం లేదు. అతనేమో మాటలతో వీరవిహారం చేసేస్తున్నాడు. ఇది ఒక చానల్‌లో ప్రసారం అయిన కథ. కొద్ది సేపటి తరువాత ఒక అమ్మాయిని ప్రవేశపెట్టారు. కొత్త పార్టీ నాయకుడు వేధించింది ఈ అమ్మాయినే అని చెప్పించారు.
 మరి కొద్ది సేపటి తరువాత ఆ అమ్మాయి ఈ చానల్‌కు, వీరి పార్టీకి పోటీగా ఉండే చానల్‌లో ప్రత్యక్షమైంది. ఫలానా చానల్ వాళ్లు నన్ను బెదిరించి నాతో ఇలా చెప్పించారు. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండగా ఆ చానల్ వాళ్ల ఆఫీసుపై దాడి చేశాను, ఆ కేసు నుండి తప్పించాలంటే మేం చెప్పినట్టు వినాలని బెదిరించారు అనేది ఆమె కథనం. ఆమె మాటలకు ఆధారంగా కొత్త పార్టీకి అనుబంధ చానల్‌లో ఈ అమ్మాయి ప్రత్యర్థి మీడియాపై దాడి చేస్తున్నప్పటి దృశ్యాలు సైతం ప్రసారం చేశారు. ఈ వ్యవహారంపై రెండు చానల్స్, రెండు పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య రోజంతా మాటల యుద్ధం జరిగింది.
ఆ నాయకుడు అమ్మాయితో అలా మాట్లాడింది నిజమే కానీ అలా మాట్లాడింది మాత్రం టీవీలో కనిపించిన ఆ అమ్మాయితో కాదు, జగన్ పార్టీని వ్యతిరేకించే చానల్‌లోనే పని చేసే అమ్మాయితో అని వినిపిస్తోంది. ఆమె దాదాపు నెల రోజుల నుండి కొత్త పార్టీలో మగ నాయకులు పలువురికి ఫోన్ చేసి అలా మాట్లాడితే చివరకు ఒక నాయకుడు వీరి గాలానికి చిక్కాడు. 

ఐతే తమ చానల్‌లో పని చేసే అమ్మాయిని చూపించలేక దాని కోసం మరో అమ్మాయిని చూపించారు అనేది అంతర్గత చర్చల్లో నాయకులు చెబుతున్న మాటలు. చివరకు ఈ వ్యవహారం ఆరోపణ ఎదుర్కొన్న నాయకుడు, రెండు చానల్స్‌లోనూ హడావుడి చేసిన అమ్మాయి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి మానవ హక్కుల కమీషన్‌ను కలిసి చానల్ వాళ్లు తనను బెదిరించి తప్పుడు మాటలు చెప్పించారని ఫిర్యాదు చేసింది. కేసు విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో జగన్ కోసం ఒక చానల్ పని చేస్తే, టిడిపి కోసం మరో చానల్ పని చేస్తుందని బలంగా విమర్శలు వినిపించాయి. రాష్ట్రంలో మీడియా నిష్పక్షపాతం గురించి ముసుగులేమీ లేవు. ఎవరు ఎవరి పక్షమో అంతా బహిరంగమే

4 కామెంట్‌లు:

  1. దొంగ ఇంకో దొంగని చూసి దొంగ, దొంగ అని అరవడం అంటే ఇదే.

    రిప్లయితొలగించండి
  2. మీడియా అయినా ఇంకేదైనా వ్యక్తిగత ఆస్థిగా వున్నంత వరకు , వ్యక్తిగత కక్షలున్నంత వరకూ ఇలాగే వుంటాయి. మీరు చెప్పినట్టు ఈరోజు ఏ మీడియా ఎవరిదో అందరికీ తెలిసిందే . సాక్షి జగన్ ది , ఎ బి ఎన్ జగన్ వ్యతిరేకిది. అయితే అంబటి రాంబాబు శీల పరీక్షతోనో , కేవలం జగన్ పై వ్యతిరేకతతోనో సమాజాన్ని ఉద్ధరించలేమని ఆంధ్రజ్యోతి వారు గుర్తించాలి. కేవలం సెన్సేషన్ కోసమైనా , తమకు గిట్టని వారి కోసమైనా వ్యక్తిగత జీవితాలతో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయడం వ్యక్తిత్వమున్న వాల్లు చేసేది మాత్రం కాదు. ఇక తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివారి తప్పులను ఎదుర్కునేందుకు కొత్త తప్పులను చేయడం , బదాయిలు పోవడం సాక్షికి , అంబటికి తగడు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం