11, అక్టోబర్ 2011, మంగళవారం

ఢిల్లీ నేతలను హడలెత్తిస్తున్న తెలుగు చానల్స్ విపరీత వ్యాఖ్యానాలు


 

చంద్రుడిలో మచ్చ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది. శిశువుకు పాలిస్తున్న తల్లిలా కొందరికి కనిపిస్తే, త్రాచుపాములా ఒకరికి కనిపించింది. ఒక్కో కవికి చంద్రునిలో మచ్చలు ఒక్కోలా కనిపిస్తాయి. మీరు మనసులో ఒక రూపాన్ని తలుచుకుని మబ్బులను చూడండి మబ్బుల్లో అచ్చం ఆ రూపమే కనిపిస్తుంది. వినాయకుడిని తలుచుకుని అదే పనిగా మబ్బులను చూస్తే అందులో వినాయకుడి రూపం ఉన్నట్టు అనిపిస్తుంది.

 విషయం ఏమంటే ఈ మధ్య నాయకులు మాట్లాడే మాటలు మన చానల్స్‌కు సైతం అదే విధంగా వినిపిస్తున్నాయి. తమ చానల్ ఏం కోరుకుంటే నాయకుల నోటి నుండి వచ్చిన మాటలకు అదే అర్థం స్ఫురిస్తోంది. తెలుగు చానల్స్ దెబ్బకు ఢిల్లీ నాయకులు సైతం హడలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులతో చర్చించి తెలంగాణ అంశంపై హై కమాండ్‌కు ఒక నివేదిక అందజేశారు.

 ఆ నివేదికలో ఏముందో ఆయన ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. కానీ ఆయన నివేదిక ఇంకా అధిష్టానం చేతిలో పెట్టకముందే తెలంగాణపై మూడు ప్రతిపాదనలు చేశారని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ చానల్స్ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేశాయి. ఖంగుతిన్న గులాంనబీ ఆజాద్ నేను ఈరోజు తెలుగు చానల్స్‌ను కూడా చూశాను, మీ ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేశారు. నేను ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు, నేను ప్రతిపాదనలు చేశానని మీరెలా ప్రసారం చేస్తారని ప్రశ్నించి, చానల్స్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయనే కాదు చివరకు పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడని, వివాదాలకు దూరంగా ఉండే ప్రణబ్ ముఖర్జీకి సైతం తెలుగు చానల్స్ ఘాటు ఏంటో తెలిసొచ్చింది.

 ప్రతి సంవత్సరం దసరా పండుగకు సొంత గ్రామంలో గడపడం ఆయనకు అలవాటు. ఎన్‌డిటీవీ వాళ్లు ఆయన్ని గ్రామంలోనే కలిసి ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా స్టూడియోలో మాట్లాడితే శబ్దంలో క్లారిటీ ఉంటుంది. గ్రామంలో ప్రణబ్ మాట్లాడినప్పుడు శబ్దం స్టూడియోలో ఉన్నంత స్పష్టంగా లేదు. దానికి తోడు విషయం తెలంగాణకు సంబంధించింది. ఇంకేం తెలుగు చానల్స్ వీరంగం వేశాయి. అన్ని చానల్స్ కన్నా మిన్నగా ఆయన మాటలతో ఐ న్యూస్ అనువాదంలో వీర విహారం చేసింది. ప్రణబ్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం రాత్రి 9.30కి చూపిస్తారని ఎన్‌డిటీవీ వార్తల్లో కొద్ది భాగం చూపితే, ఉదయం ఎనిమిది గంటల నుండే తెలుగు చానల్స్ దీనిపై చర్చలు నిర్వహించింది. 

తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో పది రాష్ట్రాలు ఏర్పాటుకు డిమాండ్ వస్తుందని ప్రణబ్ చెప్పినట్టు ఐ న్యూస్ స్క్రోలింగ్ విడుదల చేసింది. మొదటి గంట వరకు ఇతర చానల్స్ కొంత సంయమనం పాటించాయి, ఆ తరువాత ఐ న్యూస్ తరహాలోనే ఇతర చానల్స్ కూడా విజృంభించాయి. అప్పటి వరకు తెలంగాణ సంక్లిష్టమైన సమస్య అని ప్రణబ్ చెప్పారని చెప్పిన ఇతర చానల్స్ గంట తరువాత ఐ చానల్ తరహాలోనే తెలంగాణ ఏర్పాటు చేస్తే పది రాష్ట్రాల డిమాండ్ వస్తుందని ప్రణబ్ అన్నారని చెప్పుకొచ్చాయి. ఆయా చానల్స్ తమతమ పాలసీలకు అనుగుణంగా ప్రణబ్ మాటలను తమకు తోచిన విధంగా అనువాదం చేసుకున్నాయి.

 నిజానికి ప్రణబ్ ముఖర్జీ గత 60 సంవత్సరాలుగా తెలంగాణ సమస్య ఏ విధంగా ఉందో చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రాల ఏర్పాటు అంశం, మద్రాసు ప్రెసిడెన్సీ, ముంబాయి ప్రెసిడెన్సీ తదితర అంశాల చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. ఆ మాటలు కాస్తా పరమానందయ్య శిష్యుల వంటి తెలుగు చానల్ పాలిట పడి అనేక రూపాలు సంతరించుకున్నాయి. నాలుగు వందల సంవత్సరాల నుండి రాష్ట్రాల విభజన జరగలేదట ఇది ఐ న్యూస్ చెప్పిన చారిత్రక సత్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎన్ని రాష్ట్రాలుంటే ఇప్పుడెన్ని ఉన్నాయి. అప్పటి వరకు ఆలోచించడం కష్టం అనుకుంటే పోనీ వాజ్‌పాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌డిఏ హయాంలో మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది అంటే మన తెలుగు చానల్స్ లెక్క ప్రకారం వాజ్‌పాయి నాలుగువందల సంవత్సరాల కన్నా పూర్వం ప్రధానిగా చేశారా? ఇక దేశంలో మద్రాసు, బొంబాయి రెండు ప్రెసిడెన్సీలే ఉండేవని ప్రణబ్ చెప్పారని చానల్స్ ప్రసారం చేశాయి. ఆయన చెప్పింది దక్షిణ భారతదేశంలో ఈ రెండు ప్రెసిడెన్సీలు మాత్రమే ఉండేవన్నారు, దేశం మొత్తంలో రెండని చెప్పలేదు. మన తెలుగు చానల్స్ ప్రణబ్ మాటలపై ఇంత హడావుడి చేస్తే తీరా మరుసటి రోజు ప్రణబ్ తెలుగు చానల్స్ మాటలను ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యలని, కొత్త రాష్ట్రాల డిమాండ్ వస్తుందని తానేమీ అనలేదని విలేఖరుల సమావేశంలో ఖండించారు.

 ఒకవేళ ఆయన ఆ మాటలను అని తిరిగి ఖండించారని చానల్స్ భావిస్తే, అప్పుడు ఇంటర్వ్యూలో ఆయన అన్ని మాటలు ఇవి, ఖండిస్తూ ఇప్పుడు చెప్పిన మాటలు ఇవి అంటూ రెండింటిని చూపించవచ్చు కదా? అలా చేయరు ఎందుకంటే నిజానికి ఆయన ఆ మాటలు అనలేదు కాబట్టి. తెలంగాణ సంక్లిష్ట సమస్య అని చెప్పారు తప్ప తెలంగాణ ఏర్పాటు చేస్తే సమస్యలొస్తాయని, కొత్తరాష్ట్రాల డిమాండ్ వస్తుందని తెలుగు చానల్స్ చెప్పినట్టుగా ఆయన అనలేదు. ఇక ఆ రోజు ఎన్‌టీవి ఒక అడుగు ముందుకు వేసి తమ ఢిల్లీ రిపోర్టర్‌తో అప్పటికప్పుడు విశే్లషణ చేయించారు. యుపిఎ మిత్రపక్షాల్లో మమతా బెనర్జీకి తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకత ఉందని, గుర్కాల్యాండ్ సమస్య వల్ల ఆమె వ్యతిరేకిస్తున్నారని అందుకే ప్రణబ్ అలా చెప్పారన్నారు. 

బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించగానే మమతా బెనర్జీ గుర్కాలాండ్ సమస్య పరిష్కరించుకున్నారు. అదే ఫార్ములాను ఎపికి అమలు చేస్తారా? అనే విశే్లషణలు సైతం టీవిల్లో వచ్చాయి. ఇక గతంలో స్వయంగా మమతనే విలేఖరుల సమావేశంలో తాను తెలంగాణకు వ్యతిరేకం అనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆ సమస్యతో నాకేం సంబంధం అని ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆ రిపోర్టర్‌కు గుర్తులేవో లేక ఆ సమయంలో సెలవులో ఉన్నారో కానీ అప్పటికప్పుడు ఏదో చెప్పమంటే ఇలాంటివే చెబుతారు. కానీ విషయం సున్నితమైంది, రాష్ట్రం ఉద్రిక్తతతో ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చూపాలి కానీ ఇలా సొంత కవిత్వం కలిపితే ఎలా? సోనియాగాంధీనే ప్రణబ్‌తో ఈ మాటలు చెప్పించింది అని తెలుగు చానల్స్ తేల్చిపారేశాయి. సాక్షి ఓ అడుగు ముందుకేసి రాష్టప్రతి పాలన అంటూ తేల్చేసింది. మిగిలిన చానల్స్‌కు సమైక్యం ప్రధాన సమస్య అయితే సాక్షికి వెంటనే ఎన్నికలు జరగడం అత్యవసరం.
3జి సమస్య
అసెంబ్లీ ఆవరణలోకి కెమెరాలపై నిషేధం అమలులో ఉంది. మీడియా పాయింట్‌లో సైతం అసెంబ్లీ సమావేశాలు జరిగేప్పుడే కెమెరాలకు అనుమతి. ఈ మధ్య నాగం జనార్దన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించాలని డిప్యూటీ స్పీకర్ గదిలో తమను తాము నిర్భంధించుకుని గడియపెట్టుకున్నారు. అందులో నుండి ఒక నాయకుడు 3జి ఫోన్‌తో సాక్షి చానల్ రిపోర్టర్‌కు ఫోన్ చేశాడు. అతను తన 3జి సెల్‌ఫోన్ ద్వారా డిప్యూటీ స్పీకర్ గదిలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో చానల్‌లో చూపించారు. అప్పటి వరకు వారు గదిలో ఎలా ఉన్నారో తెలియదు. 3జితో తెలిసొచ్చింది. మరి కెమెరాలను అనుమతించనప్పుడు 3జి సంగతేమిటి? 3జిపై కూడా నిషేధం విధిస్తారా? ఇదో కొత్త సమస్యనే స్పీకర్ ఇంకా దీనిపై దృష్టి సారించినట్టు లేదు.

1 కామెంట్‌:

  1. ఈ విధమైన వికారాలనే వార్తలు వండటం అంటారు.

    ఈ రోజుల్లో ఛానెల్స్ చూపించే లేదా వినిపించే వార్తలు మరుయు వార్తావ్యాఖ్యలను యధాతధంగా నమ్మేంత వెఱ్ఱిమాలోకాలు యెవరూ లేరు.

    ఎప్పుడేం జరిగినా యెప్పటికీ యేమీ జరక్క పోయినా ఆశ్చర్యం లేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం