పలు ప్రముఖ తెలుగు చానల్స్ ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఈ వారం ప్రత్యేకం. బురద చల్లుకునే వ్యవహారం చాలా కాలం నుండి సాగుతున్నా ఈ వారం మాత్రం ఈ బురద వ్యవహారం మరీ ఎక్కువ కావడమే కాకుండా ఏకంగా ‘బురద’ పేరుతోనే బురద జల్లుకునే ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశారు. మీరు వేసిన బురద మా మీద పడదు అంటూ టీవీ 9 బురద పేరుతో సాక్షిపై గురిపెడుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. సాక్షి చల్లిన బురద మాపై పడదూ అని తమకు తాము కితాబు ఇచ్చుకొంది. ఇదీ మీ బతుకు వీటికి సమాధానం చెప్పండీ అంటూ సాక్షి చానల్ టీవి 9, ఎబిఎన్ చానల్‌పై బురద జల్లింది.
సాక్షి, టీవి9, ఎబిఎన్ చానల్స్ మధ్య బురద జల్లుకునే ప్రత్యేక కార్యక్రమాలు జోరుగానే సాగాయి. మూడువేల రూపాయల జీతంతో బతికిన నువ్వు చానల్ పెట్టి, ఎస్‌ఇజెడ్ సంపాదించావు, కోట్లు కూడబెట్టావు అని ఒక చానల్ భాగస్వామిని మరో చానల్ వాళ్లు విమర్శించారు. సాధారణ జర్నలిస్టుగా ఉన్న నువ్వు బాబు అండతో కోట్లు సంపాదించి చానల్ పెట్టావని ఒకరిని విమర్శించారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించి అవినీతి డబ్బుతో చానల్ పెట్టావని ఒకరిని విమర్శించారు. ఎవరు ఎవరిని ఏమని తిట్టుకున్నా తెలుగు చానల్స్ చరిత్ర తెలుగు ప్రజలకు బాగానే తెలిసిపోయింది. ఏ చానల్ ఏ పార్టీదో అని పెద్దగా రాజకీయాలు తెలియని వారికి సైతం సులభంగా తెలిసిపోవడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగానే ఉపయోగపడతాయి.
టీవీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాల వల్ల సమయం వృధా అవుతుందనే విమర్శతో ప్రారంభ కాలంలో టీవీలను ఇడియట్ బాక్స్ అని విమర్శించారు. కార్యక్రమాలు నచ్చకపోతేనే ఏకంగా ఇడియట్ బాక్స్ అని తిట్టుకున్న వారు ఇప్పుడు మన తెలుగు చానల్స్ బురద జల్లుకోవడాన్ని, పరస్పరం తిట్టుకోవడాన్ని చూస్తే ఏమనేవారో? సరే ఇంగ్లీష్ చానల్స్‌ను ఇడియట్ బాక్స్ అని వాళ్లు పిలుచుకుంటే తెలుగు చానల్స్‌ను మనం బురదగుంట అని చెప్పుకోవచ్చునేమో! దీనికి చానల్స్ అభ్యంతరం కూడా ఉండదు, ఎందుకంటే ఆ పేరుతో వారే స్వయంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తుంటే వారికి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు.
తెలుగు చానల్స్ వ్యవహారంపై జీ తెలుగులో చక్కని ప్రకటనలు వస్తున్నాయి. తోలుబొమ్మలను ఆడించినట్టుగా రాజకీయ నాయకులు టీవీలను కంట్రోల్ చేయడంపై జీ ప్రసారం చేస్తున్న ప్రకటనలు రాష్ట్రంలో చానల్స్ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. అనేక చానల్స్‌ను రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరికీ కొమ్ముకాయని చానల్ అని జీ తన గురించి తాను చెప్పుకుంది. మెజారిటీ తెలుగు చానల్స్ యాజమాన్యం తెలుగు వారే. వారికి అభిమాన పార్టీ, అభిమాన సామాజిక వర్గం, అభిమాన ప్రాంతం ఉంటుంది. వర్గ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా అవి వ్యవహరిస్తున్నాయి. జీ చానల్ తెలుగువారు కాదు దాంతో ఈ అనుబంధ విభాగం జంఝాటం ఆ చానల్‌కు లేదు. చానల్‌లో పని చేసే కొందరు తమతమ ఇష్టాయష్టాలకు అనుగుణంగా కొంత మొగ్గు చూపవచ్చు కానీ మొత్తం మీద మిగిలిన చానల్స్‌తో చానల్ స్టైల్ వేరు.
తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ ఇళ్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారని, తెలంగాణ స్ట్రగుల్ కమిటీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు, గవర్నర్ విచారణకు ఆదేశిస్తానని చెప్పినట్టు దీపావళి రోజున పలు చానల్స్ బ్రేకింగ్ న్యూస్ పేరుతో హడావుడి చేశాయి.
తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ ఇళ్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారని, తెలంగాణ స్ట్రగుల్ కమిటీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు, గవర్నర్ విచారణకు ఆదేశిస్తానని చెప్పినట్టు దీపావళి రోజున పలు చానల్స్ బ్రేకింగ్ న్యూస్ పేరుతో హడావుడి చేశాయి.
మరుసటి రోజు ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్‌ను ఈ ఫిర్యాదు గురించి విలేఖరులు ప్రశ్నించగా, తనకెవరూ ఫిర్యాదు చేయలేదని, ఒక్క రోజులోనే మరిచిపోయేంతగా మతిమరుపేమీ తనకు లేదని చెప్పారు. ఫిర్యాదు చేశారని, గవర్నర్ విచారిస్తామన్నారనే దానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చిన వారు, గవర్నర్ చెప్పిన దాన్ని పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీ చానల్ సీమాంధ్ర డబ్బాలు అంటూ ఎబిఎన్, ఎన్‌టీవీలను విమర్శించింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే వార్తను ప్రసారం చేసిన వారు, పొరపాటు జరిగితే తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదా? వివిధ, సంస్థలు, పార్టీలు ఒక అంశాన్ని చెప్పినప్పుడు ప్రసారం చేయడం సహజమే, అయితే అది వారి పేరుతో కాకుండా సొంత వార్త అన్నట్టుగా ప్రసారం చేసినప్పుడు దానికి వివరణ ఇచ్చుకోవలసిన అవసరం లేదా? లేక అది నిజమే అని భావిస్తే గవర్నరే తప్పు చెబుతున్నాడు, తమకు వచ్చిన సమాచారం నిజమైనదే అని ప్రసారం చేసుకోవచ్చు కదా!
ఆర్టీసి ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతున్నప్పుడు వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెడుతోంది. గతంలో గరుడ అని పేరు పెట్టారు. ఇప్పుడు కొత్త వాహనాలకు ఇంద్ర అని పేరు పెట్టారు. దీనికి ఎన్ టీవి వాళ్లు అల్లిన కథ సినిమా కథలా ఉంది. రవాణా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ. ఆయన చిరంజీవిని మంచి చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఈ ప్రయత్నాల్లో భాగంగా కొత్త వాహనాలకు ఇంద్ర అని పేరు పెట్టారు. ఇంద్ర అంటే చిరంజీవి నటించిన సినిమా పేరు. త్వరలోనే స్టాలిన్, ఖైదీ అనే పేర్లను బస్సులకు పెట్టి చిరంజీవిని ప్రసన్నం చేసుకుంటారట! ఇది ఎన్‌టీవి అద్భుత తెలివి తేటలను చాటిచెబుతున్న ప్రత్యేక వార్త.
సి నారాయణరెడ్డి తెలుగు జాతిపాట - తెలంగాణా మాట
సాక్షి లిజెండ్స్‌లో పాత తరం సినిమావారి పరిచయాలు చాలా బాగుంటున్నాయి. డాక్టర్ సి నారాయణరెడ్డి జ్ఞాపకాలు పంచుకున్నారు. స్వప్న తెలుగుజాతి మనది పాటను చాలా ఉత్సాహంగా ప్రస్తావించారు. సమైక్యాంధ్ర వాదానికి జాతీయ గీతం అన్నంతగా గుర్తింపు పొందిన పాట ఇది. ఎంత కాలానికి విన్నా ఈ పాట అద్భుతంగా ఉంటుంది అంటూ స్వప్న ఈ పాటను ప్రస్తావించారు. స్వప్న ఉత్సాహాన్ని నారాయణరెడ్డి ప్రారంభంలోనే తుంచేశారు. ఒక సందర్భాన్ని చెప్పి దానికి తగ్గట్టు పాట రాయమని అడిగారు. ఇది నేను ఆ సందర్భం కోసం రాసిన పాట మాత్రమే. కానీ వ్యక్తిగతంగా ఆ పాటలోని అంశంపై నాకు నిబద్ధత లేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సి.నారాయణరెడ్డి ఇంకా ఏం చెప్పారో కానీ మధ్యలోనే నిలిపివేశారు. ఇదేమీ వార్తలకు సంబంధించిన కార్యక్రమం కాదు. నారాయణరెడ్డి పాటల పరిచయానికి సంబంధించిన కార్యక్రమమే. అందులో ఇలాంటి అంశాలు ప్రస్తావించ వచ్చునా? లేదా ? అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ప్రస్తావించినప్పుడు ఆయన అభిప్రాయం సంపూర్ణంగా ప్రసారం చేయాల్సిన అవసరం లేదా? ఆ పాటలోని అభిప్రాయాల పట్ల తనకేమీ నిబద్ధత లేదు అని ఆయన చెప్పినప్పుడు ఎందుకు? ఆ పాట ఏ పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది, ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? అని అడగాల్సిన అవసరం లేదా? ఒకవేళ ఆయన పాటలోని అంశాలకు కట్టుబడి ఉన్నానంటే కొనసాగించేవారేమో అనిపించింది. నాలుగు దశాబ్దాల క్రితం ప్రత్యేక ఉద్యమాల సమయంలో పాట రాయించారు. అప్పుడు రాష్ట్ర విభజనపై ఆయన అభిప్రాయం ఏమిటో కానీ ఇప్పుడు మాత్రం ఆయన పలు సందర్భాల్లో రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి బతకాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమం ఊపందుకోని సమయంలోనే ఆయన త్యాగరాయ గాన సభలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో చెప్పారు. అయితే అది పెద్దగా ప్రచారంలోకి రాలేదు.
బుద్దా మురళి గారు,
రిప్లయితొలగించండిమన దేశం లో ప్రతి అరవై కిలో మీటర్లకి బాష, తినేతిండి లో మార్పులు ఉంటాయని ఒక చోట చదివాను. భారత దేశ సంస్కృతి ఎక్కడికక్కడ ప్రాంతాల కనుగుణం గా విభిన్నమైనది. తెలంగాణా సంస్కృతి, ఏవిధంగా హిందూ సంస్కృతి కన్నా విభిన్నమైనది? ఆంధ్రా హిందువులు దానిని ఏవిధంగా నాశనం చేస్తున్నారని, తెలంగాణా వారు పరిరక్షించూకోవాలనుకొంట్టున్నారు?
వాళ్ళు అన్ని వెధవ్వేషాలేస్తున్నా మన జనాలకి బుధ్ధొచ్చి చూడ్డం మానడంలేదన్నమాట. సంతోషం.
రిప్లయితొలగించండిసినారె గారి విషయంలో మీరన్నది నీజమే. అందర్నీ విమర్శించే చానళ్ళు తమదాకా వచ్చేసరికి అలా ప్రవర్తించడం ఇంతకుముందుకూడా చాలాసార్లు జరిగిందేకదా.
తెలుగో అంటూ బాధపడిపోయే మనకి తెలుగు యాజమాన్యాలు చేస్తున్న చానళ్ళసేవ బాగా వివరించారు.
రామ గారు నాశనం చేస్తున్నారు అంటూ మీరు రాసిన కొన్ని పదాలు నా వ్యాసం లో లేవు . మీ ఉద్దేశం విశ్వమానవ భావన ఏర్పడాలని అయితే. ఆలాంటి రోజు వస్తే మంచిదే
రిప్లయితొలగించండిఇలాంటి ఛానళ్ళని తెలుగులో "డబ్బా ఛానళ్ళు" అనవచ్చునేమో?
రిప్లయితొలగించండిమురళిగారు..
రిప్లయితొలగించండితెలుగు వార్తా పత్రికలు, చానెళ్ళు చాలా పూర్ కంటెంట్ తో రావటం అందరికీ తెలిసిందే!
పచ్చళ్ళు, గనులు, రియల్ వ్యాపారుల నుండి ఇంతకన్నా ఆశించలేం!
పెరుగుట విరుగుట కొరకే.
నేను మాత్రం అప్పుడప్పుడు వినోదం కోసం ఈ వార్తా చానెళ్ళు చూస్తుంటాను.
మంచి పోస్ట్ రాశారు.
అభినందనలు.
i am sorry sir as you said z telugu news is a not transferent channel. Even it is a dirty chanel among all. electronic media is showing a wrong way to the public why we are not considering wether it is right or wrong ?
రిప్లయితొలగించండి