27, జనవరి 2012, శుక్రవారం

అధికారం లో ఉన్నప్పుడు బుర్ర పని చేయదు. కళ్ళు కనిపించవు . అందుకే ఉద్యమాల గోడు వినిపించదు ... వస్త్ర వ్యాపారుల9 రోజుల బంద్ .



వారం రోజుల బంద్ అంటూ సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల గురించి వింటుంటాం. ఢిల్లీలో చీమ చిటుక్కుమన్నా, ముంబాయిలో హీరోయిన్ గర్భవతి అయినా గంటల తరబడి జాతీయ చానల్స్ మొత్తం స్పందిస్తాయి. ఎక్కడో మూలపడేసినట్టు ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి రెండు వారాలు కాదు ఏకంగా నెలల పాటు బంద్ జరిగినా మనకు పెద్దగా పట్టదు. కానీ ఇప్పుడు చివరకు మన రాష్ట్రంలో సైతం సరిగ్గా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజుల బంద్‌కు వస్త్ర వ్యాపారులు పిలుపు ఇచ్చారు. నాలుగు రోజుల నుండి బంద్ పాటిస్తున్నారు. వారి డిమాండ్లలో న్యాయం ఉందా? లేదా? డిమాండ్ ఆమోదిస్తే లాభమెంత? నష్టమెంత అనే చర్చ తరువాత విషయం. ముందు వారి బంద్‌పై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

 బట్టలపై ఐదు శాతం వ్యాట్ విధించడాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలల నుండి వస్త్ర వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడంతో ఏకంగా తొమ్మిది రోజుల పాటు బంద్‌కు పిలుపు ఇచ్చారు. సోమవారం నుండి రాష్ట్రంలో వస్త్ర వ్యాపారుల బంద్ సాగుతోంది. ఏ ఒక్క మంత్రి స్పందించలేదు, ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. రాజధాని నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వస్త్ర వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. ఏకంగా రాజధానిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సోమవారం నుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు జరుపుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ వస్త్రాలపై వ్యాట్ విధించడం లేదు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రం ఐదు శాతం వ్యాట్ విధిస్తున్నారు. ఏ వస్తువుపై పన్ను ఉన్నా దాన్ని భరించాల్సింది చివరకు వినియోగదారుడే. మన కన్నా ముందు ఒరిస్సా, జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో వస్త్రాలపై వ్యాట్ విధించారు. అయితే వస్త్ర వ్యాపారులు వ్యతిరేకించడంతో వారి వాదనను మన్నించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను రద్దు చేశాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎంత తీవ్ర స్థాయిలో వస్త్ర వ్యాపారులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.

 తొలుత జివో ఎంఎస్ నంబర్ 932 ద్వారా వస్త్రాలపై రాష్ట్రంలో 8.7.2011న నాలుగు శాతం వ్యాట్ పన్ను విధించారు. దీన్ని వస్త్ర వ్యాపారులు వ్యతిరేకించారు. అనంతరం ప్రభుత్వం 14.9.2011 నుంచి ఐదు శాతానికి పెంచింది. ఐదు శాతం వ్యాట్ వల్ల ఏటా కనీసం ప్రజలపై 14వందల కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా వస్త్రాలపై వ్యాట్ లేనప్పుడు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే విధించడం వల్ల రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందనేది వీరి ఆందోళన. వ్యాట్‌ను వ్యతిరేకిస్తూ వస్త్ర వ్యాపారులు చేస్తున్న వాదన కూడా సహేతుకంగానే ఉంది. దేశంలో ఎక్కడా లేనప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే వ్యాట్ విధిస్తే, మన వస్త్ర వ్యాపారం పొరుగు రాష్ట్రాలకు తరలి వెళుతుంది. మన రాష్ట్రానికి సరిహద్దుల్లో తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వ్యాట్‌పై పన్ను లేదు. సమీపాన ఉన్న వారు మన రాష్ట్రంలో కన్నా ఈ రాష్ట్రాల్లో వస్త్రాలు కొనుగోలు చేయడం మంచిదనుకుంటారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన మద్రాసు, బెంగళూరు, భువనేశ్వర్‌లలో మన వారు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వ్యాట్ వల్ల ఇది మరింతగా పెరగవచ్చు. అంతే కాకుండా వస్త్రాల వ్యాపారం అనేది ప్రధానంగా అరువుపై సాగుతుంది. వస్త్రాలు ఉత్పత్తి చేసే వారి నుండి వినియోగదారునికి చేరే వరకు అనేక దశలు ఉన్నాయి. అరువుపై కొనుగోలు జరిగినప్పుడు అక్కడ నగదు అనేది లేకపోయినా మేం ముందు వ్యాట్ చెల్లించాలి ఇదెక్కడి చోద్యం? అనేది వస్త్ర వ్యాపారుల వాదన. ఉత్పత్తి అయిన వస్త్రాల్లో 70 శాతం వరకు రెడిమేడ్ వస్త్రాల తయారీకి ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ వస్త్రాలపై వ్యాట్ ఎలాగూ ఉంది. ఇక 30 శాతం మాత్రమే బట్టలు కుట్టించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వ్యాట్ విధించేది వీటిపైనే. పెద్దగా చదువు లేని సంప్రదాయ వ్యాపార కుటుంబాల వారే వస్త్ర వ్యాపారంలో ఉంటున్నారు, వీరికి ఈ మాత్రం ఉపాధి కూడా లేకుండా చేస్తారా? అని వస్త్ర వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే రెండు లక్షల మంది వస్త్ర వ్యాపారులు ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్త్ర వ్యాపారం ద్వారా 20లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని వీరు చెబుతున్నారు. వ్యాట్ ద్వారా ఇలాంటి వస్త్ర వ్యాపారుల జీవితాలను ప్రమాదంలో పడేశారని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోమ దయానంద్ చెబుతున్నారు.
అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని కలిశారు. వీరి ఉద్యమానికి టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులంతా మద్దతు ప్రకటించారు. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ధర్నా చేయనున్నారు. ప్రభుత్వం చివరకు శవం మీద కప్పే బట్టల నుండి కూడా పన్నులు వసూలు చేయాలనుకుంటోంది అని సిపిఐ కార్యదర్శి నారాయణ ఘాటుగానే స్పందించారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీలో నిలదీస్తామని టిఆర్‌ఎస్ ప్రకటించింది. వీరి బంద్‌కు టిడిపి మద్దతు ప్రకటించింది. వ్యాట్ ద్వారా ప్రజలపై 14 వందల కోట్ల రూపాయల భారం పడుతుందని సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రూపాల్లో ఆందోళన సాగించిన తరువాత కూడా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో చివరకు వస్త్ర వ్యాపారులు తొమ్మిది రోజుల బంద్‌కు పిలుపు ఇచ్చారు.
వరుసగా నాలుగు రోజుల నుండి బంద్ పాటిస్తూ, మరో ఐదు రోజుల పాటు బంద్ నిర్వహించాలని ప్రకటించినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం గమనార్హం.
ఒకవైపు అడగకపోయినా ప్రభుత్వం ఉచిత పథకాలు ప్రకటిస్తోంది. ఉచిత పథకాలు నిజంగా అవసరమా? అనే ఆలోచన కన్నా వాటి ద్వారా ఏ మేరకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేదే పాలకుల ఆలోచన. అడక్కపోయినా ఉచిత పథకాలు ఒకవైపు.. నడ్డివిరిచే పన్నులు మరోవైపు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తన మార్కు పథకం కోసం కిలో రూపాయి బియ్యం ప్రకటించారు. మరోవైపు ఏడాది కాలంలోనే అదనంగా దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు పన్నులు విధించారు.
తొమ్మిది రోజులు కాదు రెండు నెలల పాటు బంద్ జరిపినా వస్త్ర వ్యాపారులు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోవచ్చు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వీళ్లకేం అసెంబ్లీలో ఓటు ఉండదు. అధిష్ఠాన వర్గం వద్ద పలుకుబడి ఉండదు. వస్త్ర వ్యాపారులే కాదు, సమాజంలో ఎవరిలోనైనా ఏర్పడే తీవ్రమైన నిస్పృహ,ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదు, ఎవరికైనా అధికారం పోయాక తెలుస్తుంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసి కార్మికులు ఆరువారాల పాటు సమ్మె జరిపారు. జీతంపై బతికే కార్మికులు ప్రభుత్వంతో ఎంత కాలం పోరాడుతారు? మేమూ చూస్తాం, వాళ్లే తోక ముడిచి తిరిగి ఉద్యోగంలో చేరుతారు అని అప్పటి పాలకులు ధీమాగా ఉన్నారు. వారి ఉద్యమాన్ని అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఊహించినట్టుగానే చివరకు ఎలాంటి డిమాండ్లను ఆమోదించకపోయినా వారు ఉద్యోగంలో చేరారు. కానీ ఎన్నికలు వచ్చే సరికి దాదాపు లక్షమందికి పైగా ఆర్టీసి కార్మికులు కాంగ్రెస్ పార్టీకి ఆయాచిత వరంగా లభించారు. అప్పటి ప్రభుత్వం ఓటమి కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. అసెంబ్లీలో ఓటింగ్‌తో ఫలితం అప్పటికప్పుడు తేలిపోతుంది, కానీ ప్రజల్లో వచ్చే తీవ్ర వ్యతిరేకత ఫలితం చూడాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
డిమాండ్లతో ఉద్యమించే వారు ఏం చేస్తారు అనే అహంకారం ప్రభుత్వానికి పనికి రాదు. ప్రభుత్వం మరీ మొద్దుబారిపోతోంది. ఎవరు ఆందోళన చేసినా, ఎవరు ఉద్యమించినా పట్టించుకునే స్థితిలో లేదు. వ్యాపారం చేసుకుని బతికే వారు, ఉద్యోగం చేసుకుని బతికే కార్మికులు, ప్రజలు ఎంత కాలం ఉద్యమిస్తారు? అనే ధీమా ప్రభుత్వానిది. ప్రభుత్వాన్ని ఢీ కొనేంత బలం ఒక కార్మిక సంఘానికో, వ్యాపారులకో, విడివిడిగా ఉండే ప్రజలకో ఉండకపోవచ్చు. కానీ అసంతృప్తి చిన్నచిన్నగా మొదలై చివరకు అది పాలకులను గద్దె దించి అడ్రస్ లేకుండా చేసేంతగా బలపడుతుందనే విషయం పాలకులు గ్రహించాలి. అలా గ్రహిం
ని వారు ఏమయ్యారో గుర్తుకు తెచ్చుకోనైనా మారాలి. ఎట్టి పరిస్థితిలోను వ్యాట్‌ను రద్దు చేసేది లేదంటూ ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించడం సరికాదు. కనీసం వారిని చర్చలకైనా పిలిస్తే వారికున్న ఇబ్బందులు ఏమిటి, ప్రభుత్వానికి ఉన్న సమస్యలు ఏమిటి అన్నది పరస్పరం తెలుసుకునే అవకాశమైనా లభిస్తుంది .

2 కామెంట్‌లు:

  1. తెలుగుదేశం పార్టి ఉద్యోగుల విషయంలో ప్రవర్తించినట్లు ఎవ్వరు ప్రవర్తించలేదు. వీరి పాలనలో ఎంతో మంది ప్రభుత్వోద్యుగులు గుండెపోటు తో చనిపోయారు. అధికారం లో ఉన్నప్పుడు వీరు చాలా నిజాయితిపరులైనట్లు, ఉద్యోగులే అవినితికి కారణం అయినట్లు వారిని పీడీంచారు, సోది లో లేకుండా పోయారు. ఇప్పుడు మీడీయా వలన ఆరోజుల్లో వీరు ఎలా వెనకేసారో చదువుతూంటే, ఏ మొరల్ రైట్ తో, వీరు ఉద్యోగులను అవినితి పరులని భావించి, అందరి ప్రజల ముందు అలా ఎలా తిట్టే వారో అర్థం కాదు. ఆరోజుల్లో వీరి తిట్ల వలన కొంతమంది ఇంజనీర్లు గుండేపోటు తో చనిపోయారు. ఇప్పుడు నేను మారాను అని ఊర్లు పట్టుకొని తిరుగుతున్నా, ఆయన చేసిన తప్పులను ప్రజలు బాగా గుర్తుంచుకొని, మీటీంగులకు వస్తారు ఓట్లు మాత్రం వేయరు. ఇంత అగమ్యగోచరంగా భవిషత్ తయారవుతుందని ఆ పార్టి వారు ఎప్పుడు కలగని ఉండరు. కొన్ని జిల్లాలో ఐతే ఈ పార్టిని పట్టించుకొనే వారేవరైనా ఉన్నారా అని అనిపిస్తుంది. ఇలానే అహంకారం గా వ్యవహరిస్తే కాంగ్రెస్ వారికి కూడా అదే శాస్తి జరుగుతుంది. ఓట్లు యువనేత తన్నుకు పోతాడు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం