31, జనవరి 2012, మంగళవారం

హిందీ చానల్స్ రియాల్టీ షో లో హీరోలు .. తెలుగు టీవిలో రాణిస్తున్న కమేడియన్లు




హిందీ చానల్స్‌లో పలువురు హీరోలు పలు రియాల్టిషోలను విజయవంతంగా నిర్వహిస్తుంటే, తెలుగులో మాత్రం కమెడీయన్లు ఈ పాత్రను పోషిస్తూ, పలు తెలుగు చానల్స్‌లో సందడి చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు లేని వారు టీవి వైపు చూడడం కాదు. సినిమా రంగంలో నంబర్ వన్‌గా నిలిచిన వారు సైతం హిందీలో టీవిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమితాబ్ మొదలుకొని షారుఖ్ ఖాన్ వరకు చాలా మంది ప్రముఖ హీరోలు హిందీలో చిన్నతెరపై కనిపిస్తున్నారు. కనీసం టీవి రియాల్టీ షో లోనైనా భేషజాలు లేకుండా హీరోలు ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటున్నారు. కలిసి నృత్యం చేస్తున్నారు, హిందీ హీరోలు కామెడీ పండిస్తున్నారు.
తెలుగు చానల్స్‌కు విషయానికి వస్తే, ధర్మవరపు సుబ్రమణ్యం బాటలో మరి కొందరు కమెడియన్లు టీవిల్లో కార్యక్రమాల్లో బాగానే రాణిస్తున్నారు. ఎవిఎస్, అలీ, శివారెడ్డి టీవిల్లో హడావుడి చేస్తున్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం కన్నా చాలా ముందే హాస్యనటి శ్రీలక్ష్మి టీవిలో కొద్ది రోజులు ఇలాంటి కార్యక్రమానే్న నిర్వహించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత ఆమె కొంత కాలం కనుమరుగై టీవిలో దర్శన మిచ్చారు. కార్యక్రమంలో కామెడీని బాగానే పండించారు. మళ్లీ ఎందుకో కనిపించకుండా పోయారు. ఆ తరువాత సాక్షిలో ధర్మవరపు సుబ్రమణ్యం డింగ్ డాంగ్ బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు చానల్‌కు ఉన్నా, తనకున్న పరిధిలో కార్యక్రమాన్ని బాగానే రూపొందిస్తున్నారు. ఐ న్యూస్‌లో హాస్యనటులు ఎవిఎస్ న్యూసెన్స్ అంటూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎవిఎస్ హాస్యనటునిగా సినిమా రంగం ప్రవేశానికి ముందు జర్నలిస్టు. సహజంగా ఒకసారి జర్నలిస్టు అయిన వారికి ఆ వాసనలు పొమ్మన్నా పోవు. ఆయన టీవిలో నిర్వహిస్తున్న న్యూసెన్స్‌లో సైతం ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ తరహాలో కాకుండా ఒక హాస్యనటుడు నిర్వహించే కార్యక్రమంలో ప్రేక్షకులు మరింత వినోదాన్ని కోరుకుంటున్నారు. దాని కోసం ఎవిఎస్ ప్రయత్నిస్తే బాగుంటుంది. 

శివారెడ్డి జీ తెలుగులో చిత్తం ప్రాయశ్చిత్తం అంటూ కొంత హడావుడి చేస్తున్నారు. ఒక సినిమాలో అలీ చెప్పిన కాట్రవెల్లి అనే చిత్రమైన మాట బాగా పాపులర్ అయింది. అదే పేరుతో అలీ కార్యక్రమం సాగుతోంది. తెలుగువారిలో హస్య ప్రియత్వం తక్కువ అనే అపవాదు ఉంది. కానీ తెలుగులో వచ్చినన్ని హాస్య ప్రధానమైన సినిమాలు మరే భాషలోనూ రాలేదు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హాస్యనటులుగా ఒక వెలుగువెలిగారు. తరువాత ఆ వారసత్వాన్ని అల్లరి నరేష్ అందిపుచ్చుకున్నారు. చివరకు ఇప్పుడు మహేష్ లాంటి హీరో సైతం కామెడీ నటనతో హీరోయిజాన్ని పండించక తప్పని పరిస్థితి. సినిమాల్లో హాస్యం విషయంలో చాలా ముందున్న మనం టీవిలకు వచ్చే సరికి చాలా వెనకబడి ఉన్నాం. హిందీలో కెబిసి, బిగ్‌బాస్ తరహాలో హాస్య కార్యక్రమాలకు పాపులారిటీ ఉంది. హిందీలో కామెడీ ప్రొగ్రామ్‌ను చూసి ఒకటి రెండు తెలుగు చానల్స్ జోక్స్ చెప్పే కార్యక్రమాన్ని రూపొందించినా, జోక్స్ చదవడం వేరు కామెడీ ప్రొగ్రాం వేరు అని గ్రహించకుండా కార్యక్రమాలు రూపొందించడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇప్పుడిప్పుడే తెలుగు కమేడియన్లు టీవి కార్యక్రమాల్లో రాణిస్తున్నారు. హీరోల పరిస్థితి మాత్రం వేరుగా ఉంది.
మన తెలుగు హీరోలది మాత్రం ఎవరి సామ్రాజ్యం వారిదే, వారి సామ్రాజ్యంలో వారే రారాజులు, ఇంకో హీరో పొడ వారికి గిట్టదు. ఇటీవల ఇద్దరు మాజీ ప్రముఖ హీరోలు తిట్టుకుంటున్న మాటలను వింటుంటే మన హీరోల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. చివరకు తెలుగు సినిమా పండగ నిర్వహించినా అక్కడ కీచులాట తప్పలేదు. కులాల వారీగా, కుటుంబాల వారీగా, పార్టీల వారీగా మన హీరోలు విడిపోయారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కనీసం గతంలో ఫలానా హీరో అంటే నాకెంతో అభిమానం మా సినిమా వాళ్లం అంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాం అనే చిలకపలుకల ఇంటర్వ్యూలు పత్రికల్లో కనిపించేవి. ఇప్పుడు టీవిల పుణ్యమా అని వీరి అనుబంధం ఎంత మధురమైనదో, ఉమ్మడి కుటుంబం మాదిరిగా ఎలా కలిసిమెలిసి ఉంటారో చూసే భాగ్యం లభించింది. ఈ వారం బాలకృష్ణ చిరంజీవిల స్టార్ వార్‌కు టీవిలు ప్రాధాన్యత ఇచ్చాయి. బాలకృష్ణ తొడ గొడుతూ, వాడెవడో నన్ను చిన్నపిల్లాడు అన్నాడు... మా నాన్న కాలి గోటికి సరిపోడు అంటూ సినిమా డైలాగులు వినిపించారు. అబ్బే మా సినిమా వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవు, అదంతా మీడియా సృష్టి, బాలకృష్ణ, చిరంజీవి మంచి మిత్రులు అని సినిమా పెద్ద మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తిట్టినప్పుడు అన్ని చానల్స్ ఆ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చాయ. ప్రాయోజిత కార్యక్రమమో, పెయిడ్ న్యూసో విషయం తెలియదు కానీ బాలకృష్ణ వీరాభిమాని రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం తరహాలో ఉంది ఎన్ టీవిలో బాలకృష్ణపై శనివారం ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం. ఆయన దూకుడుగా వెళుతున్నారు, ఆచితూచి వెళుతున్నారు, తెలంగాణలో సైతం తిరిగేందుకు సిద్ధం అని చెప్పడం ద్వారా తాను ఎంత దూకుడుగా ఉన్నది స్పష్టమవుతోంది అని పొగడ్తలతో ముంచెత్తారు. మా తండ్రి కాలి గోటికి సరిపోడు, వాడు వీడు అనడం ఆచితూచి మాట్లాడడమా? దూకుడంటే ఇదేనా? ఎన్‌టివి వారికే తెలియాలి. ఎవరేమన్నా అదే స్థాయిలో స్పందించే బాలకృష్ణ లక్ష్మీపార్వతి విషయంలో మాత్రం దూకుడుగా వ్యవహరించలేదు అభినందించారు. దూకుడుగా మాట్లాడినా వీరికి ముచ్చటేస్తుంది, మాట్లాడకపోయినా ముచ్చటేసిందన్నమాట! టిడిపి వర్గాలు సమాచారం ప్రకారమే బాలకృష్ట గురించి చిరంజీవి మామూలుగానే మాట్లాడుతూ చిన్నపిల్లల మనస్తత్వం అన్న దానికి బాలకృష్ణ అదే విధంగా సెటైర్‌గా మాట్లాడితే సరిపోయేది, వ్యక్తిగతంగా దూషణకు దిగాడనే అభిప్రాయం ఏర్పడింది అని టిడిపి నాయకులే చెబుతున్నారు. బహుశా ఇలాంటి అభిప్రాయం ఏర్పడడంతో పాజిటివ్ ప్రచారం కోసం ప్రయత్నాలు సాగించినట్టుగా ఉంది, దానిలో భాగంగానే ఈ ప్రత్యేక కథనం వచ్చిందేమో! అయితే సినిమా వాళ్లకు సంబంధించి ఏది స్పాన్సర్డ్ ప్రోగ్రామో, ఏది టీవి వాళ్లు రూపొందించిన కార్యక్రమమో తెలియదు. వారే చెబితే బాగుంటుంది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ సిగరెట్‌పై కనిపించీ కనిపించకుండా ముద్రించినట్టుగా కనీసం చిన్న అక్షరాలతో స్పాన్సర్డ్ ప్రోగ్రాం అని వేసే ప్రయత్నం చేయాలి
.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం