ఒక జర్నలిస్టు ఆక్రోశం
-మురళి, January 22nd, 2012
ఒక హిందువు నేను హిందువును ఎట్లయితా? అని ప్రశ్నిస్తూ పుస్తకం రాసినప్పుడు సహజంగా ఆ పుస్తకం ఆసక్తి రేపుతుంది. అదే మార్గంలో ఇప్పుడో జర్నలిస్టు నేను జర్నలిస్టునేనా? అంటూ పుస్తకం ప్రచురించారు. ఒక పాఠకుడిగా పుస్తకం చదివినప్పుడు జర్నలిస్టుల్లో నైతిక విలువల కోసం రచయిత తపిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. మీడియా సంస్థలు, జర్నలిస్టులు వ్యక్తిగతంగా తమతమ ఖాతాల్లో విశ్వసనీయత బ్యాలెన్స్ ఏ మేరకు ఉందో బేరీజు వేసుకోవాలని రచయిత సూచించారు. మంచిదే మరి జర్నలిస్టుల నైతిక విలువల గురించి ప్రశ్నలు లేవనెత్తిన రచయిత విశ్వసనీయత బ్యాలెన్స్ గురించి ఆలోచించారా? ఈ రచనలో సందర్భాను సారం నేను అక్కడక్కడా చేసిన కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు మీడియాతో ప్రత్యక్ష పరోక్ష, సంబంధాలున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వ్యవస్థలు, అధికారులను బాధిస్తాయని తెలిసినా, రోగి క్షేమం దృష్ట్యా ధైర్యం చేసినట్టు రచయిత ముందుమాటలోనే చెప్పారు.
జర్నలిజంలోనే కాదు ఏ రంగంలోనైనా విలువలు ముఖ్యం. అన్ని రంగాల్లోనూ విలువలు పడిపోతున్నాయి. స్వాతంత్య్ర పోరాటం కాలం నాటి పత్రికల్లోని విలువలను ఇప్పుడు ఆశించడం అత్యాశే అవుతుంది. అప్పుడు పత్రికలు స్థాపించే వారు, అందులో పని చేసే వారు ఒక ఉన్నత లక్ష్యంతో ఆ పని చేశారు. మీడియా ఇప్పుడు లాభసాటి వ్యాపారం. మారిన పరిస్థితులను అర్థం చేసుకున్న వారు మార్కెట్‌లో నిలబడతారు లేదంటే కాలగర్భంలో కలిసిపోతారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన వారు దేశం కోసం మీడియాను నడుపుతారని, నడుపుతున్నారని అనుకుంటే అమాయకత్వం అవుతుంది.
జర్నలిస్టులకు నైతిక విలువ గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించిన జర్నలిస్టు రచయిత వ్యాపార కోణంతో ఆలోచించినప్పుడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే యజమాని ఆలోచన ఏ రీతిలో ఉంటుంది. నైతిక విలువల ఆవశ్యకత వివరించిన 130 పేజీల పుస్తకంలో 10 నిండు పేజీల వ్యాపార ప్రకటనలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ప్రకటనలు ప్రభుత్వ సంస్థలవి, రెండు ప్రైవేటు వారివి. బ్యాక్ కవర్ కలర్ ప్రకటన ప్రభుత్వానిదే. ఒక దిన పత్రిక ఇంత పెద్ద సంఖ్యలో ప్రకటనలు సాధిస్తుందేమో కానీ ఒక పుస్తకానికి ఇన్ని ప్రకటనలు సంపాదించడం సామాన్యం కాదు. అందుకే ఈ రచయత సామాన్య జర్నలిస్టు కాదు. 12వ పేజీలో ప్రకటనల గురించి రచయిత ఒక చక్కని మాట రాశారు..ప్రజల నుండి పన్నులు, ఇతరత్రా వివిధ రూపాల్లో వసూలు చేసే డబ్బుతో ప్రభుత్వ బొక్కసం నిండుతుంది. మీడియాకు, జర్నలిస్టులకూ సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహకాల పేరిట, ప్రకటనల రూపంలో అవసరానికి మించి కూడా రాజకీయ ఒత్తిడులు, వ్యూహాల కారణంగా కోట్లాది రూపాయలను ప్రభుత్వం బొక్కసం నుండి తీసి ఖర్చు పెడుతున్నది’ అని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలోని ప్రకటనలకు సైతం ప్రభుత్వం ఆ బొక్కసం నుండే ఖర్చు చేసింది. ఒక పేజీ బ్లాక్ అండ్ వైట్ ప్రకటనతో పుస్తక ప్రచురణ ఖర్చు సరిపోతుంది. సీనియర్ జర్నలిస్టులను కాదని, వారి అనుభవాన్ని తోసిపుచ్చి పూచిక పుల్ల కింద జమకట్టి కొత్తవాళ్ల మీద ఆధారపడుతున్నారని చానల్స్‌పై ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ను అని మడికట్టుకుని కూర్చుంటే బొట్టుపెట్టి పిలిచేదెవరు? దూసుకెళ్లిన వారికే అవకాశాలు. జర్నలిస్టుల జీవితాలు అద్భుతంగా ఉన్నాయంటే రచయిత పలు సందర్భాల్లో ఈర్ష్య ప్రకటించారు. కానీ ఒకరిద్దరి జీవితాలను చూసి అంతా అలానే ఉన్నారని జర్నలిజంతో సంబంధం లేని వారు అనుకోవచ్చు కానీ జర్నలిజంతో సంబంధం ఉన్నవారు అనుకోలేరు.
నేను జర్నలిస్టునేనా?
రచయిత - ములుగు రాజేశ్వరరావు
వెల రూ.100
రచయిత - ములుగు రాజేశ్వరరావు
వెల రూ.100
very valid points.
రిప్లయితొలగించండిNarayanaswamy S. garu thanks
రిప్లయితొలగించండిమురళీ గారు, మీ బ్లాగ్ బాగుంది !
రిప్లయితొలగించండిknmurthy garu thanks
రిప్లయితొలగించండి