7, మార్చి 2012, బుధవారం

జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం

‘‘ప్రియా నన్ను మరిచిపో... ఎన్ని తరాలు మారినా, ఈ పెద్ద వాళ్లు మారరుప్రియా! ఆనాటి లైలా మజ్నుల ప్రేమను ఈ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. మొన్నటి దేవదాసు పార్వతి ప్రేమను అడ్డుకున్నారు. నిన్నటి దేవానంద్ సురయా ప్రేమను కాలరాచారు. మన ప్రేమను త్యాగం చేయాల్సిందే తప్పదు’’ అంటూ సీనియర్ నందమూరి  స్టైల్‌లో చెప్పిన మాటలనే రెండేసి సార్లుచెప్పిన రాజేష్ రియాక్షన్ కోసం ప్రియ ముఖంలోకి చూశాడు. ‘‘అదేంటి రాజేష్ నీ మాటను మీ ఇంట్లో వాళ్లు కాదనరని, కాదన్నా ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుని చిలకా గోరింకల్లా ఉందామన్నావ్! మరిప్పుడేమో ’’ అంటూ ఇక మాట్లడలేకపోయింది. ‘‘మనం ఒకటి తలిస్తే,దైవం మరోటి తలుస్తాడు’’ అని కాసేపు ఆగాడు. ‘‘దేవుడిని కూడా ఎదిరిస్తానన్నావ్’’ అంది ప్రియ. ‘‘ ఆవేశంతో మనిషి దేవున్ని కూడా ఎదిరించగలనని అనుకుంటాడు ప్రియా కానీ అంతా కాల మహిమ. మన ప్రేమను త్యాగం చేయక తప్పదు’’ అంటూ రాజేష్ ముఖంలోకి బాధను ఆహ్వానించాడు. మరి కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపం మాటేంటి రాజేష్’’ ప్రియ అడిగింది. ‘‘అదీ త్యాగం చేయాలి’’ అని మెల్లగా పలికాడు. ‘‘అలా అంటావా? రాజేష్ ఏదో ఒక రోజు ఇలాంటి త్యాగం సీన్ మన ప్రేమలో ఉంటుందని ఊహించాను. మన వ్యవహారాన్ని మొత్తం రికార్డు చేశాను. అన్ని ఆధారాలను పోలీసులకు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రులకు పంపించే ఏర్పాటు చేసే వచ్చాను రాజేష్’’ అంటూ ప్రియ నవ్వింది. ‘‘పిచ్చి ప్రియా నిజమే అనుకున్నావా? ఆ దేవుడే దిగివచ్చినా మన ప్రేమను త్యాగం చేయను. ఉత్తుత్తినే నిన్ను ఆటపట్టించాలని అన్నాను’’ అనిరాజేష్  నవ్వాడు. నేనూ అంతే అని ప్రియ నవ్వింది.
***
కొన్ని జీవితాలు అంతే.. వాళ్లు త్యాగాల కోసమే పుడతారు. కానీ సమాజమే వారి త్యాగాలను గుర్తించదు. ఈ మట్టి చేసుకున్న పుణ్యమో ఏమో కానీ మహనీయుల త్యాగం దేశంలో జీవనదిలా ప్రవహిస్తోంది. మీ కోసం ఆరునెలల పదవీ కాలాన్ని త్యాగం చేస్తున్నాను, నా త్యాగాన్ని గుర్తించండి అని ఒక రాజకీయ త్యాగధనుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. త్యాగాన్ని గుర్తించమన్నాడు కదా? అని ఆయన్ని ఎన్నికల్లో ఓడించారు. ఔను మరి గెలిపిస్తే త్యాగాన్ని చిన్నచూపు చూసినట్టు అవుతుంది కదా? ఆనాటి త్యాగం నుంచి ఆయన ఇప్పటి వరకు కోలుకోలేదు. ఒక రకంగా ఈయన ఆ శ్రీరాముడి కన్నా గొప్పవారే అని ఆయన అభిమానులంటారు. శ్రీరాముడి కథను లవకుశులు గానం చేశారు కానీ స్వయంగా శ్రీరాముడికి చెప్పుకునే అదృష్టం దక్కలేదు. ఏ పూర్వజన్మ సుకృతమో కానీ ఆయన ఒక్కరికే తన త్యాగాన్ని తాను గానం చేసుకునే అదృష్టం దక్కింది. ఒకటా రెండా? ఆయన త్యాగాలకు అంతు లేదు. ప్రధానమంత్రి లాంటి పదవిని త్యాగం చేసిన ఈయన కర్ణుడి కన్నా గొప్పవారే కదా? నీకు ప్రధానమంత్రి పదవి ఎవరిస్తారన్నారయ్యా బాబు రోజూ నాకు ప్రధానమంత్రి పదవి వద్దే వద్దు అని త్యాగం చేస్తున్నావు అంటూ ఆ మధ్య ఒకాయన కనికరం లేకుండా కటువుగా మాట్లాడారు. త్యాగం చేసేందుకు ఒకరివ్వాలా? ఏమిటో ఎవరో ప్రధానమంత్రి పదవి ఇస్తే త్యాగం చేసేందుకు ఆయన అల్లాటప్పా నాయకుడు కాదు ఆయనంతటి వారు ఆయన అందుకే ఎవరు ఇవ్వకపోయినా త్యాగం చేసేస్తున్నారు.



 అంతటి త్యాగశీలిని పదవి లేనిదే క్షణం ఉండలేకపోతున్నారని ఆడిపోసుకుంటున్నారు కానీ త్యాగాన్ని గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం మామను కుర్చీ నుంచి లాగేసిన అల్లుడి త్యాగాన్ని గుర్తించ లేదు. ప్రేమాభిషేకం సినిమాలో చివరి సీన్‌లోనైనా శ్రీదేవికి అక్కినేని త్యాగం గురించి తెలుస్తుంది. కానీ మన నాయకుల త్యాగాన్ని ప్రజలెప్పుడు తెలుసుకుంటారో? వారు వీరు అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు మన నాయకులు మనుషులకు సహజ సిద్ధమైన సిగ్గు అనేదాన్ని త్యాగం చేశారు. ఈ త్యాగానికి గుర్తింపే లేదు. క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి మన సిఎంతో రహస్యంగా చెవిలో నువ్వు నేను, టోనిబ్లేయిర్ కలిసి మరో ప్రపంచం సృష్టిద్దాం, దానికి నువ్వే అధ్యక్షుడివి అని ప్రతిపాదిస్తే, మరో ప్రపంచాన్ని కూడా త్యాగం చేస్తున్నాను నాకు తెలుగునాడే ముఖ్యం అని ప్రకటించిన త్యాగశీలి మన నేత. మా రాహుల్ ప్రధానమంత్రి కావాలనుకుంటే రాత్రికి రాత్రి అవుతారని కాంగ్రెస్ కేంద్ర మంత్రి ఒకరు చెప్పుకొచ్చారు. కానీ రాహుల్ మాత్రం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. వాళ్ల అమ్మ కూడా అంతకు ముందు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారాయే! ఆ మధ్య జి వెంకటస్వామి నాకు ఇక  రాష్ట్రపతి పదవి ఇస్తానన్నా వద్దంటాను అని త్యాగం చేశారు. అంతకు ముందు ఎం సత్యనారాయణరావు గవర్నర్ పదవి త్యాగం చేశారు. ఏంటీ వాళ్ల త్యాగాలు వీళ్ల త్యాగాల గురించి రాయడమే తప్ప మీ త్యాగం ఏమిటంటున్నారా? అంత మంది ప్రధానమంత్రి పదవి త్యాగం చేస్తుంటే నేనేం తక్కువ తిన్నానా? నేనూ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసేస్తా, నాకూ ఆ పదవి వద్దే వద్దు. జనాంతికంగా మీతోనే ఉండిపోతా..

6 కామెంట్‌లు:

  1. జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం..
    వార్తలో...
    సీనియర్ ఎన్టీఆర్ స్టైల్‌లో బదులు సీనియర్ ఎస్టీఆర్ స్టైల్‌లో అని తప్పు రాసారు. ఒక ప్రముఖ నాయకుడు, నటుడు పేరులోనే తప్పు రాయడం పట్ల మీకు మధనం లేదా? ఒకచోట రాజేష్ మరోచోట రాజేశ్ .. ఏది సరైనది?
    రాష్ట్రపతి బదులు రాష్టప్రతి అని రాసారు. ఒక ప్రధానమైన పేరులోనే తప్పా?

    రిప్లయితొలగించండి
  2. జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం..
    వార్తలో...
    సీనియర్ ఎన్టీఆర్ స్టైల్‌లో బదులు సీనియర్ ఎస్టీఆర్ స్టైల్‌లో అని తప్పు రాసారు. ఒక ప్రముఖ నాయకుడు, నటుడు పేరులోనే తప్పు రాయడం పట్ల మీకు మధనం లేదా? ఒకచోట రాజేష్ మరోచోట రాజేశ్ .. ఏది సరైనది?
    రాష్ట్రపతి బదులు రాష్టప్రతి అని రాసారు. ఒక ప్రధానమైన పేరులోనే తప్పా?

    రిప్లయితొలగించండి
  3. చంద్రకిరణం గారు అయిదు లైన్ల కామెంట్ ను మీరు రెండు సార్లు పంపించారు ఇది మీకు తప్పు అనిపించలేదా ? ( సరదాగానే ) .మీరు చెప్పిన వాటిని అక్షర దోషాలు అంటారండి . అక్షర దోషాలు సరే విషయం గురించి ?? ( మీరు కామెంట్ రెండు సార్లు పంపాలనే ఉద్దేశం తో పంపరు . అలా చిన్న ఒరపాటు జరిగి పోతుంది అంతే )

    రిప్లయితొలగించండి
  4. @buddha murali: పోన్లెండి గారు చంద్రకిరణం గారు కామెంటును త్యాగం చేయకుండా రాసారు :)

    రిప్లయితొలగించండి
  5. @చంద్ర కిరణం గారు థాంక్స్ సవరించాను...
    మీరు రాసిన ఈ క్రింది వాఖ్యలోనే ఒక తప్పు ఉంది ఏమిటో చెప్పుకోండి ................
    .ఒక ప్రముఖ నాయకుడు, నటుడు పేరులోనే తప్పు రాయడం పట్ల మీకు మధనం లేదా?
    ..............................
    తప్పును ఎత్తి చూపాలని కాదు ..
    @Jai Gottimukkala గారు థాంక్స్

    రిప్లయితొలగించండి
  6. (దుఖంతో గొంతు పూడుతుండగా.. )

    మురళి గారు.. మీరు చేస్తున్న ఈ త్యాగం వెల కట్టలేనిది. మీరు త్యాగాన్నే త్యాగం చేస్తున్న త్యాగరాజులు బాబూ! త్యాగరాజులు!!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం