2, మే 2013, గురువారం

మీ రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?



 మీ కలల  రిటైర్‌మెంట్ జీవితం 

మీరు ఇప్పుడే ఉద్యోగం లో చేరిన వారు కావచ్చు ... ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు కావచ్చు .. రిటైర్‌ అయిన వారు, త్వరలో కాబోతున్న వారు కావచ్చు .. ప్రతివారికి రిటైర్‌ మెంట్ జీవితం ఎలా ఉండాలనే దాని పై కొన్ని ఆలోచనలు ఉంటాయి  వీటిపై చర్చ జరిగితే ఒకరి ఆలోచనలో మరొకరికి ఉపయోగ పడవచ్చు .. రిటైర్‌ మెంట్ జీవితం పై మీ ఆలోచనలు పంచుకోవాలని కోరుతూ ...................

 ******************
ఉద్యోగం లో చేరిన రోజే పదవీ విరమణ తేది తెలిసిపోతుంది.  పదవీ విరమణ అనివార్యం. ఉద్యోగమే కాదు, ఏ వృత్తిలో ఉన్నా, వ్యాపారమైనా కొన్నాళ్లకు రిటైర్‌మెంట్ తప్పదు. మనిషి ఆయుః ప్రమాణం తక్కువగా ఉన్న కాలంలో రిటైర్‌మెంట్‌ను 58 ఏళ్లుగా నిర్ణయించారు. రోగాలు ఎన్ని పెరిగినా ఆధునిక వైద్య చికిత్సల పుణ్యమాని ఆయుః ప్రమాణం బాగా పెరిగింది. రిటైర్‌మెంట్ తరువాత కూడా ఒకటి, రెండు దశాబ్దాల కాలం పాటు హాయిగా ఏదో ఒక పని చేసే అవకాశం ఉన్న రోజులివి.

 మీరు ఇప్పుడే ఉద్యోగంలో చేరి ఉండవచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, రిటైర్‌మెంట్‌కు సమీపించవచ్చు. ఆడైనా, మగైనా రిటైర్‌మెంట్ తప్పదు కదా?


రిటైర్‌మెంట్ తరువాత మనవడు, మనవరాళ్లతో హాయిగా జీవించే గత కాలం కాదిది. పెళ్లికి ముందే ఉద్యోగం కోసమో, చదువు కోసమో కొన్ని వేల మైళ్ల దూరాన ఉంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఖండాంతర దూరం ఉందిప్పుడు. జీవన సంధ్యా సమయంలో కుటుంబ సభ్యులందరితో హాయిగా ఉండగలిగితే సంతోషమే. కానీ, ఇప్పుడు కాలం అలా లేదు. ఏ కొద్ది మందికో ఇలాంటి అదృష్టం ఉండొచ్చు. నిజానికి సమస్యల్లో ఉన్నవారే ఎక్కువ. ఉద్యోగానికి జాయినింగ్ డేట్ ఉన్నట్టుగానే రిటైర్‌మెంట్ డేట్ ఉంటుందని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచింది.

 రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలి? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. దాని కోసం ముందు నుంచే ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చు. రిటైర్ అయిన తరువాత మిగతా సంగతి ఆలోచిద్దాం..! అనుకుంటే అప్పటికి ఆలోచించడానికి ఏమీ మిగిలి ఉండదు.


మహాభారతంలో ధృతరాష్ట్రుడు ‘యుద్ధం వద్దు’ అని దుర్యోధనుడికి చెప్పాడు. తండ్రి మాటలను అతడు అస్సలు పట్టించుకోలేదు . దుర్యోధనుడు తండ్రి మాట వినకపోవడం సహజమే అంటాడు 13వ శతాబ్దానికి చెందిన కాశ్మీరీ పండితుడు క్షేమేంద్రుడు. ఎందుకంటే- రాజ్యం మొత్తం దుర్యోధనుడికి అప్పటికే అప్పగించాడు. ఇక అతడు తండ్రి మాట ఎందుకు వింటాడు? రాజ్యం అప్పగించకపోతే తండ్రిపైనే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. అందుకనే ముందు కొంత రాజ్యం అప్పగించి, చెప్పిన మాట వింటూ ఉంటే ఆ తరువాత తండ్రి పూర్తి రాజ్యం అప్పగిస్తాడు. తండ్రిని ఆదరిస్తూ అతడు చెప్పినట్టు దుర్యోధనుడు నడుచుకునేవాడు. అందుకే- ఆస్తిని మొత్తం పిల్లలకు ఇవ్వవద్దు, అలా అని ఏమీ ఇవ్వకుండా ఉండవద్దు. కొంత ఇచ్చి అంతా బాగుంటే మిగిలింది ఇస్తాడనే అభిప్రాయం కలిగించాలని కాలం ఇంతలా చెడిపోక ముందు- 13వ శతాబ్దాంలోనే క్షేమేంద్రుడు చారు చర్యలో   చెప్పాడు. 

ఈ మాటలు ఇప్పటికీ ఆచరణ యోగ్యమే. రిటైర్ మెంట్ జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం అని కాదు. కానీ, డబ్బు కూడా అవసరమే. ముందు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవితమంతా అనేక బాధ్యతలతో పరుగుల జీవితం గడిపిన వారు రిటైర్‌మెంట్ తరువాత వారు కోరుకున్న విధంగా జీవించడానికి ముందు ఆరోగ్యవంతంగా ఉండాలి కదా! జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నా ఈ శరీరంతోనే. అనుకున్నది సాధించడానికి అనువుగా శారీరక ఆరోగ్యం ఉండాలి. విలాసవంతమైన వస్తువులను కొన్నట్టుగా ఆరోగ్యాన్ని కొనడానికి అవకాశం ఉండదు. అనారోగ్యం కలిగితే- డబ్బు ఖర్చు చేస్తే చికిత్స చేస్తారేమో కానీ, డబ్బుతో అంగట్లో ఆరోగ్యం కొనలేం కదా!
జీవితమంతా డబ్బు సంపాదనకేనా? అని కాదు. కానీ, ఏ వయసులోనైనా ఏ పనీ చేయకుండా ఉండే వారి కన్నా- వృద్ధ్యాప్యంలో సైతం ఏదో ఒక పని చేసే వారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు.


 దివంగత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వృద్ధాప్యంలో వరంగల్‌లో సాహితీ మిత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ గడపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకోని పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆ పదవి చేపట్టిన తరువాత ఆయన అప్పటి కన్నా చురుగ్గా ఉన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం ద్వారా దేశానికి కొత్త మార్గం చూపించారు. నేటి అభివృద్ధి గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా ఆ ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. వయసుడిగిన దశలోనే ఆయన పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.


యాంగ్రీ యంగ్ హీరోగా  కన్నా బాలీవుడ్ నటుడు అమితాబ్ 71 ఏళ్ల వయసులో ఎక్కువగా నటిస్తున్నారు. ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు. ఈ వయసులో సైతం ఆయన అంత ఉత్సాహంగా ఉండడానికి అటు కుటుంబ జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవడం, మరోవైపు తనకు నచ్చిన వృత్తిలో ఉండడం ప్రధాన కారణాలు. అమితాబ్, ధర్మేంద్రల మధ్య ఏడేళ్ల వయసు తేడా మాత్రమే ఉంది. కానీ, చాలా కాలం నుంచి ధర్మేంద్ర సినిమాలకు దూరంగా ఉండడం వల్ల ఆయన కనిపిస్తున్న తీరుకు అమితాబ్ కనిపిస్తున్న తీరుకు తేడా గోచరిస్తుంది. ఆరుపదుల వయసులో నటీమణులు హేమమాలిని, రేఖ ఉత్సాహంగా ఉండడానికి కారణం వారి వారి వృత్తుల్లో ఇంకా బిజీగా గడపడమే.
చేయడానికి చేతినిండా పని ఉన్నప్పుడు మనిషి మరింత ఉత్సాహంగా ఉంటాడని చెప్పేందుకు మనకు ఎందరో ప్రముఖులు నిదర్శనంగా నిలుస్తారు.


 పీవీకి ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కొందరు నటులకు నటించే అవకాశం ఉంటుంది. అందరికీ అలాంటి అవకాశాలే ఉండాల్సిన అవసరం లేదు. కానీ, చేయడానికి ఏదో ఒక పని ఉంటుంది కదా? అభిరుచి ఉన్న పనినే రిటైర్‌మెంట్ తరువాత చేసుకోవడానికి ఎంపిక చేసుకుంటే ఇటు మానసిక ఉల్లాసం, అటు శారీరక శ్రమ, దానికి తోడు అంతో ఇంతో ఆదాయం లభించవచ్చు. దేశమంతా తిరిగి రావాలనే కోరిక కొందరిలో ఉండవచ్చు. సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉండవచ్చు. గుళ్లూ గోపురాలూ తిరగాలనే ఆసక్తి ఉండొచ్చు. మళ్లీ చదువుకోవాలనే కోరిక కలగొచ్చు. జీవన పోరాటంలో మనసుకు నచ్చింది చేయలేకపోయినా, రిటైర్‌మెంట్ తరువాత అవకాశం ఉంటే ఆ దిశగా ఆలోచించవచ్చు. దాని కోసం ముందు నుంచే ఒక ప్రణాళిక ఉంటే మంచిది. పారిశ్రామిక వేత్త రతన్ టాటా రిటైర్‌మెంట్ తరువాత తాను ప్లూట్ వాయించడం నేర్చుకుంటానని ప్రకటించారు.


ఇక, ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, డబ్బు విషయంలో సైతం అలాంటి జాగ్రత్తలు అవసరం. సికింద్రాబాద్‌లోని ఎఎస్‌రావు నగర్ సమీపంలో రాష్ట్రంలో తొలిసారిగా రిటైర్‌మెంట్ అయిన వారి కోసం కాలనీ ఏర్పాటైంది. రిటైర్ అయినా యాక్టివ్‌గా ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రణామ్ పేరుతో ఓ కాలనీ నిర్మించారు. దాదాపు ఒకే వయసు వారు కాబట్టి వారికి బోలెడు కాలక్షేపం. మనసుకు నచ్చినట్టు ఉండడం వల్ల కాలక్షేపానికి తోడు ఆరోగ్యమూ లభిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ చుట్టూ మనుషులు, మనుషుల చుట్టూ మార్కెట్ తిరుగుతోంది. మార్కెట్, మనుషులు ఒకరికొకరు ఉప గ్రహాలు. దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరుతోంది. మార్కెట్ వీరిపై దృష్టి సారించక తప్పదు. దీన్ని సూచన ప్రాయంగా వెల్లడించేదే- ప్రణామ్ కాలనీ నిర్మాణం. జీవిత చరమాంకాన్ని హాయిగా తాము కోరుకున్న విధంగా గడిపిన ఒక దంపతుల కథే- ‘మిథునం’ సినిమా. ఫ్యాక్షన్ కథల్లా ఈ సినిమా బాక్సాఫీస్ హిట్టు కాదు. కానీ- చూసిన వారికి మాత్రం- మన జీవితం కూడా ఇలాగే గడిస్తే బాగుండునని అనిపించించేట్టుగా ఉంది.


మన రాజధాని నగరానికి చెందిన ఓ ఇంజనీర్‌కు ఒకే ఒక కూతురు. హైటెక్ సిటీకి దగ్గర్లో చౌకగా ఉన్నప్పుడు వెయ్యి గజాల స్థలం కొన్నాడు. అందులో పాత ఇల్లు ఒకటి. మామిడి చెట్టుకు ఉయ్యాల ఊగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆ దంపతులు హాయిగా ఉండేవారు. అల్లుడు ఒక శుభ ముహూర్తంలో మామ గారికి బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. ఆ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇస్తే లక్షల్లో అద్దెలు అంటూ ఆశ చూపించాడు. అల్లుడి పేరు మీద రుణం తీసుకుని అపార్ట్‌మెంట్ నిర్మించాడు మామ. నిర్మాణ సమయంలో కింది ఫ్లోర్ మీదే అని అల్లుడు హామీ ఇచ్చాడు. ఆరునెలలు కూడా గడవక ముందే, ‘బ్యాంకు రుణ భారం భరించలేకపోతున్నానని, కింది ఫ్లోర్ అద్దెకిస్తే భారం తగ్గుతుంది. మీరు పై ఫ్లోర్‌లోని సింగిల్ బెడ్‌రూంలోకి మారండి’ అని అల్లుడు అన్నాడు. వాళ్లు మారిపోయారు. మామిడి చెట్టుపై ఉయ్యాల ఊగుతూ హాయిగా గడిపిన వారి జీవితం ఇప్పుడు లిఫ్ట్ లేని ఆ భవంతిలో సింగిల్ బెడ్‌రూంలో బిక్కుబిక్కుమంటూ సాగుతోంది. ఇలాంటి సంఘటనలకు కొదవ లేదు. అయతే, రిటైర్‌మెంట్ జీవితం అనగానే అదేదో శాపంగా భావించాల్సిన అవసరం లేదు.


 మెజిస్ట్రేట్స్‌గా పని చేసిన వారంతా హైదరాబాద్ లో ఒక గ్రూప్ గా ఏర్పడి  గత రెండు దశాబ్దాల నుంచి ఏటా ఉత్తర దేశ యాత్ర, దక్షిణ దేశ యాత్ర అంటూ దూరప్రాంతాలకు వెళతారు. 80-85 ఏళ్ల వయసు వారంతా ఒక చోట చేరి తాము ఉద్యోగంలో ఉన్నప్పటి సంగతులు చెప్పుకుంటూ రైలులో రోజుల తరబడి ప్రయాణించడం ఊహిస్తేనే ఎంత అద్భుతంగా ఉంటుంది. నగరంలో ఇలా వివిధ వృత్తుల్లో రిటైర్ అయిన వారు సంఘాలు ఏర్పాటు చేసుకుని తరుచుగా సమావేశం అవుతూ , పర్యటనలు చేస్తుంటారు. పెద్దగా రిస్క్ లేకుండా, సమయం ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా రిటైర్‌మెంట్ తరువాత కూడా ఏదో ఒక సంపాదన మార్గాన్ని చూసుకోవచ్చు. అదే విధంగా ఇష్టం వచ్చినప్పుడు తమకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. భగవంతుడి వరాన్ని భారంగా తీసుకోవడం ఎందుకు? సంతోషంగా స్వీకరిద్దాం, సంతోషంగా జీవిద్దాం. ఇంతకూ మీ రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?

9 కామెంట్‌లు:

  1. I am happy with my retired life, hale healthy, writing blog sine last one and a half year, with so many friends in 76 countries all around the globe :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. kastephale గారు మంచి పాయింట్ గుర్తు చెశారు. చాలా మంది పెద్ద వారికి తమ మాట వినే వారు లేరు అనేదే పెద్ద సమస్య .. ఈ రోజుల్లో దాదాపు అందరికి కంపూటర్ అందుబాటులో ఉంటుంది .. తమ ఆలోచనలు ఇలా బ్లాగ్ ద్వారా పంచుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. బ్లాగ్ అంటే బ్రంహ విద్య అనుకుంటారు .. కొద్దిపాటి శ్రద్ధ పెడితే ప్రపంచం లోనే ఎంతో మందతో ఆలోచనలు పంచుకోవచ్చు .. దీనిపై ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది

      తొలగించండి
  2. add one more thing living in a village peacefully.

    రిప్లయితొలగించండి
  3. Pillala chethulaku aarthika paggalanee appaginchi chivaralo kukkachaavu chacche parents nu endarino choostunnam!Pillalu evari bathuku vaalu bathakaali,evarikivaaru sampaadinchukovaali!Athiprema pillalnee paadu chestundi chivaraku meeku vishaadaanni migulustundi!Ee vishayamlo USA paddhathe naaku nacchutundi!Vruddhulu aakharu xanaala varakoo thama jeevitham thaamu gaduputhoo aarthika swaavalambanatho aanandamgaa gadapaali!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యప్రకాష్ గారు ధన్య వాదాలు పిల్లలను అనుమానించడం అని కాదు, చిన్న చూపు చూడడం అని కాదు లోకం పోకడను బట్టి జాగ్రతగా ఉండడం మంచిది

      తొలగించండి

  4. చాలా బాగుందండి పోస్ట్!
    ఈ మధ్య మా ఇంట్లో తరచూ జరిగుతున్న డిస్కషన్ ఇదే!
    పరాయి దేశాలకు వలస వచ్చిన మాలాంటి వారికి "రిటైర్‌మెంట్ జీవితం" ఎలా గడపాలి అన్నది పెద్ద సమస్యే!
    ఎంతో ప్లానింగ్ ఉండి,మెడికల్ బెనిఫిట్స్, రిటైర్‌మెంట్ డబ్బులు, ఒక సొంత ఇల్లు (బాంక్ అప్పు లేకుండా) ఉంటే కాని,అమెరికా లో జీవించడం కష్టం.ఇండియా తిరిగి వచ్చెయచ్చు కదా అంటే, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అని ఏదో ఆశ! ఇంకా రిటైర్‌మెంట్ ప్లానింగ్ లోనే ఉన్నాము అని చెప్పొచ్చు! ఈ ప్లాన్నింగ్స్ అన్ని ఒక ఎత్తు, ఆరోగ్యం కాపాడుకుంటూ, బ్రతికినంత కాలం ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడం ఒక ఎత్తు..నేనూ అందరికీ చెపుతూ ఉంటాను, వ్యాయామం అదీ చేస్తూ, ఫిట్ గా ఉండడం కూడా చాలా అవసరం అని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు ... ఆరోగ్యం, డబ్బు ఈ రెండింటి పై జాగ్రతగా ఉన్దాలి. వీటితో పాటు నలుగురుతో బాగుంటే పదవి విరమణ దశ హాయిగా ఉంటుందని ఆశ ... చివరకు ఆ బాగావంతుది దయ కుడా ఉండాలి ( నమ్మే వారికి )

      తొలగించండి
  5. మీ వ్యాసం చాలా బాగుంది. అందరినీ ఆలోచింప జేసేదిగా ఉంది. నా విషయానికి వస్తే, కుటుంబబాధ్యతలే నా జీవితం. నా గురించి అంటూ అలోచించుకొనే అవకాశం నాకు కలగనే లేదు. ఈ మధ్యనే పదవీవిరమణ జరిగింది. ఇది ఒక పెద్ద దెబ్బలాగా తగిలింది. ప్రస్తుతం నిజానికి denial phase లో ఉంది నా మానసికస్థితి. అయినా యెలాగో భవిష్యత్తుకోసం సాధ్యమైనంతగా ప్రణాళికలు వేస్తున్నాను. మా వృధ్ధాప్యంలో ఒకరికొకరమే గాని యెవరూ లేరు గాబట్టి అది దృష్టిలో ఉంచుకొనే ప్రయత్నిస్తున్నాను. ఆపైన అంతా ఈశ్వరేఛ్ఛ.

    రిప్లయితొలగించండి
  6. రిటైర్ అయినతరువాత తరువాత ఏ విధంగా ఉండాలి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద చాలా పుస్తకాలు రచనలు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కూడా. అవన్నీ చదువుతుంటే అదేదో భూతం లాగా ఉండి గాభరా పెడుతాయి.
    నా ఉద్దేశంలో అంత గాభరా పడవలసిన అవసరం లేదు. నేను ఉపయోగించిన గైడ్ లైన్సు చెబుతాను.

    నెలకి మనకి ఎంత అవసరం అవుతుంది. దానికి తగిన రాబడి మనకుందా ? అని ఆలోచించాలి. రాబడి కి సరిపోయేటట్లు అవసరాలు మార్చుకోవాలి. ఈ చిన్ని పొట్టకి గుప్పెడు అన్నం పెట్టటానికి ఎంత కావాలి?

    అవసరము, అనవసరము --- వాటిని విడతీయటం నేర్చుకోవాలి. ఉదా: స్మార్ట్ ఫోన్ కావాల్సిన అవసరము లేదు , ట్రాక్ ఫోన్ తో సరిపెట్టు కోవచ్చు.

    అప్పులు చేయటం మానేయాలి. పిల్లలు చూట్టానికి రమ్మంటే, టిక్కెట్ పంపిస్తేనే వెళ్లటం.

    అమెరికాలో ఉంటే మెడికేర్ ఆప్షన్స్ తెలుసుకోండి. ఉదా: మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్స్.

    ఏమీ తోచకపోతే చాలా చోట్ల వాలంటీర్ గ పనిచెయ్యొచ్చు.

    పై విధంగా ఆలోచిస్తే మీ ఆందోళన కొద్దిగా తగ్గుతున్దనుకుంటాను.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం