5, ఏప్రిల్ 2014, శనివారం

పెను’గాలి! ఆ రోజు స్పీకర్ పదవి తీసుకోని ఉంటే 95వెన్నుపోటు కథ ఏమయ్యేదో ?

          

  పేరులో ఏముందిలే అంటారు -పెద్దలు. పేరులోనే కాదు ఇంటి పేరులోనూ ఏదో ఉండే ఉంటుంది -అనిపిస్తుంది ముద్దుకృష్ణమ నాయుడు గాలిని చూస్తే. ఆయన తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఆయనవి -గాలి మాటలు అనేవాళ్లు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెదేపా వాళ్లు -గాలి మాటలు పట్టించుకోం అనేవారు. పురాణమైనా రోజూ వింటే బోరు కొడుతుంది. అలాగే -గంటకోసారైనా అవినీతిపై తీవ్రారోపణలు చేయడంతో -గాలి ఆరోపణలకు ఆరోప్రాణం లేకుండా పోయింది. మంత్రిగా ఉన్నపుడు -ప్రచారంలో కొత్తపుంతలు తొక్కారు. 

’94 ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది. విజయం ఖాయం అని తేలాక మంత్రి పదవులకు ఎంపికలు కూడా లోపాయకారిగా జరిగిపోతున్నాయి. ఆ సమయంలోనే అల్లుడి కదలికలపై మామకు అనుమానమొచ్చింది. ఏదైనా జరగొచ్చనుకున్నారు. ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్పీకర్ పదవి తీసుకోండి అని ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి దంపతులు గాలి ముద్దు కృష్ణమనాయుడిని కోరారు. ముద్దుకృష్ణమ నాయుడు ఎన్టీఆర్‌కు వీరభక్త హనుమాన్ అన్నట్టుగా ఉండేవారు. దానికితోడు జిల్లాలో అల్లుడికి గాలికి పడటం లేదు. జరగరానిది ఏమైనా జరిగితే స్పీకర్ మనవాడు కావడం మంచిదనుకున్నారు. కానీ మంత్రి పదవిలో చురుగ్గా ఉండే ముద్దు తనకు స్పీకర్ పదవి ఇష్టం లేదన్నారు. ఒకవేళ ఆ రోజు గాలి ముద్దు కృష్ణమనాయుడు స్పీకర్ పదవి తీసుకోవడానికి అంగీకరించి ఉంటే -1995 వెన్నుపోటు కథ ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదో? ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మెదిలిన 12మంది మంత్రులను అప్పుడు డర్టీ డజన్ అంటూ బాబు వర్గం -మీడియాలో బాగా ప్రచారం చేసింది. ఆ పనె్నండు మందిలో ముద్దుకృష్ణమనాయుడు మొదటి వారు.
గాలి ముద్దు కృష్ణమనాయుడికి -చంద్రబాబుతో ప్రారంభంలో మంచి స్నేహం ఉండేది. పేకాట ఆడే ప్రాణమిత్రులు ఎంతగా కలిసి పోతారో అలా ఉండేవారు. క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. 95లో ఎన్టీఆర్‌ను దించేసిన తరువాత ఒకరి తరువాత ఒకరు తిరిగి చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరినా ముద్దుకృష్ణమ మాత్రం మనసు చంపుకోవడానికి  ఇష్టపడలేదు. కాంగ్రెస్‌లో చేరారు. సిఎల్పీ కార్యాలయంలో ప్రతి రోజు చంద్రబాబుపై ధ్వజమెత్తేవారు. వీర కాంగ్రెస్ వాదులను మించి విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా సాకారం కాలేదు. 2009లో తెదేపా అధికారంలోకి వస్తుందనే అంచనాకు వచ్చారు. ఆయన గెలిచారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. మళ్లీ ప్రతిపక్షమే. అయితే తాను తిట్టాల్సిన నాయకుడి పేరు మారింది అంతే. ముద్దు కృష్ణమనాయుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెదేపాను, తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను తిట్టడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నారు. వెయ్యి కోట్ల పనుల్లో పదివేల కోట్ల కుంభకోణం అంటూ ధైర్యంగా విమర్శలు చేయడంలో గాలికి గాలే సాటి.
ఇలా ఇష్టం వచ్చినట్టు విమర్శించడం వీళ్లకు సరదా అని మీరనుకుంటారేమో -కానే కాదు. నేనో మాట అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్లు అనకుండా ఉంటారా? పడాలి తప్పదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడు చెప్పినట్టు తిట్టక తప్పదని ఓ సందర్భంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. 95లో ఎన్టీఆర్ హయాంలో పోయిన మంత్రి పదవి ఇప్పటికీ ఆయనకు దక్కినట్టే దక్కి దూరమవుతోంది. చిత్తూరు జిల్లా వెంకటాపురం గ్రామంలో 1947 జూన్‌లో జన్మించిన గాలి -ఎన్టీఆర్ తెదేపాను ఏర్పాటు చేసినప్పుడు లెక్చరర్‌గా పని చేసేవారు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. శాసన సభకు ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కువగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడేది ఆయనే. ఏం మాట్లాడినా గాలి మాటలు అనే విమర్శ మాత్రం ఇప్పటికీ -వినిపిస్తూనే ఉంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం