23, ఏప్రిల్ 2014, బుధవారం

కిట్టీ పార్టీల్లో ఆడవారు పొలిటికల్ కిట్టీ పార్టీ లలో మగవారు

పూర్వకాలంలో పెళ్లికి వెళ్లడం అంటే కనీసం రెండు వారాల వ్యవహారం. పెళ్లికి మూడు రోజుల ముందు వచ్చి వారం రోజుల పెళ్లి చూసి మూడు రోజుల తరువాత వెళ్లేవారు. పెళ్లంటే సందడే సందడి. ఇప్పుడు కనీసం రిజిస్ట్రార్ ఆఫీసులో ఇంటి రిజిస్ట్రైషన్‌కు పట్టినం త సమయం కూడా పట్టడం లేదు పెళ్లికి. అక్షింతలు వేసే సమయానికి వచ్చి క్షణాల్లో మాయమవుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంధువుల మధ్య పరాచికాలు, ఆడవారి ముచ్చట్లు ఇప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే అపురూప దృశ్యాలు. ఈ తరం వారికి ఎన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఆనాటి సంబరాలు తీరని లోటే. బహుశా ఈ లోటును పూడ్చుకోవడానికే కిట్టీ పార్టీలు పుట్టాయేమో! ఇండియా, పాకిస్తాన్‌లలో మాత్రమే ఈ కిట్టీ పార్టీలు కనిపిస్తాయి. ఆడవారు ప్రతి నెల ఒకరి ఇంట్లో కిట్టీ పార్టీలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కొంత డబ్బు వేసి అందరు కలిసి నెలకు ఒకరి ఇంట్లో పార్టీ చేసుకుంటారు. నెల రోజుల అలసట ఒక్క రోజు కిట్టీ పార్టీతో తీరిపోతుంది.


సరే మరి ఆడవారు కిట్టీ పార్టీతో సేద తీరుతున్నారు. మరి మగవారు....
పెళ్లిళ్లు వారం రోజుల పాటు అట్టహాసంగా జరిగినట్టే పూర్వం రాజకీయ పార్టీల ఏర్పాటుకు భారీ కసరత్తు జరిగేది. సిద్ధాంతాలు, పార్టీల విధానాలపై సుదీర్ఘ మంతనాలు సాగేవి. అందుకే ఆ కాలంలో పార్టీలు పెద్దగా పుట్టలేదు. మరిప్పుడు చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే ఊరికే ఉండడం ఎందుకని పార్టీ పెడుతున్నారు. హీరోకు వయసు మీద పడితే రిటైర్‌మెంట్ జీవితంలో కాలక్షేపం కోసం పార్టీ పెట్టేస్తున్నారు. అన్నమీద కోసం వస్తే పార్టీ, బావ మీద కోపం ఉంటే పార్టీ ( అన్నాటిడిపి) భర్త జ్ఞాపకాలు నిలుపుకోవడానికో పార్టీ , షూటింగ్‌లు పెద్దగా లేకపోవడంతో కాలక్షేపం కోసం అన్నట్టు రాఖీసావంత్ ఓ పార్టీ పెట్టేశారు. జగన్మోహిని, ఆ మోహినీ ఈ మోహినీ అంటూ 80వ దశకంలో జయమాలిని సినిమాలు ఒక ఊపు ఊపాయి. అందులో హీరోయిన్ జయమాలిని అయితే హీరో నరసింహారాజు. ఆయనకు ఎన్టీఆర్‌పై కోపం వచ్చి మీది తెలుగుదేశం అయితే నాది భారత దేశం అంటూ భారత దేశం పేరుతో ఒక పార్టీ పెట్టేశాడు.బహుశా పార్టీ పెట్టినట్టు ఆ తరువాత ఆయన కూడా మరిచిపోయినట్టున్నారు. టీవి సీరియల్స్‌లో వయసుకు మించి వృద్ధ పాత్రల్లో అడపాదడపా కనిపిస్తున్న ఈయన ఇప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున కూకట్‌పల్లిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నటునిగా సొంత పార్టీ పెట్టుకోవలసిన వయసు వచ్చినా అంతో ఇంతో డబ్బు కావాలి కదా అది సాధ్యం కాకపోడవంతో జై సమైక్యాంధ్ర పార్టీని నమ్ముకున్నారు.


కిట్టీపార్టీలతో కాలక్షేపం చేయాలని ఆడవారికి, రాజకీయ పార్టీలతో కాలక్షేపం చేయాలని నటులకు ఉన్నప్పుడు ప్రశాంత జీవితం గురించి బోధించే స్వాములు, బాబాలకు మాత్రం ఉండదా? ఏమిటి?
పిరిమిడ్ ధ్యానకేంద్రం తెలుగునాట గత రెండు దశాబ్దాల నుంచి మారుమూల పల్లెలకు సైతం ప్రాకింది. సుభాష్‌పత్రి ధ్యానంతో పాటు రాజకీయాలతో కాలక్షేపం ఎలాగో నేర్పించేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఎన్నికలైనా సరే పిరమిడ్ పార్టీ అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తుంది. స్వాములకు ఈ రాజకీయాలు అవసరమా? అనే ప్రశ్న ముఖం మీద కనిపించగానే ఆయనే నవ్వుతూ చెబుతారు. మేం పోటీ చేసేది గెలిచేందుకు కాదు. ఈ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా మా పిరమిడ్ సంస్థకు ప్రచారం లభిస్తుంది. ఇంత తక్కువ ఖర్చుతో అంత తక్కువ సమయంలో రాష్ట్రం మొత్తంలో ప్రచారం లభించే మార్గం ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటారు. రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల మంది ఓటర్లు ఓటు వేసే ముందు ఆ పార్టీ పేరు, గుర్తు చూడనైతే చూస్తారు కదా?


అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్టయినా పవన్ కల్యాణ్ ప్రచారం సినిమా పేజీలకే పరిమితం అయింది. ఆయన సినిమా జీవితం మొత్తంలో ఎంత ప్రచారం లభించిందో ఒక్క జనసేనతో అంతకు మించి ఎన్నో రేట్లు ప్రచారం లభించింది. ఇది సీరియస్ పార్టీ కాదు, రాజకీయ కిట్టీ పార్టీ అని తెలుసు అయినా బోలెడు ప్రచారం. ఎవరు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ సరికొత్త రాజకీయాలకు తెర తీశారు. ఆయన పోటీ చేయరు, ఆయన పార్టీ తరఫున ఎవరూ పోటీ చేయరు. కానీ ఆయన తనకు నచ్చిన నియోజక వర్గంలో నచ్చిన పార్టీకి ప్రచారం చేస్తారు. పవన్ పార్టీ భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం. ఇదో కొత్త మలుపు. మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసినా ఎందుకో గానీ కిరణ్ కుమార్‌రెడ్డికి కూడా కిట్టీ పాలిటిక్స్‌పైనే ఆసక్తి కలిగినట్టుగా ఉంది. కొత్త పార్టీ పెట్టారు, గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అని ధీమాగా ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది కానీ ఆయన మాత్రం పోటీ చేయడం లేదు. అదేంటి అంటే మహాత్మాగాంధీ పోటీ చేశాడా? లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పోటీ చేశారా? అని తులసీరెడ్డి గారు కోపంగా అడుగుతున్నారు. 

మనకు మరో మహాత్ముడు దొరికాడని సరిపుచ్చుకోవాలి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు కూర్చున్న ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తుంటుంది. అలానే ఇప్పుడు నేటి మహాత్ముడు కిరణ్, ఆయన పక్కన నెహ్రూలా తులసీరెడ్డిని చూసుకుని మనం మురిసిపోవాలి. ధాన్యం గురించి ప్రచారం చేయడానికే ఎన్నికల్లో పోటీ అని పిరమిడ్ సుభాష్ పత్రి గారి మాటల్లానే సమైక్యాంధ్ర ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడానికే జై సమైక్యాంధ్ర పోటీ అని కిరణ్ చెబుతున్నట్టుగా ఉంది. కిట్టీ పార్టీ ఖర్చు అందరు కలిసి భరిస్తారు, కిట్టీ పొలిటికల్ పార్టీల ఖర్చు కోసం అధికారంలో ఉన్నప్పుడు సంపాదిస్తారు. రెండింటి లక్ష్యం మాత్రం ఒకటే. కాసేపు కాలక్షేపం అంతే.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం