28, ఏప్రిల్ 2014, సోమవారం

అనువాద వాదం..ఎన్టీఆర్‌కు హిందీ నేర్పడానికి వచ్చి రాజకీయాలు నేర్చుకొన్న యార్లగడ్డ

సమాజంలో మనువాదానికీ , రాజకీయాల్లో మార్క్స్‌వాదానికి కాలం చెల్లి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఇప్పుడు అనువాద వాదందే కాలం అంటున్నారు. తెలుగునేత అధికారంలో ఉన్నప్పుడు టూరిజం తప్ప అన్ని ఇజాలకు కాలం చెల్లిందని గట్టిగా నమ్మారు. రోడ్డుపక్కన మందులమ్మేవాడు ధర్మేంద్ర, అమితాబ్, హేమామాలిని వంటి వారితో దిగిన ఫోటోలను ప్రదర్శిస్తూ, వారంతా నా క్లయింట్స్ వారికి నేనే చికిత్స చేశాను అందుకే అంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు అని చెబుతుంటారు. సాక్ష్యంగా ఫోటోలు కనిపిస్తుంటే నమ్మలేమని ఎలా చెబుతాం. అలానే తెలుగునేత టూరిజంను నమ్ముకుని అనేక దేశాలు తిరిగి ఇదిగో సర్ట్ఫికెట్లు వాళ్లంతా తెలుగునాట నేను అద్భుతంగా పాలిస్తున్నానని సర్ట్ఫికెట్ ఇచ్చారు అని ప్రచారం చేసుకునే వారు. ఆయన్ని బాగా నమ్మిన మీడియా ఔను నిజం. ఇక్కడి వారికి ఆయన గొప్పతనం ఏమీ తెలియదు, మీరు కళ్లతో చూసేది నమ్మకండి, అక్కడి వారు ఇచ్చిన సర్ట్ఫికెట్లనే నమ్మండి చెప్పేవి.


పాతాళాభైరవితో పాటు ఎన్నో సినిమాల్లో ఎన్టీవోడు కాళ్లకు మంత్రాల చెప్పులు, మాయావస్త్రం, గుర్రాలు ఏది కనిపిస్తే అది వేసుకుని రాజకుమారిని వెతుకుతుంటాడు. ప్రేమించిన రాజకుమారి కోసమే ఎన్టీవోడు అన్ని వేశాలేస్తే, ఎన్టీవోడి దగ్గర కొట్టుకొచ్చిన సింహాసనం కోసం తెలుగునేత ఎన్ని వేషాలు వేయాలి? పదేళ్ల నుంచి జారిపోయిన సింహాసనం కోసం తెలుగు నేత నమ్ముకోని వాదం లేదు, మొక్కని దేవుడు లేడు. కలవని పార్టీ లేదు. కాలం చెల్లిందన్న కమ్యూనిజాన్ని నమ్ముకున్నా ఫలితం లేకుండా పోయింది. దేశాన్ని ముక్కలు ముక్క లు చేసేందుకే పుట్టింది గులాబీ వాదం అని విమర్శించిన బాబే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని చివరకు ఆ గులాబీని కూడా నమ్ముకున్నారు.... చేతికి ముల్లు గుచ్చుకుంది కానీ అధికారం దక్కలేదు. చీ..చీ.. గులాబీ అందంగా ఉంటుందనుకున్నాను అది నిజం కాదంటూ అంతకు ముందు ఛీ...్ఛ... రక్త పిపాస సిద్ధాంతి అని తిట్టిన మోడీ ఇజాన్ని నమ్ముకున్నారు. మోడీ ఇజం... పవన్ ఇజం.... బాబు ఇజం అన్ని కలిపితే అధికార ఇజం అంటున్నారు అభిమానులు. 

మోడీది మతోన్మాదం అని నువ్వే చెప్పావు, తిక్కనే నా ఇజం అని పవనే చెప్పుకున్నాడు. అధికారమే మీ ఇజం అని అందరికీ తెలుసు ఇందులో కొత్తేముందని అడిగితే మా ఈ మూడింటి మధ్య కెమిస్ట్రీ కుదిరి కొత్త వాదం పుట్టింది. ఇక మాదే అధికారం అంటున్నారు. మసీదులు కూల్చే పార్టీ అని అంతగా తిట్టిన వారు చేతులు కలపడం భావ్యమా అని కొందరు చాదస్తు వాదులు ప్రశ్నిస్తే, అధికారంలోకి వస్తే సరే లేకపోతే మళ్లీ మసీదులు కూల్చే పార్టీ అని గతంలో కన్నా ఎక్కువ తిడతారు తొందరపడకండి అని సమాధానం వినిపిస్తోంది. శాస్తవ్రేత్తలు తాను అనుకున్న ఫలితాన్ని సాధించేందుకు అనేక పరిశోధనలు చేస్తారు. రాజకీయాలను ఒక శాస్త్రంగా భావించి, విజయం సాధించేందుకు అవసరమైన కెమిస్ట్రీ పై ప్రయోగాలు చేస్తున్నారని అభినందించాలి, అధికారం కోసం ఒక్కో ఎన్నికలోఒక్కో పార్టీతో చేతులు కలుపుతున్నాడని తిట్టడం భావ్యమా! శాస్తవ్రేత్తల ప్రయోగాలకు ఇచ్చే గౌరవం రాజకీయ ప్రయోగాలకు ఇవ్వరా? ఇదేం అన్యాయం?
తెలుగునేత తన వాదాలను ఎప్పటికప్పుడు అలా మారుస్తూ పోతుంటే కొందరు చోటా మోటా నాయకులు అన్ని వాదాలకు కాలం చెల్లింది ఇప్పుడు నడుస్తోంది అనువాదాల కలామే అంటున్నారు.


ఉండవల్లి అరుణ్‌కుమార్ సోనియాగాంధీ దృష్టిలో పడి ఎంపి అయింది అనువాదం వల్లనే కదా? అని తమ వాదమే కరెక్ట్ అంటూ వీళ్లు ఆధారాలు చూపిస్తున్నారు. నిన్నమొన్న టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రావణ్ కూడా రాహుల్ దృష్టిలో పడ్డాడంటే అనువాదాన్ని నమ్ముకునే కదా? అనుకున్న దానం నాగేందర్ ఎంతో మందిని పక్కకు తోసి అనువాదంతో చెలరేగిపోయి కాళిదాసు కవిత్వం కొంత నా సొంత పైత్యం కొంత అని అనువాదాన్ని కొత్త పుంతలు తొక్కించారు రాహుల్ సభలో. రాహుల్ మాట్లాడింది, అనువాదకుడు మాట్లాడింది రెండు విడివిడిగా రాసుకోలేక చచ్చామని విలేఖర్లు వాపోయారు. ఇక నుంచి ఉపన్యాసకుడి కోసం ఒక రిపోర్టర్, అనువాదకుడి ఉపన్యాసం కోసం మరో రిపోర్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


అనువాద మహిమను వీరందరి కన్నా ముందు గుర్తించింది వెంకయ్యనాయుడు. హిందీని తెలుగులోకి అనువాదం చేయడాన్ని నమ్ముకుని ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడి స్థానం వరకు వెళ్లారు. ఆయన మార్గంలోనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్టీఆర్‌కు చేరువయ్యారు, అటు నుంచి బిజెపికి దగ్గరయ్యారు. ఎన్టీఆర్‌కు హిందీ నేర్పడానికి వచ్చిన యార్లగడ్డ హిందీ నేర్పలేదు, కానీ తాను రాజకీయాలు నేర్చుకున్నారు. రాజ్యసభ సభ్యులయ్యారు. ఈ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి అలసిపోయిన తరువాత చంద్రబాబు కొంత కాలం హిందీ నేర్చుకోవడానికి, ఆ తరువాత ఉర్దూ నేర్చుకోవడానికి ప్రైవేటు ట్యూషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఓ హిందీ పత్రిక ఎడిటర్, మరో ఉర్దూ పత్రిక రిపోర్టర్ ఆయనకు ఈ భాషలు నేర్పడానికి కొంత వరకు ప్రయత్నించారు. వీళ్ల నుంచి బాబుకు హిందీ, ఉర్దూ రాలేదు, బాబు నుంచి వాళ్లకు రాజకీయం అంటలేదు. 

సీటు కోసం ప్రయత్నించడం కన్నా అనువాదంలో అనుభవం సంపాదించి హై కమాండ్ దృష్టిలో పడడం మేలు అనుకుంటున్నారు అనువాద వాదాన్ని నమ్ముకున్న వాళ్లు. పవన్ కల్యాణ్ సాహసోపేతంగా రాసిన పవనిజం పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించి రాంగోపాల్ వర్మ, యండమూరి వీరేంధ్ర నాథ్ లాంటి మేధావులే చేతులెత్తేశారు. పవనిజాన్ని ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్‌లోకి, తెలుగు నుంచి తెలుగులోకి అనువాదం చేయడానికి ఎవరికైనా అసక్తి ఉంటే ప్రయత్నించ వచ్చు. భవిష్యత్తు మొత్తం అనువాద వాదానిదే.

5 కామెంట్‌లు:

  1. ఈ అనువాద రహస్యం కనుక్కున్న మీకు యెన్ని వీరతాళ్ళు వేసినా తక్కువే సుమా!

    రిప్లయితొలగించండి
  2. అవును సార్. ఇప్పుడు కాలమంతా అనువధ కులదే

    రిప్లయితొలగించండి
  3. అవును సార్. ఇప్పుడు కాలమంతా అనువధ కులదే

    రిప్లయితొలగించండి
  4. హిందీ నేర్చు"కొని" ఎన్టీఆర్ పొడిచింది ఏమీ లేదు, రాజకీయాలలో చేరి యార్లగడ్డ సాదించింది అంతకంటే తక్కువ.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం