29, ఏప్రిల్ 2014, మంగళవారం

తెలంగాణ జెండా

కె సిఆర్ -ఈ మూడక్షరాలు తెలంగాణ జెండా.. తెలంగాణ ఆస్తిత్వం... తెలంగాణ ఉద్యమం.. 2001 స్థానిక సంస్థల ఎన్నికలు. నర్సాపూర్ ప్రాంతంలో కేసీఆర్ హెలికాఫ్టర్‌లో వచ్చి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించి వెళ్తుంటే -ఒక పోలీసు అధికారి ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది. కేసీఆర్‌తో కరచాలనం చేసి తన ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేకపోయాడు. అతనిలోని అంతటి ఆనందానికి కారణం -తన ఉపన్యాసంలో కెసిఆర్ ఉపయోగించిన పదాలు. సిరా ఆరకముందే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని కెసిఆర్ చేసిన ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తూ ‘సిరా’ ఈ మాట వినగానే నా బాల్యంలోకి వెళ్లిపోయాను. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట అంటూ ఆ అధికారి తనకన్నా చిన్న వయసు వ్యక్తితో ఆనందాన్ని పంచుకున్నాడు.

తెరాస ఆవిర్భావం తరువాత తెదేపా పతనం మొదలైందా? తెదేపా పతనం నుంచి తెరాస ఆవిర్భవించిందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ తెరాస ఆవిర్భావం మాత్రం తెదేపాను చావు దెబ్బతీసింది. 2001 ఏప్రిల్ 27న తెరాస ఆవిర్భవించిన తరువాత వందరోజులకే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెదేపా పరాజయం ప్రారంభమైంది. 2004 సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2009లో తిరిగి అదే తెరాసతో జతకట్టినా తెదేపాకు అధికారం దక్కలేదు.


విద్యుత్ ఉద్యమం, చంద్రబాబుపై భ్రమలు తొలిగిపోతున్న కాలం అది. తెలంగాణ పార్టీ ఏర్పాటుకు అదే సరైన సమయం అని కెసిఆర్ నిర్ణయానికి వచ్చారు. కెసిఆర్‌తోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చాలామంది భావిస్తారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 95నుంచే కొన్ని ఉద్యమ సంస్థలు తెలంగాణ కోసం సభలు, సదస్సులు, మేధోపరమైన చర్చలు సాగించాయి. వరంగల్‌లో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించారు. అయితే కెసిఆర్ రంగ ప్రవేశం చేశాక తెలంగాణ ఉద్యమం రాజకీయ రూపం సంతరించకుంది.
తెలంగాణలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో దేశాన్ని ఊపేస్తున్న బిజెపి నేత నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్ వంటి హేమాహేమీలు తెలంగాణలో ప్రచారం చేశారు. వీరందరి లక్ష్యం, గురి -కెసిఆర్‌పైనే. అందరి లక్ష్యం ఒక్కరే అయినప్పుడు తెలంగాణలో అతని బలమెంతో తెలుస్తోంది.
మీడియా, అంగబలం, ఆర్థికబలం, కులబలం ఇవన్నీ ఒకవైపు, కెసిఆర్ నాయకత్వం ఒకవైపు.

తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ చెబితే, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్వాతంత్య్ర సమరయోధులకు క్రెడిట్ ఇస్తామా? స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్‌వాడికి క్రెడిట్ ఇస్తామా? అని కెసిఆర్ ప్రశ్నిస్తారు. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా 2001 నుంచి పదమూడేళ్లపాటు రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ చుట్టూ తిప్పిన ఘనత కేసీఆర్‌దే.
డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ తెరాస పార్టీని ఏర్పాటు చేశాడు. అప్పటివరకు తెదేపా వారి అంచనా భద్రత కోసం ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగుతాడని, దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. పార్టీ ఆవిర్భావ సభలో నాటకీయంగా కేసీఆర్ నవ్వు ఒక్క రాజీనామా చేయమంటే నేను మూడింటికి చేస్తున్నాను. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి -ఇదిగో రాజీనామా అంటూ వేదికపైనుంచే రాజీనామా లేఖలు అందించడం రాజకీయంగా తెలంగాణ వారిలో కేసీఆర్‌పై విశ్వసనీయత కలిగించింది. నాయకులు, మీడియా, ప్రత్యర్థులు ఎవరైనా కావచ్చు కేసీఆర్ విశ్వసనీతను దెబ్బతీయడానికి చేసిన తీవ్ర ప్రయత్నాలు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ విశ్వసనీయతను పెంచాయి. 

1954లో జన్మించిన కెసిఆర్ 83లో తొలిసారిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి మదన్‌మోహన్ చేతిలో ఓడిపోయారు. 85లో గెలిచారు. తరువాత ఓటమి ఎరుగలేదు. 90వ దశకంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కరువు మంత్రిగా చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. కారు గుర్తుతో సైకిల్‌ను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

1 వ్యాఖ్య:

  1. కాంగ్రేసుకు కాలం చెల్లింది. తెలంగాణాలో మిగిలిన అన్ని పార్టీలు బిజెపితో సహా అన్ని సీమాంధ్ర పార్టిలె ఒక్క తెరాసా తప్ప. తెలంగాణా కాంగ్రేసులో కెవిపి రాజకీయం ఓపెన్ సీక్రెట్. వీల్లందరికి బుద్ది చెప్పటానికి అయినా తెలంగాణా రాష్ట్ర సమితికె ఓటు వెయ్యాలి.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం