26, ఏప్రిల్ 2014, శనివారం

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిన సామెత.. ప్రత్యామ్నయ -జెపి


అంద రికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట! ఈ సామెతలానే ఉంటుంది -లోక్‌సత్తా జాతీయాధ్యక్షుడు నాగబైరవ జయప్రకాశ్ నారాయణ రాజకీయ వ్యవహారం. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సత్తా పుట్టిందని చెప్పే జెపి -తాను పోటీ చేసే నియోజక వర్గం ఎంపికలో మొదటినుంచీ సాంప్రదాయ రాజకీయాలనే ఆశ్రయించారు.

1994 మేలో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయనను దించేసే వ్యూహ రచన సాగింది. ఆగస్టు గండం ఈసారి ఎన్టీఆర్‌ను రక్షించలేకపోయింది. చిన్నల్లుడు, పెద్దల్లుడు ఒక్కటయ్యారు. అయినా అప్పటికీ వారి వద్ద మెజారిటీ ఎమ్మెల్యేలు కూడలేదు.


-‘అసెంబ్లీ రద్దు చేస్తానని ప్రకటించండి. జారిపోయిన ఎమ్మెల్యేలు భయపడి వెనక్కి వస్తారు’ అంటూ ఓ ఆసామీ ఎన్టీఆర్‌కు సలహా ఇచ్చాడు. సలహా నచ్చడంతో -ఎన్టీఆర్ ప్రకటించేశారు. అంతే -సీన్ రివర్సయ్యింది. ఎన్టీఆర్ దెబ్బకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు వెనక్కి రాలేదు. వెనక్కి వెళ్దామా అన్న ఆలోచనల్ని కూడా బుర్రల్లోంచి తుడిచేశారు. సరికదా -ఎన్టీఆర్‌తో ఉన్నవాళ్లూ అల్లుళ్ల వద్దకు పారిపోయారు. ఎన్టీఆర్‌కు ఈ సలహా ఇచ్చింది -ఆయన వద్ద ఐఏఎస్ అధికారిగా కీలకస్థానంలో ఉన్న జయప్రకాశ్ నారాయణ అని అప్పట్లో వినిపించిన మాట.
తరువాత జెపి ఎక్కువ రోజులు పదవిలో ఉండలేదు. లోక్‌సత్తా పేరిట సంస్థ స్థాపించారు. స్థానిక సంస్థలకు అధికారాలు, గ్రామ స్వరాజ్యం కోసం సంస్థ తరుఫున పలు సదస్సులు నిర్వహించారు. లోక్‌సత్తాను 2006లో రాజకీయ పార్టీగా మార్చారు.

సాంప్రదాయ రాజకీయాలకు భిన్నం -ప్రత్యామ్నాయ రాజకీయం. అదేంటో చూపిస్తామంటూ జెపి అట్టహాసంగా ప్రకటనలు గుప్పించారు. ప్రారంభంలో లోక్‌సత్తా పట్ల యువత బాగానే ఆకర్షణకు గురైంది. ‘కులం, మతం, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం సాంప్రదాయ పార్టీల నైజం. లోక్‌సత్తా దీనికి భిన్నం’ అని జెపి ప్రకటించారు. అయితే -పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే లోక్‌సత్తా సాంప్రదాయ రాజకీయానే్న అనుసరించింది. తమ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిని జెపి పోటీకి సురక్షిత స్థానంగా ఎంపిక చేసుకోవడం సాంప్రదాయ రాజకీయమే. ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు. కానీ సాంప్రదాయ పార్టీలు గెలుపు గుర్రాలంతా దీన్ని ముద్దుగా పిలుచుకుంటాయి. అంటే ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎవరైతే గెలుస్తారు? అనే లెక్కలన్నమాట. చివరకు ఇప్పుడు జెపి అదే లాజిక్కుతో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.

లోక్‌సత్తాకు 2009 ఎన్నికల్లో రెండు శాతం వరకు ఓట్లు రావడంతో కాంగ్రెస్ కుట్రలో భాగంగానే లోక్‌సత్తా పుట్టిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ బృందం తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మనిషి కనుకే జెపికి నామినేటెడ్ పదవిని సోనియా గాంధీ కట్టబెట్టిందనేది తెదేపా ఆరోపణలకు ఆధారం. 2009 ఎన్నికల వరకూ తెదేపా, లోక్‌సత్తా తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి. చివరకు ఏం జరిగిందో తెలీదుకానీ, ఇప్పుడు -దేశానికి మోడీ, రాష్ట్రానికి బాబు, హైదరాబాద్‌కు జెపి కావాలని జెపి నినాదం ఇస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ ప్రచారం చేసిన జెపికి మోడీలో కనిపించిన ప్రత్యామ్నాయ రాజకీయం ఏమిటి? అనే విమర్శ వినిపిస్తోంది. 1980 ఐఏఎస్ అయిన జెపి అధికారిగా ఉన్నప్పుడు, లోక్‌సత్తా సంస్థను నిర్వహించినప్పుడు మంచి పేరే సంపాదించారు. జెపికి నామినేషన్ వేసేందుకు రాజమౌ ళి కావాలి, ప్రచారానికి పవన్ కల్యాణ్, గెలవడానికి మోడీ కావాలి. ఇవి అవకాశవాద రాజకీయాలుకావా? అన్నది మల్కాజిగిరిలో జెపితో పోటీ పడుతున్న స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేదెవరు?

4 కామెంట్‌లు:

  1. మేధావి ముసుగులో అంతఃపుర రాజకీయాలు & వ్యక్తిపూజ ఆయన రాజకీయ జీవితానికి ఆయువుపట్టులు. ఆయన చంచాలకు మాత్రం ఇవేవీ పట్టవు.

    రిప్లయితొలగించండి
  2. ayana kamma kula abhimani. ayana chandrababu, ramoji abimani. mekavanne puli

    రిప్లయితొలగించండి
  3. మనదేశంలో ఇదో పెద్ద సమస్య.
    ఎవడైనా నేను మంచిగా ఉంటానంటే, వాడు చిన్న తప్పు చేసినా విమర్శిస్తారు.
    అదే మిగతావాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వాడంతే అని పట్టించుకోరు.
    చిన్న తప్పులు చేసే వాళ్ళని క్షమించి ప్రోత్సహిస్తే అలాంటివాళ్ళ సంఖ్య పెరిగి పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది.
    వ్యవస్థలలో లోపాలు సరిదిద్దేవరకూ, చిన్న తప్పు కూడ చెయ్యకుండా ఎవడూ బతకలేడు ఈ దేశంలో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. An individual can claim to be good, no problem. However holier-than-thou language (& body language) is not appropriate, more so when the individual applies this selectively & without any proof.

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం