1, సెప్టెంబర్ 2014, సోమవారం

మోదీ చూస్తున్నాడు!!

కుటుంబరావు టైమ్‌కు ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఎప్పటి మాదిరిగానే క్యాంటిన్‌కు వెళ్లాడు. అక్కడ తన కన్నా ముందే మిత్రులు చేరుకున్నారు.
బ్రహ్మచారి భాస్కరంను ఎందుకొచ్చావని ఎవరూ అడగరు! అతను ఇంట్లో కన్నా క్యాంటిన్‌లోనే ఎక్కువ సమయం ఉంటాడు కాబట్టి!
ఈ దేశానికి మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది భాస్కరం ఆశావాదిలా అనేశాడు. ‘‘పైకి కారణాలు మీరేం చెప్పినా మీరంతా ఆఫీసుకు తొందరగా ఎందుకొచ్చారో? నాకు తెలుసు’’అని భాస్కర్ ముసిముసిగా నవ్వాడు. విషయం అర్ధమై మిగిలిన ఇద్దరూ నవ్వుకున్నారు.


ఎందుకైనా మంచిది కాస్త మెల్లగా మాట్లాడుకుందాం అసలే గోడలకు చెవులుంటాయంటారు అని పరాంకుశం మెల్లగానే అన్నాడు. అది విని టీ తెచ్చిన కుర్రాడు నిజమే మొన్న మా వీధిలో కూడా ఇదే సంగతి మాట్లాడుకున్నాం. పని మనిషి రంగి మొగుడు పచ్చి తాగుబోతు కల్తీ మద్యం తాగుతాడు. ఆ రోజు మద్యం అమ్మే వాడు షాపు మూసుకొని పారిపోయాడట! ఏమైందా అని తెలుసుకుంటే మోదీ ఫోన్ చేసి పేదల జీవితాలతో ఆడుకుంటావా? ఖబడ్దార్ అని హెచ్చరించాడట ఆ దెబ్బతో వాడు షాపు మూసుకొని వెళ్లిపోయాడు’’ అని టీ కుర్రాడు చెప్పుకొచ్చాడు. ‘‘మా టీ కుర్రాళ్ల జాతికే మోదీ గొప్ప పేరు తెస్తున్నాడు’’ అంటూ ఆ కుర్రాడు అచ్చం తెలుగుసినిమాలోలానే భావోద్వేగానికి గురై కళ్లుతుడుచుకున్నాడు.
పరాంకుశం ఆ కుర్రాడి వంక అనుమానంగా చూస్తూ ఏరా మేం విన్నవన్నీ కొంపదీసి మోదీకి చెప్పవుకదా? అని అడిగాడు. బాబుగారూ నాకు తెలుగు తప్ప మరోభాష రాదు, హిందీ వచ్చి ఉంటే చెప్పేవాడినేమో అంటూ వాడు ఏటూ కానీ సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. గోడలకు చెవులుంటాయంటారు మనం కాస్త మెల్లగా మాట్లాడుకోవడం మంచిదని పరాంకుశం, కుటుంబరావులు నిర్ణయానికి వచ్చారు.


భాస్కర్ నవ్వుతూ ‘‘మీరు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. ఈ హోటల్ గోలలో మనం మాట్లాడుకునేది మనకే సరిగా వినిపించడం లేదు. ఇక మనం మాట్లాడుకునే ఇంతోటి గొప్ప విషయాలను ఎవరో విని మోదీకి చేరవేస్తే మోదీకి మరీ పని పాటా ఏమీ లేక మనకు ఆయన ఫోన్ చేస్తాడా?’’ అని అడిగాడు.


కుటుంబరావు కాస్త సీరియస్‌గానే.. ‘భాస్కర్ నువ్వు అన్నింటిని తేలిగ్గా తీసేస్తున్నావు కానీ నీకు విషయం తెలియదు. పత్రికలు చదవడం లేదా? మొన్నటికి మొన్న ఒక పెద్ద ఉద్యోగం కోసం రాజ్‌నాథ్‌సింగ్ ఆయన కొడుకు ఒక వ్యక్తి వద్ద కోటి రూపాయలకు బేరం ఆడుతుంటే ఇంతలోనే అక్కడున్న ముగ్గురి సెల్‌ఫోన్‌లు ఒక్కసారే మ్రోగాయి. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను మందలించిందా స్వరం. ఏమోయ్ ఉద్యోగం కోసం కోటి రూపాయల లంచం బేరమాడతావా? అంటూ అబ్బాయిని మందిలించిందా స్వరం. కోటి రూపాయలిచ్చి ఉద్యోగం కొట్టేసి ఎన్ని కోట్లు కొట్టేయాలనుకుంటున్నావు అని ఆ పెద్ద మనిషిని చీవాట్లు పెట్టిందా స్వరం. ఏక కాలంలో ముగ్గురిని మందిలించిన ఆ సర్వం మోదీదే అని మీడియాలో వచ్చింది అంటూ తాను చదివిన విషయానికి విన్న విషయాన్ని కొంత మసాలా జోడించి ఆసక్తికరంగా చెప్పాడు కుటుంబరావు.


పరాంకుశం జోక్యం చేసుకుని ‘‘ఔను నేను కూడా విన్నాను మా బాబాయ్ కొడుకు ఢిల్లీలో ఇంగ్లీష్ పేపర్‌లో పని చేస్తున్నాడు. వాడు మొన్న ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పాడు. ఓ మంత్రి ఒక వ్యాపారితో కలిసి హోటల్‌కెళ్లి ఏదో దందా గురించి బేరమాడుతుంటే ఇంతలోనే మంత్రిగారి ఫోన్ రింగైంది.. ‘‘ఏం తిక్కగా ఉందా? ఆ బడాసేఠ్ ఎలాంటి వాడో తెలుసా? వాడిలో ఆవగింజంత దేశభక్తి కూడా లేదు వాడితో నీకు బేరాలేంటి ఇంకోసారి ఇలాంటి బేరాల్లో కూర్చున్నావంటే ఉద్యోగం ఊడుతుంద’’ని మోదీ బెదిరించే సరికి ఆ మంత్రికి చెమటలు పట్టి ఆఫీసుకు పరుగు పెట్టాడు. తోటి మంత్రికి ఫోన్ చేసి తన బాధ చెప్పుకుంటే ఇంకా నయం నేను ఆఫీసుకు అరగంట లేటుగా వచ్చానని ఫోన్ చేసి మోదీగారు తలంటు పోశారు. అంటూ ఆ మంత్రి ఏడ్చాడట! మనం ఫోన్‌లో మాట్లాడుకునే విషయాలు మోదీసాబ్ వింటారేమో అని భయపడి లైన్ కట్ చేసి బుద్ధిగా పనిలో పడ్డారట!’’ అని చెప్పాడు పరాంకుశం.


అది సరే మోడీ ఒకే సమయంలో అంత మంది ఏం చేస్తున్నారో చూడడం వారికి ఒకేసారి ఫోన్ చేయడం విడ్డూరంగా లేదూ? అని భాస్కరం సందేహం వ్యక్తం చేశారు.
‘‘నీలాంటి వారికి జ్ఞానుల పనులు అనుమానంగానే ఉంటాయి. ఉత్తరాఖండ్ వరదలప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ తమ రాష్ట్రానికి చెందిన వేలాది మందిని వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించుకు వెళ్లాడా? లేదా? అంతెందుకోయ్ శ్రీకృష్ణుడు 16వేల మంది గోపికలతో ఒకే సమయంలో ఉన్నాడా? లేదా? ఇదీ అంతే’’.. అని కుటుంబరావు ముక్తాయించాడు.


శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా జన హృదయాలను దోచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా ఇలాంటి మాటలే వినిపించేవి. గాంధీ ఆస్పత్రిలో గేట్ కీపర్ డబ్బులు అడుగుతుంటే రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారని ఒకరు. ప్రభుత్వ ఆఫీసులో లంచం అడిగితే చాచి లెంపకాయ కొట్టి పేదవాడి పని ఉచితంగా చేయించి పంపారని రకరకాల కథలు వినిపించేవి. వాటిలో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ ఎన్టీఆర్ రాగానే ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాల ధరలు మాత్రం అమాంతం పెంచేశారు ఏంటయ్యా అని అడిగితే ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్, రిస్క్ పెరిగినప్పుడు చార్జ్ కూడా పెంచక తప్పదన్నారు’’ అని భాస్కర్ ఆనాటి విషయాలు గుర్తు చేశాడు.
‘‘ఔను నిజమే ఐతే ఏంటి’’ అని ఇద్దరూ కోరస్‌గా అడిగారు.
‘‘ గాంధీ ఆస్పత్రిలో గేట్ కీపర్, గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌లు ఏం చేస్తున్నారో కూడా ఎన్టీఆర్ నిరంతరం గమనించేవారని జనం నమ్మేవారు. లక్షలాది మంది ఉద్యోగులపై నిఘా సంగతి పక్కన పెట్టి నట్టింట్లో అల్లుడు గారే కత్తి నూరుతున్నారనే విషయం మామకు గద్దె మీది నుంచి కింద పడి, ఆస్పత్రిలో చేరేంత వరకు అర్ధం కాలేదు ’’అని భాస్కర్ నవ్వి, 


‘‘ పార్టీలో నంబర్ టూ అంటూ ఎవరూ లేకుండా మొదట్లోనే మొదళ్లను నరుక్కుంటూ వస్తున్నాడు కాబట్టి మోదీకి అలాంటి ప్రమాదమేమీ లేదనుకో’’ అని భాస్కరే ఆ ఇద్దరిని సముదాయించాడు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం