31, మే 2011, మంగళవారం

ప్రధాన మంత్రి , ముఖ్యమంత్రి ..నేను .....................సికింద్రాబాద్ కథలు 3

ప్రధాన మంత్రి , ముఖ్యమంత్రి ..నేను ....

మీ ఆయనకు ప్రధాన మంత్రి తెలుసా ?  అంటూ మా ఇంటి ఓనర్ కూతురు ఇంట్లోకి పూర్తిగా అడుగు పెట్టకుండానే ప్రశ్న సంధించింది. ప్రధానమంత్రే కాదు అమెరికా అధ్యక్షుడు కుడా నాకు తెలుసు కాని నేనే వాళ్ళకు తెలియదు అని పాత జోక్ చెబుదామనుకున్నా , కాని ఆమె నామాట వినేట్టుగా లేదు .   ఇంటి  ఓనర్ కూతురు మా ఆవిడను ఆశ్చర్యంగా అడిగితే మా ఆవిడా అదేం ప్రశ్న అన్నట్టు గందర గోళం తో   కూడిన ఆశ్చర్యంగా ముఖం పెట్టింది . ఆశ్చర్యానికి, ఆశ్చర్యం ఎప్పుడూ సమాధానం కాదు. ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే మా ఆవిడ ముందు  ఆమె వైపు, తరువాత  నా వైపు  ప్రశ్నార్థకంగా చూసింది . నీకు ప్రదాని తెలుసన్న విషయం నాకు తెలియదు కాని ఆమె కెలా తెలుసు అని నన్ను   ప్రశ్నిస్తున్నట్టుగా  అనిపించిది నాకు  ఆ చుపునకు అర్థం . ప్రదాని నాకు తెలుసన్న విషయం ఆమె చెప్పేంత వరకు నాకే తెలియదు ఇక నీకేం  చెబుతాను అన్నట్టుగా మా  ఆ విడ  వైపు  సంజాయిషి ఇస్తున్నట్టు చూశా..   తన ప్రశ్నకు కారణం అన్నట్టు ఓనర్ కూతురు మా ఇంట్లో  ఓ మూలకు బిక్కు బిక్కు మంటూ పడి ఉన్న ఫోటో  చేతిలోకి తీసుకుంది.  నిజమే   ఆ ఫోటోలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి , నేను ఉన్నాను.
 ************
1995 లో వరంగల్ నుంచి హైదరాబాద్ బదిలీ అయ్యాక . సికింద్రాబాద్ వారసిగూడ లోని బ్రాహ్మణ  బస్తీలో ఉండే వాళ్ళం  . కొద్ది రోజుల తరువాత ఇల్లు  చిన్నగా మనుషులు పెద్దగా ఉన్నట్టు సందేహం వచ్చింది .మనుషులను చిన్నగా చేయలేం , అలా అని ఇంటిని పెద్దగా చేద్దామంటే ఇంటి  ఓనర్ ఒప్పుకోడు .. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది .అది కాశ్మీర్ సమస్య కావచ్చు , తెలంగాణా,  సమైక్యాంధ్ర  సమస్య కావచు పరిష్కారం మాత్రం ఉంటుంది .ఇంట్లో ఉన్న  వస్తువుల సంఖ్య    తగ్గిస్తే  ఇల్లు పెద్దదవుతుందని నిర్ణయించుకున్నాం .  ఆ నిర్ణయం లో భాగంగానే ఆ మూలనున్న వస్తువులను బయటకు తీసినప్పుడు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి నేను ఉన్న ఫోటో బయటకు వచ్చింది .ఫోటో లో డజను మందిమి ఉన్నాం. ప్రదానమంత్రి నీ, ముఖ్యమంత్రిని ని    ఆందరూ గుర్తు పడతారు, వాళ్ళింట్లో అద్దెకు ఉన్నాం కాబట్టి నన్ను గుర్తు పట్టారు. అందువల్ల వాళ్ళ దృష్టిలో ప్రదాని, ముఖ్యమంత్రి , నేను దిగిన ఫోటో అనిపించింది . అప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఇంటి ఓనరు కూతురు గౌరవ  భావనతో చూడసాగారు. 

********
94 లో పివి నరసింహారావు ప్రదానమంత్రి, కోట్ల విజయ  భాస్కర్ రెడ్డి  ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రదాన మంత్రి హోదాలో తోలి  సారిగా పివి నరసింహారావు వరంగల్ వచ్చారు . టివిల గందరగోళం లేని కాలమది . ఐదారుగురు జర్నలిస్టులు మాత్రమే ఉండేవారు. పివి సొంత ప్రాంతం కాబట్టి  ఆర్భాటం లేకుండా మాములుగానే ఉన్నారు దాంతో ప్రెస్ క్లబ్ తరపున అందరితో ఫోటో దిగారు. అక్కడ నేను కాకుండా ఒక అప్పారావు ఉన్న ఫోటో దిగేవాడు అందులో నా ప్రత్యేకత ఏమి లేదని ఫోటో ను పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నా అభిప్రాయం అదే . ఇంటి ఓనర్ హిందీ టిచర్ ౩౦౦ గజాల స్థలం ఉంటే సగం స్థలంలో ఇల్లు కట్టాడు . ఇంటి మీద పెట్టిన పెట్టుబడి అంతా డేడ్ ఇన్వెస్ట్ మెంట్ మీరు తప్పు చేసారు అంటూ ఆతను కనిపించినప్పుడల్లా క్లాస్ తీసుకునే వాడిని. (నెలనెలా అడగక ముందే అద్దె చెల్లించే వారికి ఈ అదనపు సౌకర్యం ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది . స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు రిటైర్ అయ్యే నాటికి ఎక్కడికో వెళ్లి పోతారని సలహా ఇచ్చాను . ఏమోనండి నాకు అవన్నీ తెలియవు రేపు అద్దేతోనైన బతక వచ్చునని ఇంటి మీదే ఇన్వెస్ట్ చేసానని చెప్పాడు,... 
*****
*ప్రముఖులతో ఫోటోలు దిగడానికి ఉత్శాపడే వారిని నేను చిన్నచూపు చూసేవాడిని. ఇప్పుడు నా అభిప్రాయం మారింది  కాలాన్ని ఒక్క క్షణం కూడా నిలుప లెం , ఇక  జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తేగలమా.?  ఫోటోలు ఆ పని చేయగలవు ఒక్కసారి కాలాన్ని గిర్రున వెనక్కి తిప్పగలవు. సంతోషంలో తేలియాడి పోయేట్టు చేయగలవు. ఒక్క మాట మాట్లాడకుండానే జీవిత గ్రంధాన్ని చదివి వినిపిస్తాయి. ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ అంటే చిన్న చూపు  .. రిటైర్ అయ్యే నాటికి అద్దెలు వచ్చే బిల్డింగ్ కట్టేయాలనేది నేటి నా ఆలోచన ..ఇది నా ఇప్పటి ఆలోచన ..  ఏమో ఆ రోజు వచ్చే సరికి మరే  ఆలోచన మనపై దాడి చేస్తుందో .. ఇప్పుడు నేను స్కూల్ లో గ్రూప్ ఫోటో కోసం చిన్న నాటి మిత్రుల కోసం వెతుకుతున్నా.... ఈ ఆలోచన ఎన్ని రోజులు ఉంటుందో. ప్రతి క్షణం మనిషి మారుతుంటాడని ఓషో రజనీష్ చెప్పింది నిజమే అని ఇప్పటికైతే అనిపిస్తుంది . .....

7 కామెంట్‌లు:

  1. ఎప్పటిలాగే ఈ పోస్టును కూడా జనరంజకంగా రాసారు. ఎత్తుగడ,ముగింపు కూడా బాగానే కుదిరాయి ఈ చిన్న టపాకి, నిజానికి విషయం చాలా చిన్నదైనా.
    సికిందరాబాద్ కథలంటే సికింద్రాబాద్ లో ఉన్నప్పటి మీ కథలు కూడానన్నమాట.

    రిప్లయితొలగించండి
  2. good one.
    నేను హైదరాబాదులో ఉన్నప్పుడు అద్దెకున్న అపార్ట్‌మెంట్ ఓనర్ నన్ను పెద్ద పట్టిచ్చుకునే వాడు కాదు. ఆయన ప్రతిరోజూ బేగం పేట్ కుందన్‌బాగ్ మినిస్టర్ బంగలాల వేపు సాయంత్రం షికారు వెళ్ళేవాడు. ఒక రోజు నన్ను హోం మినిస్టర్ (అప్పట్లో దేవేందర్ గౌడ్) బంగలాలోనించి బయటికొస్తుంటే చూశాడు. ఇక అప్పణ్ణించీ చాలా గౌరవంగా ఉండేవాడు :)

    రిప్లయితొలగించండి
  3. @ మృత్యుంజయ థాంక్స్. సమాజాన్ని పరిశీలించకపోతే బలి చక్రవర్తులమైపోతం సమాజం కోసం కాక పోయినా మన కోసమైనా సమాజాన్ని పరిశీలించాలి. .@కొత్త పాళీ గారు థాంక్స్ ....

    రిప్లయితొలగించండి
  4. సుధా గారు చాలామంది తమతమ గ్రామాల గురించి రాస్తున్నారు. miru నాగ వళి గురించి రాసినట్టు. నేను చిన్నప్పటి నుంచి సికింద్రాబాద్ లోనే ఉన్నా కాబట్టి నాకు గుర్తున్నవి ఆసక్తి కలిగిస్తాయనుకున్నవి రాయాలనే ప్రయత్నం ... విషయం బాగుందనుకుంటే సికింద్రాబాద్ ప్రస్తావన లేకపోయినా రాస్తా. రాసే నేను సికింద్రాబాద్ లో ఉన్నా కాబట్టి ఆవిధంగా సికింద్రాబాద్ తో సంబంధం ఉన్నట్టే

    రిప్లయితొలగించండి
  5. మీరు రాసారని రాయడం కాదు. నాకూ ఇలాటి అనుభవాలు వున్నాయని చెప్పడానికే సుమా!
    ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
    ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్ అనాలా?)లో ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే – అక్కడినుంచి మూడో ఇల్లే మాది – మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో బాగా వెనగ్గా వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు భవనం వెంకట్రాం కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.
    నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.
    ఏవయినా అవి బంగారు రోజులు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీనివాసరావు గారు మీ సినియారిటీ నాకు తెలుసు ..

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం