13, జులై 2011, బుధవారం

ఇట్లు మీ విధేయుడు.....తారకరాముడు లక్ష్మీపార్వతి విధేయుడిగా మారిన విధంబెట్టిదనిన ....



తెలుగుభాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అంటూ ఒక్కో హీరో ఒక్కో పదం చెబుతున్నాడు. ఇంకా నయం ఆ హీరోల వీర విధేయులైన అభిమానులు ఆ పదాలను పలకడం మానేస్తే? ఇంకేమన్నా ఉందా? తెలుగు భాషలో పదాలు మిగులుతాయా? అసలే తెలుగు అంకెలు మాయమయ్యాయి.
 కొందరు నా నిఘంటువు- డిక్షనరీ- లో పలానా పదం లేదంటే, కొనేప్పుడు చూసుకోవద్దాఅని కొందరు పరాచికాలాడుతారు.కొందరి నిఘంటువులో కొన్ని పదాలు ఉండకపోవచ్చు, కొందరికి కొన్ని పదాలు నచ్చకపోవచ్చు. కానీ అందరికీ నచ్చే పదాలు - ‘‘ఇట్లు మీ విధేయుడు....’’ ఇ- మెయిల్స్ సెల్‌ఫోన్లు వచ్చాక ఉత్తరాలు కనిపించకుండా పోయినందుకన్నా అందులో తప్పని సరిగా కనిపించే ఇట్లు మీ విధేయుడు పదం కనిపించకుండా పోయినందుకు చాలా మంది బాధపడుతున్నారు.

మనకొచ్చిన ఉత్తరంలో నైనా మనం రాసిన ఉత్తరంలో నైనా, ముగింపులో ఉండే ఇట్లు మీ విధేయుడు అనే పదాలు చదవగానే మనసు ఉత్సాహంతో తేలిపోతుంది ! మనకు ఉత్తరం రాసిన వారు ఇట్లు మీ విధేయుడు అని ముగిస్తే మనకూ ఒక విధేయుడున్నాడని మన అహం గాలిలో తేలిపోతుంది. మనం రాసిన ఉత్తరాన్ని ఇట్లు మీ విధేయుడు అని ముగిస్తే పాపం పిచ్చోడు నమ్మేసినట్టున్నాడు, అని మనసు ఆనందంతో గెంతుతుంది.
వికటకవిని ఎటు నుండి చదివినా ఒకలానే ఉన్నట్టు ఇట్లు మీ విధేయుడును మనం రాసినా, మనం చదివినా ఒకే విధమైన సంతృప్తిని ఇస్తుంది.



 రావణ వధ తరువాత శ్రీరాముడి పట్ట్భాషేకం వేడుకగా సాగింది. విజయం సాధించిన సంతోషంతో శ్రీరాముడు అందరికీ తలా ఒక బహుమతి ఇచ్చాడు. తనకు అత్యంత విధేయుడైన హనుమంతుడికి ఒక ముత్యాల హారం ఇచ్చాడు. హనుమంతుడు ఆ హారంలోని ఒక్కో ముత్యాన్ని నోటితో కొరికి పారేయడాన్ని సీతారాములు చూశారు. తన అత్మీయ విధేయుడు తమను ఆవమానించినట్టుగా భావించి, ఎందుకలా? అని ప్రశ్నిస్తారు. నా రాముని పేరు లేని ముత్యం నాకెందుకు అందుకే ఇలా అంటాడు హనుమంతుడు. విధేయత అంటే ఇది అని సీతారాములు మురిసిపోతారు. అది త్రేతాయుగం కాబట్టి అంతటి విధేయతకు మురిసిపోయారు కానీ ఈ కలియుగంలో అంత విధేయత చూపిస్తే, హనుమంతున్నైనా! అనుమానించాల్సిందే.


 నేను చాలా సిన్సియర్‌నండి అంటూ ఎవరైనా వచ్చి విధేయత చూపిస్తే, కమల్‌హాసన్ అనుమానంగా చూస్తాడట! మరో మాయగాడు వచ్చాడని అనుమానిస్తాడట ఈ విషయం ఈ మధ్య స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు....చిన్నపిల్లలలను గమనించి చూడండి వారు పసిపిల్లలంటే ముచ్చటపడుతారు. దీనికి కారణం తెలుసా? ఇటీవలే మానసిక శాస్తవ్రేత్తలు వెల్లడించారు. వయసుతో సంబంధం లేదు, ఏ వయసులో ఉన్నవారైనా తమకు విధేయంగా ఉండేవారుంటే బాగుండు అనుకుంటారు. అందుకే పిల్లలు తమకు విధేయంగా ఉండే పసిపిల్లలను ఇష్టపడతారని తేల్చి చెప్పారు.


 దేవుళ్లే తమకు విధేయులుండాలని కోరుకున్నప్పుడు మనుషులు కోరుకోవడంలో వింతేముంది. అమెరివాడు ప్రపంచ మంతా తమకు విధేయులై ఉండాలని కోరుకుంటాడు. తమ కోరికలో న్యాయం ఉందని ఆ మధ్య ఆమెరికా మంత్రిణి ఒకరు బహిరంగాగానే తమ వాదన వినిపించారు. అమెరికా వాడు కనుగొన్న ఆవిష్కరణలన్నీ ప్రపంచంలోని మనుషులందరికీ చెందినప్పుడు అమెరికా బాధ ప్రపంచ బాధ కావలసిందే అమెరికా అధికారం ప్రపంచ వ్యాప్తం కావలసిందే! అని చెప్పుకొచ్చారు. గతంలో రష్యాకు విధేయులా? అమెరికాకు విధేయులమో తేల్చుకోలేక కొన్ని దేశాలు సతమతమయ్యేవి. ఇప్పుడా సమస్య లేదు మేం అమెరికా విధేయులం అని చెప్పుకోవడానికి దేశాలు పోటీ పడుతున్నాయి.


 వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడ్డవాళ్లు కూడా విధేయతకు పడిపోవలసిందే. సినిమా రంగంలో ఎంతో మంది సుందరాంగులను చూసిన ఎన్టీఆర్ అంత పెద్ద వయసులో అలా ఎలా అయ్యారు? మనసు ఎలా పారేసుకున్నారు అని చాలా మందికి ఇప్పటికీ అంతు చిక్కని విషయం.


 విధేయతే అని బాగా తెలిసిన వారంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా తీరిగ్గా ఉన్న సమయంలో అన్నగారికి జీవిత చరిత్ర రాయించుకోవాలనిపించింది. దాని కోసం అప్పటి లబ్దిప్రతిష్టులైన రచయిత్రులు కొందరిని పిలిపించారు. అన్నగారు బయటకు వచ్చే సమయానికి అంతా తమకు కేటాయించిన ఉచితాసనాలపై కూర్చోగా, లక్ష్మీపార్వతి మాత్రం హఠాత్తుగా కింద కూర్చున్నారు. అప్పుడే వేంచేసిన తారకరాముడు అదేమిటమ్మా మీరు అలా కింద కూర్చున్నారు అని రాగానే ఆమెనే పలకరించారు.
 మీరు కనిపించే దైవం, కలియుగ శ్రీరాములు, జ్ఞాన సంపన్నులు మీ ముందు నేను కూర్చోవడమా? అన్నారట! ఆ విధేయతకు తారకరాముడు మురిసిపోయాడు. ఆ మాటలు ఎక్కడో తాకాయి , ఆ దెబ్బతో తారకరాముడే ఆమెకు విధేయుడయ్యారు. అన్నిచోట్ల అందం పని చేయదు కొన్నిచోట్ల విధేయత మాత్రమే పని చేస్తుంది.


మాయలపకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు గొప్పవారి ప్రాణాలు విధేయుల చేతిలో ఉంటాయి. ఎన్నో పక్షులు ఉండగా మాయలపకీరు తన ప్రాణాన్ని చిలుకలోనే ఎందుకు పెట్టాడు? కుక్క అరుస్తుంది, కరుస్తుంది, కానీ చిలుక మాత్రం అరవదు, కరవదు, మనం చెప్పినట్టు పలుకుతుంది. అత్యంత విధేయతగల జీవి చిలుక అని ఫకీరు గ్రహించే ఆ పని చేశాడు. జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు కానీ నలుగురు విధేయులను సంపాదించుకోవడం చాలా కష్టం. కన్నవారిపై ఉండే విధేయత కట్టుకున్నవారికి బదిలీకావడం వల్లే మహానగరాల్లో ఓల్డ్‌ఏజ్ హోమ్‌లు పెరుగుతున్నాయట! సరే ఇక ఉంటాను.
 

                                                  -    ఇట్లు మీ విధేయుడు

26 కామెంట్‌లు:

  1. హహహ బావుంది.
    "కొందరు నా నిఘంటువు- డిక్షనరీ- లో పలానా పదం లేదంటే, కొనేప్పుడు చూసుకోవద్దాఅని కొందరు పరాచికాలాడుతారు.".....హిహిహిహి

    మీకూ ఏదో ఒక పదం ఇస్తే చాలనుకుంటా... ఆ పదానికి విధేయులైపోయి ఓ పోస్టే రాసేస్తారు. అందులో అందరినీ ఇరికించేస్తారు కూడా! :)

    రిప్లయితొలగించండి
  2. నిజమే నండి సౌమ్య గారు నేను పద విధేయుడిని ..పదవీ విధేయుడి కన్నా పద విధేయుడు నయం కదండి

    రిప్లయితొలగించండి
  3. సాయి గారు థాంక్స్ సరి చేశాను

    రిప్లయితొలగించండి
  4. ఏమిటో.. ఇట్లు.. మీ విధేయుడు అని తెగ మొహమాట పెట్టేస్తున్నారు. ఇంకేమన్న పదం మీ డిక్ష్త్రనరిలొ మాయమయ్యింది..ఏమో..అది చూసి..వాడండీ..మురళి గారు.హాయిగా మళ్ళీ నవ్వుకుంటాం.

    రిప్లయితొలగించండి
  5. బావుందండీ.. భలే రాసారు.. మొత్తానికి విధేయత అన్ని యుగాలలోనూ పని చేస్తుందన్నమాట.. :)

    రిప్లయితొలగించండి
  6. మొత్తానికి పాఠకుల్ని మీ బ్లాగుకి విధేయుల్ని చేసేస్తున్నారు :)

    రిప్లయితొలగించండి
  7. మాయల ఫకీరు - చిలక లాజిక్ మాత్రం మహ బాగుంది. భలే! ఒక పదం చుట్టూ జరిగిన కథ ని మళ్ళీ తిప్పి, ఇంకో రెండో మూడో దృష్టాంతాలను చూపి "ఔరా!" అనిపించడం లో మీకు మీరే సాటి. :)

    రిప్లయితొలగించండి
  8. మిష్టర్ పెళ్ళాం సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం విధేయతకి బెస్ట్ ఎగ్జాంపుల్.నేను కూడా మిమ్మల్ని అతనిలాగే పొగడుతున్నా...వాటే పోస్టుసార్..వాటే బ్లాగ్ సార్....
    టపా చివర లేటుగా రాసినా లేటెస్టుగా చెప్పిన సత్యం...
    కన్నవారిపై ఉండే విధేయత కట్టుకున్నవారికి బదిలీకావడం వల్లే మహానగరాల్లో ఓల్డ్‌ఏజ్ హోమ్‌లు పెరుగుతున్నాయట!....ఆహహహహ...వాటెనే అబ్జర్వేషన్ సార్...

    రిప్లయితొలగించండి
  9. @ సుధా గారు నచ్చినందుకు థాంక్స్ ( చిన్న అనుమానం ఎమీ అనుకోకండి ఇంతకూ మీరు పొగిడారా? తిట్టారా ?)

    రిప్లయితొలగించండి
  10. మురళిగారు...మీరు అర్థం కానట్టు....నటిస్తున్నారా..? జీవిస్తున్నారా?

    రిప్లయితొలగించండి
  11. @వనజ వనమాలి గారు థాంక్స్. ఇలాంటి సమస్యలు ఉంటాయనే నేను డిక్షనరీలు కొననండి . ( అవసరం ఐతే మా పిల్లల డిక్షనరీలు చూస్తాను . ఏ బుక్ కొన్నా అన్నీ సరిగా చూసి కొనాలని మమ్ములను అంటావు . ఆ హీరో చూడు ఆతను కొన్న డిక్షనరీ లో కొన్ని పదాలు లేల్నే లేవట అయినా అంత గర్వంగా చెబుతున్నాడు వల్ల నాన్న ఏమనడా ? అని మా అమ్మాయి నన్ను నిలదిసినంత పని చేసిందండీ

    రిప్లయితొలగించండి
  12. @ కొత్తావకాయ గారు థాంక్స్ అండీ అందుకే నా అంతటి వాణ్ణి నేను అని చెప్పుకున్నానండి ముళ్ళపూడి వారి స్పూర్తితో

    రిప్లయితొలగించండి
  13. @ప్రసిద గారు నచ్చినందుకు థాంక్స్ ( మనిషికి కృతజ్నత చూపడం కష్టమండి. జి మెయిల్ లో ఆ పదం కంపోస్ చేయడం మరి కష్టం అందుకే థాంక్స్ అంటున్నాను . ప్రసిద అంటే ఏమిటండి )

    రిప్లయితొలగించండి
  14. కొత్త పాళీ గారు మీ అభినందనలకు థాంక్స్ . - ఇట్లు మీ విధేయుడు

    రిప్లయితొలగించండి
  15. మిత్రులు బుద్ధా మురళి గారికి:

    బాగున్నారా? ఇక్కడ నవ్వుల పూల వాన చూస్తే బాగున్నట్టే అనిపిస్తోంది.

    ఇట్లు
    మీ విధేయుడు

    రిప్లయితొలగించండి
  16. @అఫ్సర్ గారు బాగున్నానండి ( అదృష్ట వశాత్తు భూమి మీద నాకెప్పుడు బాగానే ఉందండీ )

    రిప్లయితొలగించండి
  17. సుధా గారు మీ గురువు గారు చెప్పినట్టు జీవితం అన్నాక కాసింత కళాపోసన తో పాటు జివించడానికి కి కాసింత నటన కూడా అవసరమే

    రిప్లయితొలగించండి
  18. @అఫ్సర్ గారు చెప్పడం మరిచాను పేస్ బుక్ లో మిమ్ములను రోజు చూస్తున్నాను

    రిప్లయితొలగించండి
  19. విధేయత గురించి మి క్లాసు బాగున్నది. మీ profile picture కి అర్ధం ఏమిటి? brain wahing(brushing) అనా...? మీ బ్లాగ్‌ని ఒకరోజు తీరికచేసుకొని అస్వాదించాలండీ. మొన్నొకసారి చూసినప్పుడు కొంచెం సీరియస్ మ్యాటరని అర్ధమయ్యింది

    రిప్లయితొలగించండి
  20. ndian Minerva gaaru ఆ profile picture కి అర్ధం అక్కడ picture లేదు అని

    రిప్లయితొలగించండి
  21. విధేయత కు ఈ వ్యంగ్య రచన ద్వారా ఒక కొత్త అర్థాన్ని చెప్పిన మురళి గారికి అభినందనలు

    రిప్లయితొలగించండి
  22. చాలా బాగుందండి. మంచి పాయింట్ గురించి రాశారు.

    రిప్లయితొలగించండి
  23. కృతజ్ఞతా
    krutagnatha

    కృతజ్ఞతా భావంతో వ్రాస్తున్న - ప్రసాదు

    రిప్లయితొలగించండి
  24. భలే భలే!
    ఇన్ని రోజులు మీ బ్లాగు చూడనందుకు చింతిస్తున్నా!

    మీ బ్లాగు విధేయుడు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం