5, జులై 2011, మంగళవారం

త్యాగం లో నా అంతటి వాణ్ణి నేను. .. కోట్ల రూపాయలు త్యాగం చేశాను

నా గురించి నేను చెప్పుకోవద్దు కానీ త్యాగం లో నా అంతటి వాణ్ణి నేను. ఏం త్యాగం చేశారేమిటి అనే కదా అడుగుతున్నారు.  ఈ రోజుల్లో  మనుషులు డబ్బుకోసం దేనికైనా తెగిస్తున్నారు కదా?  వంద రూపాయల కోసం హత్యా అని పతికల్లో బాక్స్ వార్తలు చూస్తున్నారు కదా ? ( వంద కాకుండా ఎక్కువ మోత్హానికి హత్యా చేస్తే వారికి అభ్యంతరం ఉండదేమో )  అలాంటి పరిస్తితిలో నేను వెయ్యి కాదు లక్ష కాదు కొన్ని కోట్ల రూపాయలను త్యాగం చేశాను. నమ్మడం లేదా ? అది ఒకసారి రెండు సార్లు కాదు కొన్ని డజన్ల సార్లు. నా త్యాగం ఒక్కోసారి నాకే ముచ్చటేస్తుంది. . నిజంగా నువ్వు నీ అంతటి వాడివి లేక పొతే ఎవరైనా ఇంత త్యాగం చేస్తారా అని నన్ను నేనే మెచ్చుకుంటాను. సాద్యమైనంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి ఇతరులపై ఆధార పడరాదు. అందుకే అప్పుడప్పుడు నన్ను నేనే మెచ్చుకుంటాను. ఒకటి కాదు రెండు కాదు వంద కోట్లు ఏం చేయాలి బాగా  ఆలోచించాను. సరే అని నేను ఒక్క మాట అంటే వంద కోట్లు వచ్చి పడతాయి.  మనం నమ్ముకున్న విలువలా ? వంద కోట్లా ? సినిమాలో ఐతే ఇలాంటి సందర్భం లో  అద్దం లో మనలోని మన వాడు వచ్చి సలహా ఇస్తాడు. అద్దం ముందు నిలబడ్డా నేనే కనిపించాను. తప్పదు నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి. బాగా ఆలోచించి తాము నమ్ముకున్న విలువల కోసం ఎన్నో పాత సినమాల్లో యన్టిఆర్ ,  అక్కినేని,కృష్ణ  ఎన్ని త్యాగాలు చేశారు . వారి త్యాగాలను చూస్తూ పెరిగిన నేను ఈ మాత్రం త్యాగం చేయలేనా అనుకున్నాను.వంద కోట్లు వద్దు పో అని ఎడమ చేతితో తోసేశాను. నా త్యాగం గురించి ఏ పత్రికలో రాలేదు కాబట్టి మీకు తెలిసి ఉండదు. కొందరు  గుప్త దానాలు చేస్తారు  అలానే నేను గుప్త త్యాగాలు చేశానన్నమాట. 
****
త్యాగాలు నాకు కొత్త కాదు నా జీవితంలో భాగమే. మేం వారాసిగుడా లో  ఉండగా ఎప్పటి మాదిరిగానే ఆ రోజు కుడా కిచులాడుకున్నాక నేను బయటకు వచ్చాను. సాయంత్రం ఫోన్ వచ్చింది. మనను  ఉత్తమ దంపతులుగా ఎంపిక చేశారట  డిన్నర్ కు  పలానా హోటల్కు  వస్తే ఉత్తమ దంపతులకు భారీ గిఫ్టు ఇస్తారట అది సారాంశం . ఫోన్ నెంబర్ తప్పేమో అని అనుమానం వ్యక్తం చేశాను. కాదు అడిగాను మన నంబరే చెప్పారని సమాధానం . ఏమో ఉత్తమ దంపతుల ను ఎంపిక చేసే విధానాలు మార్చారేమో. గొప్పగా చెప్పుకునే  రాజ్యాంగాన్ని ఆరువారాల నగలను  మార్చుతున్నంత  ఈజీగా  నాలుగు వారాలకోసారి మారుస్తుంటే ఉత్తమ దంపతుల  నిబంధనలు మారిస్తే తప్పేముంది  అనుకున్నాను.( ఆదివారం ఆడవారికి సెలవు కావున ఇప్పుడు ఏడు వారల నగలు కాదు ఆరువారాల నగలే )  అయినా నాలోని త్యాగ జివి మేల్కొని ఉచిత బహుమతులు అనుచితం అన్నాను. సరే విషయం తెలుసు కదా అసలు బహుమతి ప్రదానం ఎలా ఉంటుందో ఓ సారి చూసి వస్తే పోయేదేముంది అని శ్రేయోభిలాషులు చెబితే సరే అని వెళ్ళాను. స్టార్ హోటల్ మేము  వెళ్ళే సరికి అక్కడ ఉత్తమ దంపతులు చాల మంది కనిపించారు. కొందరు సొంత బంగారం, కొందరు అద్దె బంగారాన్ని  మెడ నిండా  దిగేసుకొని వచ్చారు .  వారందరినీ  కిడ్నాప్ చేస్తే ఒకటో రెండో క్వింటల్ల బంగారం దొరుకు తుందని అనిపించింది .
ఒక్కో టేబుల్  ఒక్కో జంట . అంత తెలుకుట్టినట్టిన దొంగల్ల ఉండి  పోయారు నేను మాత్రం విజయ గర్వం తో నేను ముందే చెప్పానా? లేదా ?  అన్నట్టుగా  శ్రీమతి ముఖం లోకి చూశాను .మన ప్రతిభను ప్రపంచం అంతా గుర్తించవచ్చు భార్య  గుర్తించడం అంత ఈజీ కాదు 
నేను స్కూల్కు  వెళ్ళను  అని ఏడ్చే పిల్లాడిని బలవంతంగా పంపిస్తే బుజ్జి.. కన్నా అని టిచర్ వాడికి రంగు రంగుల పుస్తకం చూపుతుంది.  మా వద్దకు  అలాంటి బుక్ తోనే ఒకడు వచ్చాడు . ప్రపంచం లో మీరు కానీవినీ  ఎరుగని దేశాలన్నిటిలో వీరికి హోటల్స్ ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయల విలువైన ఆతిధ్యం  మీకు అని చెప్పబోతుండగా నేను ఆసక్తిగా వింటూ  నోరు తెరవడానికి ప్రయత్నించా ను. సందేహం వద్దు అడగండి సార్ అని అతను ఉత్సాహంగా అన్నాడు. నీకు ఇక్కడ జీతం ఇస్తారా ? ఇస్తే ఎంతా అని అడిగాను. జీతం పై కాదు చదువుకుంటున్నాను . రోజుకు ఇంతా అని ఇస్తారు వారు చెప్పమన్నది చెబుతాము అన్నాడు. ట్రాక్ తప్పుతుందని అతను  మళ్లీ  మొదలు పెట్టాడు. నేను కొంత  సేపటి తరువాత నువ్వు చాల బాగా చెబుతున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది నా మాట విని వీడిని వదిలేయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బూం రానుంది అటు వెళ్ళు బాగు పడతావు అని చెప్పను. ..ఇంతలో టపటప మని చప్పట్లు వినిపించాయి .  అందరు చప్పట్లు కొట్టి ఆ జంటను అభినదించమని మాటలు  వినిపించాయి.  ఒక  ఉత్తమ జంట ౩౦ వేల రుపాయాలి చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. దాంతో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా వారి హోటల్స్ లో , రి సర్టులలో చాల చవకగా ఉండ వచ్చునన్నమాట. నాకు అలాంటి ఉచితాలు తీసుకోవడం అస్సలు నచ్చదు.  నా లాంటి  త్యాగ రాజును   నీమాటలు కరిగించలేవు  అని చెప్పాక అతను బేలగా  ముఖం పెట్టాడు. ఇలాంటి త్యాగాలు నాకు లెక్కలేనన్ని ఉన్నాయి ...


***
దూరపు బంధువు మరణించడం వల్ల కలిసొచ్చిన ఆస్తి అంటూ చిన్నప్పుడు పత్రికల్లో చదివినప్పుడు అలాంటి దూరపు బంధువు మనకు ఒకడు ఉండక పోడా  వారికి వారసులు ఎవరు లేకుండా ఏదో ఒక రోజు పోకపోడా అనుకునే వాణ్ణి.  దూరపుబంధువు కాదు కాని అదేదో  ఆఫ్రికా దేశం నుంచి కబురొచ్చింది . ఆ దేశంలో రాజకుటుంబం వద్ద బోలెడు డబ్బు ఉంది . వారికి ఎందుకో నా మీద  ప్రేమ పుట్టింది. సహజమే తెలుగు వాడిని సాటి తెలుగు వాడు ప్రేమించక పోవచ్చు కాని  ఆఫ్రికా వాడు ప్రేమించావద్దని లేదు కదా? ఆసక్తి ఉందని చెబితే కొన్ని కోట్ల డాలర్లు పంపుతానని అన్నాడు.
 మోహన్ దాస్ కరం చాంద్ గాంధీ , పోరుబందర్ అంటూ వివరాలు పంపాను . ఆ వెంటనే అక్కడి నుంచి సమాదానం రావడంతో నా కళ్ళు చెమర్చాయి. గాంధీని మనం మర్చిపోతున్నాం కానీ ఆఫ్రికా వాడికి మాత్రం గాంధీ మీ ద యెంత అభిమానం లేక పొతే వెంటనే స్పందిస్తాడని కళ్ళు చెమర్చాయి. ఐతే వందలకోట్లను ముట్టుకోవద్దని త్యాగం చేయాలని ముందుగానే అనుకోవడం వల్ల వాడు అడిగిన విధంగా నేను బ్యాంకు అకౌంట్ నెంబర్, ఇతర వివరాలు పంపలేదు.
 తన శరీరాన్ని కోసి ఇచ్చాడని శిబి చక్రవర్తి త్యాగం గురించి చెప్పుకుంటారు. గద్ద కు  మాంసం వేయాలంటే మార్కెట్లో దొరుకుతుంది కదా ? వంద రూపాయలకు కేజీ దొరికే మటన్ ను  త్యాగం చేస్తేనే యుగ యుగాలుగా తలుచుకుంటున్నారు  కానీ వందల  కోట్లు త్యాగం చేసినా ? .....అయినా మనది గుప్త త్యాగం కదా ? 
ఇంతకూ నేనుచెప్పొచ్చేదేమిటంటే ? త్యాగం మా సికిందరాబాద్ కే పరిమితం కావద్దు . అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. వందల కోట్లు ఇస్తామని మీకు ఆఫర్లు రావచ్చు తొందరపడకండి త్యాగం చేయండి . మీ మిత్రులతో కుడా త్యాగం చేయించండి . చిరజీవి అదేదో సినిమాలో ఒక మంచిపని చేసి ప్రతి ఒక్కరు ముగ్గురితో మంచిపని చేయించాలని అంటాడు చుడండి  అలా మనం మరో ముగ్గురితో త్యాగం చేయిద్దాం . ( నా త్యాగాల మీద అనుమానం ఉందా ? ఐతే ఓకే అంటే కోట్ల రూపాయలు పంపిస్తామని నాకు వచ్చిన మెయిల్స్ పంపమంటే పంపిస్తాను ) అలా వచ్చిన మెయిల్స్ లో అమౌంట్ లెక్కిస్తే ??????). సికిందరాబాద్ కథలు ౬ 



11 కామెంట్‌లు:

  1. పాపం ఎంత త్యగం చేసినా మిమ్మల్ని గుర్తించటం లేదు. భారతీయులంటే ఆఫ్రికా వాళ్ళకీ, ఇంగ్లీష్ వాళ్ళకీ ఎంతో ప్రేమ. కానీ మీరు త్యాగ ధనులని వాళ్ళకి తెలియదు. ఎలాగూ గుర్తింపు రావట్లేదు, పోనీ ఆ కోటి రూపాయల ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే పోలా?

    రిప్లయితొలగించండి
  2. సునీత గారు నాకూ కోట్ల మీద అస్సలు ఆశ లేదండి. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి కోట్ల రూపాయలు ఇస్తామని వచ్చే మెయిల్ మీకు ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను .

    రిప్లయితొలగించండి
  3. కోటి కాదు, లక్ష కోట్లు ఇచ్చినా నాలాటి వారిని కొనలేరు. మెయిల్సే కాదు, మొబైల్ లో మెసేజెస్ కూడా వున్నాయి నా దగ్గర. హ హ

    రిప్లయితొలగించండి
  4. నేనూ చాలా త్యాగాలు చేశానండీ. త్యాగం చేసింది ఒక సామాన్య నేను కనుక ఎవరూ గుర్తించడం లేదు. అదే ఏ పెద్దవారో, ఏ పెద్ద పదవులో త్యాగం చేస్తే ఎం.పిలు కూడా పొగిలి పొగిలి ఏడుస్తారు. మనబోటివారి త్యాగలని ఎవరూ గుర్తించరండీ, గుర్తించరు.

    రిప్లయితొలగించండి
  5. అన్నట్టు ఇప్పటికీ నా త్యాగాల గురించి చెప్పకపోదును. మీరు "సాద్యమైనంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి ఇతరులపై ఆధార పడరాదు" అన్నారు కదా అని చెప్పుకోక తప్పలేదు.

    రిప్లయితొలగించండి
  6. @సునీత గారు మీ త్యాగం నా కళ్ళు తెరిపించిందండి. మీరు నన్ను మించిన త్యాగ జీవులు .
    @ శిశిర గారు మీ త్యాగాలు చెప్పనేలేదు . సుమన్ సినిమా చూడడం సాహసం అవుతుంది కానీ త్యాగం కాదండి.

    రిప్లయితొలగించండి
  7. అబ్బో నా త్యాగాల ముందు మీరెవ్వరూ పనికిరారు. మీ మొదటి త్యాగం టైపులో నేను ఓ 10 లక్షలు త్యాగం చేసుంటా. వారం వారం మైల్ లో వస్తుంటాయి లక్షల కోట్ల రూపాయిలు అప్పణంగా....అన్నిటినీ నిర్వికారం గా త్యాగం చేసేస్తుంటాను. మీకు ఒక్క అఫ్రికా యేగానీ నాకు Bank of England, American Embassy దగ్గరనుండి కూడా కోటానుకోట్ల రూపాయల ఆఫర్లొస్తుంటాయి...ఏమిటో చిన్నప్పటినుండీ త్యాగాలు అలవాటయిపోయి ధారాళంగా ఆ ఆఫర్స్ అన్నిటినీ త్యజించి త్యాగం చేసేస్తుంటాను. :)

    రిప్లయితొలగించండి
  8. hilarious
    నామట్టుకి నేను ఏమీ త్యాగం చెయ్యలేదు.

    రిప్లయితొలగించండి
  9. @కొత్తపాళి గారు జీవితం అన్నాక కాసింత కళా పోసనే కాకుండా అంతో ఇంతో త్యాగం ఉండాలండి .
    @ఆ సౌమ్య గారు మీరు ఆహా అనిపించే సౌమ్య గారండి ..అంటే మీరు అంతర్జాతీయ త్యాగ స్త్రీలన్న మాట ( త్యాగపురుషుడు అన్నప్పుడు త్యాగ స్త్రీ అనే పదం ఎందుకు వాడరు ? )

    రిప్లయితొలగించండి
  10. ఝేమిటో...నేనొక్కదాన్నే గుప్తత్యాగాలు చేస్తున్నాననుకున్నాను సుమండీ. ఇంకా ఇఁతమంది ఉన్నారన్నమాట.మెయిల్ లో వస్తున్న ఇన్నికోట్లరూపాయలు త్యాగం చేస్తుంటే మిమ్మల్ని గుర్తించలేదుకదా వాళ్ళు..

    కారణం ఏమిటంటే అంతకు పదింతలు త్యాగం చేస్తున్న ఓ వ్యక్తి వాళ్ళ కళ్ళముందుండడమే. పైగా వాళ్ళు అంతర్జాతీయ త్యాగరాణి బిరుదుతో కలిపి నోబుల్ ప్రైజ్ ఇస్తామంటే ఆ ఫళంగా వద్దని త్యాగం చేసేసి వాళ్ళ కళ్లు తెరిపించాను. ఆవ్యక్తి ఎవరో తెలుసుకదా. అదే లెండి....మీరు చెప్పినట్టు నాపని నేను చేసుకుపోవడమే కాని ప్రచారం అలవాటు లేదు..చూసారూ.అయినా మీరు సూక్ష్మగ్రాహులు- కనిపెట్టేస్తారులెండి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం