20, జులై 2011, బుధవారం

ఇసుక నుండి నూనె తీయబడును

ప్లీజ్ నన్ను ప్రేమించు రాజా! - అని చాలా సేపటి నుండి హీరోయిన్ బతిమిలాడుకొంటోంది. దీనంగా హీరోయిన్ అడుగుతోంది. ఆ మాటలు విన్న వారికి జాలి కలగడం సహజమే కానీ ఆమెది పవిత్ర ప్రేమ. రాజా ప్రేమ పొందని జీవితం వృధా అని నిర్ణయించేసుకున్న పవిత్ర హీరోయిన్ ఆమె. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు రాజా! నీతో ఐ లవ్ యు చెప్పించుకోని జీవితం వృధా అంటూ కన్నీరు కార్చింది.
 ఐనా ఎన్టీఆర్ కరిగిపోలేదు. బెల్ బాటం ఫ్యాంటు, ఎత్తుగా ఉన్న షూ ఉబికి వస్తున్న పొట్టతో భారీకాయుడైన ఎన్టీఆర్ హీరోయిన్ మాటలను పట్టించుకోకుండా చేతిలోని ఒక పుస్తకాన్ని మోస్తూ కాలేజీకి వెళుతున్నారు. అది టాకీ సినిమా కాబట్టి విషయం సులభంగానే ఆర్ధమవుతోంది. మూకీ సినిమా ఐతే బొజ్జమీద కూర్చోబెట్టుకుని ఆడించమని పిల్ల మారాం చేస్తుందేమో అనిపించేది!
హీరో అన్నాక ఒక పెద్ద లక్ష్యం ఉండి తీరుతుంది. దాని కోసం ప్రేమ దోమా జాన్తానై అంటారు. ఎవడి సమస్య వాడికి గొప్పది. చెట్టుమీద ఏం కనిపిస్తుంది అని అడిగితే వంద మంది కౌరవులకు వందలాది దృశ్యాలు కనిపించాయి. అర్జునుడికి మాత్రం పిట్టకన్ను మాత్రమే కనిపించింది. అలానే సాధకుడికి లక్ష్యం తప్ప మరేమీ కనిపించదు. అలా ఎన్టీఆర్ తన తండ్రిని మోసం చేసిన వాడిపై పగ తీర్చుకోవాలనే గొప్పలక్ష్యంతో ఉన్నాడు కాబట్టి అలాంటి వాడితో ఐ లవ్‌యు చెప్పించడం మహానటి అంజలీదేవితో మొదలు పెడితే వాణిశ్రీ నుండి జయప్రద, శ్రీదేవి,రాధ వరకు ఎవరికీ సాధ్యం కాదు. వాణిశ్రీ, శ్రీదేవి అంటే మనకు గొప్ప కానీ ఎన్టీఆర్‌కు కాదు కదా! హీరో పక్కనుండే కమెడియన్ ద్వారా హీరోయిన్ తన హీరో లక్ష్యం తెలుసుకున్నాక ఎన్టీఆర్ తో ఐ లవ్‌యు చెప్పించుకోవడం కన్నా , ఆయన లక్ష్యం సాధించడం ముఖ్యం అనుకుని రాజా ఇక నీ లక్ష్యమే నా లక్ష్యం అంటుంది. విషయం ఏమంటే ఏదో ఒక లక్ష్యంతో ఉన్నవాడితో ఎంత కష్టపడ్డా మరో మాట చెప్పించలేం.


కొన్ని కొన్ని విషయాలు కొందరితో చేయించడం, చెప్పించడం అంత ఈజీకాదు. ప్రహ్లదుడు నిరంతరం హరి ధ్యానంలోనే మునిగాడు కదా! ఆ మాట అతని నోటి నుండి రాకుండా చేయడం హిరణ్యకశిపుడుతోనే కాదు మహామహా ప్రైవేటు మాస్టారు చండమార్కుల వారి వల్లనే కాలేదు. భర్తృహరి కొందరితో చేయించగల పనులు, చేయించలేని పనుల జాబితాను తన నీతిశతకంలో చెప్పాడు. ‘‘తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు....’’ కానీ ‘‘చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు..’’అని చెప్పాడు ఏదో విధంగా ఇసుక నుండి నూనెను తీయవచ్చునట! ఎండమావుల్లో కూడా నీటిని సంపాదించవచ్చు, కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు కానీ మూర్ఖుని మనస్సు రంజింపజేయలేమని తేల్చి చెప్పారు.


 అంతేనా మరో చోట మొసలి నోటిలోని రత్నన్నైనా బయటకు తీయవచ్చు, పెద్ద అలలు గల సముద్రాన్ని దాటవచ్చు, పామును పూదండగా ధరించవచ్చు, మూర్ఖుని మనస్సును సమాధాన పెట్టడం కష్టమన్నారు. చిన్నతనాన మనకు 13వ ఎక్కం కష్టమైన పని ఐనట్టే ఇవి భర్తృహరి కాలానికి సంబంధించి కష్టమైన పనులే కావచ్చు. 


నిజానికి భర్తృహరి చెప్పిన వాటిలో చాలా తరువాత కాలంలో సులభసాధ్యమై పోయాయి. కానీ ఆయన కాలంలో రాజకీయ నాయకులు లేరు కాబట్టి వారి గురించి ప్రస్తావించలేదు కానీ ఇవన్నింటి కన్నా నాయకులతో నిజం చెప్పించడం అనేది చాలా కష్టం. కర్ణుడితో లేదని చెప్పించడం, హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పించడం ఆ దేవుళ్లకే సాధ్యం కాలేదు. నాయకులతో నిజం చెప్పించడం అంత కన్నా కష్టం.


 ఓసారి శాసన సభలో ఏదో అంశంపై సీరియస్‌గా చర్చ జరుగుతుంటే బాబు ఆవేశంగా మాట్లాడాక రాజశేఖర్‌రెడ్డి లేచి ఏంటయ్యా బాబు నిజం చెబితే తల ముక్కలైపోతుందని నీకేమన్నా శాపం ఉందా? ఏంటి ఒక్క నిజం కూడ చెప్పవేమిటయ్యా అని నెమ్మదిగా అడిగాడు. ఒక్క బాబే కాదు రాజకీయ బాబులతో నిజం చెప్పించడం ఇసుక నుండి నూనె తీయడం కన్నా కష్టం. కనీసం సినిమా చివర్లో అయినా వాణిశ్రీ ఎన్టీఆర్‌తో ఐ లవ్‌యు అని చెప్పిస్తుంది. తరువాత ఇద్దరి తలలు పెద్ద పూవు వెనక్కి వెళతాయి. పూవు పరవశంతో ఊగిపోతుంది. పలుకుతల్లీ పలుకు అని ఎస్వీ రంగారావు తన చేతిని తెగ్గోసుకుంటే పాతాళభైరవి పలుకుతుంది. రావణుడు ఒక్కో తల తెగ్గోసుకుంటే శివుడు పరవశంతో పలుకుతాడు. చేతులు, కాళ్లు, ఒకటి రెండు తలలు తెగగానే నోరు విప్పడానికి ఆమేమన్నా అల్లాటప్ప మాతనా? అధిష్ఠాన మాత !! అందుకే ఆరువందల తలలు తెగినా మాట్లాడడం లేదు. ఆమెతో తెలంగాణపై ఔనని కానీ కాదని కానీ ఎవరూ చెప్పించలేకపోతున్నారు.


తన బలాన్ని పదింతలు చేసి ప్రచారం చేసుకోవడం, ప్రత్యర్ధి బలం పదిరేట్లు తగ్గించి ప్రచారం చేయడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంగదుడి నాయకత్వంలో వానర సైన్యం రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు వానర సైన్యంపై పడి బఠానీలు నమిలినట్టుగా నమిలేస్తుంటే అంతా పరుగులు పెడతారు. అప్పుడు అంగదుడు వాడు నిజమైన రాక్షసుడు కాదు పంట పొలాలకు కాపలాపెడతారు కదా! అలాంటి బొమ్మ రాక్షసుడు, భయపడకుండా యుద్ధం చేయండి అంటూ ధైర్యవచనాలు చెబుతాడు. కుంభకర్ణుడి గురించి నిజంగా అంగదుడికి తెలియదా? అంటే విషయం అది కాదు ప్రత్యర్థి బలహీనుడు కాగితపు పులి అంటేనే కదా తన సైన్యం ధైర్యంగా యుద్ధం చేసేది. ఈ టెక్నిక్‌ను మన వాళ్లు రామరావణ యుద్ధం నుండే నేర్చుకున్నట్టున్నారు. ఫలానా నేత జైలుకు వెళతాడు, కుర్చీ మనకోసమే ఎదురుచూస్తుంది- అని ఎంత కాలమైనా నమ్మించగలరు. ఎందుకంటే వారితో నిజం చెప్పించడం ఎవరి వల్ల కాదు!

4 కామెంట్‌లు:

  1. రాజకీయనాయకులతో నిజం చెప్పించడం తివిరి ఇసుమున తైలం తీయడమే అని మాచేత బాగానే నమ్మించారు సుమా. టాకీ కాకుండా మూకీ అయిఉంటే సదరు ఎన్టీవోడుగారి ఆ సీనుని ఎలా అ(పా)ర్థం చేసుకుంటామో అని మీరు చెప్పినది చదివి బాగా నవ్వుకున్నాను. ఆరువందల తలలు తెగినా పలకని అధిష్టానం గురించిన వ్యంగ్యపు విసురు...మీకే చెల్లు.

    రిప్లయితొలగించండి
  2. మీ రచనా శైలి అద్భుతంగా ఉందండీ .సమకాలీన విషయాలకు చక్కని ఉదాహరణలను కలిపిస్తూ చక్కగా సాగిపోయే వాక్యాలు చివరిదాకా చదివిస్తాయి .చాలా హాయిగా ఉంది చదువుతున్నంతసేపు .

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం