26, డిసెంబర్ 2012, బుధవారం

ఏడ్చి సాధిద్దాం రా!

అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి సగం తెలుసుకున్నాడట! సగం కాదు ఇప్పటి పిల్లలు శిశువులుగానే ఎన్నో తెలుసుకుంటున్నారు. ఏడవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఈ మధ్య పాశ్చాత్య శాస్తవ్రేత్తలు కనిపెట్టేశారు. వాళ్లకీ విషయం ఇప్పుడు తెలిసిందేమో కానీ మన పిల్లలకు ఇది పుట్టగానే తెలుసు. ఏడ్చి సాధించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. మనిషి పుట్టగానే గురువు లేకుండా తల్లి ఒడిలోనే నేర్చుకునే తొలి విద్య ఏడుపే. తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే ఈ కళను ప్రదర్శించకపోతే డాక్టర్లు కూడా ఆందోళన పడతారు. ఆ తరువాత కూడా ఏం కావలసినా ఏడ్చి సాధించుకోవచ్చునని పిల్లలు పదే పదే నిరూపిస్తూనే ఉంటారు.
ఓసారి దగ్గరి బంధువు ఎవరో చనిపోతే రేలంగి అంతిమ యాత్రలో పాల్గొని ఏడుపు ఆపుకోలేకపోయారట! ఆయన ఏడుపు చూసి రేలంగి భలే నటిస్తున్నాడు అంటూ దారిలో ఉన్నవాళ్లు అనుకోవడం వినిపించిందని ఒక సందర్భంలో రేలంగి ప్రస్తావించారు. హాస్యనటుల ఏడుపు కూడా నవ్వులాటగానే ఉంటుందని ఆయన ఆవేదన చెందారు. రేలంగి కాలంలో హాస్యనటులకే పరిస్థితి అలా ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం నటులు, నాయకులది అదే పరిస్థితి. ఈ మధ్య ఒక నాయకుడు బీడికార్మికుల కష్టాలు చూసి మీరు ఒక్కో బీడీ చుట్టడానికి ఇంత కష్టపడతారా? అని కెమెరాల సాక్షిగా, మీడియా సమక్షంలో ఏడ్చేశారు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడైనా బీడీలను చేతితోనే చుడతారు, వారి కష్టాలు అలానే ఉంటాయి కదా? మరి ఏడుపు ఎందుకు? అని ప్రశ్నిస్తే, ఎవరి గోలవారిది, ఎవరి ఏడుపు వారిది మీకెందుకు అని అని కొందరు సెలవిచ్చారు.
కలర్స్ చానల్స్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో ఒక నటి పదే పదే ఏడుస్తుంటే బిగ్‌బాస్ బాలివుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ మీ ఏడుపు నిజమైన ఏడుపా? నటనలో భాగమా? అని ప్రశ్నించేశారు. నిజానికి ఈ ప్రశ్న ఆమెకు ఏడుపు తెప్పించాలి కానీ తమాయించుకుని ఏడుపు నిజమే అని నవ్వుముఖం పెట్టి చెప్పింది.
ఏడుపు అంటే నాకు గిట్టదు ఎపుడూ నవ్వుతూ ఉండాలి అంటూ నలుపుతెలుపు సినిమాలో హీరో హీరోయిన్‌కు పాటతో షరతు విధిస్తాడు. పాట వింటే నవ్వుతూ ఉండడం అంటే హీరోకు ఎంత ఇష్టమో అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమంటే ఏడుపుతో ఎంతటి హీరోలనైనా జీరోలను చేయవచ్చు అనే విషయం అతనికి తెలుసు అందుకే మురిపెంగానే పాడుతూ ఏడుపు వద్దంటాడు.


మా కాలంలో అయితేనా అంటూ కుటుంబరావులు తమ అనుభవాలు చెబుతుంటారు. మా కాలంలో భార్యలు ఏడ్చి సాధించేవారు, ఈ కాలంలో ఏడిపించి సాధిస్తున్నారని వాపోయాడు. ఏడ్చే పాత్ర మారింది కానీ ఏడుపు శక్తి మాత్రం తగ్గలేదన్నమాట! నిజజీవితంలో భర్తయినా, భార్యయినా పెళ్లి తరువాత ఏడిస్తే ఇప్పుడు హీరోయిన్లు మాత్రం సినిమాల్లో పెళ్లికి ముందే ఏడ్చేస్తున్నారు. జీడిపాకం కోసం పిల్లాడు ఏడ్చినట్టుగా నన్ను ప్రేమించు ప్రేమించు అంటూ హీరో కోసం హీరోయిన్ ఏడ్చేస్తోంది.


ఏడుపు ఎంత శక్తివంతమైందో కనిపెట్టిన తొలి పురాణ మహిళ కైకేయి. శ్రీరాముడి పట్ట్భాషేకానికి ఆయోధ్య నగరం ముస్తాయి అయిన సమయంలో ఏడుపు అనే ఆయుధంతో కైకేయి అంతా తలక్రిందులు చేయగలిగింది. ధశరథుడు గతంలో ఇచ్చిన వరాలు గుర్తు చేస్తే, సరే కోరుకో అంటే ఆమె చెప్పిన వరాల జాబితా విని థశరథునికి దిమ్మతిరిగి పోతుంది. శ్రీరాముడిని 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపి, తన కుమారుడు భరతునికి పట్ట్భాషేకం చేయాలంటుంది. చివరకు ఆమె ఏడుపు అనే అస్త్రాన్ని ప్రయోగించే సరికి ఆమె డిమాండ్లను అంగీకరించక తప్పలేదు. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం అంటూ రకరకాల శక్తివంతమైన ఆయుధాల గురించి రామాయణం, మహాభారతం, పురాణాల్లో చెప్పారు కానీ నిజానికి వీటికన్నా శక్తివంతమైన ఆయుధం ఏడుపే. పురాణాల్లోని శక్తివంతమైన ఆయుధాలన్నీ శత్రువును దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కానీ ఏడుపును మాత్రం సొంత మనుషులపై ప్రయోగించి కోరుకున్నది సాధించుకోవచ్చు.


నవ్వుల్లో అనేక రకాలున్నట్టే ఏడుపులోనూ అనేక రకాలుంటాయి. కొన్ని ఏడుపులు కనిపిస్తాయి కొన్ని ఏడుపులు అస్సలు కనిపించవు. ఎదుటి వాడికి ఆధికారం ఉంది నాకు లేదు అనేది ప్రతిపక్షం ఏడుపు. అధికారంలో ఉన్న నన్ను చూసి ఓర్వలేక దించేయాలని చూస్తున్నారనేది అధికారిక ఏడుపు. రాజకీయాల్లో ఏడుపులు, ఓదార్పులు సర్వసాధారణం. కొందరు నవ్వలేక ఏడుస్తుంటే, మరి కొందరు ఏడ్వలేక నవ్వుతుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒక రూపంలో ఏడుపు ఉంటుంది.


ఆ రోజుల్లో సినిమాల్లో రాజబాబు, రమాప్రభ కళ్ల నుంచి నీరుకారేంతగా నవ్వాల్సిందే. ఇక శారద ఉంటే సినిమాలోనే కాదు ఇంటికొచ్చి సినిమా కథ తలుచుకుని కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. ఆ రోజుల్లో శారద చాలెంజ్ చేయలేదు కానీ శారద నటించిన శారద సినిమా చూసి మనసులోనైనా ఎడవని వారు లేరు. నవ్వించిన రాజబాబు, రమాప్రభల పరిస్థితి చివరకు అభిమానులను ఏడిపించే విధంగా మారింది. రమాప్రభ ప్రస్తుత పరిస్థితి అభిమానులను ఏడిపించే విధంగా ఉంది. ఇక ఏడుపు నటనతో శిఖరాగ్రాలకు చేరుకున్న ఊర్వశి శారద రాజకీయాల్లో చేరి ఎంపిగా ఎదిగి, మంచి స్థితిలో నిలిచారు. నవ్వించిన నటి పరిస్థితి ఏడిపించే విధంగా, ఏడిపించిన నటి పరిస్థితి సంతోషించే విధంగా ఉండడం కాల మహిమ.
నాయకుల ఏడుపునకు కరిగిపోయి అధికారం అప్పగిస్తే, ఐదేళ్లపాటు ఏడిపించి కక్ష తీర్చుకుంటారు అందుకే నాయకుల ఏడుపు పట్టించుకోవడం లేదని జనం అంటున్నారు.

25, డిసెంబర్ 2012, మంగళవారం

బొత్సాకు ఒక చానల్ .. కిరణ్ కు రెండు .. బుల్లితెరను కబ్జా చేసిన రాజకీయం

పలు తెలుగు న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలుగా తయారయ్యాయి. పార్టీల గుర్తుతోనే తమిళనాడులో పార్టీల చానల్స్ ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ మన రాష్ట్రంలో మరో అడుగు ముందుకు వేసి చివరకు పార్టీల్లోని గ్రూపుల వారీగా చానల్స్ తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులకు నిలయం. గతంలో ఆ పార్టీకి అధికారం ఉన్నా చానల్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గ్రూపు రెండు చానల్స్ నడుపుతుంటే, పిసిసి అధ్యక్షునికి ఒక చానల్ ఉంది. చానల్స్ సంఖ్య పెరిగిపోవడం, ఆదాయం తగ్గడం, వ్యయం పెరగడం వంటి కొన్ని సమస్యలతో అప్పటి వరకు చానల్స్ నిర్వహించిన వారు ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేయడంతో ఇలాంటి చానల్స్ రాజకీయ నాయకుల చేతిలోకి వెళుతున్నాయి.

 వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలో ఆ రెండు పత్రికలు అంటూ టిడిపికి అండగా నిలిచే మీడియాను విమర్శిస్తూ మాకూ రెండు పత్రికలు రాబోతున్నాయి అని బహిరంగంగానే ప్రకటించారు. అయితే చిత్రంగా ఆ రెండింటిలో ఒకటి టిడిపి వైపు వెళ్లగా, మరోటి వైఎస్‌ఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ కోసం పని చేసినా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది.


జీ న్యూస్ మూతవేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తరువాత ఏం జరిగిందో... అది పిసిసి అధ్యక్షునికి అనుకూల చానల్‌గా మారిపోయింది. అదే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఈ మార్పు స్పష్టంగా కనిపించేది కానీ పిసిసి అధ్యక్షుడు కాబట్టి అంతగా కనిపించడం లేదు. పార్టీకి క్రెడిట్ లభించే విధంగా ఇందులో వార్తలు ఉంటే. ఇక ఐ న్యూస్‌లో మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇమేజ్ బూస్టప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఒకే వర్గం చేతిలో మీడియా ఉన్నప్పుడు చంద్రబాబు పాలనను ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో ఇప్పుడు ఐ న్యూస్‌లో కిరణ్‌కు ఆ స్థానం కల్పిస్తున్నారు. సమస్యలన్నీ అదిగమించి ఆయన దూసుకెళుతున్నారట! మరీ ఎక్కువైనట్టుగా ఉంది అంటూ స్వయంగా ముఖ్యమంత్రే ఇష్టాగోష్టి సమావేశంలో ఐ న్యూస్ గురించి అన్నట్టుగా సచివాలయం విలేఖరులు చెప్పుకుంటున్నారు. ఆయన అలా అన్నది నిజమో కాదు కానీ విషయం మాత్రం అలానే ఉంది. ఐ న్యూస్ స్వల్ప కాలంలోనే అనేక రంగులు మారింది. తొలుత అందులో జగన్ పెట్టుబడులు పెట్టారనే ప్రచారం సాగింది. ఆ తరువాత కొంత కాలానికి ఆ చానల్ జగన్‌ను వ్యతిరేకించడానికే ఏర్పాటు చేశారేమో అనే విధంగా ప్రచారం సాగింది. మొన్నమొన్నటి వరకు కూడా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరి పెట్టుబడి మహత్యమో కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు చూసినా కిరణ్‌ను ఆకాశానికెత్తుతూ కనిపిస్తున్నారు.

 కొంత కాలం ఉందో లేదో అన్నట్టుగా కనిపించి మాయమైన ఒక టీవిలో ముఖ్యమంత్రి సన్నిహితుడైన ఎమ్మెల్సీ పెట్టుబడులు పెట్టారని ప్రచారం సాగుతోంది. ఎ టీవిలో ముఖ్యమంత్రి గురించి బాగానే ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ చానల్‌లో లైవ్‌గా ప్రసారం అవుతోంది. టెస్ట్ సిగ్నల్స్ పేరుతో సైతం కిరణ్ నామ స్మరణే. అన్ని రాజకీయ పక్షాలకు సొంత చానల్స్ ఉన్నందున మనం కూడా ఒక చానల్ పెట్టాలి అని గతంలో కాంగ్రెస్ మేధోమథనంలో నిర్ణయించారు. అయితే నేరుగా చానల్ పెట్టకపోయినా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రికి మద్దతుగా మూడు చానల్స్ కనిపిస్తున్నాయి. టిడిపి అనుకూల చానల్స్ ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు పాదయాత్రను ఆకాశానికెత్తుతుండగా, సాక్షి జగన్ పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తోంది. అదేం శాపమో బాబుకు మీడియాలో జనం బ్రహ్మరథం పడతారు. తీరా ఉప ఎన్నికలు వస్తే డిపాజిట్ దక్కనివ్వరు. 2009 నుంచి 42 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే సగం నియోజక వర్గాల్లో డిపాజిట్ పోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. చానల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమంత్రికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న మా పార్టీ చానల్ పెట్టలేకపోతోంది అంటూ తెలుగు యువత ప్రశ్నించింది. మిగిలిన పార్టీలకు వారి పార్టీ ప్రచారానికి సొంత చానల్స్ అవసరం. టిడిపిని సొంత పార్టీగా భావించే మీడియా ఉన్నప్పుడు సొంత చానల్స్ అవసరం ఎందుకు? అనేది ప్రత్యర్థుల సమాధానం. 

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉండగానే పరిస్థితి ఇలా ఉంది అంటే ఎన్నికల నాటికి బుల్లి తెరనే యుద్ధ క్షేత్రం అవుతుందేమో! టీ న్యూస్ తెలంగాణ వాదానికి, టిఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తోంది. అలా అని మిగిలిని చానల్స్ నిస్పక్షపాతంగా ఉంటున్నాయని కాదు. అంశాల వారిగా, ఒప్పందాల వారిగా కొన్ని చానల్స్ కొన్ని పార్టీలకు అండగా నిలుస్తున్నాయి. ఎన్నికల సమయానికి మద్దతు కోసం వేలం పాటలు సాగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

19, డిసెంబర్ 2012, బుధవారం

నగదు బదిలీ అను రాజమాత .. యువరాజు , ఇద్దరు రాజకుమారుల కథ

‘‘అమ్మ ఎవరికైనా అమ్మే.. మా అమ్మ నిజంగా అందరికీ అమ్మ. ఎంత గొప్ప ఆలోచన. అమ్మ దేవత కాబట్టే ఇలాంటి ఆలోచన వచ్చింది మనుషులకైతే ఇలాంటి ఆలోచన వచ్చేదా? ’’అని పరాంకుశం కళ్లు తుడుచుకున్నాడు. 

‘‘అమ్మంటే ఎవరనుకున్నావు అమ్మంటే తల్లిరా..’’ అంటూ సూపర్ స్టార్ కృష్ణ స్టైల్‌లో శంకరం జోకాడు. ‘‘నేను సీరియస్‌గా చెబుతుంటే నీకు జోకా?’’ అని పరాంకుశం సీరియస్‌గా ప్రశ్నించాడు.

 ‘‘ఓహో తల్లిదండ్రులను గౌరవించాలని రజనీకాంత్ చెప్పిన మాట నీమీద ఇంతగా ప్రభావం చూపుతుందని అనుకోలేదురా!’’ అంటూ శంకరం సారీ చెప్పాడు. ‘‘రజనీకాంత్‌కేం సంబంధం?’’అని పరాంకుశం అడిగాడు. ‘‘మీ అమ్మను మీ అన్న ఇంటి నుంచి తెచ్చుకోవడానికి అస్సలు ఇష్టపడని నువ్వు మాతృమూర్తి గురించి మాట్లాడుతున్నావంటే రజనీకాంత్ సామాన్యుడు కాదు రా! నీలాం టి పాషాణ హృయదం గల వాడిని కూడా కరిగించాడంటే ’’ అంటూ శంకరం చెప్పుకుపోతూనే ఉంటే. ‘‘ మన మధ్యలో రజనీకాంత్ ఎందుకొచ్చాడు. అయినా అమ్మగొప్పది అంటూ నేను చెప్పింది మా అమ్మ గురించి కాదు సోనియమ్మ గురించి’’ అని పరాంకుశం చెప్పాడు. శంకర్ పిచ్చి చూపులు చూస్తుండడంతో ‘‘ఔను రా! నేను చెప్పింది సోనియమ్మ గురించి.. నగదు బదిలీ పథకం ఎంత అద్భుతమైంది. దీంతో దేశంలోని పేదరికం మొత్తం సమసిపోతుంది. అంబానీ ఖాతా అప్పలరాజు ఖాతా ఒకటే అవుతుంది. దేశంలోని ఖజానా నుంచి ఎవరి ఖాతాలోకి ఎంత అవసరం పడితే అంత నేరుగా జమ అవుతుంది. ఇంత గొప్ప పథకం తెచ్చిన సోనియాగాంధీ మునిమనవడిని కూడా మనను పాలించేంత వరకు వదిలిపెట్టేది లేదు’’ అని పరాంకుశం చెప్పాడు.


‘‘పిచ్చోడా! నగదు బదిలీ గురించి నువ్వు మరీ అతిగా ఊహిస్తున్నట్టుగా ఉంది. అయినా అమ్మ కన్నా ముందు మా యువరాజుకొచ్చిన ఐడియా కదా ఇది!’’అని శంకరం పలికాడు.


వీరి మాటలు వింటున్న కుటుంబరావు ‘‘రాజమాత కాదు... యువరాజు కాదు అసలు నగదు పుట్టుకతోనే నగదు బదిలీ పథకం అమలు జరుగుతూనే ఉంది. మనిషి జీవితంలో ఏ దశలో ఈ పథకం అమలు జరగడం లేదో చెప్పండి చూద్దాం అని చిలిపిగా నవ్వాడు.
పుట్టేముందు అస్పత్రిలో పోయాక స్మశాన వాటికలో సైతం నగదు బదిలీ వెంటాడుతూనే ఉంటుంది. బుడ్డోడిగా బొడ్డూడి భూమిపైకి వచ్చినప్పటి నుంచి కపాలమోక్షంతో పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు మనిషి జీవితంతో నగదు బదిలీ ముడిపడి ఉంది. నాన్న చేతిలో నుంచి నర్సు చేతిలోకి నగదు బదిలీ తరువాతే అమ్మ కడుపులో నుంచి శిశువు బయటకు వస్తుంది. నేతాశ్రీలైనా, ఓటరు శ్రీలైనా పుట్టినప్పుడు జరిగేది ఇదే! అంతేనా చివరకు పెళ్లి పేరుతో ఇద్దరు ఒకటి కావాలంటే కూడా ముందు నగదు బదిలీ జరగాల్సిందే. వేల సంవత్సరాల్లో సంస్కృతి సంప్రదాయాలు మారుతున్నాయి కానీ మారనిది నగదు బదిలీ ఒక్కటే. పూర్వం కన్యాశుల్కం పేరుతో వరుడి తరఫు వారు అమ్మాయి తరఫు వారికి నగదు బదిలీ చేశాక పెళ్లి జరిగేది. కన్యాశుల్కం పేరుతో అమ్మాయిలను అమ్ముకుంటారా? అంటూ ఎంతో మంది సంఘ సంస్కర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఉద్యమం ఫలించి, పుష్పించి వరుడి తరఫు వారు వధువుకు నగదు బదిలీ చేయడానికి బదులు వధువు తరఫు వారు వరుడికి నగదు బదిలీ చేసే సంస్కృతి మొదలైంది. అంటే ఇప్పుడు టీనోపాల్ యొక్క కొత్త పేరు రాణిపాల్ అని చెప్పుకున్నట్టు కన్యాశుల్కం పేరు వరకట్నంగా మారింది. 


హీరోకో, హీరోయిన్‌కు కష్టం వచ్చినప్పుడు ప్రకృతి స్తంభిస్తుంది అది సినిమా ధర్మం. నిజజీవితంలో మాత్రం నగదు బదిలీ లేకపోతే ప్రకృతి స్తంభించిపోతుంది. అనుమానం ఉంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్లి నగదు బదిలీ లేకుం డా పని చేయించుకురా చూద్దాం. రిటైర్ అయ్యాక నువ్వు బతికున్నట్టుగా నీకు సర్ట్ఫికెట్ కావాలన్నా నగదు బదిలీ అమలు చేయాల్సిందే. లేకపోతే నీవు చాలా కాలం క్రితమే పోయావని నీ చేతిలోనే డెత్ సర్ట్ఫికెట్ పెట్టేస్తారు. బాబోయ్ నేను పోలేదు నిక్షేపంగా బతికే ఉన్నానని నువ్వు చెప్పినా నమ్మరు ఎందుకంటే ఇక్కడ సర్ట్ఫికెట్ ముఖ్యం కానీ మనిషి కాదు. అందుకే బాబ్బాబు నేను బతికే ఉన్నానని ఒక సర్ట్ఫికెట్ ఇవ్వవూ అంటూ రిటైర్ అయిన వాళ్లు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి నగదు బదిలీ పథకం అమలు చేస్తుంటారు. మనిషి బతికున్నంత వరకు నగదు బదిలీ వెంటాడుతూనే ఉంటుంది పోయాక, మన తరఫు వాళ్లు మన తరఫున నగదు బదిలీ చేయకపోతే స్మశానంలోకి ఎంట్రీ కూడా దక్కదు. మానవ సంబంధాలన్నీ నగదు బదిలీలే ’’ అని కుటుంబ రావు ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘అంటే నగదు బదిలీతో రాజమాత పార్టీ ఈసారి జయకేతనం ఎగురవేయడం ఖాయమా?’’ అని పరాంకుశం సంబరపడ్డాడు. 

పిచ్చోడా! మొన్నటి ఎన్నికల్లో తెలుగు బాబు కంప్యూటర్‌లో లెక్కలేసి ఆరోగ్యశ్రీ అంటే ఏటా 800 రూపాయల నగదు బదిలీనే కదా! మాకు అధికారం అప్పగించండి నెలకు రెండువేల నగదు బదిలీ చేస్తాం అన్నాడు. ఏమైంది. నమ్మకమైన నగదు బదిలీనే జనం నమ్ముకున్నారు. అన్ని పార్టీలు నగదు బదిలీని ఎప్పటి నుంచో అమలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం వాళ్లు మీడియా కోసం దాడులు చేస్తూ చిన్నా చితక నోట్ల కట్టలను పట్టుకుంటారు. సీజన్ ప్రారంభం అయ్యాక కూడా మన దేశంలో రైతులకు విత్తనాలు, ఎరువులు దొరకవు. కానీ ఎన్నికల సీజన్ ప్రారంభం కావడానికి ముందే నగదు బదిలీ కోసం నోట్ల పంపిణీ జరిగిపోతుంది. అందరికీ వాహనాలున్నాయి, అందరి వద్ద నగదు ఉంది. అదే అసలు చిక్కు. కాబట్టి ఎన్నికల్లో నగదు బదిలీతో పాటు ఇంకా ఏదో పని చేస్తుంది. అదేమిటనేదే రాజకీయ రహస్యం’’ అని కుటుంబ రావు మళ్లీ నవ్వాడు.

నగదు బదిలితో వోటరు ఎవరి మెడలో అధికార మాల వేయనున్నారు ?
దేశమంతా నగదు బదిలిఅమలు చేస్తున్న రాజమాతను  కరుణించి యువరాజుకు పట్టం కడతారా ?  జైలులు ఉన్న పెద్ద రాజు  గారి  రాజ కుమారుడి కోరిక తీరుస్తారా? మా నాన్న  తరువాత నేను అని క్యూ లో ఉన్న తెలుగు బాబు రాజకుమారుడి ఆశ నేరవేరుస్తారా ?  ఆమ్ ఆద్మీ మనుసులో ఏముందో ? 
కాలమే సమాధానం చెప్పాలి .

17, డిసెంబర్ 2012, సోమవారం

ఎన్టీఆర్‌ను పిండేస్తారా?

చెరుకు రసాన్ని పిండడం ఎప్పుడైనా చూశారా? ఎండా కాలంలో హైదరాబాద్‌లో చెరుకు రసం పిండే బండ్లు చాలానే కనిపిస్తాయి. ఈ రసాన్ని పిండేప్పుడు చూసే వాళ్లు ఇక అయిపోయింది రసం ఏమీ రాదు అది పిప్పి అనుకుంటున్న సమయంలో కూడా బండివాడు మరో రెండు మూడు సార్లు ఆ చెరుకు పిప్పిని యంత్రంలో పెట్టి రసాన్ని పిండేస్తాడు. ఆ పిప్పిలో ఒక్క చుక్క రసం కూడా మిగలలేదు అని తేలేంత వరకు వాడి కృషి ఆగదు. అది వాడి బతుకు పోరాటం.

 కానీ ఇప్పుడు ఎన్టీరామారావు పేరుతో వేరువేరు పార్టీల్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహం పేరుతో చేస్తున్న రాజకీయం చూస్తుంటే చెరుకు రసం పిండడం గుర్తుకొస్తోంది. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎవరు ప్రయత్నిస్తేనేం? ఒక తెలుగు నేత విగ్రహం పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారని సంతోషించాలి. సామాన్యులు చేసేది ఇదే కానీ ఆయన పేరుతో రాజకీయ ప్రయోజనం పొందేవాళ్లు సామాన్యులు కాదు కదా? అందుకే ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేస్తూ జనం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారు. పార్టీలు, కులమతాలకతీతంగా ఎన్టీఆర్‌ను ఒక నటునిగా అభిమానించే వారు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. రాజకీయంగా ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు సైతం నటునిగా విపరీతంగా అభిమానిస్తారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా పిసిసి అధ్యక్షుడు మొదలుకొని ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు సైతం మేం ఎన్టీఆర్ అభిమానులం అని చెప్పుకునే వారు.


ఎన్టీఆర్‌ను దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత 1996 ప్రాంతంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి మహానాడులో చంద్రబాబు గురించి వివరిస్తూ ఇంగ్లీష్‌లో ఒక పరిచయ పత్రం విడుదల చేశారు. అందులో చంద్రబాబు మామగా ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు. నిజానికి అప్పటి వరకు జాతీయ మీడియాలో సైతం చంద్రబాబుకు ఎన్టీఆర్ అల్లుడిగానే గుర్తింపు ఉండేది. ఆయన చివరి రోజుల్లో, మరణించిన తరువాత కుటుంబం చేతిలో సమస్యల పాలయ్యారు. చివరకు ఆయన మృత దేహం కోసం కూడా కుటుంబ సభ్యులు ఎల్‌బి స్టేడియంలో కీచులాడుకున్నారు. ఎన్టీఆర్ మరణించినప్పుడు ముంబైలో ఉన్న హరికృష్ణ విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేంత వరకు మృతదేహంపై లక్ష్మీపార్వతి వర్గీయులది పై చేయిగా ఉండగా, హరికృష్ణ ఎల్‌బి స్టేడియంకు వస్తూనే కర్ర పట్టుకొని రండిరా ఎవరు వస్తారో అని హూంకరించాక బాబు వర్గం ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ మరణించి రెండు దశాబ్దాలు కావస్తుండగా, మరోసారి ఆయన పేరుతో కుటుంబ సభ్యులు వీధిన పడి కీచులాడుకుంటున్నారు. గాడిద పళ్లు తోమావా? ఏం చేస్తున్నావు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబును ప్రశ్నిస్తే, బాలకృష్ణ అదే ప్రశ్న పురంధ్రీశ్వరికి వేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు క్రెడిట్ తనకు దక్కాలనే ప్రయత్నం కన్నా బాబుకు దక్కవద్దనే ప్రయత్నం పురంధ్రీశ్వరిది. 

ఇక టిడిపి సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీఆర్ బొమ్మను సైతం తీసేయించిన చంద్రబాబు ఇప్పుడు విగ్రహం క్రెడిట్ పురంధ్రీశ్వరికి దక్కితే తన పార్టీకి ఇబ్బంది అనేది ఆయన బాధ. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఇప్పుడు బాబు వైపు కొందరు పురంధ్రీశ్వరి వైపు, కొందరు తటస్థంగా ఉన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఆయన అధికారికంగానే రెండో పెళ్లి చేసుకున్నారు. విగ్రహం విషయంలో భార్యగా తన అభిప్రాయం అవసరం లేదా? అని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదతమ స్వార్థ రాజకీయాల కోసం ఆయన కుటుంబ సభ్యులే ఆయన్ని బజారుకీడుస్తూ అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నారు.

14, డిసెంబర్ 2012, శుక్రవారం

మన చానల్స్ లో అన్ని నిజాలే.. అన్ని అబద్దాలే ..... వీరి వీరి గుమ్మడి పండు ఎవరి చానల్ ఏది



దూసుకెలుతున్న ముఖ్యమత్రి కిరణ్ కుమార్ రెడ్డి .. అనేక ప్రతికూల పరిస్తుతుల్లో పదవి చేపట్టారు .. కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు .. అన్నింటిని విజయవంతంగా ఎదుర్కొని జనం లో ఆదరణ సంపాదించి దూసుకెలుతున్నరు ..
...... ఐ న్యూస్ 
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయతించిన ప్రతిపక్షాల ఎత్తుగడలను తిప్పి కొట్టిన కాంగ్రెస్స్ - జీ టివి 
బాబుకు పద యాత్రలో జన ప్రభంజనం .. మహిళలు మంగళ హారతి పడుతున్నారు - ఈ టివి  న్యూస్ 
చంద్రయాన్ .. బాబు పాదయాత్రకు అనూహ్య స్పందన - abn ఆంధ్ర జ్యోతి 
తెలంగాణాలో బాబు, శార్మిలలను నిలదిస్తున్న తెలంగాణా వాదులు - టి న్యూస్ 
షర్మిల కు  తెలంగాణాలో అడుగడుగునా నీరాజనం - సాక్షి 
( మిగిలిన చానల్స్ సంగతేమిటి అంటారా ? అవి  అంశాల వారి మద్దతు ప్రకటిస్తుంటాయి 

12, డిసెంబర్ 2012, బుధవారం

చింతామణి ప్రజాస్వామ్యం-ఇరానీ టీ!


‘కడుపు తరుక్కు పోతోంది మనం ఏదో ఒకటి చేయాలి. అంటూ శంకరం అరికాలును గీక్కున్నాడు. అది చూసి ఇరానీ హోటల్ లోని తెలుగు సప్లయర్ ‘‘సాబ్ బాజూమే గవర్నమెంట్ హాస్పటల్ హై వహా అచ్చా మరం లగాతే.. తీన్‌దిన్‌మే ఆచ్చా హోజాతా హై’’ అని చెప్పాడు. ‘‘ ఆస్పత్రిలో మందు ఇస్తే మూడు రోజుల్లో ప్రజాస్వామ్యం బాగవుతుందా?’’ అని శంకరం ఆశ్చర్యపోయాడు. 

‘‘నువ్వు అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రిని రెండింటిని కలిపి ఆశ్చర్యపోతున్నావు. నువ్వు కాలు గోక్కుంటుంటే వాడు కాలుకు పుండయి బాధపడుతున్నావేమో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమని చెబుతున్నాడు’’ అని పరాంకుశం వివరించి చెప్పాడు. ‘‘నా పుండు గురించి కాదు ప్రజాస్వామ్యనికి పట్టిన పుండును బాగుచేయాలనేది నా బాధ.’’ అని అన్నాడు. ‘‘నువ్వేం సినిమా హీరోవు కాదు, నీ వయసు 60 ఏళ్లు కాదు. సాధారణ ఉద్యోగివి. 50 ఏళ్ల వయసు కూడా కాదాయే నువ్వేం చేస్తావు ప్రజాస్వామ్యానికి?’’అని పరాంకుంశం అడిగాడు. సగం టీకి కక్కుర్తి పడి వీడితో ఇరానీ హోటల్‌కు వస్తే ఇదే బాధ అని మనసులోనే అనుకున్నా పైకి మాత్రం మామూలుగానే ఉన్నా డు.‘‘ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నావు?’’ అని శంకరం ఆవేశంగా ప్రశ్నించాడు. ‘‘నేనేమీ అనుకోవడం లేదు కానీ నువ్వేమనుకుంటున్నావో చెప్పు ’’ అని పరాంకుశం బదులిచ్చాడు.

‘‘ఇంతకూ ప్రజాస్వామ్యం అంటే ఏమై ఉంటుంది?’’ అని శంకరం మెల్లగా అడిగాడు. ‘‘నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఆత్మ లాంటిది. ఆత్మ కనిపించదు. ఆత్మకు చావు లేదు. ప్రజాస్వామ్యం కూడా అంతే దీనికి చావులేదు. కనిపించదు’’ అని పరాంకుశం చెప్పాడు. అది కాదురా సీరియస్‌గా చెప్పు అని శంకరం అడగడంతో పరాంకుశం ఒక్క క్షణం ఆగి

 ‘‘ఈ మధ్య చింతామణి నాటకం విన్నాను. ఎక్కడా చెప్పలేదు. ఎవరితో పంచుకోలేదు కానీ ఆ నాటకం విన్నాక నాకెందుకో చింతామణి ప్రజాస్వామ్యం ఒకటే అని పించింది’’ అని మనసులోని మాట చెప్పా డు.‘‘తాను ఎవరెవరిని ఎలా ముంచేసింది, ఎంత సంపాదించింది. నమ్మించి ఎలా ముం చేసింది. యూజ్ అండ్ త్రో అంటూ ఉపయోగించుకున్న వారిని ఎలా వదిలించుకోవాలో తల్లి చింతామణికి చెబుతుంది. అది వృద్ధ నాయకులు తన వారసులకు ప్రజాస్వామ్య నీతి బోధిస్తున్నట్టు అనిపించింది. చింతామణి చెప్పే నీతులు ప్రజాస్వామ్యంలో నాయకులు చెప్పే నీతులు ఒకేలా ఉంటాయి.

 తన వద్దకు వచ్చేవాళ్లు ఎలాంటి వాళ్లయితే చింతామణి అలాంటి పాట పాడుతుంది. తుంటరి వాళ్ళు వస్తే తుంటరి పాట పాడుతుంది, పెద్దమనిషి వస్తే అన్నమాచార్య కీర్తన పాడుతుంది. తన అభిమానుల మనసు దోచేందుకు చింతామణి పాడే పాటలు, మాటలు వింటే అచ్చం నాయకుల మాటల్లానే ఉంటాయి. కావాలంటే చింతామణి నాటకాన్ని విను.. ప్రజాస్వామ్యం విశ్వరూపం నీ కళ్లముందు ప్రత్యక్షం అవుతుంది. లేనిపోని చిక్కులెందుకు అని ఎవరితోనూ అనలేదు. నీతోనే చెబుతున్నాను ఎక్కడా చెప్పకు’’ అని పరాంకుశం చెప్పాడు. శంకరానికి సంతృప్తి కలగలేదు..

‘‘ప్రజాస్వామ్యం అంటే ఏంటో నాకు అర్ధం కాలేదు కానీ అది మాత్రం చాలా పవిత్రమైందిరా?’’ అని అన్నాడు. ‘‘విషం కలిపిన పాయసం ఈ ప్రజాస్వామ్యం, అని ఓ కవి ఆవేశంగా చెప్పాడు కానీ ఎందుకో అది సరికాదనిపించింది. విషం కలిపిన పాయసం అంటే అది ఎవరికైనా విషమే కదా? కానీ ప్రజాస్వామ్యం అలా కాదే కొందరికి పాయసంగా కొందరికి విషంగా ఉపయోగపడుతున్నది కదా? కాబట్టి అది సరికాదనిపిస్తోంది.’’ అని శంకరం నిరాశగా చెప్పాడు. అప్పుడెప్పుడో అన్నగారిని అధికారం నుంచి దించేసినప్పుడు ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటే ప్రజాస్వామ్యం అడ్రస్ దొరికినట్టు సంబరపడ్డాను. పదేళ్ల తరువాత అదే అన్నగారిని తిరిగి దించినప్పుడు ప్రజాస్వామ్యం కోసమే దించాం అంటే ఏది ప్రజాస్వామ్యమో అర్ధం కాలేదు. 

ఒక నేత విచ్చలవిడిగా పాలించినప్పుడు అదే ప్రజాస్వామ్యం అనిపించింది. ఆయన కుమారుడ్ని జైలులో పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అంటే మళ్లీ అనుమానం వచ్చింది ఏది ప్రజాస్వామ్యం?’’ అని శంకరం ఆవేదనగా చెప్పుకుపోతున్నాడు. పరాంకుశం అప్పుడే గుర్తుకు వచ్చినట్టు ‘‘ 

ప్రజాస్వామ్యం వైట్ హౌస్ గొడ్ల చావిడిలో కట్టేసి ఉంటుందనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడి ప్రజాస్వామ్యం అయినా వైట్ హౌస్ నుంచి అమెరికా కంట్రోల్ చేస్తుంది. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ అనే వాడెవడో ప్రజాస్వామ్యాన్ని సరి గా చూసుకోవడం లేదని అమెరికా వాడు బాంబులేసి వాన్ని చంపేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాడా? లేదా? పెట్రోలు, సహజ వనరులు ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యానికి వీసమెత్తు అపకారం జరిగినా అమెరికా వోడు అస్సలు సహించడు. దీన్ని బట్టి ప్రజాస్వామ్యానికి అమెరికా వాడు మొగుడు అని పిస్తోంది. మొగుడు సరే మరి ప్రజాస్వామ్యం అంటే ఎవరు? అంటే మాత్రం నేను చెప్పలేనురా’’ అని పరాంకుశం చేతులెత్తేశాడు.

 నన్ను చెప్పమంటారా? అని ఇరానీ హోటల్ లో సప్లయర్ ‘‘ప్రజాస్వామ్యం అంటే ఇరానీ హోటల్ లాంటి దే సార్! గుంపులు గుంపులుగా కూర్చుంటారు. ఎవడి గోల వాడిదే. ఒకడి మాట ఒకడు వినడు. ప్రజాస్వామ్యంలోనూ ఇంతే. తాగే టీ కప్పును సరిగా కడకపోయినా తాగేందుకు మళ్లీ మళ్లీ వచ్చేస్తుంటారు.’’ అంటూ వాడు చెబుతుంటే శంకరం నీళ్లను జగ్గులో నుంచి గ్లాస్‌లో పోస్తూ, నీళ్లు గ్లాస్‌లో పోస్తే గ్లాస్ రూపంలో కనిపిస్తాయి, జగ్గులో పోస్తే జగ్గు రూపంలో కనిపిస్తాయి. ప్రజాస్వామ్యం అంటే ఇరానీ హోటల్ జగ్గులోని నీళ్లు’’ అని అరిచాడు.

 శంకరం మాటలను విబేధిస్తూ పరాంకుశం ప్రజాస్వామ్య యుతం గా తల అడ్డంగా ఊపాడు.

5, డిసెంబర్ 2012, బుధవారం

యుగాంతం లో రాంగోపాల్ వర్మ సినిమా .. కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు .. చందన ,బొమ్మన డిస్కౌంట్ సేల్స్

డిసెంబర్ 22న యుగాంతమని ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. నానా గడ్డికరిచి కూడబెట్టిన డబ్బును వదిలివెళ్లాలంటే ఏ నాయకుడికైనా మనసెలా ఒప్పుతుంది? ఓటర్లందరినీ ఆలోచింప చేస్తున్న యుగాంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నాయకులు తంటాలు పడుతున్నారు. యుగాంతంపై హాట్ హాట్ సినిమాలు తీసేందుకు సినిమా వాళ్లు కెమెరాలతో సిద్ధమవుతున్నారు. చానల్స్ యుగాంతాన్ని తమ స్టూడియోకి రప్పించి చర్చ నిర్వహించడానికి తంటాలు పడుతున్నాయి.


***
యుగాంతంపై సినిమా తీయనున్నట్టు కిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ‘‘ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా సినిమా తీయవచ్చుననే కొత్త కానె్సప్ట్‌తో రవితేజతో దొంగల ముఠా సినిమా తీస్తే, ఒక్క పైసా రాలేదు. నా కానె్సప్ట్‌ను ప్రజలు సరిగా అర్ధం చేసుకోలేదు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా సినిమా అని నేను చెబితే ఆ సినిమా చూసేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దని ప్రేక్షకులు అనుకున్నారు. ఒక్కోసారి ప్రేక్షకులు మన ఆలోచనా స్థాయిలో ఆలోచించక పోవడం వల్ల ఇలానే జరుగుతుంది. ఆ ప్రయోగం తరువాత తెలుగులో మరో అద్భుత ప్రయోగంగా యుగాంతం సినిమా తీస్తాను. ఇందులో నటీనటులు ఎవరో నాకే తెలియదు. యుగాంతం జరుగుతుంటే అప్పుడే షూటింగ్ చేస్తాం. ప్రపంచంలో ఇదే తొలి లైవ్ షూటింగ్ సినిమా అవుతుంది.’’ అని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.
***

తెలుగునేత పాదయాత్రలో ఆవేశంగా మాట్లాడుతున్నారు.‘‘ఒక్క వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫ్యాక్షనిజం రాష్ట్రానికి ప్రమాదం అని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. కొండలను,గుట్టలను కొల్లగొట్టారు. వారి పాపాల వల్లనే యుగాంతం జరగబోతుంది. యుగాంతానికి ముమ్మాటికీ జగనే కారణం. తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఇలా చేశారు. తండ్రి కొడుకులు కలిసి దేవునితో చెలగాటం ఆడారు యుగాంతానికి కారణమవుతున్నారు. జగన్ కోసం వైఎస్‌ఆర్ రాష్ట్రాన్ని కొల్లగొడితే దేవుడికి ఆగ్రహం వచ్చి యుగాంతానికి సిద్ధమయ్యారు. 82లోనే యుగాంతం జరిగే ప్రమాదం ఏర్పడింది. కానీ అప్పుడు ఎన్టీఆర్, తరువాత నేను స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల యుగాంతం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఆగే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసమర్ధుడు. ఢిల్లీ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని గంట సేపు ఆపలేని వారు యుగాంతాన్ని ఆపగలరా? నేను కుర్చీలో కూర్చుంటేనే యుగాంతం నిలిచిపోతుంది.


అక్కడెవరో తమ్ముడు తెలంగాణ తెలంగాణ అని అరుస్తున్నాడు. చూడు తమ్ముడు నేను తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక్క ఓటరును కూడా నేను వ్యతిరేకించను అలాంటిది. నాలుగు కోట్ల ఓటర్లను ఎలా వ్యతిరేకిస్తానని అనుకున్నావ్ బ్రదర్. యుగాంతానికి కెసిఆర్ కూడా కారణమే’’ అని చెప్పుకుపోతుంటే. ఇంతలో ‘‘సార్ మీరు యుగాంతం అయిపోయేంత వరకు ఇలానే మాట్లాడేంత శక్తి మీకుందనే విషయం మాకు తెలుసు. మీరు ఉపన్యాసం ఆపితే యుగాంతాని కన్నా ముందే ఈ వార్తను ఆఫీసుకు పంపించుకుంటాం’’ అని కుర్ర విలేఖరి చీటిరాసి పంపడంతో బాబు ఉపన్యాసం ముగించారు.
***

విజయమ్మ ఒక చేతిలో బైబిల్, మరో చేతిలో మైకు పట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మీ కోసం మీ పిల్లల కోసం కాదు మా కోసం మా అబ్బాయి కోసం ఏడవండి. వైఎస్‌ఆర్ రెక్కల కష్టం మీద ఈ విశ్వం ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి చేసిన పాపం ఏమిటి? యుగాంతం కాకుండా ప్రజలను కాపాడడమే ఆయన చేసిన పాపమా? కాంగ్రెస్, టిడిపి పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. ఈ ఘోరాన్ని చూడలేక దేవుడికి కోపం వచ్చి, యుగాంతానికి సిద్ధపడ్డాడు. యుగాంతాన్ని ఆపే శక్తి ఒక్క జగన్‌కే ఉంది. అందుకే కిరణ్ బాబులు భయపడి జగన్ బాబును జైలులో పెట్టారు. జగన్ బాబు జైలు గోడలు బద్ధలు కొట్టుకొని వస్తారు. యుగాంతాన్ని అడ్డుకుంటారు.
షర్మిల మైకు అందుకుని ‘‘యుగాంతాన్ని అడ్డుకోవడానికి నేను జగనన్న వదిలిన బాణాన్ని. నా మాట నమ్మండి జగనన్న బయటకు వస్తారు. యుగాంతం సంగతి తేలుస్తారు. అందుకే బెయిలు రాకుండా అధికారపక్షం, ప్రతిపక్షం కుమ్మక్కయ్యాయి.’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.
***


‘‘నేను స్పష్టమైన తెలుగు మాట్లాడేంత వరకు యుగాంతం రాదు’’ అని అర్ధం అయి కాకుండా కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పిన మాటలతో హాలు చప్పట్లతో మారుమ్రోగింది. యుగాంతం భయంతో బిక్కుబిక్కుమంటున్న వారంతా హాయిగా ఊపిరి పీల్చుకుని చప్పట్లు కొట్టారు.‘‘మేడమ్ సోనియాగాంధీ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. నాకు తెలుగు నేర్పేందుకు ఢిల్లీ నుంచి హై కమాండ్ దూతను పంపిస్తానని, నేను తెలుగు నేర్చుకునేంత వరకు యుగాంతం కాదని మేడం స్వయంగా చెప్పారు’’ అని కిరణ్ ముగించారు. ఆ తరువాత మాట్లాడిన చిరంజీవి తాను రాజకీయాలను నేర్చుకుని, హిందీ మాట్లాడేంత వరకు యుగాంతం కాదని అన్నారు.
యుగాంతం తరువాత రిటైర్‌మెంట్ తీసుకుంటానని సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఈ ప్రకనటను స్వాగతించిన అక్కినేని నాగేశ్వరరావు తనదీ అదే నిర్ణయమని అన్నారు.
***

తెలుగు చానల్స్ అన్నీ యుగాంతం లైవ్ కవరేజ్ ముందస్తుగానే ప్రారంభించాయి. యుగాంతాన్ని తమ చానల్ చర్చలకు ఆహ్వానించామని ఓ టీవి ప్రకటించింది. యుగాంతాన్ని ముందుగా ప్రపంచానికి చూపేది కూడా తమ చానలే అని బోడుప్పల్ నుంచి టీవి ప్రతినిధి బోడిగుండయ్య లైవ్‌లో చెప్పారు.
యుగాంతం కోసం చందన బొమ్మన బ్రదర్స్ లో సరికొత్త డిజైన్స్ తో  90 % డిస్కౌంట్ సేల్స్  ప్రకటించారు 

2, డిసెంబర్ 2012, ఆదివారం

కాలం తయారు చేసుకొన్న యోధుడు నరేంద్ర మోడీ

తనకు కావలసిన యోధులను కాలమే తయారు చేసుకుంటుంది. ఆ యోధులు హీరోలు కావచ్చు, విలన్‌లు కావచ్చు. లక్షలాది మంది యూదులను హతమార్చిన హిట్లర్‌నైనా, ప్రపంచాన్ని పాలించే అమెరికాను గడగడలాడించిన లాడెన్‌నైనా .. కోట్లాది మందిలో స్వాతంత్రేచ్ఛను రగిల్చిన మహాత్మాగాంధీనైనా, ప్రపంచానికి మార్గాన్ని చూపించిన బుద్ధ్ధుడినైనా కాలమే తయారు చేసుకుంటుంది. అంత కన్నా ముందు ఆ తరువాత వీరికన్నా శక్తివంతమైన వారు పుట్టి ఉండవచ్చు కానీ కాలం సహకరించక పోవడం వల్ల వారి ఉనికే తెలియకుండా పోయింది. భారత రాజకీయాల్లో నడుస్తున్న కాలం రూపొందించుకున్న యోధుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రస్తాన లేకుండా భారత రాజకీయాలను అంచనా వేయలేం. ఆయన్ని వ్యతిరేకిస్తూనో, ఆయనకు అభిమానిస్తూనో, ఎలాగైతేనేం ఆయన పాత్ర లేకుండా రాజకీయాలు ఊహించలేని స్థాయికి మోడీ చేరుకున్నారు.

 తాను ప్రధానమంత్రి పోటీలో ఉన్నానని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ప్రధానమంత్రి పోటీలో ఉన్న వారి జాబితా ఎవరు రూపొందించినా ఆయన పేరు ఉండి తీరాల్సిందే. తనను తాను గుజరాతీగా చెప్పుకోవడానికి, గుజరాత్ అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందడానికే మోడీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పునాదులు బలంగా ఉంటే భవనం ఎంత ఎత్తుకైనా కట్టవచ్చునని పునాదులు తెలిసిన నాయకుడాయన. అందుకే బిజెపిలో తాను ఎవరికీ పోటీ కాదని గుజరాత్ రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఒక జాతీయ పార్టీ నాయకుడైనా, గుజరాత్‌లో మాత్రం ప్రాంతీయ పార్టీ తరహాలోనే తన వ్యక్తిగత ఇమేజ్‌తో బిజెపికి ఎదురులేకుండా చేశారు. నరేంద్ర మోడీ స్థానిక నాయకుడు, రాహుల్‌గాంధీ జాతీయ నాయకుడు, రాహుల్‌తో మోడీకి పోలికేమిటి? అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకులు విమర్శించినప్పుడు.

 ఔను నేను స్థానిక నాయకుణ్ణే, ఈ విషయాన్ని నేను వినయంగా ఒప్పుకుంటాను. రాహుల్‌గాంధీ జాతీయ నాయకుడే కాదు అంతర్జాతీయ నాయకుడు కూడా. ఆయన ఇటలీ నుంచి కూడా పోటీ చేయగలరు అంటూ చురక అంటించారు. ఎదుటి వారిని ఆటపట్టిస్తూ, గుజరాత్ ఆత్మగౌరవాన్ని చాటిచెబుతూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ మాట్లాడడంలో మోడీ స్టైలే వేరు. కార్యదర్శులు రాసిచ్చే ఉపన్యాసం కన్నా అప్పటికప్పుడు చమక్కులతో ప్రత్యర్థులను ఆటపట్టించడం మోడీకి భలే సరదా! మోడీ ముమ్మాటికీ కాలం తయారు చేసుకున్న హీరో.... మోడీని రాజకీయాల్లో విపరీతంగా అభిమానించే వాళ్లు ఉన్నారు. అదే విధంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర బిందువు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావం ఆ రాష్ట్రానికే పరిమితం అవుతుంది. కానీ మోడీ ప్రభావం మాత్రం మొత్తం దేశంపై కనిపిస్తోంది. కాబోయే ప్రధానమంత్రి మోడీ అని భావించే వాళ్లు కొందరు. రాహుల్‌గాంధీకి మోడీ నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది.

 ఒక్క ఫోటో మీ జీవితానే్న మార్చేస్తుంది. నిజమే రాజకీయ నాయకుల జీవితాలను ఏ సంఘటన ఎలా మలుపుతిప్పుతుందో తెలియదు. గుజరాత్ మత కలహాల సమయంలో ఒక ముస్లిం యువకుడు నన్ను ఏమీ చేయకండి అంటూ కన్నీళ్లు పెడుతూ వేడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేక ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. చివరకు ఆయనకు అమెరికా, బ్రిటన్‌లు వీసాను సైతం నిరాకరించాయి. ఇది మొదటి ఫోటో కథ ఇక మరో ఫోటోలోకి వెళదాం.. అది మైనారిటీల సమావేశం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వక్తలు ఆకాశానికెత్తుతున్నారు. మోడీ మెడలో శాలువ కప్పారు. అనంతరం ముస్లింలు సంప్రదాయ బద్ధంగా తలపై ధరించే టోపీని మోడీ తలపై పెట్టడానికి మత పెద్ద ముందుకు రాగానే మోడీ సున్నితంగా తిరస్కరించారు. పత్రికలు ఆ ఫోటోను ప్రచురించాయి. చానల్స్ హడావుడి చేశాయి. మోడీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా మోడీ స్థానంలో మరే నాయకుడు ఉన్నా ముస్లింల కన్నా మిన్నగా ముస్లిం సంప్రదాయంలో టోపీ ధరించి ఆ సమావేశానికి వెళ్లేవారు. టోపీ పెట్టడానికి ముందుకు వస్తే మహాద్బాగ్యంగా భావించే వాళ్లు. మోడీ సైతం అలానే చేసి ఉంటే దేశంలోని కొన్ని వందల మంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరుగా ఉండేవారు. కానీ మనసులో ఒకటి పైకి ఒకటి అని కాకుండా ఇతరులు ఏమనుకున్నా, ఇతరులకు నచ్చినా నచ్చక పోయినా తాను అనుకున్నది చేయడం ద్వారా భారత రాజకీయాల్లో నవతరానికి ఆయన హీరోగా మారారు.

 ఆయన పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు, అలానే లౌకిక వాద మీడియా ప్రచారం సాగించినట్టుగా భయంకరమైన నాయకుడు కాకపోవచ్చు. కానీ నవ తరాన్ని ఆకట్టుకుంటున్న నిఖార్సయిన రాజకీయ నాయకుడు. ప్రధానమంత్రి పోటీలో ప్రాంతాలకు అతీతంగా మద్దతు పొందుతున్న నేత. అగ్రవర్ణాల పార్టీ అనే ముద్ర ఉన్న బిజెపిలో వెనుకబడిన వర్గాల నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగిన నేత. గదిలో బంధించి అదే పనిగా పిల్లిని హింసించినా అది పులిలా తిరగబడుతుంది ఇది సహజం. అలానే హిందూమతం సహనాన్ని అసమర్థతగా భావించినప్పుడు మోడీ లాంటి వారిని తమ యోధునిగా నిర్ణయించుకోవడానికి కాలమే అవకాశం కల్పించింది. మతం అనే భావన పుట్టక ముందే పుట్టిన హిందూ మతంలోనే లౌకిక వాదం ఉంది. హిందూమతానికి మరెవరో లౌకిక వాదం నేర్పాల్సిన అవసరం లేదు, ఆ మతం పునాదే లౌకిక వాదం. కానీ ఓట్ల రాజకీయంలో, మైనారిటీల సంతృప్తీకరణ విధానాలతో మమ్ములను, మా మతాన్ని చులకన చేస్తున్నారు అనే భావన హిందువుల్లో బలంగా ఏర్పడింది. ఈ ఆలోచనలే మోడీని బలమైన నాయకుడిగా నిలబెట్టింది. దేశం మొత్తం మోడీకి వ్యతిరేకంగా మీడియా ప్రచారం సాగించినా, అమెరికా వీసా నిరాకరించినా ఇలాంటి ప్రతి చర్య మోడీకి హీరో ఇమేజ్‌ను తెచ్చి పెట్టాయి. 

అమెరికాలో గుజరాతీల సమావేశానికి హాజరు కావడానికి మోడీ వీసా కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. దాంతో మోడీ గుజరాత్ నుంచే అమెరికాలోని గుజరాతీలతో సంభాషించారు. ఎంతో ఆర్భాటంగా పెట్టుబడుల సేకరణ కోసం కాళ్లరిగేలా అమెరికాలో తిరిగిన నాయకుల కన్నా మోడీ తన సొంత రాష్ట్రంలో ఉండే ఎక్కువ పెట్టుబడులు రాబట్ట గలిగారు. పెట్టుబడులతో పాటు గుజరాతీల మనసు దోచారు. గుజరాత్‌కు సింబల్‌గా మారారు. చివరకు ఆయన ప్రత్యర్థి పార్టీలు సైతం మాది మోడీ రాష్ట్రం అని చెప్పుకునే పరిస్థితి కల్పించారు.

రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటో? తమ రాష్ట్రం పెట్టుబడులకు ఏ విధంగా అనుకూలమైనదో వివరించారు. మోడీ వంతు రాగానే డబ్బు సంపాదన కోసం మీరు సొంత దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిన వారు. లాభం వస్తుందనే నమ్మకం ఉంటే తప్ప పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టమని నేనేమి మిమ్ములను బ్రతిమిలాడడం లేదు. లాభం ఉందనుకుంటే పెట్టుబడులు పెడతారు అంటూ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఎలా ఉందో వివరిస్తూనే మీ నుంచి ఒక సహాయాన్ని కోరుతున్నాను అంటూ మీరున్న దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక పది మందికి భారత దేశంలో దర్శనీయ ప్రదేశాల గురించి ఒక పది మందికి చెప్పండి. ఒక్కొక్కరు ఒక పది మందిని భారత్‌కు పర్యాటకులుగా పంపగలిగితే దేశానికి ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుందో లెక్కలు చెప్పారు. అప్పటి వరకు మాట్లాడిన ముఖ్యమంత్రులంతా ఎన్‌ఆర్‌ఐలను బ్రతిమిలాడినట్టుగా మాట్లాడితే మోడీ మాత్రం ప్రాక్టికల్‌గా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

 తన ధరించే దుస్తుల నుంచి, తన ఉపన్యాసం, తన పాలన వరకు అన్నింటిలోనూ మోడీ మార్క్ కనిపిస్తుంది. అప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్న మోడీ 1987లో బిజెపి ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అంతకు ముందు అతనికి ఎలాంటి పాలనానుభవం లేదు. కానీ చిత్రంగా అనేక ఒడిదుడుకులను, వ్యతిరేకతను ఎదుర్కొని పాలనను గాడిలో పెట్టి వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి నాలుగవ సారి సైతం అధికారంలోకి రావడంలో ఎలాంటి సందేహం లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 1995 నుంచి గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి ఉంచే విధంగా చేసింది మాత్రం మోడీనే. 2001 జనవరి లో భారీ భూ కంపం గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ పగ్గాలు చేపట్టారు. భూ కంపంలో భుజ్ పట్టణం సర్వనాశనం అయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. ఈ రోజు మీరు భుజ్ పట్టణాన్ని చూస్తే ఒకప్పుడు భూ కంపంలో నాశనమైన పట్టణం ఇదేనా? అని ఆశ్చర్యపోతారు. భుజ్ పట్టణం మోడీ పాలనా దక్షతకు నిదర్శనం అంటారు ఆయన అభిమానులు. ఒకవైపు భుజ్‌పై శ్రద్ధ పెడుతూనే మరోవైపు గుజరాత్ నవ నిర్మాణంపై దృష్టి సారించారు. ఇప్పుడు గుజరాత్ అభివృద్ధి రేటు రెండంకెల్లో ఉంది. గుజరాత్‌కు ఇప్పుడు రాష్ట్రాలతో కాదు దేశాలతోనే పోటీ అని మోడీ సగర్వంగా ప్రకటించారు. మతపరంగా మోడీని విమర్శించే వారు సైతం అభివృద్ధి విషయంలో, అవినీతి వ్యవహారాల్లో ఆయన్ని వేలెత్తి చూపించలేరు. మతపరంగా మోడీపై తీవ్రంగా విమర్శలు చేసే వారు ఉన్నారు కానీ పాలనలో అసమర్ధత, అవినీతి, అక్రమాలపై విమర్శించే వారు లేరు. చివరకు మైనారిటీ నాయకులు సైతం మోడీ కన్నా ముందు నుంచే గుజరాత్ అభివృద్ధి పథాన పయనిస్తోంది అని చెబుతున్నారు కానీ మోడీ అభివృద్ధి సాధించలేరు అని చెప్పడం లేదు. సహజంగా వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కుంభకోణాలు, అవినీతి సైతం అదే స్థాయిలో బయటపడుతుంది. కానీ మోడీ పాలన మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది. 1950 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని మెహసనా జిల్లాలోని వడనగర్ అనే చిన్న పట్టణంలో మోడీ జన్మించారు. సామాన్య కుటుంబం. మోడీ ఈ స్థాయిలో ఉన్నా ఏ ముఖ్య కార్యక్రమం అయినా తన గ్రామంలోని ఇంటికి వెళ్లి తల్లికి పాదాభివందనం చేసి ప్రారంభిస్తారు. 1967లో ఇండో పాక్ యుద్ధ సమయంలో చిన్న వయసులోనే సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో సైనికులకు యుద్ధ సమయంలో వాలంట్రీగా పని చేశారు. అఖిలభారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివిన మోడీ విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాల్లో ఉండేవారు. ఎంఎ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కువ సమయం గడిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉండగా, 1974లో అవినీతికి వ్యతిరేకంగా నవనిర్మాణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అజ్ఞాత వాసంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. 1987లో బిజెపిలో చేరారు. ఏడాదిలోనే అతన్ని గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1995లో గుజరాత్‌లో బిజెపి అధికారంలోకి వచ్చింది. 88 నుంచి 95 వరకు మోడీ తన కార్యకలాపాలతో గుజరాత్ బిజెపిలో మంచి వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. అద్వానీ రథయాత్రలకు ఏర్పాట్లు జరిగింది మోడీ నాయకత్వంలోనే. 

1998లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. 1995లో మోడీని బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమించి, ఐదు రాష్ట్రాల్లో బిజెపి బాధ్యతలు అప్పగించారు. తరువాత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వివిధ దేశాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి, బిజెపి జాతీయ నాయకులతో సన్నిహితం కావడానికి ఈ కాలంలో ఆయనకు ఎంతో ఉపయోగపడింది. ఈ పరిచయాలే ఆయన్ని 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిని చేశాయి. పంచమిత్ర యోజన పేరుతో ఐదు ప్రధాన అంశాలను గుర్తించి, వివిధ రంగాల్లో గుజరాత్ సమగ్రాభివృద్ధికి మోడీ ప్రాధాన్యత ఇచ్చారు.

 22 డిసెంబర్ 2002లో రెండవ సారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం నుంచే మోడీ స్టైల్ చూపించారు. ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేశారు. గ్లామర్ రాజకీయాలను నమ్ముకునే ప్రాంతీయ పార్టీల నాయకుల తరహాలో ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ గవర్నెన్స్, పెట్టుబడులు, విద్య, విద్యుత్, ఎస్‌ఇజడ్, రోడ్లఅభివృద్ధి వంటి అనేక రంగాల్లో గుజరాత్ ఆశ్చర్యకరమైన అభివృద్ధి సాధిస్తోంది. మీడియా మొత్తం మోడీని వ్యతిరేకించిన కాలంలో సైతం సామాజిక సైట్స్‌లో మాత్రం మోడీ హవా కనిపించేది. దేశం మొత్తంలో అందరి కన్నా ఎక్కువగా సామాజిక సైట్స్‌తో అనుసంధానం అయింది మోడీనే. ఆయన ట్విట్‌ను కొన్నివేల మంది అనుసరిస్తారు. వివిధ అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ముస్లింలు సైతం మోడీకి మద్దతు ఇస్తున్నారు. మత రాజకీయాలు ఇంకెంత కాలం అభివృద్ధిపై దృష్టి సారిద్దాం అంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. బురఖాలను సైతం బిజెపి పంపిణీ చేసి సభలకు పంపిస్తున్నారు అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడొకరు విమర్శించారంటే మోడీ సభల్లో ముస్లింల హాజరుపై ఆ పార్టీ కలవరపాటు కనిపిస్తోంది. కేవలం మతాన్ని నమ్ముకొని మోడీ అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం ఒకసారి మాత్రమే గెలిచే వారు. నాలుగవ సారి అధికార పగ్గాలు చేపట్టడం అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మోడీ పాలన గుజరాత్ ప్రజలకు నచ్చింది. అందుకే మళ్లీ మళ్లీఅధికారం అప్పగిస్తున్నారు. కేవలం ప్రచారం, మతం, ఉద్రేకాలు రెచ్చగొట్టే ఏదో ఒక అంశం ఒకసారి కన్నా ఎక్కువ సార్లు పని చేయదు. మోడీ మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు అంటే ప్రజలు ఆమోదిస్తున్నారనే విషయాన్ని మోడీ వ్యతిరేకులు గుర్తించాలి. 

మోడీ స్టైల్

* మోడీ స్టైల్ నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు ఆయన దుస్తుల్లోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఒకే రకంగా తెల్ల రంగు దుస్తులు ధరిస్తారు. కానీ మోడీ స్టైల్ వేరు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆయన దుస్తుల్లో సైతం ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. మోడీ కుర్తా ఇప్పుడు గుజరాత్‌నే కాకుండా ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో పాపులర్. మీ దుస్తుల డిజైనర్ ఎవరు? అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. ఎందుకంటే ఆయన దుస్తుల డిజైనర్ ఆయనే. ఇందులో వింతేమీ లేకపోవచ్చు. కానీ ఆ డిజైన్ వెనుక కథ మాత్రం ఆసక్తికరమైనదే. ‘‘ గత 40 ఏళ్ల నుంచి నా దుస్తులను నేనే ఉతుక్కుంటున్నాను. లాంగ్ కుర్తా ఉతుక్కోవడం కొంచెం కష్టం అనిపించేది. ఉతక డానికి సౌకర్యంగా ఉంటుందనే చేతులు లేని కుర్తాకు డిజైన్ చేశాను. అంటే కనీసం చేతుల వరకు ఉతకాల్సిన అవసరం ఉండదు. పైగా లగేజీలో తక్కువ స్థలం ఆక్రమించుకుంటుంది. అంటూ తన స్టైల్ రహస్యం విప్పి చెప్పారు. నా సింప్లీసిటీ కూడా ఫ్యాషన్ అయిపోయింది. మోడీ కుర్తా ఇప్పుడు అన్ని చోట్ల లభిస్తోంది అంటారు నవ్వుతూ. ఇక ఆయన ఇష్టపడి తినేది కిచిడి. ఈ తరం వాళ్లకు ఇది అంతగా ఇష్టం ఉండదు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అంటారు. నేను గత నాలుగున్నర దశాబ్దాలుగా పరివ్రాజకునిగానే జీవిస్తున్నాను, ఎక్కడ ఎవరింటికి వెళ్లినా వాళ్లు పెట్టింది తింటాను’’ అని చెబుతున్నారు. 

 హిట్లర్ మోడీ
ఔను హిట్లర్ కూడా అభివృద్ధి చేశాడు అభివృద్ధి విషయంలో మోడీని ఆకాశానికెత్తేవారు ఉన్నట్టుగానే తీవ్రంగా విమర్శించే వారు సైతం ఉన్నారు. వారు సైతం బలమైన వాదనలే వినిపిస్తారు. గుజరాత్, మహారాష్టల్రో విద్యారంగంలో విశేష కృషి జరిపిన మహమ్మద్ వస్తన్వీ వాదన మరో విధంగా ఉంది. 20 శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది. 1933నుంచి 1939 వరకు ఆరేళ్లు జర్మనీలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది. అయితే ఆ తరువాత 1939 నుంచి 1945 వరకు ఆరేళ్ల కాలంలో హిట్లర్ పాలనా కాలంలో జర్మనీ విధ్వంసం అయింది. అభివృద్ధి జరిగింది హిట్లర్ పాలనా కాలంలోనే విధ్వంసం జరిగిందీ హిట్లర్ పాలనలోనే. ఐదు కోట్ల మంది రెండవ ప్రపంచ యుద్ధం వల్ల బాధితులయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను, షిప్ బ్రేకింగ్ యూనిట్స్‌ను అల్యూమినియం, అస్బెస్టాస్, కెమికల్ పరిశ్రమలను తమ దేశం నుంచి తొలగించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం వీటిని చూసి అభివృద్ధి అని భావిస్తున్నామని గులాం మహమ్మద్ వాదిస్తున్నారు. 

మేం భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకోవడానికి నాయకులు ఇలాంటి ప్రమాదకరమైన పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్నారనేది ఆయన వాదన. ఇలాంటి ఇనె్వస్ట్‌మెంట్ ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వస్తోందని తెలిపారు. అభివృద్ధి సూచికలపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన పారామీటర్స్‌నే మనం ఉపయోగిస్తున్నాం ఇది మారాలని ఆయన అంటారు. పారిశ్రామికంగా దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన మహారాష్టల్రోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే జమ్మూకాశ్మీర్‌లో అతి తక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అయినా గుజరాత్ అభివృద్ధి మోడీ నాయకత్వంలో ఇప్పుడు మొదలైనదేమీ కాదు. పారిశ్రామిక వాతావరణం గుజరాత్‌లో 19వ శాతాబ్దం నుంచే ఉంది. పారిశ్రామిక వేత్త అబ్దుల్లా గుజరాత్ నుంచి మహాత్మాగాంధీని దక్షిణ ఆఫ్రికాకు పిలిపించుకున్నారు. పారిశ్రామిక వాతావరణం విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో గుజరాత్‌ను పోల్చడానికి అవకాశం లేదు. ఇక గుజరాత్‌లో అభివృద్ధి అని చెబుతున్నది మోడీ హయాంలో జరిగిందేమీ కాదు. నరేంద్ర మోడీ గ్రోత్ రేట్ అని ప్రచారం చేస్తున్నారు కానీ మోడీ లేక ముందు రెండు దశాబ్దాల క్రితమే ఇప్పటి కన్నా అభివృద్ధి రేటు ఎక్కువగా ఉందనేది మోడీ వ్యతిరేకుల వాదన. 

1990లో గుజరాత్‌లో అభివృద్ధి రేటు 12 నుంచి 13 శాతం. ఆ సమయంలో జాతీయ అభివృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ఇప్పుడు గుజరాత్‌లో అభివృద్ధి రేటు 11 శాతం కాగా,జాతీయ అభివృద్ధి రేటు దీని కన్నా ఒకటి రెండు శాతం మాత్రమే తక్కువ. ఇదీ మోడీ వ్యతిరేకుల వాదన. మీడియా ప్రచారం వల్ల మోడీకి అభివృద్ధికి చిహ్నం అనే ముద్ర పడిందనేది వారి వాదన. అయితే అభివృద్ధి విషయంలో మోడీ చేతలతో చూపించడం వల్ల వ్యతిరేక ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. 

నరేంద్ర మోడీ.. నారా బాబు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని పోలికలు ఉన్నాయ. బాబు కన్నా మోడీ వయసులో ఆరునెలలు, రాజకీయాల్లో పదేళ్లు చిన్న . కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఆరాకులు ఎక్కువే చదివారు. 1950 ఏప్రిల్‌లో బాబు జన్మిస్తే, అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మోడీ జన్మించారు. 1978లో కాంగ్రెస్ ఐ ద్వారా బాబు రాజకీయ జీవితం ప్రారంభమయితే, 1987లో బిజెపి ద్వారా మోడీ రాజకీయ జీవితం ప్రారంభం అయింది. బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

బాబుకు అనుకూలంగా దాదాపు ప్రపంచ మీడియా మొత్తం ప్రచారం చేయగా, మోడీకి వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రచారం సాగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రచారాన్ని పొందింది ఈ ఇద్దరు నాయకులే. మన రాష్ట్రానికి చెందిన సామాజిక శాస్తవ్రేత్త ఒకరు ఒక విషయాన్ని పదే పదే చెబుతుంటారు. 2004లో మన రాష్ట్రంలో, గుజరాత్‌లో దాదాపు ఒకే సమయంలో ఎన్నికలు జరిగాయి. మీడియా బాబుకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం చేసింది, మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మీడియా విస్తృత ప్రచారం చేసింది. కానీ చిత్రంగా వ్యతిరేక ప్రచారాన్ని ఎదురీది మోడీ విజయం సాధించగా, అనుకూల ప్రచారం ఉన్నా బాబు ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు సైతం నా పాలన చూసి మురిసిపోయారు అని ప్రచారం చేసుకున్న బాబు ఓడిపోగా, అమెరికా వీసా ఇవ్వకుండా అవమానించిన మోడీ మాత్రం ఘన విజయం సాధించారు. బాబు పాలనపై క్లింటన్ సెనెట్‌లో సైతం ప్రస్తావించారు అని తెలుగు మీడియా ప్రచారం చేసినా బాబుకు విజయం చేకూర్చలేకపోయారు. మోడీని తమ దేశానికి రాకుండా అమెరికా అడ్డుకున్నా ఆయన విజయాన్ని అడ్డుకోలేక పోయింది.

 మీడియానో, అమెరికానో కాదు ఓటు వేసే ప్రజలే హీరోలు అని గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్టమ్రైనా పదే పదే నిరూపిస్తూనే ఉంది. మీడియా ప్రచార ప్రభావంపై ఈ ఇద్దరు నాయకుల ఫలితాలను అధ్యయనం చేయాల్సిన అంశమే. గుజరాత్ అల్లర్ల సమయంలో రాజధర్మం గురించి మోడీకి అప్పటి ప్రధాని వాజ్‌పాయి వివరించే సరికి, ఆయన్ని మారుస్తారేమో అనే ప్రచారం జరిగింది. గాలికి పోయే పిండిని కృష్ణార్పణం అన్నట్టుగా ఆ క్రెడిట్ తాను కొట్టేయడం ద్వారా మైనారిటీల ఓట్లను సాధించవచ్చునని బాబు భావించి, మోడీని తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం బాబు మద్దతుతోనే నిలబడ్డా, బాబు డిమాండ్‌ను మాత్రం వాళ్లు పట్టించుకోలేదు. బిజెపి వ్యవహారాల్లో ఇతర పార్టీల జోక్యం ఏమిటి? అని బిజెపి నాయకులు నిలదీశారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చమనడానికి ఇతర రాష్ట్రాల వారికున్న హక్కేమిటని గుజరాతీలు ప్రశ్నించారు. చివరకు గుజరాత్ అల్లర్ల వివాదం మోడీని గుజరాత్‌లోనే కాదు దేశంలోనే బలమైన నాయకుడిగా నిలిపింది. మీడియా ప్రచారాన్ని చూసి కొందరు బిజెపి నాయకులు ఏవేవో ఊహించుకుని బిజెపిలో తిరుగుబాటు తీసుకు వచ్చి పార్టీ నుంచి బయటకు వెళ్లి , కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. మోడీ బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని తరువాత ప్రకటించారు.

 ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక నాయకుడు విజేతగా నిలవాలన్నా ప్రజల మద్దతుతో తప్ప అమెరికా అండతోనో, మీడియా మద్దతుతోనో సాధ్యం కాదని మోడీ నిరూపించారు. మోడీని దించాల్సిందే అని పట్టుపట్టిన బాబు ఎనిమిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి, అధికారం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేస్తుండగా, మోడీ మాత్రం నాలుగవ సారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

1, డిసెంబర్ 2012, శనివారం

నగదు బదిలీ తో మద్యం ఆదాయానికి ఊతం

జనవరి ఒకటవ తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రయోగాత్మకంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేయనున్నారు. మన రాష్ట్రంలో దీని కోసం ఐదుజిల్లాలలను ఎంపిక చేశారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్‌గాంధీనే స్వయంగా చెప్పిన విషయం కావచ్చు, సర్వేలు కావచ్చు కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం చేస్తున్న వ్యయంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. మనది సంక్షేమ రాజ్యం. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోయి ఉంటే అంతర్గత సంక్షోభంలో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్‌లా మన దేశం ఉండేది. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి సంక్షేమ రంగానికి గణనీయంగా వ్యయం చేస్తున్నా, పేదరికం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఒకవైపు సంక్షేమానికి నిధుల వ్యయం పెరుగుతోంది మరోవైపు పేదలు పెరుగుతున్నారు. పౌష్టికాహార లోపం గల వారి సంఖ్య ప్రపంచంలో కెల్లా మన దేశంలోనే ఎక్కువగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే కేటాయించిన నిధులకు, వ్యయం జరుగుతున్న దానికి పొంతన లేదు అనేది వాస్తవం. ఈ లోపాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని గొప్పగా ప్రకటించుకుంటోంది. నిజంగా ప్రభుత్వం ఆశించిన విధంగానే జరిగే అవకాశం దేశంలో ఉండి ఉంటే ఈ రోజు సంక్షేమ పథకాలకు ఇన్ని నిధుల అవసరం కూడా ఉండదు. నగదు బదిలీ పథకం అమలు చేసినా అది జరగదు సరికదా మరింత ఎక్కువ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

 రూపాయికి కిలో బియ్యం, సబ్సిడీతో కిరోసిన్ వంటి వాటిని ఇప్పుడు పేదలకు ఇస్తున్నారు. నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చిన తరువాత ఇక వీటిని ఇవ్వరు. అంటే బియ్యం కోసం నెలకు ఒక కుటుంబానికి రెండు వందల రూపాయల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది అనుకుంటే బియ్యానికి బదులు నేరుగా ఆ కుటుంబం ఖాతాలోకి రెండు వందల రూపాయలను జమ చేస్తారు. నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడం వల్ల సబ్సిడీ పథకాల దుర్వినియోగం అస్సలు ఉండదు. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ జరిగేది వేరు. ఒక కుటుంబానికి బియ్యానికి బదులు నగదు ఇస్తే, ఆ నగదు బియ్యానికి మాత్రమే ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్పగలదా? గ్రామీణ ప్రాంతాల్లో, బస్తీల్లో రేషన్ షాపులకు వెళ్లి చూస్తే అసలు వ్యవహారం తెలుస్తుంది. సబ్సిడీ బియ్యం ఇస్తున్నప్పుడే వాటిని అప్పటికప్పుడు ఎక్కువ ధరకు నగదుకు అమ్ముకునే వారున్నారు. బంగారాన్ని తనఖా పెట్టుకుని నగదు ఇచ్చినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో, బస్తీల్లో రేషన్ కార్డును తనఖా పెట్టుకుని డబ్బులిచ్చే పద్దతి చాలా చోట్ల కనిపిస్తుంది. అంటే ఆ కార్డుపై వచ్చే వాటిని తనఖా పెట్టుకున్నవారు తెచ్చుకుంటారు. వారిచ్చిన అప్పు తిరిగి చెల్లించేంత వరకు వడ్డీగా సరుకులు చౌక ధరలకు తెచ్చుకుంటారు. బియ్యం ఇస్తున్నప్పుడే ఇలా ఉంటే ఇక నగదు ఇవ్వడం వల్ల ఆ డబ్బు బియ్యానికే ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలం. నగదు బదిలీ పథకాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది టిడిపి. అప్పటి వరకు ఉన్న సబ్సిడీ పథకాలను తొలగించి వాటి స్థానంలో నగదు బదిలి అమలు చేస్తారా? లేక వాటిని కొనసాగిస్తూనే నగదు బదిలి అమలు చేస్తారా? అని బాబు అధికారంలో ఉన్నప్పుడు స్పష్టంగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. కానీ కేంద్రం నగదు బదిలీ పథకం గురించి ప్రకటన చేయగానే ఇది మాదే మాదే అంటూ హడావుడి చేశారు.. 

నగదు బదిలీ పథకం అమలు వల్ల కచ్చితంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది తప్ప పేదలకు మేలు జరగదు. కచ్చితంగా దుర్వినియోగాన్ని అరికట్టాల్సిందే కానీ పేదల కడుపు కొట్టి ఖజానాకు మేలు చేసే పద్దతిలో కాదు. దుర్వినియోగాన్ని అడ్డుకునే మార్గాలు పరిశీలించాలి. పేదలు కనీసం పట్టెడన్నం తింటారనే కదా బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బును బియ్యానికే ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్పగలదా? మద్యం ఆదాయంలో రాష్ట్రం ఇప్పటికే కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ పథకం అమలుతో ఆ ఆదాయం మరింత పెరిగితే అది ప్రభుత్వానికి రెండు విధాల ప్రయోజనం. పేదలకు అన్ని విధాల శాపం

28, నవంబర్ 2012, బుధవారం

అప్సరసలు - ఆమ్ ఆద్మీ - నేతలు


    ఢిల్లీలో చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకుల కన్నా వయసులో సగం ఉన్నా ఎత్తుగడల్లో రెట్టింపు తెలివి చూపిస్తున్నారు అరవింద్ కెజ్రీవాల్.
దేశంలో ఓట్ల పండగ పుట్టక ముందు నుంచి పుట్టిన పార్టీలు నుంచి వచ్చే ఎన్నికల కోసం పుట్టిన పార్టీల వరకు అందరి గుండె చప్పుడు సామాన్యుడే కదా!
వేశ్య విటుల కోసం పరితపించినట్టు, కల్లు కంపౌండ్ వాడు తాగుబోతుల కోసం , కాటికాపరి శవాల కోసం చూసినట్టు రాజకీయ పార్టీలు ఏవైనా తమ వినియోగదారుడైన సామాన్యుడి కోసం చూస్తుంటాయి. కస్టమర్ ఈజ్ గాడ్ అని చెప్పిన గాంధీజీ మాటను ఉత్తరాది వాళ్లు ఇప్పటికీ తమ షాపుల్లో రాసి పెడతారు. వినియోగదారుడే వ్యాపారికి దేవుడు కదా? రాజకీయ నాయకులు మహాత్మాగాంధీని మరిచిపోయారు కానీ వినియోగదారుడే దేవుడు అని ఆయన చెప్పిన మాట మరువలేదు. హిందీ ప్రాంతం వ్యాపారుల కోసం మహాత్మాగాంధీ ఇంగ్లిష్‌లో చెప్పిన ఈ మాటను ప్రజలే దేవుళ్లు అని తెలుగు నాయకులు తెలుగులోకి అనువాదం చేసుకున్నారు. రాజకీయం, వ్యాపారం ఒకటే కాబట్టి ఒకే నినాదాన్ని ఇద్దరూ నమ్ముకున్నారు. రాజకీయ వ్యాపారం నడిచేది సామాన్యుడితోనే అందుకే ప్రతి పార్టీ సామాన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతుంది. ఎన్నికల మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచారం, నినాదాలు అన్నీ సామాన్యుడి చుట్టే తిరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చాక పని చేసేది అసామాన్యుల కోసమే అయినా చచ్చినట్టు సామాన్యుల చుట్టు తిరగాల్సిందే!
దేశం ఇంత అధ్వాన్నంగా ఉండడానికి ప్రజాస్వామ్యంలోనే లోపముందని మోకాలిని చేతితో నిమురుతూ చెప్పుకొచ్చాడో మేధావి. ఏమిటా లోపం అని అడిగితే, స్టాక్ మార్కెట్ గురించి తెలుసా? ఒక కంపెనీ షేర్లను వందగా విభజిస్తారు. నీ దగ్గర ఎంత డబ్బుంటే అన్ని వందల చొప్పున షేర్లు కొనవచ్చు. కంపెనీ మీటింగ్‌లో నీకు వంద షేర్లకో ఓటు ఉంటుంది. అంటే చిన్న మదుపరికి వద్ద వంద షేర్లు ఉంటే ఒక ఓటు లక్ష షేర్లు ఉన్న పెద్ద మదుపరికి వెయ్యి ఓట్లు ఉంటాయి. ఈ విధానం వల్లనే స్టాక్ మార్కెట్‌తో పాటు కంపెనీలు కళకళలాడుతున్నాయి. మరి ప్రజాస్వామ్యంలో నీ వద్ద ఉన్న డబ్బును ఏ మాత్రం గౌరవించకుండా తల ఒక్కంటికి ఒక్క ఓటు మాత్రమే ఇస్తున్నారు. దీని వల్లనే ప్రజాస్వామ్యం ఇలా ఆమ్ ఆద్మీని దేవుడిగా కొలవాల్సి వస్తోంది అని ఏడ్చాడు.
మళ్లీ మన కెజ్రీవాల్ వద్దకు వద్దాం.
సామాన్యులను స్వల్పకాలంలో మహా సంపన్నులుగా మార్చిన జగన్ అయినా, ప్రపంచానికి రాజకీయ పాఠాలు నేర్పించిన నేతగా అభిమానులు నిరాజనాలు పలికే బాబు అయినా చివరకు సామాన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నించాలి. వీరిని లక్ష్యంగా చేసుకుని రాజకీయం నడపాలి. అప్సరసలు అత్యంత సుందరంగా ఉండేవారట! ప్రబంధాల్లో వారి అందం గురించి చదివితనే మనసు ఎక్కడికో పోతుంది. ఇక వారిని నేరుగా చూస్తే... అంతటి అందగత్తెల ప్రధాన బాధ్యత ఏళ్ల తరబడి స్నాన పనాలు లేకుండా జెడలు కట్టిన తల వెంట్రులతో ముక్కు మూసుకొని తపస్సు చేసే మునులను రంజింప చేయాలి. పాపం నాయకులు కూడా ఇంతే ఎంత అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తేనేం చివరకు అప్సరసలు మునుల ముందు నృత్యం చేసినట్టు నాయకులు సామాన్యుల ముందు కళావిన్యాసాలు ప్రదర్శించాలి. కల్లు ముంత పట్టుకోవాలి, తాటి చెట్టేక్కాలి, టీ కొట్టులో టీ తయారు చేయాలి, చెప్పులు కుట్టాలి, పాలిష్ చేయాలి, గడ్డం గీయాలి. ముసలమ్మ కష్టాలు విని కన్నీరు కార్చాలి.జైలులో బంధించినా జనం కోసం తపించాలి ఎనె్నన్ని కళలు చూపాలి. ఇంత చేసినా ఫలితం ఉంటుందా? అంటే చెప్పలేం. ప్రవరాఖ్యుని లాంటి వాళ్లు అస్సలు చలించరు, వరూధిని లాంటి నేతలు ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడాలి. ఇన్ని కళలు ప్రదర్శించినా సామాన్యుడి మనసులో ఎవరున్నారో చివరి వరకు చెప్పడు. నా మనసులో ఉన్నది నీవే ప్రియా అని అందరికీ చెబుతున్నట్టు కనిపిస్తాడు కానీ మనసులోని మాట చివరి వరకు రహస్యంగా ఉంచుకుంటాడు.

 అల్లరి నరేష్ సినిమాలా మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే నమ్మకం కూడా లేకపోయినా ఖర్చు, హడావుడి మెగాస్టార్ సినిమా లెవల్‌లో చేయక తప్పదు. మళ్లీ మనం కేజ్రీవాల్‌ను పక్కన పెట్టేసి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ నాయకుల కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివిన వాడు ఎందుకంటే... మగ జనాభాలో కనీసం సగం మంది మందుబాబులే ఉంటారు మినిమం గ్యారంటీ అని ఆ మధ్య ఒకరు మందు బాబుల పార్టీ పెట్టారు. అది ఎన్నికల్లో పని చేయలేదు. ఆడా మగా అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ ప్రేమించేస్తారు కదా? అని ఒకరు ప్రేమికుల పార్టీ పెట్టారు. జస్పాల్‌భట్టీ కొత్త కోణంలో ఆలోచించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కుంభకోణాల కోసమే కదా? అని ఏకంగా గోటాలా పార్టీ (కుంభకోణాల పార్టీ) పెట్టారు.ఎంత కష్ట పడ్డా సూట్ కేసుల కోసమే కదా అని నిర్మోహ మాటంగా సూట్కేస్ పార్టీ పెట్టారు. ఇవేవీ ఎన్నికల మార్కెట్‌లో నిలువలేకపోయాయి.

 అందరు నాయకులు సామాన్యుడి కోసం పరితపిస్తుంటే కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేసి ఆ సామాన్యుడి పేరుతోనే పార్టీ పెట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అని ప్రకటించే సరికి నేతలు లబోదిబో మన్నారు. ఇప్పుడు ఎవరు ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడినా అది కెజ్రీవాల్ పార్టీ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్‌కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్ అంటూ సోనియా హయాంలో పుట్టిన నినాదం కాంగ్రెస్‌కు బాగానే వర్కవుట్ అయింది. ఆమ్ ఆద్మీ నినాదాన్ని మా నుంచి వేరు చేయలేరు అంటూ కాంగ్రెస్ నేతలు వాపోయారు. కెజ్రీవాల్ ఆమ్ ఆద్మీనే తన పార్టీ పేరుగా పెట్టడంతో తొలి విజయం సాధించారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ తన పేరున్న పార్టీని ఆదరిస్తాడా? తనను దేవుడన్న పార్టీని గెలిపిస్తారా? తన నామ స్మరణతోనే కాలం గడిపే పార్టీలను ఆదరిస్తారా? చూడాలి.

23, నవంబర్ 2012, శుక్రవారం

.తెలుగు హీరోల కడుపున హీరోయిన్లు ఎందుకు పుట్టరు?

పులికడుపున పులే పుడుతుంది ఇదో సినిమా డైలాగు. హీరో కడుపున హీరోనే పుడతాడు. ఇది వాస్తవం. మరి హీరోయిన్ కడుపున హీరోయిన్ పుడుతున్నప్పుడు హీరో కడుపున హీరోయిన్ ఎందుకు పుట్టడం లేదు. ఇందులో ప్రత్యేక కారణం ఏమీ లేదా? లేదు అని ఎవరైనా అంటే నమ్ముదామా? ఇప్పుడు తెలుగు చిత్రసీమను మూడు నాలుగు కుటుంబాలు ఏలేస్తున్నాయి. హీరోలు, నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఆ కుటుంబాల నుంచే పుట్టేస్తున్నారు. తెలుగు సినిమా వారికి ఏమిటో ఈ ప్రత్యేకత ఒక్క హీరో కడుపులో కూడా ఒక హీరోయిన్ పుట్టక పోవడం ఆశ్చర్యంగానే ఉంది. చివరకు కొందరు కామెడీ స్టార్లకు సైతం హీరోలు పుట్టారు కానీ హీరోయిన్లు పుట్టలేదు. ఎన్టీఆర్ కుమారులు హీరోలుగా వెలుగు వెలిగారు. కుమారుల కుమారులు సైతం ఇప్పుడు ఏలేస్తున్నారు. ఆ ఒక్క కుటుంబం నుంచే ఆరడజను మంది హీరోలు పుట్టారు. అక్కినేని కుటుంబంలోనూ అంతే కుమారుడి కుమారులే కాదు కుమార్తెలకు సైతం హీరోలు పుట్టేస్తున్నారు. 

అన్నగారు 82లో ఇంత కాలం తనను ఆదరించిన తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపనతో బాలకృష్ణను సినిమా రంగానికి అంకితం చేసి తాను రాజకీయాల్లోకి వెళ్లారు. ఇప్పుడు బాలకృష్ణకు తెలుగు ప్రజలకు ఏదో చేయాల్సిన వయసు వచ్చేసింది. తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి, తాను రాజకీయ ప్రవేశానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాత స్వయం కృషితో సినిమా రంగంలోకి వచ్చిన చిరంజీవి కుమారుడు సైతం హీరో అయ్యారు.


హిందీలో చాలా మంది హీరోల కుమార్తెలు హీరోయిన్లుగా నటించారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాదు టాప్ స్థాయికి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కిరీటాన్ని అలంకరించిన తొలి స్టార్ రాజేష్‌కన్నా , మాజీ హీరోయిన్ డింపుల కాపాడియ కుమార్తె హీరోయిన్‌గా చాలా సినిమాల్లోనూ నటించారు. ఇప్పుడు టాప్ స్థాయిలో ఉన్న కరిష్మాకపూర్, కరీనా కపూర్‌లు హీరో కడుపున పుట్టిన హీరోయిన్లు. ధర్మేంద్రా, హేమామాలిని జంట ఒకప్పుడు హిందీ సినిమా రంగానే్న ఏలారు. హేమా మాలిని తన కుమార్తెలను హీరోయిన్లుగా చేయడానికి బాగానే ప్రయత్నించారు. తొలుత విలన్‌గా ఆ తరువాత హీరోగా సంచలం సృష్టించిన షాట్‌గన్ శతఘ్న్ సింన్హా కుమార్తె హీరోయిన్‌గా వెలుగొందారు. హిందీలోనే కాదు చివరకు పొరుగున ఉన్న తమిళనాడులో సైతం కొందరు హీరోల కుమార్తెలు హీరోయిన్‌లు అవుతున్నారు. ప్రయోగాలకు పెట్టింది పేరయిన కమల్‌హాసన్ కుమార్తె శృతి హాసన్ తెలుగు, హిందీ సినిమాల్లో టాప్ రేంజ్‌కు వెళ్లారు.


కానీ చిత్రంగా తెలుగు నాట మాత్రం హీరోలకు, హీరోల బంధువులకు సైతం హీరోలే పుడుతున్నారు కానీ ఒక్క హీరోయిన్ కూడా పుట్టడం లేదు.
పాత తరం నటుడు అమర్‌నాథ్ కుమార్తె శ్రీలక్ష్మి హాస్యనటిగా స్థిరపడ్డారు. వారసత్వంగా కాకుండా బతుకు తెరువు కోసమే ఆమె నటి అయ్యారు. అంతా పోగొట్టుకుని హైదరాబాద్ నగరంలో ఒక అభిమాని ఆశ్రయం ఇస్తే బతుకు వెళ్లదీస్తున్న సమయంలో బతుకుతెరువు కోసం సినిమాల్లోకి వెళతాను అంటే తండ్రి చెప్పిన మొదటి మాట వద్దు అంటూ సినిమా రంగం ఎలాంటిదో చెప్పుకొచ్చారు. ఈ మధ్య జయమాలిని ఒక ఇంటర్వ్యూలో ఆ పాప కూపంలోకి నా పిల్లలను తీసుకు వచ్చే ఉద్దేశం లేదని చెప్పింది. హీరో కృష్ణ నటునిగా కొనసాగుతున్నప్పుడు కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్‌గా నటిస్తుందని ఒక ప్రకటన వచ్చింది. కృష్ణ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. ఆ తరువాత మంజుల సినిమాలు నిర్మిస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు. మోహన్‌బాబు కుమార్తె సినిమాలు తీస్తున్నారు, హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రల్లోనటిస్తున్నారు. మోహన్‌బాబు ఎన్నో సినిమాలు నిర్మించారు. ఎందరికో నటులుగా అవకాశం ఇచ్చారు. అంటే మంచు లక్ష్మికి హీరోయిన్‌గా నటించాలనే ఆసక్తి లేకపోవడం వల్లనే అవకాశం కల్పించలేదని అనుకోవాలా?


జయమాలిన తరువాత వాంప్‌గా ఒక వెలుగు వెలిగిన అనురాధ కుమార్తె తల్లిలానే వాంప్‌గానే కొన్ని సినిమాల్లో కనిపించారు. 80-90 ప్రాంతాల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రాధ కుమార్తె ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తోంది.


నాన్నా మా వారు ఈసారి దసరాకు మీనాన్న మోటర్ సైకిల్ కొనిచ్చి తీరాల్సిందే అంటున్నాడు అంటూ మధ్య తరగతి కుటుంబరావు కుమార్తె భర్త కోరిక చెప్పినంత సులభంగా ఇప్పుడు ఒకనాటి మాజీ హీరోల కుమార్తెలు నాన్నా మా వాడు హీరోగా నటించాలని ముచ్చటపడుతున్నాడు ఎలాగైనా ముచ్చట తీర్చాలి అని అడుగుతున్నారు. ముచ్చట తీర్చుకుంటున్నారు. ఒకరి తరువాత ఒకరు హీరోల వంశంలో హీరోలు పుడుతున్నా హీరోయిన్లు పుట్టక పోవడం చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న ఫ్యూడల్ మనస్తత్వం తెలియడం లేదా?


తెలుగు సినిమా రంగంలో స్ర్తిలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీన్ని బట్టి తెలియడం లేదా? కొడుకును హీరోగా చేయడానికి తంటాలు పడుతున్న వృద్ధ హీరోలు కుమార్తెల విషయంలో అలా చేయడం లేదంటే సినిమా రంగంలో స్ర్తిలకు ఇచ్చే గౌరవం గురించి వారికి బాగా తెలుసు కాబట్టి అంతే కదా? కాదంటారా?

21, నవంబర్ 2012, బుధవారం

నేరజాణకు తమలపాకు తొడిమే పదివేలు? .. నేతలకు కుర్చియే చాలు

వరం కోరుకోవడం కూడా ఓ కళ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే పిల్లలు కేరు మంటూ ఏడిచి వరం సాధించుకుంటారు. వరం ఎప్పుడు కోరాలో పిల్లరాక్షసులకు తెలిసినంతగా పెద్ద రాక్షసులకు, నాయకులకు కూడా తెలియదనిపిస్తుంది.
 ఓ గడసరి నేరజాణ తనను బంగారంలో ముంచెత్తమని కోరుతూ పాట పాడుతుంది. ముద్దటుంగరం అమ్మి ముక్కుకు ముక్కెర, నాణ్యమైన ధాన్యం అమ్మి నడుముకు వడ్డాణం, కాడియెద్దులు అమ్మి కాళ్లకు కడియాలు తెమ్మంటుంది. చివరకు పట్టెమంచం పరుపూ లేక మనసు చిన్నబోయింది పంట భూములమ్మి పట్టె మంచం తెమ్మంటుంది. కాస్త స్వరం పెంచి అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు నేనేదిక కోరేదిక లేదు అంటుంది. చూసే వారికేమో పాపం తమలపాకు తొడిమె ఇచ్చినా అదే పదివేలనుకుంటుంది అమాయకురాలు, పైగా అందరి వలే అలిగే దాన్ని కాదు కొసిరే దాన్ని కాదని చెబుతుంది అనిపిస్తుంది.

 కోరికలు కోరేప్పుడు స్వరం తగ్గించి తమలపాకు తోడిమే పదివేలు అన్నప్పుడు స్వరం పెంచుతూ లౌక్యం చూపుతుంది. ఇప్పుడు మన నాయకులు కూడా ఇలానే తమలపాకు తొడిమే పదివేలు అంటూ కుర్చీ ఇస్తే అవన్నీ సమకూర్చేసుకుంటామని రోడ్డున పడ్డారు. కానీ ఆ జాణ లౌక్యంగా అడిగితే, మన నాయకులు మాత్రం కోరికను ఎక్కడా దాచుకోలేక పదవి లేకుండా ఉండలేమని చెబుతున్నారు.
ఆమె కోరికలు కోరుతున్న తీరు పాట కాదు పాఠం. ఏళ్ల తరబడి తపస్సులు చేసి గడ్డాలు పెంచి నీరసించే రుషులకు సైతం వరాలు ఎలా కోరాలో తెలియదు. నేతలకు అసలే తెలియదు.


మహాభారత యుద్ధంలో ధర్మరాజు హఠాత్తుగా కౌరవుల వైపు వెళ్లి భీష్ముడికి పాదాభివందనం చేస్తారు. శత్రువు కాళ్లు మొక్కాడు .. ఛీ..్ఛ... అని ఆది చూసిన వారికి అనిపించవచ్చు. సొంత వాళ్లు ఎన్ని పొగిడినా ఇవ్వని కిక్కు శత్రువు గౌరవించినప్పుడు వస్తుంది. ఆ విషయం ధర్మరాజుకు బాగా తెలుసు. ప్రసన్నుడై ఏం కావాలో కోరుకో అంటే నువ్వు ఎలా చస్తావో చెప్పి పుణ్యం కట్టుకో అని ధర్మరాజు కోరతాడు. అష్టాదశ పురాణాల్లో ఇంతటి చతురతతో వరం కోరిన వారు మరొకరు కనిపించరు. ధర్మరాజు కాళ్లు మొక్కినట్టే కనిపిస్తుంది కానీ కోరిక మాత్రం పీక నులిమేది. పాపం ఇలాంటి తెలివి తేటలు లేకపోవడం, ఏం వరం కోరాలో, ఎలా కోరాలో తెలియకనే మహా మహా రాక్షసులు సైతం బోల్తాపడ్డారు. ఒక ఐడి యా జీవితానే్న మార్చేస్తుందన్నట్టు.. సాస్టాంగ ప్రమాణం ఎలా చేయాలో చూపించమని అడిగి ఎస్‌విఆర్ తల నరికేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఎన్టీఆర్ వరం కోరుకోవడం పాతాళాబైరవిలో మనం చూశాం కదా?


ఘోరమైన తపస్సు చేసి చివరకు శివుడిని భస్మాసురుడు కోరిన వరం అతనే్న బూడిదగా మార్చింది కదా? భస్మాసురుడి భాషలో వీకో, అతని భావం వరమిచ్చే దేవునికి అర్ధం కాలేదో కానీ నేను ఎవరితలపై చేతులు పెట్టినా వాళ్లు బూడిద కావాలనే వరం కోరుకోవాలనుకున్నాడు. స్పష్టంగా చెప్పక పోవడం వల్ల చివరకు తన తలపై చేయి పెట్టుకుని తానే భస్మం అయ్యాడు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్నట్టు తన చావు కోసం తానే తపస్సు చేసినట్టు అయింది. తల్లిచేతిలోనే చనిపోయే వరం నరకాసురుడి సొంతం. కొడుకు వల్ల మరణించే వరం హిరణ్యకశిపుడిది. శివుడు రాక్షసులకు ఇచ్చిన వరాలన్నీ ఇలాంటివే కదా? నా కడుపులో దూరిపొమ్మని గజాసురుడు అడిగితే చివరకా వరం గజాసురుని కడుపు చీల్చడానికి ఉపయోగపడింది. పాపం వాళ్ల ప్రాణాలు వాళ్లు తీసుకోవడానికి వరం కోరుకోవడం ఎందుకో?


పత్రికలకు పాఠకులే దేవుళ్లు, రాజకీయ నాయకులకు ఓటర్లే దేవుళ్లు. దేవుళ్లలో అందరి కన్నా సులభంగా వరం ప్రసాదించేది పరమ శివుడంటారు. సరే ఈయన వరమిచ్చినా మిగిలిన దేవుళ్లు వెన్నుపోటు ద్వారా ఆ వరాన్ని శాపంగా మార్చేస్తుంటారు. దేవుళ్లలో శివుడు భోళా అయితే ప్రజాస్వామ్యంలో ఓటరు చాలూ.. ఓటరు దేవుళ్లను మెప్పించి వరం కోరుకోవడం అన్నింటి కన్నా కష్టమైన పని. ఓటరు దేవుళ్లు ఎవరికి ఎప్పుడు వరమిస్తారో, ఎప్పుడు ఎందుకు శిక్షిస్తారో మాకు బాగా తెలుసు అని నాయకులు అనుకుంటారు కానీ అది నిజం కాదు.
ఏ నాయకుడు ఏం చేసినా ఓటరు దేవున్ని మెప్పించి కుర్చీని వరంగా పొందాలనే కదా? నాకు కుర్చీపై అస్సలు వ్యామోహం లేదని ఏ నాయకున్ని కదిపినా చెబుతుంటారు. వారి ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగితే చెబుతారో లేదో కానీ వారి ఎక్స్‌రేను పరిశీలిస్తే, అందరి హృదయం లవ్ షేప్‌లో ఉంటే వీరిది మాత్రం కుర్చీ ఆకారంలో ఉందని అనుమానం.


పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు అని అమ్మలక్కలాంతా అడిగే వయసు కూడా దాటిపోయినప్పటికీ సోనియమ్మ మాత్రం తన కుమారుడిని దేశానికి త్యాగం చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికలు యువరాజా వారి నాయకత్వంలోనే జరుగుతాయి. ఫేస్‌బుక్‌లో, సోషల్ సైట్స్‌లో అతని పరిస్థితి ఘోరంగా ఉన్నా, దేశంలోని జనం ఫేస్‌లోకి చూస్తే మాత్రం మిగిలిన వారి కన్నా ఈ ముదురు బ్రహ్మచారికే అవకాశాలు ఎక్కువున్నట్టు అనిపిస్తోంది.నా కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి, అలసిపోయాను, జ్వరం వచ్చింది నీరసంగా ఉంది అయినా నడుస్తున్నాను అని నాయకుడు చెబితే కుర్చీ కోసం ఎంత తంటాలు పడుతున్నాడో అనిపిస్తుంది కదా! తమలపాకు తొడిమే పదివేలు అన్నంత లౌక్యంగా కోరిక కోరాలి. పంట భూములమ్మయినా పట్టె మంచం కొనుక్కురమ్మంటున్న ఆ జాణ కోరికను భర్త తీర్చాడా? నేతల కోరిక ఓటరు దేవుడు తీరుస్తాడా? చూద్దాం.

19, నవంబర్ 2012, సోమవారం

ఈ కాలానికి అవసరమైన నాయకురాలు ఇందిరాగాంధీ



అందమైన యువతికి నపుంసక భర్త  ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మన  దేశానికి  నాయకత్వం అలానే ఉంది ..   ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, అపారమైన వనరులు ఉన్న దేశం .  లేనిదల్ల సమర్ధమైన నాయకత్వం .మోడీ లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే దేశం లో బలమైన నాయకత్వమే లేదు ...  కీలుబొమ్మలు, నిద్రలో కూడా నటించే నట నాయకులు , అవినీతి పరులు , తప్ప నాయకులు తక్కువ. ఇందిరాగాంధీ  మరణించి మూడు  దశాభ్దాలు అవుతోంది. ఆమె బతికి ఉన్నప్పుడు నచ్చలేదు కానీ. ఇప్పుడు అనిపిస్తోంది .. ఇలాంటి సమయం లో అలాంటి దైర్య వంతురలైన నాయకురాలు ఉంటె బాగుండు అని ...

. ఇందిరాగాంధీ ఆమె జీవించిన కాలం కన్నా ఇప్పుడు ఉంది ఉంటే బాగుండేదేమో ( నేడు ఇందిరా గాంధీ జయంతి )
గతం లో ఆమె గురించి రాసిన ఒక పోస్ట్ .
http://amruthamathanam.blogspot.in/2012/03/blog-post_08.html

16, నవంబర్ 2012, శుక్రవారం

యం ఐ యం మద్దతు ఉపసంహరణకు కారణం ..రాజ్యలక్ష్మా? భాగ్యలక్ష్మా?




ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఊహించిందే. కానీ ఎంఐఎం మద్దతు ఉప సంహరణ ఊహించని పరిణామమే! ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి జగన్‌కు సన్నిహితులు. సోనియాగాంధీ వద్దన్నా, జగన్ ఓదార్పు కోసం బయలు దేరాలని సన్నద్ధం అవుతున్నప్పుడు సోనియాగాంధీకి, జగన్‌కు మధ్య అసదుద్దీన్ రాజీకి ప్రయత్నించారు. తమ పాత నగరానికి, మతానికి సంబంధించిన వ్యవహారాలు మినహాయిస్తే, అసెంబ్లీలో అయినా, బయట అయినా చక్కగా మాట్లాడే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో అసదుద్దీన్ ముందు వరుసలో నిలుస్తారు.

 తమ సామ్రాజ్యంలో వారి సొంత పాలన వేరు కానీ పరిపాలనకు సంబంధించి వారు చెప్పే విషయాలు వేలెత్తి చూపడానికి వీలులేకుండా చక్కగా ఉంటాయి. అలాంటి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడానికి చూపిన కారణాలు, సందర్భం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో వివాదం ఇది మొదటి సారేమీ కాదు. చార్మినార్ కట్టిన తరువాత భాగ్యలక్ష్మి ఆలయం కాట్టారా? భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న చోట చార్మినార్ నిర్మించారా? అనేదానిపై ఎవరి వాదనలు వారికున్నా మద్దతు ఉపసంహరణకు అసదుద్దీన్ చెప్పిన కారణాలు మాత్రం సహేతుకంగా కనిపించడం లేదు.

 భాగ్యలక్ష్మి ఆలయం విస్తరణకు ప్రభుత్వమే సహకరిస్తోందట! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంఘ్ పరివార్ చెప్పు చేతుల్లో ఉన్నారట, ఆయన మరో మోడీ అనేది ఎంఐఎం ఆరోపణ. మిగిలిన వారికి ఎలా ఉన్నా ఈ ఆరోపణలు స్వయంగా ముఖ్యమంత్రికి సైతం విస్మయం కలిగించి ఉండొచ్చు. హైదరాబాద్‌లో సంఘ్ వారున్నారా? వారి వివరాలేమిటి? అని కిరణ్ తెలుసుకోవడానికి ప్రయత్నించి కూడా ఉండొచ్చు. క్రైస్తవుడే అయినా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హిందూ పూజారులకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకున్నారని చిల్కూరు బాలాజీ పూజారి, పురోహితుల సంఘం నాయకులు స్వయంగా ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఇలాంటి చరిత్ర ఏమీ లేదు. అసలు కిరణ్ వ్యవహార శైలి అర్ధం కాక సొంత పార్టీ వారే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఆయన మంత్రులకే ఆయనంటే పడదు. ఇక సంఘ్ కోసం ఆయన పని చేయడమా? ఒక ఉద్యోగి ఉద్యోగం మారుతున్నప్పుడు తాను అప్పటి వరకు పని చేసిన సంస్థ గురించి చెడుగా చెప్పవద్దని అంటారు. కానీ ఇది రాజకీయాల్లో చెల్లదు. పాత పార్టీని ఎంత ఎక్కువగా తిడితే కొత్త కంపెనీకి అంత చేరువవుతారు. ఎంఐఎం చేసింది కూడా అదే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే! ఏడాదిన్నర పాటు ప్రభుత్వాన్ని నిలుపుకుంటామని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెబుతారేమో కానీ మళ్లీ గెలుస్తాం అని ఎవరూ చెప్పరు. చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల కోసం సాగుతున్న వ్యూహాలే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఎవరితో కలిసినా పాత బస్తీలోని ఏడెనిమిది నియోజక వర్గాల్లో ఎంఐఎం పార్టీనే గెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. కొత్త ప్రాంతాలకు విస్తరించగడానికి గతంలో కొంత వరకు ప్రయత్నించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు అందుకే ముందు చూపుగా ఎంఐఎం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు తీసుకునే నిర్ణయాలకు ప్రజల్లో పెద్దగా విలువ ఉండదు. అందుకే ఏడాదిన్నర ముందే ఎంఐఎం ఎన్నికల రంగంలోకి దిగింది. మద్దతు ఉపసంహరణ తొలి అడుగు. మద్దతు ఉపసంహరణ ఎంఐఎం వ్యూహాత్మక ఎత్తుగడనే తప్ప భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కానే కాదు.

 ఎంఐఎం కోరాలే కానీ ప్రభుత్వం భాగ్యలక్ష్మి ఆలయ   గతంలో ఉన్న దాని కన్నా మరింత చిన్నగా ఆలయాన్ని మార్చడానికి సైతం సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఐఎంకు కావలసింది అది కాదు మద్దతు ఉపసంహరణకు ఒక అవకాశం అంతే
.

10, నవంబర్ 2012, శనివారం

అన్నా హజారే అవినీతి ఉద్యమం ....పూనం పాండే నషా సినిమా



1.అన్నా ఉద్యమం సమయం లో  ఉద్యమానికి మద్దతుగా  నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలన సృష్టించి ప్రచారం పొందిన పూనం  పాండే 
మోడల్గా పలు కంపెనీల నుంచి అవకాశాలు పొందారు .. నషా  సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు .
2. కేజ్రివాల్ పార్టీ పెట్ట బోతున్నారు ( ఆయన గెలిచే చాన్స్ ఉంది )
3. ఉద్యమ సమయం లో టిడిపి కార్యాలయం ముందు అన్న - బాబుల  కటౌట్లు ఏర్పాటు చేసిన టిడిపి అవి తొలగించి ఇప్పుడు  బాబు- బాపూజీ కటౌట్లు  పెట్టారు 
4.అన్న హజారే అవినీతి ( అంశాన్ని )ని పక్కన పెట్టి రైతు సమస్యలపై ఉద్యమానికి  సిద్ధమవుతున్నారు ..
5.సామాన్యులం  క్యాండిల్స్ దుమ్ము దులిపి మళ్లి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాం

7, నవంబర్ 2012, బుధవారం

ప్రతి నాయకుడి మదిలో కొలువై ఉండే ప్రేయసి

దురద వేసినప్పుడు మెదడు చెప్పకపోయినా గోళ్లు తమ పని తాము చేసుకుపోతాయి. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఇదే. వయసొచ్చాక ప్రేమ కూడా అంతే ప్రేమించాలనిపించేస్తుంది. ప్రేమ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మన కేంద్ర మంత్రి శశిథరూర్ ప్రేమంటే తెలుసా? నీకు అంటూ నరేంద్ర మోడీని ప్రశ్నించే సరికి ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది.

 ఎదుటి వాడి బలానికి మన బలం సరిపోదని లెక్క తేలితే బలహీనతపై దృష్టి పెట్టాలి. అప్పుడు లెక్క తేలుతుందనే లెక్క శశిథరూర్‌కు బాగా తెలుసు. ప్రేమ ఆ సబ్జెక్ట్‌లో థరూర్‌కు విశేషమైన ప్రావీణ్యం ఉంది. ఆ సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ పట్టాలా ఆయన వెన్నంటే అందాల కొత్త భార్య సునంద పుష్కర్ సాక్ష్యంగా పక్కన కనిపిస్తారు. 50 కోట్ల ప్రేయసిని ఎక్కడైనా చూశారా? అంటూ శశిథరూర్‌పై నరేంద్ర మోడీ చురక అంటించారు. ఐపిఎల్ టీంల కేటాయింపు సమయంలో ఎలా జరిగిందో తెలియకుండా సునంద ఖాతాలో 50 కోట్లుచేరిపోయాయి. అది కాస్తా వివాదంగా మారి చివరకు మంత్రి పదవి ఊడింది. అయినా అందమైన భార్య పక్కన లేకుండా ఏ సింహాసనం ఉంటే ఏం లాభం అనుకుని థరూర్ తన ప్రేయసి కోసం మంత్రి పదవిని లెక్క పెట్టలేదు. మంత్రి పదవి ఊడబెరికితే ఆయన ప్రేమించడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటాను అని ఒక అడుగు ముందుకేసి చేసుకొని చూపించారు. ముందే చెప్పుకున్నాం కదా దురద పెట్టినప్పుడు గోక్కుంటే ఎదుటి వాడు చూస్తున్నాడా? పరువు పోతుందా? లాభమా నష్టమా? అనే లెక్కలు గుర్తుకు రావు. గోళ్లు తమ విధినిర్వహణలో మునిగిపోతాయి. ప్రేమా అంతే మంత్రి పదవి పోతుందా?మళ్లీ వస్తుందా? రాకపోతే ఎలా అనే భవిష్యత్తు ప్రణాళికలు ఉండవు.

 ప్రే మించగానే ఎక్కడ లేని శక్తి వస్తుంది. అయతే హనీమూన్ ముచ్చట తీరిన తరువాత థరూర్‌కు మళ్లీ మంత్రి పదవి లభించింది. ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు ఆయన రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. పోయిపోయి మోడీతో పెట్టుకున్నారు. ఈయన 50 కోట్ల ప్రేయసి గురించి మోడీ చేబితే, నా ప్రేయసి ఖరీదు 50 కోట్లకన్నా ఎక్కువే అని శశిథరూర్ ప్రకటించేశారు. ఐనా ప్రేమిస్తే ప్రేయసి విలువ తెలుస్తుంది కానీ మోడీకేం తెలుసు? అని మోడీ బలహీనతపై దెబ్బకొట్టారు. చిన్నప్పటి నుం చి ఆర్‌ఎస్‌ఎస్‌లో వయసులోకి వచ్చాక బిజెపిలో, మధ్య వయసులో ముఖ్యమంత్రి పదవిలో బిజీబిజీగా ఉన్న మోడీకి ఇక ప్రేమించడానికి సమయమెక్కడిది? డ్యూయె ట్లు పాడే ఓపికెక్కడిది.

 రాజరికపు జిత్తులతో రణ రంగపు టెత్తులతో సతమతవౌతున్న మా మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం అని దుర్యోధనుడిగా అన్నగారు ఆశ్చర్యపోవడం మనం చూడలేదా? అయ్యో ఇది కేవ లం అన్నగారి నటన మాత్రమే అని తేలిగ్గా తీ సుకోకండి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ము దిమి వయసులో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా లక్ష్మీపార్వతితో ప్రేమలో పడలేదా? బహిరంగ సభల్లోనే ఆకుచాటు పిందె తడిసే స్టెప్పులు వేయలేదా? నటన ప్రభావం ఆయనపై ఉందో, ఆయన ప్రభావం నటనపై ఉందో కానీ చివరకు ప్రేమ కావాలా? కుర్చీ కావాలా? తేల్చుకో అని అల్లుడు వార్నింగ్ ఇస్తే ప్రేమ కోసం కుర్చీని కూడా వదులుకున్నారు కదా? అన్నగారు లక్ష్మీపార్వతి కోసం ఒకే ఒక్కడుగా ఉండే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటే, శశిథరూర్ ఆరు డజన్ల కేంద్ర మంత్రుల్లో ఒకరిగా ఉండే కేంద్ర మంత్రి పదవి వదులుకోవడంలో వింతేముంది. మీ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాల్లో మునిగిపోయిందని తిట్టినా, ఏమన్నా సహిస్తాం కానీ మా నాయకుల ప్రేమను చిన్న చూపు చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు. నీకసలు ప్రేమం టే తెలియదు అని థరూర్ అంటే ఆయన వద్దకు వెళ్లి ప్రేమ పాఠాలు నేర్చుకోవాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. ఇటీవల కాం గ్రెస్ నేతగా కన్నా పూరాతత్వ పరిశోధకునిగానే దిగ్విజయ్‌సింగ్ ఎక్కువగా గుర్తిం పు పొందారు. ముంబైలో బీహారీలపై బాల్‌థాకరే మండిపడితే, అసలు జీన్స్‌ను చూశాను థాకరేలు వచ్చింది బీహార్ నుంచే అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక, ఇక రాదని తేలాక ఆయన పరిశోధనల్లో మునిగిపోయారు. ఆయన చరిత్రను తవ్వితీసి మోడీకో ప్రేయసి ఉందని అమె పేరు యశోధ అని చెప్పారు. దీనికి గూగులే సాక్షమన్నారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని గ తంలో మనం గర్వంగా చెప్పుకున్నట్టు అన్నీ గూగుల్‌లోనే కనిపిస్తున్నాయి. మోడీ భార్య పేరు అని గూగుల్ సెర్చ్‌లో చూడగానే యశోధ అని పేరు కనిపించింది. తరువాత చాలా మంది పనిలో పనిగా రాహుల్‌గాంధీ భార్య పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏకంగా కొలంబియాకు చెందిన జునిట అనే ముద్దు గుమ్మ పేరే కాదు అందమైన ఫోటో కనిపిస్తోంది. మరి ఆ ప్రేమ సంగతి ఏమిటి? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే, రాజకుటుంబ రహస్యాలు బయటకు చెబుతామా? మాట్లాడతామా? అని ప్రభు భక్తిని ప్రదర్శిస్తున్నారు. అయినా మన నాయకులకు ప్రేమ గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఉందా? 

అస లు ప్రేమించని నాయకుడెవరు? అందరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఏ నాయకుడి మనసులోకైనా తొంగి చూడగలిగితే వారు ప్రేమించే ప్రేయసి కనిపిస్తుంది? నాయకుడెవరైనా కావచ్చు కానీ వారు ప్రేమిం చే ప్రేయసి మాత్రం ఒకరే? ఎవరు? అనే అనుమానమా?
ఇంకెవరు కుర్చీనే ఆ ప్రేయసి.
రాజకీయ నాయకులు కుర్చీనే మనసా వాచా కర్మన ప్రేమిస్తారు. ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తారు, ప్రాణాలు తీస్తారు.