13, ఆగస్టు 2014, బుధవారం

కవి..మానవ హక్కులు!

అచ్చం సినిమాలో కోర్టు హాలును చూపించినట్టుగానే ఉంది అక్కడ వాతావరణం. తనతో మాట్లాడుతున్న వ్యక్తిని పరిచయం చేసుకుంటూ ‘‘నేను కవిని మరి మీరు’’ అని కవి అడిగాడు. అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పిన ఆ వ్యక్తి భయపడుతూ ‘‘నేను చెవిటివాడిని’’ అని చెప్పి ముఖం పక్కకు తిప్పాడు. న్యాయమూర్తి వస్తుండడంతో బిళ్ల బంట్రోతు తన వంతు డైలాగు చెప్పడంతో అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. మానవ హక్కుల కమిషన్‌లో కీలక కేసుల విచారణ ఉండడంతో చాలా మందే వచ్చారు.
‘‘నువ్వు కవివా?’’ అంటూ అంత దూరం నుంచే కవిని చూసి న్యాయమూర్తి ప్రశ్నించాడు. ‘‘నా కవితా కిరణాలు మీ వరకూ ప్రసరించాయా?’’ అంటూ కవి మురిసిపోయాడు.


‘‘అదేం కాదు. లాల్చీ , పైజామా? భుజంపై వేలాడుతున్న కాటన్ బ్యాగు, నెరిసిన గడ్డం, నిరాశ నిండిన చూపులు ఇవన్నీ చూడగానే నువ్వు కవివని తెలిసిపోతుందిలే ’’అని న్యాయమూర్తి చెప్పాడు. ప్రమాదకరమైన వాటిని ఎక్కువ సేపు అలా ఉంచడం మంచిది కాదనుకుని కవి కేసునే విచారణకు మొదటి కేసుగా తీసుకున్నాడు.
‘‘ఈ సమాజం నాపట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది ’’ అని కవి దీనంగా పలికాడు


‘‘మాకు వచ్చేవే మానవ హక్కుల ఉల్లంఘన కేసులు... అది కాదు కానీ నీ కేసేమిటో చెప్పు’’ అని న్యాయమూర్తి అడిగాడు.
‘‘ నేనొక కవిని. సమాజాన్ని మనో నేత్రంతో చూస్తా, కవిత్వంతో అగ్నివర్షం కురిపిస్తా.. కంటి చూపుతో సమాజాన్ని మార్చేస్తా ... కవిత్వంతో సమాజాన్ని కడిగి పారేయాలనకుంటున్నాను. కానీ ఈ సమాజం నా కవిత్వాన్ని పట్టించుకోకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది. ఎక్కడికి వెళ్లినా మానవ బాంబును చూసి పారిపోయినట్టు పారిపోతున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కదా? అందుకే మీ వద్దకు వచ్చాను’’ అంటూ కవి బ్యాగులో చేయి పెట్టగానే న్యాయమూర్తిలో ముఖంలో రంగులు మారాయి.


‘‘స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగిని. ఈసారి బోనస్ బాగానే వచ్చింది.. బోనస్ డబ్బులతో వేయించిన తాజా కవితా సంకలనం ‘ప్రభుత్వాన్ని పడగొడతాను’లో ఒక అద్భుతమైన కవిత చదువుతాను వినండి యువర్ ఆనర్.. ’’అంటూ కవి చేతిలోకి కవిత సంకలం తీసుకోగానే న్యాయమూర్తి అలర్ట్ అయి ‘‘కేసును వచ్చే జడ్జికి వాయిదా వేస్తున్నాను’’ అని ప్రకటించారు.
జడ్జిగారి మాటలను రికార్డు చేసే ఉద్యోగి ఆయోమయంగా చూస్తూ, ఎవరికీ వినిపించుకుండా మెల్లగా ‘‘సార్ కేసు వచ్చే నెలకు వాయిదా వేశారా?’’ ఆని అడిగాడు. ‘‘కాదులేవోయ్ సరిగ్గానే చెప్పాను. కేసును వచ్చే జడ్జికి వాయిదా వేశాను, కవిత్వం కవికి ప్రాణం కావచ్చు, నా ప్రాణం నాకు అంత కన్నా తీపి’’ అని బదులిచ్చాడు.
న్యాయమూర్తి ‘‘హమ్మయ్య’’ అని ఊపిరి పీల్చుకుని తరువాత కేసు విచారణ చేపట్టారు.


సార్ ఈ ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తూ మమ్ములను ఏడిపిస్తోంది అంటూ ఇద్దరు కోరస్‌గా పలికారు.
తమిళ డబ్బింగ్ సినిమాల్లో డైలాగులు, సీన్‌కు సంబంధం లేకుండా మాట్లాడకండి ముందు విషయం ఏమిటో చెప్పండి అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
‘‘న్యాయమూర్తి గారు మా బాధ ఆ పగవాడికి కూడా వద్దు. ఇందిరమ్మ ఇళ్లకైనా కనీసం నాలుగు పిల్లర్‌లైనా ఉండాలి కదా’’ అంటూ మొదలు పెట్టారు.


కేసు వినేందుకు వచ్చిన వారిలో ఒకరు ఒక్కపిల్లర్ కూడా అవసరం లేకుండా వేలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టి కోట్లాది రూపాయలు స్వాహా చేశారు సార్ అంటూ మెల్లగా చెప్పాడు. సైలెన్స్ సైలెన్స్ అని బిళ్ల బంట్రోతు అరవడంతో అంతా నిశ్శబ్దంగా వినసాగారు. పిల్లర్లు లేని ఇండ్లు కట్టోచ్చునేమో కానీ ప్రజాస్వామ్యానికి మాత్రం నాలుగు పిల్లర్లు కచ్చితంగా కావాల్సిందే... మేం నాలుగో పిల్లర్లం ’’ అంటూ చెబుతుంటే..
‘‘బాబూ డైయిలీ సీరియల్‌లా సాగతీత వద్దు విషయంలోకి రండి’’ అంటూ న్యాయమూర్తి కోరారు.
‘‘ఈ ప్రభుత్వం మమ్ములను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేసేందుకు మేనక వేసినన్ని వేషాలు వేశాం అయినా చలనం లేదు,’’ అంటూ చెబుతుంటే..
‘‘అవును ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం అవసరమే. మీ బాధ్యత మీరు ప్రభుత్వం తన బాధ్యత తాను నిర్వహించాలి. భవనంలోని రెండు పిల్లర్లు తమలో తాము కీచులాడుకుంటే భవనమే కూలిపోతుంది,’’ అని న్యాయమూర్తి చెప్పి , ఇంతకూ నీ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరిగిందో చెప్పనే లేదు’’ అని గుర్తు చేశారు.
‘‘ ఇది మొండి ప్రభుత్వం బండ ప్రభుత్వం.. మేం ఏం ప్రచారం చేసినా లేదు... మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి తెలుగు మీడియాను పట్టించుకోనందుకు అమెరికా అధ్యక్షుడికి కోపం వచ్చిందని, ఐక్యరాజ్యసమితిలో దీనిపై తీవ్రంగా చర్చించాలని నిర్ణయించుకున్నారని రాస్తే ఏమీ అనలేదు’’ అని కన్నీళ్లు తుడుచుకున్నాడు.
‘‘ఐతే’’అని న్యాయమూర్తి ప్రశ్నించాడు.


‘‘అస్సలు పట్టించుకోక పోవడాన్ని మించిన మానవ హక్కుల ఉల్లంఘన ఏముంటుంది సార్... అంతేనా ముఖ్యమంత్రి తరుచుగా తుమ్ముతున్నాడు కాబట్టి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించనున్నారని ప్రచారం చేశాం అయినా స్పందన లేదు ’’ అని వాపోయారు.
‘‘కేసు విచిత్రంగా ఉంది... అయినా మానవతా దృక్ఫథంతో ఈ ప్రచారంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.. మీరేమంటారు అని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని అడిగితే,
నాదో సలహా అని మీడియేటర్ లేచి నిలబడ్డాడు. వీళ్లు ఏదో ఒక ప్రచారం ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజే ప్రభుత్వం దీనిపై స్పందించి ఖండించిందని వారంతట వారే రాసుకోవచ్చు. ఇదీ నా పరిష్కార మార్గం అని చెప్పాడు. సలహా ఉభయ తారకంగా ఉండడంతో అంతా అంగీకరించారు.
****
మెట్రో రైలు ప్రాజెక్టు నిలిచిపోయింది అనే ప్రచారం చదువుతూ మెట్రో ట్రయల్ రన్‌ను టీవిలో చూస్తూ పరాంకుశం నిద్రలోకి జారుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం