17, ఆగస్టు 2014, ఆదివారం

ఔను వాళ్లు ప్రధాన సేవకులు

‘‘ఏం వినయం... ఏం విధేయత... రెండు మూడు దశాబ్దాల క్రితం వచ్చి ఉంటే మన దేశం స్వర్ణ్భారత్ అయిపోయేదండి ’’ అంటూ శ్రీమతి కళ్లు తుడుచుకుంది. శ్రీవారిని చూస్తూ ‘‘ఆనంద భాష్పాలు.. మన పిల్లలు బుడి బుడి అడుగులు వేసేప్పుడు సంతోషంతో డ్యాన్స్ చేయాలనిపించింది. చిన్నోడు మాటలు నేర్చుకునేప్పుడు ముద్దు ముద్దు గా పలికే పలుకులు ఆనంద సాగరంలో ముంచెత్తాయి. మళ్లీ ఇంత కాలానికి నాకు అంత సంతోషం కలుగుతోంది ’’ అంటూ శ్రీమతి భావోద్వేగంతో చెప్పుకుపోతోంది.


‘‘పిచ్చి శ్రీమతి ఇంతోటి దానికి అంతగా సంతోష పడాలా? నువ్వు సహకరిస్తే, ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేస్తాను. కాలనీ వాళ్లు మనను చూసి కుళ్లుకుని చావాలి. నిజం చెప్పొద్దు డార్లింగ్ ప్రెష్‌కు వెళ్లి కిలో టొమాటో ఇవ్వమని అనగానే అంతా నావైపు ఆశ్చర్యంగా, సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటే గర్వంతో చాతి పొంగి పోయింది. పాన్ కార్డు చూపించేంత వర కు వాడు కిలో టమాట ఇవ్వలేదనుకో. కానీ మన అదృష్టాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా కుళ్లుకున్నారంటే నమ్ము. ఎంతైనా మన స్టేటస్‌కు కిలో టమాట పెద్ద కష్టమేమీ కాదు కదా? కొడుకు, కోడలు, కూతురు అల్లుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నాది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ నీది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కిలో టమాట కొనడం మాకో లెక్క కాదని కాలరెగరేసి గర్వంగా చెప్పాననుకో’’ అంటూ శ్రీవారు చెప్పుకుపోతున్నారు.
శ్రీమతి అడ్డుతగిలి ‘‘మీకు తెలుసు కదా చిన్నప్పుడు నేను కమ్యూనిజాన్ని బాగా ఇష్టపడ్డాను. ఏనాటికైనా సమాజంలో అందరూ టొమాటో కొనే స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటాను. నా సంతోషానికి కారణం అది కాదు. అని శ్రీమతి బయట ఉన్న కారువైపు చూడడంతో ‘‘ ‘‘లీటరు పెట్రోల్ ధర రూపాయిన్నర తగ్గించినందుకే అంత సంతోషమా? మరో వారంలో రెండు రూపాయలు పెంచి చూపిస్తారు.’’ అని శ్రీవారు చెప్పారు. టీవి రిపోర్టర్‌లా నీకు తోచింది మాట్లాడేయడమేనా? నేను చెప్పేది వింటావా? ’’అని శ్రీమతి లైవ్ ప్రోగ్రామ్‌లో యాంకర్‌లా అడ్డుతగిలింది.


‘‘ఇంతకూ నీకు అంత సంతోషం కలిగించిన విషయం ఏమిటో చెబితే నేనూ సంతోషపడతాను’’ అని శ్రీవారు అడిగారు.
‘‘చూడండి మన దేశ ప్రధాని ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. ప్రధాన సేవకున్ని అంటున్నాడు. మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని ఇలాంటి వారిని చూసే అన్నారనిపిస్తోంది. సంకలోని పిల్లాడు గద్దెనెక్కినా మన గురించే ఆలోచిస్తున్నాడని ఆనంద భాష్పాలు రాల్చాలనిపిస్తుంది.
నేను ప్రధాన మంత్రిని కాదు ప్రధాన సేవకుణ్ణి వాహ్ క్యా డైలాగ్..హై ... క్యా బాత్ హై అని భాష నేర్చుకుని మరీ హిందీలో అభినందించాలనిపిస్తోంది. .... ’’ అని శ్రీమతి సంతోషంగా అంది.


‘‘నీ సంతోషానికి ఇదా కారణం? ’’ ఐతే నువ్వు మన తెలుగు ముఖ్యమంత్రుల ఉపన్యాసం వినలేదన్నమాట’’ అని శ్రీవారు అడిగారు.
ఆ మధ్య డాక్టర్ ఆరోగ్యం కుదుట పడేంత వరకు తెలుగు టీవిలకు దూరంగా ఉండమన్నారు అందుకే చూళ్లేదు ఏంటీ విషయం అని శ్రీమతి అడిగింది.
‘‘అదీ సంగతి నువ్వు తెలుగు టీవిలు చూడలేదు కాబట్టి అలా అంటున్నావు. ఒకవేళ చూసి ఉంటే మన తెలుగు ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో చెబుతున్న మాటలను ఇప్పుడు మోదీ కాపీ కొట్టారని గ్రహించే దానివి’’ అని శ్రీవారు అన్నారు.
‘‘ఎలా?’’
‘‘ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయగానే ఏమన్నారు? రాజకీయాలను పక్కన పెడదాం ఇప్పుడు మనందరి లక్ష్యం తెలంగాణ సాధన కావాలి అని అన్నారా? లేదా? అందరూ రాజకీయాలు పక్కన పెట్టినా పెట్టక పోయినా కేసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలను పక్కన పెట్టి టిఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారు. మరి కేసిఆర్ ఇప్పుడేమంటున్నారు. రాజకీయాలు పక్కన పెడదాం బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పని చేద్దాం అంటున్నారా? లేదా? ’’
‘‘ ఔను అంటున్నారు .. ఇందులో తప్పేముంది’’ అని శ్రీమతి అడిగింది.
‘‘ఆగాగు మన బాబు గారు 95లో అన్నను దించి అధికారం చేపట్టినప్పుడు ఏమన్నారు. రాష్ట్రం క్లిష్టపరిస్థితిలో ఉంది మీరంతా స్వర్ణాంధ్ర సాధనకు రాజకీయాలు పక్కన పెట్టాలని అన్నారా? లేదా?’’ అని శ్రీవారు అడిగారు.
‘‘అదేం తప్పు మాట కాదు కదా? 1999లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు మళ్లీ 2014లో కూడా ఇదే మాట అంటున్నారు. ఆయన మాట మీద నిలబడతారు’’ అని శ్రీమతి అంది.
‘‘అది సరే మరి ఆ మధ్యలో ఉన్న పదేళ్ల సంగతి చెప్పవేం... ఆ పదేళ్లలో ఆయన రాజకీయాలు చేయకుండా కనీసం ఒక్క రోజైనా ఉన్నారా’’ అని శ్రీవారు అడిగారు. ఊపిరి తీసుకోకుండా ఉండాలని మనిషిని కోరుకోవడం ఎంత అన్యాయమో, రాజకీయం చేయకుండా ఉండాలని నాయకులను కోరడం అంతే ’’ అని శ్రీవారు చెప్పారు.
‘‘ఐతే’’ అని శ్రీమతి అడిగింది.


‘‘తెలుగు నేతలిద్దరూ ఎప్పుడో చెప్పిన మాటలే మోదీ ఇప్పుడు చెబుతున్నవి. మనకు భాష తెలియదు కానీ తమిళంలో అమ్మ, బీహారీలో నితీష్ అస్సామిలో మహంత, గగోయ్‌లు, కన్నడంలో రామయ్యలు ఇవే మాటలు చెబుతారు. కుర్రాడైనా యూపిలో అఖిల్ బాబు హిందీలో చెప్పింది ఇదే మాట.. నేను సిఇఓను అని ఓడిపోవడానికి ముందు బాబు చెప్పిన మాటను మోదీ ప్రధాన సేవకుణ్ణి అంటున్నారు. ’’ అని శ్రీవారు చెప్పారు.
‘‘అది కాదండీ ఎందుకో మోదీ అందరి లాంటి వారు కాదనిపిస్తోంది. ‘దేశ హితం కోసం నేడొక శుభకార్యం చేసి త్రివర్ణ పతాక గౌరవం పెంచుదామని ’స్వయంగా నరేంద్ర మోదీ నా సెల్‌ఫోన్‌కు ఒక సందేశం పంపించారు. అని శ్రీమతి సందేశం చూపించింది. ‘‘మోదీ నీ సెల్‌ఫోన్‌కు సమాచారం పంపగలరు. టొమాటో ధర తగ్గించమని కోరుతూ ఆయనకో ఎస్‌ఎంఎస్ పంపించు చూద్దాం ’’ అని శ్రీవారు కొంటెగా నవ్వారు.
నీతి: అధికారంలోకి వచ్చిన వారి తొలి బాధ్యత నీతులు చెప్పడం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం