24, ఆగస్టు 2014, ఆదివారం

తోచీ తోచనమ్మ వైరస్ ఐస్‌బకెట్!

తోచీ తోచనమ్మకు భర్త మీద కోపం వచ్చింది. కోపమెందుకో ఆమెకు గుర్తు లేదు. కానీ కోపం మాత్రం ఉంది. తాను అలిగానని తోటి కోడలు పుట్టింటికి వెళతానని అల్టిమేటం ఇచ్చింది. పుట్టింటికి వెళదామంటే అంతకు ముందు రోజే పుట్టింటి మీద అలిగి మెట్టినింటికి వచ్చిందాయె ఇప్పుడేం చేస్తుందే ఏదో ఒక చోట అలగాలి తప్పదు. అందుకే అలిగి తోటి కోడలు పుట్టింటికి వెళతానంది. తోచీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళితే అక్కడేమైంది అంటే ?


భర్త మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్లాలి, పుట్టింటి వాళ్లపై కోపం వస్తే మెట్టినింటిలోనే ఉండి భర్తను సాధించాలి. అంతే తప్ప తోచీ తోచకుండా తోటి కోడలి పుట్టింటికి వెళితే అక్కడ ఆమెను పట్టించుకునేదెవరు? తోచీ తోచకుండా చేసే పనులకు పెద్దగా అర్ధాలు ఉండవు. తోయకపోవడం ఒక్కటే కారణం. ఈ తోచీతోచనమ్మలు వెనకటికి తెలుగునాట మాత్రమే కాదు ఈనాటికీ పాశ్చాత్యుల్లో సైతం ఉన్నారు. అమెరికాలో ఇలా తోచీ తోచని వాళ్లు సముద్రం ఒడ్డున గాడిదలపై ఎక్కి పరుగు పందేల్లో పాల్గొనే వారని ఓషో రజనీష్ వాళ్ల గురించి చెప్పుకొచ్చారు. కొంత కాలానికి అదే విసుగేసి మళ్లీ ఏమీ తోచక పోవడంతో ఈసారి ఆ గాడిదలను తాము మోస్తూ పరుగు పందాలు నిర్వహించారు. అది చూసిన వారికి వారిలో ఎవరు గాడిదో? ఎవరు మనిషో? అర్థం కాక అయోమయంలో పడే ఉంటారు.
కృష్ణశాస్ర్తీ బాధ ప్రపంచ బాధ అన్నట్టు కొందరికీ ఏదీ తోచక పోతే అది వారొక్కరి బాధే కాదు ప్రపంచ బాధ అవుతుంది. అందులోనే వాళ్లేమీ అల్లాటప్పా తోచీ తోచనమ్మలు కాదు. సెలబ్రిటీలు వాళ్ల సమస్య మొత్తం ప్రపంచ సమస్య అయిపోయింది. ఈ సెలబ్రిటీల తోచి తోచని అంటు రోగం ప్రపంచ వ్యాప్తం అయింది. ఇది సెలబ్రిటీల వైరస్‌గా మారిపోయింది. తలపై ఐస్ వాటర్ గుమ్మరించుకొని వీడియో తీసి దాన్ని నెట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఐస్ బకెట్‌ను తల మీద గుమ్మరించుకోవడమేనట బిల్‌గేట్స్ మొదలుకొని బాలివుడ్ తారల వరకు ఇప్పుడు ఐస్ బకెట్ చాలెంజ్ వైరస్ అందరినీ ముంచెత్తేస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని గజగజవణికిస్తే, ఐస్ బకెట్ చాలెంజ్‌ను స్వీకరించిన తారలు తలపై చల్లని ఐస్ నీటిని కుమ్మరించుకుని చలితో వణికిపోతున్నారు. అమెరికాలో ఒకావిడ పాపులర్ టీవి షోలో పుట్టిన ఈ వైరస్ అతి వేగంగా భారత్‌కు వ్యాపించింది. గతంలో రష్యాలో వర్షం పడితే మన దేశంలో కొందరికి తుమ్ములోచ్చేవి. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికా టీవి షోలో వైరస్ పుడితే బాలీవుడ్‌ను ముంచెత్తుతుంది. 


బకెట్‌లోని ఐస్‌ను తలపై గుమ్మరించుకోవాలి ఇదో చాలెంజ్. ఈ చాలెంజ్‌ను స్వీకరించినా? స్వీకరించకపోయినా? గెలిచినా ఓడినా ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు చెల్లించాలి. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు పోటీగా గల్లీ క్రికెట్ పుట్టినట్టు ఐస్ బకెట్‌కు పోటీగా రైస్ బకెట్ చాలెంజ్ పుట్టింది. అమెరికాలోని తోచీ తోచని వాళ్ల వ్యవహారాలు చూసి విసుగెత్తిన ఒక సామాజిక కార్యకర్త రైస్ బకెట్ చాలెంజ్‌కు రూపకల్పన చేసింది. బకెట్ బియ్యం ఇస్తే ఒక కుటుంబానికి నెల రోజుల భోజనం దొరుకుందని ఈ చాలెంజ్ ప్రారంభించింది. బకెట్ బియ్యం ఇవ్వలేకపోతే వంద రూపాయలు ఇవ్వాలి. అయితే సెలబ్రిటీల ఐస్ బకెట్‌లో ఉన్నంత వెర్రి ఒక కుటుంబానికి బకెట్ బియ్యంలో ఉండదు కాబట్టి ఈ చాలెంజ్ ప్రచారం సామాజిక మాధ్యమాలకే పరిమితం అయింది. ఐస్ బకెట్ చాలెంజ్‌లా కార్పొరేట్ మిడియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సంపన్నులు, సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా, వాళ్లూ తోచీ తోచని తనంతో ఇబ్బంది పడుతుంటారని, ఇలాంటి వైరస్‌లను చూస్తే తెలుస్తుంది. వంటింటి పార్వతి వంటి పని ముగిశాక తీరిక దొరికితే పక్కింటి లక్ష్మితో వరండాలో నిలుచోని తోచనప్పుడు కబుర్లు చెప్పుకుంటారు. సెలబ్రిటీలు చీమలు దూరని భవంతుల్లో నివసిస్తారు, మొగుడి గారికో గది భార్యగారికో గది విడివిడిగా ఉంటుంది. మగడనే వాడు ఇంటికి వచ్చాడా? లేదా అనేదే తెలియదు. అలాంటప్పుడు తోచనప్పుడు పక్కింటి వారితో కబుర్లు చెప్పుకునేంతటి అదృష్టం వారికెక్కడిది. ఏమీ తోయకపోవడం అనేది అందరిలోనూ కనిపిస్తుంది. అయితే ఎవరికి వారు తమ తమ స్థాయిలో ఆ పనులు చేస్తుంటారు. 

అధికారం అనుభవించి, ప్రతిపక్షంలోకి వచ్చిన వారికి ఏమీ తోచక పోవడం నరక ప్రాయం లాంటిది. ఒకవైపు అధికారం పోయిందనే బాధ, మరోవైపు ప్రత్యర్థి చేతిలో అధికారం ఉందనే బాధ. ఈ ఆలోచనలతో వారి కసలు నిద్రనే పట్టదు. తమకు నిద్ర లేనప్పుడు తమను ఓడించిన ప్రజలకు నిద్ర ఎందుకుండాలని సమస్యలు లేకపోతే సృష్టించి మరీ ఉద్యమిస్తారు. మేం అధికారం లోకి వస్తే భూలోక స్వర్గం చూపిస్తాం అంటారు. ఒకవేళ అధికారంలోకి వస్తే తోచీ తోచనప్పుడు ఇచ్చిన హామీలే అసలు సమస్యలుగా మారుతాయి. రైతులారా! మీరు రుణాలు చెల్లించకండి.. నేను రాగానే రద్దు చేస్తానో అంటూ ఏదో తోచీ తోచనప్పుడు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చాక తలకు చుట్టుకుంది. రాత్ గయి బాత్ గయి అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక అడగడం అన్యాయం అనిపిస్తుంది కానీ పాపం ఆ మాట పైకి చెప్పలేరు. చెన్నారెడ్డిని బయట ఉంచితే ప్రమాదం అని ఇందిరాగాంధీకి చాలా మంది తెలుగు నాయకులు చెప్పేవారట! పదవి ఊడబెరికి ఏమీ తోచని పరిస్థితి కల్పిస్తే ఆయన అధినాయకురాలిపైనే తిరుగుబాటు చేస్తారని, అందుకే ఆయన్నినిరంతరం బిజీగా ఉంచాలని సలహా ఇచ్చేవాళ్లట! సెలబ్రిటీలకు ఏమీ తోచక పోతే ఐస్ బకెట్ చాలెంజ్ లాంటి సిల్లీ గేమ్స్ పుడతాయేమో కానీ రాజకీయ నాయకులకు ఏమీ తోచక పోతే ప్రజలకు ప్రమాదం. రాజకీయ నాయకులకు అధికారం ఉండి పని లేకపోయినా, అధికారం లేక పని లేకపోయినా రెండూ ప్రజల పాలిట ప్రమాదమే. సాధారణ వ్యక్తులు ఏ పనీ లేకపోతే ఏదో ఒక వ్యసనానికి బానిసగా మారి తమను తాము నష్టపరుచుకుంటే నాయకులు మాత్రం ఏమీ తోచక పోతే అల్లకల్లోలం సృష్టిస్తారు.
నాయకులకు ఏమీ తోచక పోతే మరో నాయకుడి పై బురద జల్లుతారు . సెలబ్రిటీ లకు తోచక పోతే ఐస్ బకెట్ ను తమ పైనే కుమ్మరించుకుంటారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం