17, ఆగస్టు 2014, ఆదివారం

రాజ మహల్ నుంచి అద్దె గది లోకి సినిమా రాణి జీవిత పయనం.. ఆమెపెరుతో మద్రాస్ లో ఓ వీధి ఉంది ... కానీ ఆమెకే ఓ ఇల్లు లేదు

సినిమా శుభంతో ముగుస్తుంది. కానీ ఆ సినిమా వారి జీవితం శుభంతోనే ముగియాలనేమీ లేదు. ప్రయోగంలో చిన్న పొరపాటు జరిగినా జీవితం తలక్రిందులు అవుతుంది. ఇది సినిమా రంగానికి సైతం వర్తిస్తుంది. మద్రాసు మహానగరంలో డజన్లు భవనాలతో రాజవైభోగాన్ని అనుభవిస్తున్న ఆ హీరోయిన్ జీవితంమే ఓ ప్రయోగం.
ఆమె అందానికి ముగ్దులై ఆమెకు సినిమా రాణి అనే అవార్డును బహూకరించారు. ఆమె అందాన్ని చూసేందుకు ఆమె నటించిన సినిమాలకు వెళ్లేవారు. అలాంటి సమయంలో నటిగా తన ప్రతిభను చాటే విధంగా ఇదియా గీతం అనే ఓ తమిళ సినిమాలో ఆమె వృద్ధురాలిగా నటించారు. ఆమె సాహసాన్ని హర్షించలేదు. అందాల రాణికి వయసు అయిపోయింది అనుకున్నారు అభిమానులు. ఆ సినిమా ఆమెకున్నదంతా ఊడ్చుకు పోయేట్టు చేసింది. ఆ సినిమా దెబ్బతో ఆమె కోలుకోలేకపోయారు.
***
కలైమామణి తమిళనాడులో కళారంగంలో కృషి చేసిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే అత్యున్నతమైన అవార్డు. కలైమామణి అవార్డు బహూకరణ కోసం సమయం ఆసన్నమవుతోంది. తమిళప్రజలకు ప్రత్యక్ష దైవం లాంటి ఎంజి రామచంద్రన్ లాంటి వారు సైతం వేచి చూస్తున్నారు. అవార్డు గ్రహీతలే ఇంకా రాలేదు. అందరిలో ఉత్కంఠత... సభలకు ఎంత ఆలస్యంగా వస్తే అంత గుర్తింపు అనేది కొందరి భావన. కానీ ఆ అవార్డు గ్ర హీత ఆలస్యానికి కారణం అది కాదు. సినిమా రంగంలో ఎంతో కీర్తిగడించిన, ఒకప్పుడు రాజభోగాన్ని అనుభవించిన ఆమెకు ఆ సమయంలో సభాస్థలికి వెళ్లడానికి ఓ వాహనం కూడా లేదు. ఏం చేయాలో తెలియక తమలో తామే మదనపడిపోతూ ఇంటి వద్దనే ఉండిపోయారు. విషయం తెలిసిన ఎంజి రామచంద్రన్ స్వయంగా తన వాహనాన్ని ఇచ్చి తన పిఎను పంపించి కలైమామణిని రప్పించారు.
***
ఆమె మరెవరో కాదు దక్షిణ భారత దేశంలో తొలి మహిళా దర్శకురాలు, నిర్మాత ఒకప్పటి అందాల తార. టిపి రాజలక్ష్మి. ఆమె హీరోయిన్, దర్శకురాలు, సినిమాకు కథ , మాటలు రాశారు. మంచి గాయని. ఆమె జీవితం సినిమా కథను తలపిస్తుంది. టిపి రాజలక్ష్మికి తెలుగు సినిమా రంగంతో కూడా అనుబంధం ఉంది. తెలుగునాట తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. అయితే అంతకు ముందే తెలుగు తమిళంలో వచ్చిన కాళిదాసు సినిమాలో టిపి రాజలక్ష్మి హీరోయిన్. ఇది తొలి తెలుగు, తమిళ టాకీ సినిమా అనేది ఓ వాదన. ఈ సినిమాలో హీరో టి వెంకటేశ్ తెలుగువారే. అతను తెలుగులో మాట్లాడితే రాజలక్ష్మి తమిళంలో సమాధానం చెబుతుంది. ఎల్‌వి ప్రసాద్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. గులేబకావళి కథను తమిళం, తెలుగు, హిందీలో తీశారు. తమిళ సినిమాలో హీరోయిన్ రాజలక్ష్మి.
భానుమతి దర్శకత్వంలో 1953లో తెలుగు, తమిళ భాషలో చండీరాణి సినిమా వచ్చింది. భానుమతి కన్నా 17 ఏళ్ల ముందు 1936లోనే దక్షిణాదిలోనే తొలి మహిళా దర్శకురాలిగా రాజ్యలక్ష్మి రికార్డు సృష్టించారు. తాను స్వయంగా రాసిన నవలతో మిస్ కమల అనే సినిమా 1936లో తీశారు.
***
బాల్యం నుంచి ఆమె జీవితం సినిమాలానే ఊహించని మలుపులతో సాగింది. నవంబర్ 11, 1911లో రాజ్యలక్ష్మి మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో జన్మించారు. తండ్రి మరణించడంతో వారి కుటుంబం జీవనోపాధి కోసం తిరుచ్చికి తరలి వెళ్లింది. వివాహం అంటే ఏమిటో తెలియని చిన్న వయసులోనే బాల్యవివాహం జరిగింది. మంచి గాత్రం ఉండడంతో నాటకాల్లో పాడేందుకు అంగీకరిస్తే, భర్త, అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ఆమె వివాహ జీవితానే్న వదులుకుంది. డ్రామాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన ఆమెను స్వాతంత్య్ర పోరాటం బాగా ఆకర్షించింది. వివాహ జీవితం పట్ల ఆసక్తి చూపించలేదు. 12ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే నాటకాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించింది. నాటకాల నుంచి సినిమాలవైపు వెళ్లింది. 1930 నాటికి ఆమె స్టార్‌గా మారింది. 20 ఏళ్ల వయసులో ఆమె అందానికి సినిమా రాణి అనే అవార్డు లభించింది. తన సహ నటుడు టివి సుందరాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ కాలంలోనే ఆమె బాల్య వివాహాలను, ఆడవారి పట్ల, పిల్లల పట్ల చూపుతున్న వివక్షతను వ్యతిరేకించారు.
శ్రీ రాజ్యం టాకీస్ పేరుతో ఆమె సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. రాజలక్ష్మి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని మద్రాసులో ఆమె నివసించే వీధికి రాజరత్నం స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఆ వీధిలో ఆమెకు 12 పెద్ద భవనాలు ఉండేవి. రాజరత్నం స్ట్రీట్ నంబర్ వన్‌లో భారీ భవనం రాజమహల్‌లో ఆమె నివసించే వారు.
దేశభక్తిని ప్రబోధించే కథతో ఇదియ తాయి సినిమా నిర్మించారు. ఆ సినిమాలో ఆమె వృద్ధురాలిగా నటించారు. రాజలక్ష్మి వయసు మీరిందని, , ఆమెకు పూర్వం నాటి అందం లేదనే నిర్ణయానికి అభిమానులు వచ్చారు. ఆ సినిమా తరువాత రాజలక్ష్మికి చాలా తక్కువగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆదాయం తగ్గడంతో క్రమంగా ఆస్తుల అమ్మకం ప్రారంభం అయింది.
నటనలో, సినిమాలకు దర్శకత్వం వహించడంలో బోలెడు ప్రతిభ ఉన్నా జీవించే కళలో ఆమెకు ప్రవేశం తక్కువే. అందుకే తన ఆస్తి ఎంతుంది, ఏమవుతోంది. ఆస్తిని ఎందుకు అమ్ముతున్నారు. ఇలా అమ్ముతూ పోతుంటే ఏమవుతుంది అనే ఆలోచన ఆమెకు రాలేదు. నిజానికి ఆమె ప్రమేయం లేకుండానే ఆస్తుల అమ్మకాలు సాగిపోతున్నాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత భవిష్యత్తు జీవితం గురించి ఆమె వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఉంటే బాగుండేది. ఎంత గొప్ప నటులకైనా సినిమా అవకాశాలు తగ్గే దశ ఒకటి వస్తుంది. అలాంటి దశను ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధం కావాలి. ఆమెకు అలాంటి ముందు జాగ్రత్త ఉండి ఉంటే సినిమా అవకాశాలు తగ్గినా, అప్పటి వరకు సంపాదించిన ఆస్తిని సరైన విధంగా చూసుకుంటే భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా గడిచేది. జీవిత కథ ముగింపు సుఖాంతం అయ్యేది. కానీ ఆమెకు సినిమా కథ అర్థమయినంతగా జీవిత కథ అర్థం కాలేదు. ఆస్తంతా కరిగిపోయి, ఆమె పేద రాజ్యలక్ష్మిగా మిగిలిపోయారు. ఆ సమయంలోనే కలైమామణి అవార్డు బహూకరించారు. రాజవైభోగాన్ని అనుభవించి వాహనం లేకుండా కార్యక్రమానికి వెళ్లడానికి మొహమాటపడ్డారు. ఆ సమయంలో మా అమ్మ కళ్లల్లో కన్నీరు చూసి తట్టుకోలేక పోయానని ఓ ఇంటర్వ్యూలో రాజలక్ష్మి కుమార్తె శ్రీమతి కమల చెప్పుకొచ్చారు.
పేదరికం ఆమెను కృంగదీసింది. పేదరికంపైన, సమస్యలపైన పోరాటం చేసే వయసు కాదామెది. వాటికి ఆమె లొంగిపోయింది. బిపి పెరిగిపోయింది. గుండెపోటు ఆమెను మంచానికే పరిమితం చేసింది. తన కుమార్తె కమలకు బహూకరించిన ఇల్లు తప్ప ఆస్తంతా అమ్మేశారు. ఏమైనా ఈ ఇంటిని మాత్రం అమ్మవద్దని కమలతో రాజలక్ష్మి ఒట్టు వేయించుకుంది. కుమార్తె సరే నంది. కానీ తల్లి చికిత్స కోసం ఆ ఇంటిని కూడా అమ్మక తప్పలేదు.
***
రాజలక్ష్మికి డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహల్ నుంచి ఒక అద్దె ఇంటికి తీసుకు వెళ్లారు. ఆమెకు మెలుకువ వచ్చిన తరువాత బెడ్ రూమ్ అంతా మారినట్టుగా ఉందేమిటని అడిగితే మార్పు కోసం ఒక బెడ్ రూం నుంచి మరో బెడ్‌రూమ్‌లోకి తీసుకు వచ్చినట్టు చెప్పారు. ఆమె చివరి క్షణం వరకు తాను ఇంకా రాజమహల్‌లోనే ఉన్నానని అనుకున్నారు. రాజలక్ష్మి చివరి రోజుల్లో మనవడు, కమల కుమారుడు రాఘవన్‌కు అందినెరవు అనే ఉత్సవాన్ని నిర్వహించాలని కోరింది. తనకు అవార్డుగా లభించిన కడియాన్ని కరిగించి మనవడికి బంగారు ఉంగరం చేయించింది. రాజలక్ష్మి 1964లో తనువు చాలించారు.
***
ఏ పాత్ర ఎలా ఉండాలి, ఏ పాత్ర ఎలా ప్రవేశించాలి, ఏ పాత్ర ముగింపు ఎలా ఉండాలో నాటకంలోనైనా సినిమాలోనే కచ్చితంగా ఒక ప్రణాళికా బద్ధంగా ఉండే రాజలక్ష్మి తన జీవిత కథ ఎలా ఉండాలో నిర్ణయించుకోలేక పోయారు. సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కొద్దిమందికే లభించవచ్చు. కానీ ఎవరి జీవితానికి వారే దర్శకులు. తన జీవిత కథ ఎలా ఉండాలో రాసుకునే అవకాశం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం