11, సెప్టెంబర్ 2023, సోమవారం
అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91
అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది ..
తెలుగునాట సానుభూతి రాజకీయలు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91
-------------------------------------
నవంబర్ 14, 2003 సచివాలయం విలేకరులతో కిక్కిరిసిపోయాయి ఉంది . అంతకు ముందే మంత్రివర్గ సమావేశం జరిగింది . అసెంబ్లీని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు . అప్పటికప్పుడు గవర్నర్ కు తీర్మాన ప్రతిని అందజేశారు . రాజ్ భవన్ నుంచి మంత్రివర్గ తీర్మానం మేరకు అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడింది . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరిస్తున్నారు . వెంటనే ఎన్నికలు జరగాలి అని కోరుకున్నారు . అసెంబ్లీ రద్దు గురించి బాబు చెబుతుండగానే ఇంగ్లీష్ ఛానల్ మహిళా రిపోర్టర్ ఒకరు మధ్యలో లేచి ఢిల్లీ నుంచి ఇప్పుడే సమాచారం వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేం , సమయం పడుతుంది అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ప్రకటించింది అని చెప్పగానే బాబు కంగారు పడ్డారు . ముఖకవళికలు మారిపోయాయి . పరిస్థితులు చేయి దాటి పోక ముందే ఎన్నికలు జరగాలి అని ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేశారు . రద్దు ప్రకటన చదువుతుండగానే పిడుగులాంటి వార్త వినడంతో బాబు కంగారు పడ్డారు .
99 లో స్వల్ప తేడాతో గెలవడం , 2001లో తెలంగాణ ఉద్యమం , వరుసగా మూడు నాలుగేళ్ల నుంచి కరువు వంటి పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితి చేయి దాటి పోక ముందే ఎన్నికలకు వెళ్లాలని బాబు అనుకున్నారు . 2003 అలిపిరిలో నక్సల్స్ తన వాహనం పై బాంబు దాడి చేశారు . ఈ దాడి నుంచి బయటపడ్డ బాబు దానిని అనుకూలంగా మార్చుకొని సానుభూతి పవనాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు .
వారం రోజుల చికిత్స తరువాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడుతారు అని సమాచారం . అప్పుడు సీఎం ముఖ్య పౌర సంబంధాల అధికారిగా ఉన్న విజయ కుమార్ మీడియా ఏమీ ప్రశ్నించవద్దు , బాబు చెప్పింది విని వెళ్ళాలి అంతే అనే షరతు తో లోనికి అనుమతి ఇచ్చారు . ఏమీ అడగవద్దు అని విజయ్ కుమార్ నాకు మరోసారి షరతు గుర్తు చేశారు .
అంతకు ముందు రోజే జ్యోతిలో కొమ్మినేని బాబు ముందస్తు ఎన్నికలకు వెళతారు అని రాశారు/ రాయించారు .
బాబు అరగంటకు పైగా మాట్లాడారు . ఆయన మాటల సారాంశం నామీద దాడి జరిగింది , ముందస్తు ఎన్నికలకు వెళతాను , నాకు ఓటు వేయండి అని అడుగుతున్నట్టుగా ఉంది అని జర్నలిస్ట్ మిత్రులతో నా అభిప్రాయం చెప్పాను . , సానుభూతి కోసం మంచి ప్రయత్నాలు చేశారు . ఇప్పుడు వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అప్పుడు టీడీపీలో కీలక నాయకులు వారికీ చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువచ్చి బాబుకు పిల్లలతో పూలు ఇప్పించారు . డక్కన్ క్రానికల్ లో సైతం స్కూల్ అమ్మాయి గులాబీ పూవు బాబుకు ఇస్తున్న ఫోటో మొదటి పేజీలో అద్భుతంగ వచ్చింది . ఆ తరువాత నియోజక వర్గాల వారీగా పార్టీ వారికీ టార్గెట్ విధించి ప్రతి రోజు బాబు ఇంటికి వచ్చేట్టు చేశారు . అంతరం పార్టీ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని నిర్ణయాలు . రాష్ట్రంలో నక్సలైట్లు విజృంభిస్తున్నారు , అసెంబ్లీ రద్దు చేస్తాం . మమ్ములను తిరిగి గెలిపించండి ఇదీ తీర్మానం . అధికారంలో ఉన్నది టీడీపీ , నక్సల్స్ విజృంభిస్తే కట్టడి చేయాల్సింది ప్రభుత్వం , ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీ రద్దు చేయడం ఏమిటో , తిరిగి అధికారం ఇవ్వమని కోరడం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు .
******
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడంపై ఆంధ్ర లో భిన్న వాదనలు గతమ్లో జగన్ ను అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయ్యారు , ఇప్పుడు బాబును అరెస్ట్ చేయడం వల్ల బాబు సీఎం అవుతారు అనేది తెలుగుదేశం వాదన . సానుభూతి వల్లనే జగన్ సీఎం అయ్యారు అని వాదించినా , సానుభూతి వల్ల బాబు సీఎం అవుతారు అని వాదించినా కోట్లాది మంది ఓటర్ల అభిప్రాయాలను చిన్న చూపు చూసినట్టే . ఒక పార్టీ నచ్చ డానికి , నచ్చక పోవడానికి ఓటర్లకు అనేక కారణాలు ఉంటాయి అంతే తప్ప నాయకుడికి జ్వరం వచ్చింది అనో జలుబు చేసింది అనో సానుభూతితో ఓడించరు , గెలిపించరు .
పాదయాత్ర చేయగానే సీఎం అని , అరెస్ట్ చేయగానే సీఎం అని చిత్రమైన విశ్లేషణలు చేస్తుంటారు . షర్మిల పాదయాత్రతో తెలంగాణ కాబోయే సీఎం అని రాసిన మీడియా మేధావులు కూడా ఉన్నారు . చివరకు ఆమె కనీసం ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు . పాదయాత్ర తోనే అధికారం వస్తే సిపిఎం తమ్మినేని వీరభద్రం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం సీఎం అయిపోవాలి . పాపం ఆ పార్టీకి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రతినిధ్యమే లేదు . అనేక అంశాలు ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి .
*****\
తెలుగు నాట సానుభూతి రాజకీయాలు కొత్తేమి కాదు. సానుభూతి ఎన్నికల్లో పని చేస్తుందా ? చేయదా ? అంటే ? పని చేసిన సందర్భాలు ఉన్నాయి , పని చేయని సందర్భాలు ఉన్నాయి . 84లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 పార్లమెంట్ సీట్లను గెలుచుకోండి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఎప్పుడూ రాలేదు . అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి సానుభూతి పవనాలు పని చేయలేదు . టీడీపీకి 30 సీట్లు వచ్చాయి . తొలిసారిగా పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది .
అరెస్ట్ చేయగానే సీఎం అని కొందరు జోష్యం చెబుతున్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మేలో అరెస్ట్ చేశారు . ఆ తరువాత 2014 లో ఎన్నికలు జరిగితే జగన్ సీఎం కాలేదు . బాబు ఐదేళ్ల పాలనా ప్రభావం వల్లనే జగన్ 2019 లో సీఎం అయ్యారు కానీ . 2012లో అరెస్ట్ అయ్యారనే సానుభూతితో కాదు .
కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఎన్టీఆర్ 94లో కాంగ్రెస్ ను ఓడించారు . 95లో ఎన్టీఆర్ ను బాబు గద్దె దించితే ఎన్టీఆర్ నల్ల దుస్తులు వేసుకొని సానుభూతి యాత్ర చేసినా పెద్దగా స్పందన లేదు . ఆంధ్రభూమి మినహా మీడియా పట్టించుకోలేదు . 94లో ఘనవిజయం చేకూర్చిన ప్రజలే 95లో పట్టించుకోలేదు . ఆయా సమయంలో పరిస్థితులే కీలక పాత్ర వహిస్తాయి కానీ , సానుభూతి , అరెస్ట్ లు , పాదయాత్రలు కాదు .
*******
ముందస్తు ఎన్నికల ఆశపై ఎన్నికల కమిషన్ నీళ్లు పోసింది . ఐతే సానుభూతి పవనాలు విచడం లేదు అనే విషయం దాదాపు అందరికీ అర్థమైంది .
అలిపిరి బాంబు దాడి తరువాత తిరుపతికి చెందిన టీడీపీ లీడర్ , బాబు మిత్రుడు , మున్సిపల్ ఛైర్మెన్ శంకర్ రెడ్డిని పిలిచి .... బాబు షర్ట్ రక్తంతో తడిసిపోయింది , నువ్వు లోకల్ కాబట్టి షాప్స్ షట్టర్ ఎత్తి ఐనా కొత్త షర్టు తీసుకురా అని పంపించారు . బాంబు దాడి వల్ల సానుభూతిగా తిరుపతిలో షాప్స్ అన్నీ మూసేస్తారు అని శంకర్ రెడ్డి అనుకున్నాడు . వెళ్లి చూసే సరికి అన్ని షాప్స్ లో బిజినెస్ యధావిధిగా జరుగుతోంది . ఈ విషయం శంకర్ రెడ్డినే ఎన్టీఆర్ భవన్ లో ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు .
*******
రాయలసీమకు చెందిన ఓ లీడర్ మంచి మిత్రులు ఓ రోజు ఫోన్ చేసి ఈ సారి మేం గెలవడం కష్టమే అని చెప్పుకొచ్చారు . అలిపిరి దాడి జరిగినప్పుడు షేరింగ్ ఆటోలో కొందరి ముచ్చట ఒకరు దాడి గురించి చెబితే మరొకరు అన్న మాట కార్యకర్త విని ... జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది . బాంబు దాడి జరిగినా కనీస సానుభూతి చూపడం లేదు అని ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చారు .
********
ఆరు నెలల ముందు అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు సకాలం లోనే జరిగాయి . ఏప్రిల్ 20న పోలింగ్ జరిగింది . బాబు జన్మదినం రోజున పోలింగ్ జరిగింది . ప్రజలు పుట్టిన రోజు కానుక ఇస్తారు చూడు అంటూ అప్పుడు ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణ గట్టిగా వాదించారు .
ఏ సానుభూతి పవనాలు పని చేయలేదు . అప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు వచ్చాయి . టీడీపీకి 47 స్థానాలు మాత్రమే వచ్చాయి . ప్రజలు తప్పు చేశారు అంటూ టీడీపీ మీడియా రాస్తూ పోయింది ఎప్పటి మాదిరిగానే . అలిపిరి సానుభూతి కథ అలా ముగిసింది ...
అదే సమయంలో బాబు పోతూ పోతూ వాజపేయి ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకు వెళ్లారు . ఇండియా షైనింగ్ నినాదం తో ముందస్తుకు వెళ్లి బీజేపీ బోర్లాపడింది . ఏ కారణమో తెలియదు కానీ అదే సమయంలో బంగ్లా దేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది . బాబు ముందస్తు తో బంగ్లా దేశ్ కూడా ముందస్తుకు అని తెలుగు మీడియా చాలా ముచ్చట పడి రాసింది .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం