6, సెప్టెంబర్ 2023, బుధవారం
చదువురాని ఓ జర్నలిస్ట్ కథ... మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88
చదువురాని ఓ జర్నలిస్ట్ కథ
మారుతున్న మీడియాకు ప్రతిరూపం ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88
-------------------------------------------
దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యత తో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండి పోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐ పోయాను అన్నాడు . టివి 9 సక్సెస్ అయ్యాక , 9 కి ముందో వెనుకనే కొన్ని అక్షరాలు , లేదా మరి కొన్ని తొమ్ముదులు చేర్చి చాలా నే ఛానల్స్ వచ్చాయి . అనంతరం ఈ తొమ్మిదులను చేర్చుకుంటూ పోతూ యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాయి . అందులో ఒక అనేక తొమ్ముదుల యూ ట్యూబ్ ఛానల్ లో తనను రిపోర్టర్ గా నియమించినట్టు ఐడెంటీ కార్డు చూపించాడు . ఎనీ బడి కెన్ డాన్స్ ( ఏబీసీ ) అని డాన్సర్ నటుడొకరు సినిమా తీసి జనం మీద వదిలినట్టు యూ ట్యూబ్ వాళ్ళు ఎవరైనా జర్నలిస్ట్ కావచ్చు అని మొత్తం జర్నలిజం మీదనే కక్ష తీర్చుకుంటున్నట్టు అనిపించింది . చక్కని ఐడెంటీ కార్డు తో నా ముందు నిలబడ్డ అతను మా మాజీ పని మనిషి భర్త ..
నువ్వేమన్నా రాజకుటుంబం నుంచి జర్నలిజం లోకి వచ్చావా ? పని మనిషి భర్త జర్నలిస్ట్ కాకూడదా ? ఎంత అహంకారం అని తొందరపడి తిట్టకండి . మా రోజుల్లో నైనా , ఈ రోజుల్లో ఐనా ఎక్కువగా పేదవారు , దిగువ మధ్యతరగతి వారే జర్నలిజంలోకి వస్తున్నారు . మధ్యతరగతి ఐతే ఇంజనీరింగ్ చేసి అమెరికా కో, కెనడాకో , ఇంకో దేశానికో వెళ్లి పోతారు . ఆ విషయం నాకు తెలుసు . నా సందేహం అది కాదు . అతనికి చదువు రాదు , పని గండం .
శివశంకరి అనే పాటతో బాలకృష్ణ గాయకుడు అయినట్టు , వినేవాళ్ళు , చూసే వాళ్ళు ఉంటే ఎవరు ఏమైనా కావచ్చు అభ్యన్తరం చెప్పఁడానికి నేనెవరిని . కానీ చదువు రానివారు జర్నలిస్ట్ ఎలా అవుతారు అనేదే నా అనుమానం . తరువాత ఆ అనుమానం తీరిపోయింది . అక్షరం ముక్క రావలసిన అవసరం , రాయాల్సిన అవసరం లేకుండా యూ ట్యూబ్ జర్నలిస్ట్ లను చేసేస్తుందని తెలిసింది .
*****
అతనితో మాట్లాడుతూనే యూ ట్యూబ్ లో రెండుకన్నా ఎక్కువ తొమ్ముదులు టైప్ చేసి చూశాను . ఓ ఛానల్ కనిపించింది . ఏడాది కాలం లో దాదాపు నాలుగు వందల మంది ఆ ఛానల్ చూశారు . ఇసుక మాఫియా అంటూ ఏదో స్టోరీ . విషయం అర్థమైంది .
అది సరే చదువుకోక పోయినా జర్నలిజం లోకి రావచ్చు అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని ఆసక్తిగా అడిగాను . అప్పుడప్పుడు అతను టెంపో నడుపుతాడు . టెంపోను ఓ యూ ట్యూబ్ ఛానల్ అతను అద్దెకు తీసుకోని నువ్వూ జర్నలిస్ట్ కావచ్చు అని ఐడెంటీ కార్డు అంటగట్టాడు . ( టెంపోకు అద్దె ఇచ్చాడో ఐడెంటీ కార్డు తోనే సరిపెట్టాడో నేను అడగలేదు అతను చెప్పలేదు )
అతన్ని అడిగిన మొదటి ప్రశ్న నెలకు ఎంత ఇమ్మన్నాడు అని ... భలే అడిగాను అని మనసులోనే నన్ను నేను అనుకున్నాను . ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , వెంటనే జీతం ఎంత అని అడుగుతారు . కానీ నేను ఎంత ఇమ్మన్నారు అని అడిగాను . నా ప్రశ్న కు అతనేమీ ఆశ్చర్య పోకుండా , ఇది కామన్ అన్నట్టు ఎంతో అనుభవజ్ఞుడిలా 25 వేలు ఇమ్మన్నాడు అని బదులిచ్చాడు . అతనికి 25 వేలు ఇవ్వాలి , నీకు ఎంతో కొంత కావాలి ఇదంతా ఎలా వస్తుంది అని అడిగాను . అతను రాదా ? అని లీడర్లు ఇస్తారు కదా ? అని బదులిచ్చాడు .
నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే రెండు వందలు ఖర్చు పెడితే జియో సిమ్ తో నువ్వే ఓ యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడున్న తొమ్ముదులకు మరో తొమ్మిది కలిపితే పేరు కోసం కూడా వెతకాల్సిన అవసరం లేదు అన్నాను . నాయకుల వద్ద బోలెడు వసూలు చేయవచ్చు అని ఉత్సాహంగా ఉన్న అతనికి అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు అని ..
మన లోకల్ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతరావు అతన్ని కలిసి నీ అనుభవం చెప్పు అని పంపించేశాను . అతను హనుమంతరావును.. కలిశారో లేదో తెలియదు మళ్ళీ నన్ను ఎప్పుడూ కలువ లేదు . గర్భస్థ శిశువు లా ఇంకా పురుడు పోసుకొని జర్నలిస్ట్ ను చంపేశానో లేదో తెలియదు .
****95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అప్పుడుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది . బాబు శిబిరం , ఎన్టీఆర్ శిబిరాలుగా టీడీపీ విడిపోయింది . ఈ రోజు వార్తలను మరుసటి రోజు రోజుకు గంట ప్రసారం చేసే రోజులు అవి .. కమ్యూనిస్ట్ పార్టీ శాసన సభ్యులు నర్రా రాఘవరెడ్డిని ఛానల్ మహిళా రిపోర్టర్ మీరు బాబు గ్రూప్ నా ? ఎన్టీఆర్ గ్రూప్ నా ? అని అడిగింది . రాఘవరెడ్డి కూడా టీడీపీ శాసన సభ్యలు అని ఆ అమ్మాయి అనుకుంది . అది విన్న తలపండిన జర్నలిస్టులు చాలా మంది ఆ ప్రశ్నను ఘోరమైన తప్పుగా చూశారు . దాన్నే తప్పు కుంటే ఈనాటి యూ ట్యూబ్ ఛానల్స్ జర్నలిజం ను ఏమనాలో ..
చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నగరం లోనే జీవితం . చిన్నప్పుడు పలువురు పేరు మోసిన రౌడీలా పేర్లు వినిపించేవి . పేర్లు వినే వణికి పోయే వాళ్ళం ... ఆ పేర్లలో ఇప్పటికీ బతికి ఉన్న కొందరి దివ్య మంగళ రూపాన్ని యూ ట్యూబ్ ఛానల్స్ వల్ల చూసే భాగ్యం లభించింది . ఆ పుణ్య దంపతుల ఇంటర్వ్యలు , వారి నిజ గృహంబులను చక్కగా చూపిస్తున్నారు . నా బాల్యంలో పేరు మోసిన రౌడీలు ఇప్పుడు యూ ట్యూబ్ ఛానల్స్ లో జాతిని ఉద్దేశించి చక్కని సందేశాలు కూడా ఇస్తున్నారు . యూ ట్యూబ్ ఛానల్స్ తరుపున ఇంటర్ వ్యూ చేసేవారు సైతం వయసుకు మించిన నటనా కౌశల్యం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలు వింటూ చక్కగా ఆశ్చర్యాన్ని నటిస్తున్నారు .
*****
యూ ట్యూబ్ ఛానల్స్ యేనా ? మిగిలిన మీడియా పవిత్రమైనదా ? అనే ప్రశ్న రావచ్చు . పార్టీలకు అనుబంధం లేకుండా ఏ మీడియా లేదు . ఈ దేశంలో మీడియా పుట్టిందే పార్టీలకు అనుబంధంగా . బ్రిటిష్ పాలనా కాలం లో కాంగ్రెస్ పార్టీ , మీడియా , స్వతంత్ర సమర యోధులు ఒకే లక్ష్యం తో పని చేశారు . దేశానికి స్వతంత్రం తేవాలి అనే లక్ష్యం తో కాంగ్రెస్ నాయకులే పత్రికలను ప్రారంభించారు . ఆ రోజులు , ఆనాటి మీడియా లక్ష్యాలు వేరు , ఇప్పుడు వేరు ...
ఇప్పుడు శాసన సభ్యులే కాదు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు , లోకల్ లీడర్లు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు . మా పార్టీ వాళ్లే యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చేశారు . డజన్ల కొద్ది యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న నాయకులు ఉన్నారు .
ఓ ఇంటర్స వ్యూ లో రాంగోపాల్ వర్మ వెల్లువెత్తిన యూ ట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ వీటిని ఎవరూ ఆపలేరు . కాలం గడిచిన తరువాత అబద్దాల ఛానల్స్ పోతాయి , నాణ్యత ఉన్నవి మిగులుతాయి అన్నారు . రోగాన్ని దాచిపెట్టుకుంటే ఆరోగ్యాంగా ఉన్నట్టు కాదు . రోగం ఉందని గుర్తిస్తే చికిత్స లభిస్తుందేమో . రాం గోపాల్ వర్మ జోస్యం నిజం కావాలి అని ఆశించడం తప్ప , ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు .
BUDDHA MURALI
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం