9, సెప్టెంబర్ 2023, శనివారం

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90 -------------------------------------- అర్ధరాత్రి ఇంటికి చేరుకొని ఎప్పటిలానే ఉదయం ప్రధాన రహదారి పైకి వెళ్లి చూస్తే ఇనుప చువ్వల వెనుక జైలులో బాబు ఉన్న పోస్టర్ లు , బేగంపేట వంటి ప్రధాన రహదారిలో భారీ హోర్డింగ్లను చూసి ఆశ్చర్యం వేసింది . వారి సామర్ధ్యం గురించి తెలియంది కాదు . అప్పటికే వారిని దగ్గర నుంచి ఒకటిన్నర దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాను . అయినప్పటికీ ఆ హోర్డింగ్ లు , పోస్టర్ లు చూసి వాళ్ళు మామూలోళ్లు కాదు అనుకున్నాను . రాత్రి మహారాష్ట్ర శివారులో అరెస్ట్ అయితే , తెల్లవారే సరికి హైదరాబాద్ లో ఇనుప చువ్వలు , జైలు లో బాబు బొమ్మలతో అంత భారీ హోర్డింగ్ లు ఎలా సాధ్యం అయ్యాయి అనుకున్నాను . బహుశా పోస్టర్ లు , హోర్డింగ్లకు ముందే ఏర్పాట్లు చేసుకొని ఉండవచ్చు . స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయితే ఇదే మొదటి సారి అని అనుకొంటున్నారు , 2010 లోనే భారీ అరెస్ట్ గుర్తుకు వచ్చి ... **** సరిగ్గా 13 సంవత్సరాల క్రితం . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు . తెలంగాణ కోసం తెరాస శాసన సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల ప్రచారం , తెలంగాణ ఉద్యమం కలిసి ఉదృతంగా సాగుతున్న రోజులు . ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లో నినాదం లేదు . మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ ను ఎడారిగా మారుస్తున్నారు అనే నినాదం తో టీడీపీ విస్తృతంగా ప్రచారం . శత్రు దేశం పైకి దండెత్తిన తీరులో ప్రజాప్రతినిధులు , పార్టీ నాయకులు మీడియా తో కలిసి చంద్రబాబు బాబ్లీ కి పయనం . ఇదేమి రాజరికం కాదు కొద్ధి మంది సైన్యం తో శత్రు రాష్ట్రం పై గెరిల్లా దాడి చేసి ఆ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోలేరు . ఏం చేస్తారో అంతా రహస్యం . మంత్ర సాని తనానికి ఒప్పుకున్నప్పుడు ఏమొచ్చినా పట్టుకోవాలి అనే సామెత చెప్పినట్టు టీడీపీ బీట్ రిపోర్టర్ అన్నప్పుడు వారు ఎటు వెళితే అటు వెళ్ళాలి . జూలై 16న 2010 న మీడియాతో కూడిన సర్వ సైన్త్యం తో చంద్రబాబు బృందం ప్రత్యేక బస్సుల్లో బయలు దేరింది . అచ్చం దండయాత్రకు వెళుతున్నట్టుగానే ఉంది . బాబు తరువాత తెలంగాణ నాయకుల్లో ఎర్ర బెల్లి దయాకర్ రావు , ఆంధ్ర నాయకుల్లో పయ్యావుల కేశవ్ లు బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు . చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాల్లో , గూఢచారి సినిమాల్లో ఎడారిని చూసి ఉండడం వల్ల తెలంగాణ ఎడారి అవుతుంది అని టీడీపీ నాయకులు చెప్పింది ఈజీగానే అర్థం అయింది . ******* బాసర లో భోజనానికి ఆగారు . నాకెంతో ఇష్టమైన సర్వ పిండి హోటల్స్ లో అమ్మడం బాసరలోనే తొలిసారి చూశాను . ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ అమ్మే చాలా వాటిలో సర్వ పిండి అమ్ముతున్నారు కానీ అప్పుడలా కాదు . నిజాం కాలేజీ గ్రౌండ్ లో తెలంగాణ సంబురాలు నిర్వహించి తెలంగాణ వంటకాలు అమ్మితే మొత్తం సర్వ పిండి అరగంటలో కనిపించకుండా పోయింది . అప్పుడు సర్వ పిండి తినాలి అంటే ఇంట్లోనే .. అందులోనూ అమ్మచేసిన సర్వపిండి రుచి చూశాక ...... అలాంటి పరిస్థితిలో బాసరలో సర్వపిండి అలా గుర్తుండి పోయింది . .. భోజనాలు అయ్యాక శత్రు సైన్యానికే కాదు సొంత సైన్యానికి కూడా చివరి నిమిషం వరకు దాడి తెలియకుండా ఉండడం యుద్ధ నీతి .. అటు నుంచి వాహనాలను ఎటు తీసుకువెళ్తారో , ఏం చేస్తారో తెలియదు . అప్పటి ఆంధ్ర , మహారాష్ట్ర సరిహద్దుల్లో ధన్ బాద్ సమీపం లో పెద్ద సంఖ్య లో పోలీసులు మోహరించారు . ఆంధ్ర నుంచి వచ్చిన బాబూ సైన్యాన్ని అక్కడే ఆపేశారు . అక్కడే ఉపన్యాసాలు .. చుశారా ? మీరేమో తెలంగాణ రాష్ట్రం కావాలి అని డిమాండ్ చేస్తుంటే మేం తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాం , అరెస్టులకు సిద్ధం అయ్యాం , ఇక నైనా మారండి అన్నట్టుగా పయ్యావ్యుల కేశవ్ తెలంగాణ కోరుకునే నాలాంటి వారికీ హితబోధ చేశారు . ఇదేమన్నా ఒక రాజ్యం ఇంకో రాజ్యం పై దాడి చేయడమా ? ఇలా చేస్తే తెలంగాణకు ఏం లాభం అంటే .. అరెస్టులకు సిద్దమైన ఆంధ్ర నాయకుల త్యాగాలు నీకు అర్థం కావు అని విమర్శ .. సరిహద్దుల్లో కొంత సమయం రాజకీయ ఉపన్యాసాలు , చప్పగా ఉన్నట్టు అనిపించింది . లాటీ చార్జీలు , తోపులాట అయితే తప్ప సరైన కవరేజ్ దక్కదు . మహారాష్ట్ర పోలీసులేమో మీ భూ భాగం లో మీరు ఏమైనా చేసుకోండి అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పోయారు . దాంతో బాబూ బృందానికి సహనం నశించి సరిహద్దు దాటి మహారాష్ట్రలో అడుగుపెట్టి బాబ్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే సాయంత్రం తరువాత ఈ బృందాన్ని అరెస్ట్ చేసినట్టు చూపించి ధన్ బాద్ లోని ఒక విద్యా సంస్థలో ఉంచారు . ఉప ఎన్నికల్లో ఎక్కడ గెలవరు , గెలుపు మాట దేవుడెరుగు డిపాజిట్ కూడా దక్కదు . ఉప ఎన్నికలు వెనకల్కి వెళ్లి తమ బాబ్లీ ఉద్యమం ముందుకు రావాలి అనే రాజకీయం అని తెలుస్తూనే ఉంది . అక్కడినుండి చేసేదేమి లేదని ఆఫీస్ కు ఫోన్ చేసి అనుమతి తీసుకోని హైదరాబాద్ వచ్చేశాను . ********** ఉదయం రోడ్డు మీద చూడగానే జైలు గోడల మధ ఇనుప చువ్వల వెనుక బాబు ఉన్నట్టు భారీ పోస్టర్ లతో నగరాన్ని నింపేశారు . ధన్ బాద్ లోని ఐ టి ఐ లో అందరినీ ఒకే చోట ఫ్రీ గానే వదిలేశారు . ఈ జైలు గోడలు , ఇనుప చువ్వల వెనుక బాబు ఎలా వచ్చారో అర్థం కాలేదు . అది సరే అరెస్ట్ తో అప్పుడు సానుభూతి వచ్చిందా ? అంటే ఉప ఎన్నికలను మరిచిపోయేట్టుగా మీడియా బాబు బాబ్లీ ఉద్యమానికే ప్రాధాన్యత ఇచ్చి కవరేజ్ తో అదరగొట్టినా .. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కే ప్రాధాన్యత ఇచ్చారు విజయం చేకూర్చారు . బాబు బాబ్లీ నాటకం మీడియా ప్రచారానికే పరిమితం అయింది . డిపాజిట్ లు కూడా దక్కలేదు . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం