19, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఎడిటర్ తో ఒక రోజు .... బీడీ కట్ట కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళు కూడా కెసిఆర్ ను తామే నడిపించామంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -94

ఎడిటర్ తో ఒక రోజు .... బీడీ కట్ట కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళు కూడా కెసిఆర్ ను తామే నడిపించామంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -94 ---------------------------------- ఈ మధ్య యూ ట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే బీడీ కట్ట కోసం , ప్లేట్ ఇడ్లీ కోసం ఎవరో ఒక్కరిపై ఆధారపడే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కెసిఆర్ కాదు మేమే ... మేం లేక పోతే కెసిఆర్ ఎక్కడ అంటూ బోలెడు మాట్లాడుతున్నారు . ఆ వీడియోలు చూస్తుంటే అలాంటి దృశ్యాన్ని మరికొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి నేరుగా చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది . ************* 2014 లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత సచివాలయానికి రోజూ వచ్చే వారు . భూమి ఎడిటర్ శాస్త్రి ఇంట్లో పెళ్లి కి పిలవడానికి ఎడిటర్ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ , మరో ఇద్దరితో కలిసి వెళ్లాం . దాదాపు మూడు గంటలు వేచి చూసినా పిలుపు రాలేదు . గతంలో ఛానల్స్ నాయకుడితో ఒక రోజు , నటులతో ఒక రోజు అని ఎన్నికల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చూపే వారు . యూ ట్యూబ్ ఛానల్స్ పెరిగాక వీధి రౌడీతో ఒక రోజు అని డబ్బులిస్తే చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి అవి వేరు . ఓనర్ తో , ఎడిటర్ తో ఒక రోజు అనే కార్యక్రమం రిపోర్టర్ లకు అగ్ని పరీక్ష లాంటిదే . తేడా వస్తే ఉద్యోగాలకే ప్రమాదం . టంకశాల అశోక్ ఎడిటర్ గా జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అంశాలు , వేటిపైన వార్తలు రాయవచ్చునో రిపోర్టర్ లతో మాట్లాడేవారు . అలానే ఆంధ్రప్రభలో గతంలో ఓ ఎడిటర్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి రిపోర్టర్ ని ఓ గుడి పూజారి పేరు అడిగితే చెప్పలేదు , ఎడిటర్ గుడికి వెళితే పూర్ణ కుంభ స్వాగతం పలక క పోవడం తో నువ్వేం రిపోర్టరువు అని చెడామడా తిట్టాడు . ఆ మీడియా ఈ మీడియా అని కాదు అన్ని చోట్ల బాస్ తో ఒక రోజు అంటే అది గండమే . ఎడిటర్ ఇంట్లో పెళ్లి , తెలంగాణ సీఎం ను పిలవడానికి కాబట్టి ఎడిటర్ తొలిసారిగా నన్ను వెంట తీసుకువెళ్లాడు . మూడు గంటలైనా లోనికి పిలుపు లేక పోవడంతో ఒక వైపు నేనూ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ బాధపడుతున్నట్టు నటిస్తూ , మరో వైపు సంతోష పడుతున్నాం . సంతోషానికి కారణం మా ఇద్దరికే తెలుసు . అక్కడి సిబ్బంది పరిచయం ఉండడం వల్ల కలిస్తే ప్రపంచ బ్యాంకు అధికారులు బయటకు రాగానే మీరు లోనికి దూసుకు వెళ్ళండి అని సలహా . అ లానే చేశాం . సీఎం కార్డు తీసుకోని నాకేమీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా మాములుగా అందరితో మాట్లాడి పంపించారు . ఎడిటర్ సమైక్య రాతలు, తెలంగాణ వ్యతిరేక రాతలు , తెలబాన్లు అని రాసిన చిల్లర మాటలు అన్నీ కెసిఆర్ చదివారు , గుర్తుంది . ఎడిటర్ మాత్రం అవి గుర్తు లేవేమో అనుకున్నారు . ********** హమ్మయ్య గండం గడిచింది . ఎడిటర్ తో ఒక రోజు ఎలాంటి ప్రమాదం లేకుండా గడిచింది అని బయటకు వచ్చాక ... రమణా చారి ఇక్కడే ఉన్నారుకదా ఫోన్ చెయ్ వెళదాం అని ఎడిటర్ అనగానే ఫోన్ చేసి బుద్దా మురళి అని చెప్పగానే అప్పుడు ఆంధ్రభూమి ఆదివారం లో వారం వారం రాస్తున్న ధనం - మూలం లో ఎక్కెడెక్కడి వారి గురించి భలే రాస్తున్నావు అని మాట్లాడుతుంటే .. నా పని ఐపోయింది అనుకున్నాను . ఎడిటర్ తో పాటు వెళ్లి రమణా చారి ఛాంబర్ లో కూర్చున్నాక ధనం - మూలం కాలం గురించే అలానే మాట్లాడారు . ప్రమాదం తప్పదు అని నిర్ణయించుకున్నాను . ******** ఉదయం నుంచి సాయంత్రం వరకు తినక పోవడం ఒకటి . సంతోషాన్ని పంచుకోవడం ఒకటి దారిలో సికింద్రాబద్ తాజ్ మహల్ హోటల్ లో తిన్నాం . సంతోషానికి కారణం ఏమంటే ఎడిటర్ తో సీఎంను కలిసినప్పుడు నాకూ , మిత్రుడు చంద్రశేఖర్ కు ఎక్కువ గౌరవం ఇచ్చి ఉంటే తెల్లారి నుంచి ఎడిటర్ పైరవీ పనులు , అయన రాసిన పుస్తకాలు అమ్మించే పనులు అప్పగిస్తారని భయపడ్డాం .. సీఎం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక పోవడం , మూడు గంటలు వేచి ఉండాల్సి రావడం తో ఎడిటర్ మా పై ఆశలు వదులుకొని ఆంధ్ర పై దృష్టి సారించాడు . **** సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ కు మరో ఇద్దరు జర్నలిస్టులతో కలిసి వచ్చే సరికి హోటల్ కౌంటర్ దగ్గర ఓ వ్యక్తి హోటల్ యజమానితో కెసిఆర్ ను నడిపించేది నేను , ఇప్పుడు ఇక్కడికి పిలిపించ మంటావా ?అని ఏదో మాట్లాడుతున్నాడు . ఇప్పుడు రెన్నొవేషన్ చేశారు . అంతకు ముందు సికింద్రాబాద్ పాత తరానికి చెందిన వారు అక్కడ కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు . బీడీ కట్టలకు కూడా ఇతరులపై ఆధారపడే వ్యక్తిలా ఉన్నాడు . మహా ఐతే హోటల్ యజమాని అతనికి ఓ ప్లేట్ ఇడ్లీ ఉచితంగా ఇస్తాడేమో , తెలంగాణ ఉద్యమాన్ని తానే నడిపినట్టు , కెసిఆర్ ను తానే నడుపుతున్నట్టు తెగ కబుర్లు చెబుతున్నాడు . ఎడిటర్ తో కలిసి వెళ్లి మూడు గంటలు నిలబడి కష్టంగా కలిసిన మేం ఆ మాటలు వింటూ నవ్వుకున్నాం . అప్పుడు ఎవరైనా యూ ట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే అతన్ని ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు . ఇప్పుడు ఇలాంటి వారి ఇంటర్వ్యూలు యూ ట్యూబ్ లో చాలా కనిపిస్తున్నాయి . ***** ఆ రోజు ప్రమాదం ఏమీ ముంచుకురాలేదు . మూడు నాలుగు రోజులు గడిచిన తరువాత ఎడిటర్ పిలిచి ధనం - మూలం కాలం చాలా రోజుల నుంచి రాస్తున్నావు కదా ? ఇక చాలు ఆపేయ్ అన్నారు . ఈ సంగతి నేను ఆ రోజే అనుకున్నాను అని మనసులోనే చెప్పుకున్నాను . అబ్దుల్ అని సినిమా రిపోర్టర్ సినిమా సమీక్షకు నంది అవార్డు వచ్చింది . జాగ్రత్త అని ముందే చెప్పాను . ఉత్సాహంగా ఎడిటర్ కు యెగిరి గంతేసి చెప్పాడు . ఆ మరుసటి రోజు నుంచి సినిమా రిపోర్టింగ్ నుంచి తొలగించి ఆదిలాబాద్ మఫిసిల్ డెస్క్ లో చేయమని చెప్పారు అట్లుంటుంది ఎడిటర్స్ తో ... - బుద్దామురళి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం