8, సెప్టెంబర్ 2023, శుక్రవారం
బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89
బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ...
జర్నలిజం పరిణామ క్రమం ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89
----------------------- -----------------------
ఇమ్లీ బన్ బస్సు డిపో , జూబ్లీ బస్సు డిపో , విజయవాడ , విశాఖ బస్సు డిపోల్లో ఏదో ఓ మూలకు కొన్ని బాక్స్ లు మీరు చూసే ఉంటారు. అన్ని దిన పత్రికలు తమ తమ పత్రికల పేర్లు రాసి అక్కడ బాక్స్ లు వేలాడ దీశారు . ఇప్పుడు వాటి ఉపయోగం లేకున్నా కొన్ని బస్సు డిపోల్లో ఆ బాక్స్ లు దుమ్ముకొట్టుకుపోయి ఇంకా అలానే ఉన్నాయి . వాటికో చరిత్ర ఉంది . మహా సామ్రాజ్యం కూలిపోయిన తరువాత శిధిలాలు కనిపించినట్టు ఒకనాటి మహా వైభవాన్ని ప్రదర్శించే విధంగా దుమ్ము పట్టిన ఆ బాక్స్ లు ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి . ఒకనాడు ఆ బాక్స్ లు సమాచార విప్లవానికి దోహదం చేశాయి . పత్రికల ప్రచురణ కేంద్రాల్లో రిపోర్టర్ లు ఆఫీస్ కే వచ్చి వార్తలు రాస్తారు . మరి జిల్లాల నుంచి వార్తలు ఎలా ? ముఖ్యమైన వార్తలు ఐతే ఫోన్ లో మిగిలినవి రాసి పంపాలి . రాసిన వార్తలను మండలాలు , జిల్లాల నుంచి స్థానిక జర్నలిస్ట్ లు బస్ స్టాండ్ కు వెళ్లి హైదరాబాద్ కు వెళ్లే బస్సు డ్రైవర్ ను పట్టుకొని అతనికో రెండు రూపాయలు , వార్తలు రాసిన కవర్ ఇస్తే , వాటిని హైదరాబాద్ డిపో లో ఉండే ఆయా పత్రికల బాక్స్ లలో వేసేవారు . ఒక్కో డ్రైవర్ వద్ద హైదరాబాద్ వెళ్లే సరికి ఒక్కో సారి 20-30 కవర్లు కూడా ఉండేవి . కవరు మీద ఆ పత్రిక లోగో అతికిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఏ పత్రిక కవరును ఆ పత్రిక బాక్స్ లో వేస్తే , పత్రిక కార్యాలయం నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆ కవర్లను రోజుకు రెండు సార్లు తీసుకువెళ్ళేవాడు .
ఆ కాలం లో కొన్ని పత్రికలు తమ రిపోర్టర్ లకు బేరింగ్ కార్డు లు ఇచ్చేవారు . అంటే పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వార్తలను టెలిగ్రామ్ గా పంపడం . డబ్బులు చెల్లించనవసరం లేదు . బేరింగ్ కార్డు చూపితే సబ్సిడీ తో తక్కువ ఖర్చుతోనే పంపేవారు . లెక్క చూపించి పత్రిక ప్రధాన కేంద్రం నుంచి డబ్బు తీసుకొనేవారు . ఇంగ్లీష్ లిపిలో తెలుగు రాసి టెలిగ్రామ్ పంపాలి . అది రాసే వారికి , టెలిగ్రామ్ పంపే ఉద్యోగి ఇద్దరికీ చాలా కష్టమైన పని .. వివాహ శుభాకాంక్షలు , పలానా వారు పోయారు వంటి రెండు మూడు సందేశాలకే టెలిగ్రామ్ పంపేవారు , అలాంటిది పేజీలకు పేజీలు ఇంగ్లీష్ లిపిలో తెలుగు వార్తలు పంపాలి అంటే ఇబ్బంది పడేవారు . 87లో నేను సంగారెడ్డిలో ఆంధ్రభూమిలో తొలి ఉద్యోగం . బేరింగ్ కార్డు ఇచ్చి పంపారు . టెలిగ్రామ్ కన్నా ఆర్ టీసీ డిపోలో బాక్స్ బెటర్ అనిపించింది .
******
1986-87 లో ఆంధ్రభూమి లో అప్పటి న్యూస్ ఎడిటర్ జొన్నలగడ్డ రాధాకృష్ణచొరవ తీసుకోని డిపోలో ఈ బాక్స్ ఏర్పాటు చేశారు . అంతకు ముందు ఆంధ్రపత్రిక కాలం లో ఆయా ప్రాంతాల్లోని పత్రిక ఏజెంట్ లే పోస్ట్ లో వార్తలు పంపేవారు . తరువాత జిల్లా కేంద్రాల్లో టెలిప్రింటర్ ల శకం మొదలైంది . సంగారెడ్డి లో నండూరి సాంబశివరావు ఈ టెలీ ప్రింటర్ గురించి తెలుసుకొని మా కన్నా మీరే నయం , మాక్కూడా అలాంటి సౌకర్యం లేదు అన్నారు . అప్పుడు అలా ఉండేది టెలిప్రింటర్ ఏర్పాటు చేస్తే టీపీ సెంటర్ ప్రారంభోత్సవం అంటూ కొన్ని పత్రికలు ప్రత్యేక సంచికలు వేసి ప్రకటనలు వసూలు చేసేవారు . పత్రిక వా.ళ్ళు టి పి సెంటర్ పెట్టుకొంటే రాజకీయ నాయకులు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలో ? ...
బస్సు డిపోలో బాక్స్ ల ద్వారా వార్తలు పంపే స్థాయి నుంచి సామాన్యుడు తన ఆత్మహత్యను ఫేస్ బుక్ లో ప్రపంచానికి లైవ్ గా చూపిస్తున్న కాలానికి వచ్చాము . 90 కి ముందు పత్రికా కార్యాలయానికి వార్తలు పంపాలి అంటే అదో యజ్ఞం లా ఉండేది . కానీ వార్తల సేకరణ జర్నలిస్ట్ కు పరీక్ష పెట్టే విధంగా , ఆసక్తి కలిగించే విధంగా ఉండేది .
ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంటే క్షణం లో ఫోటో లు పంపవచ్చు , సెల్ ఫోన్ లోనే వార్తను టైపు చేసి పంపవచ్చు . కానీ పెరిగిన ఈ సాంకేతిక విప్లవం జర్నలిజాన్ని మెల్లగా చంపేస్తోంది .
*******************
ఇప్పుడు కాలం మారింది . రిపోర్టర్ , సబ్ ఎడిటర్ ఇద్దరూ తిరుగుదామన్నా అవకాశం లేకుండా పోయింది . టెక్నాలెజీ పెరగడం , సామాజిక మాధ్యమాలు , వాట్స్ ఆప్ , కరోనా , రాష్ట్ర విభజన , మారిన పరిస్థితులు జర్నలిజాన్ని పూర్తిగా మార్చేసింది . ఒక్కో మీడియా ఒక్కో రాజకీయ పక్షానికి అనుబంధంగా మారిపోయింది . ఒక పార్టీ నాయకుడు విమర్శితే , మరో పార్టీ నాయకుడు ఎదురు దాడి , ప్రతి విమర్శ చేస్తాడు . కానీ చిత్రంగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పలానా నాయకుడికి గట్టి కౌంటర్ ఇచ్చిన పలానా నంబర్ టివి రిపోర్టర్ అనే శీర్షికతో ఛానల్స్ వార్తలు కనిపిస్తున్నాయి . ఒక వైపే కాదు అన్ని పార్టీల ఛానల్స్ లో ఇదే తీరు . రాజకీయ పక్షాల మధ్యనే కాదు ఛానల్స్ మధ్య కూడా రాజకీయ పోరు సాగుతోంది . ఒక పార్టీ ఛానల్ ను మీడియాను , మరో పార్టీ బహిష్కరిస్తోంది .
*****
రిపోర్టర్ అనే వాడు తిరగక చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతాడు అనేది మీడియా రంగంలో గతంలో వినిపించిన ఓ హితోక్తి . రిపోర్టర్ ఎంత ఎక్కువ తిరిగితే అంత ఎక్కువగా రాణిస్తాడు . అధికారులు నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి . జర్నలిజంలో పరిచయాలు అంటే సోర్స్ . ఎంత ఎక్కువ పరిచయాలు ఉంటే అంత బాగా వార్తలు రాయవచ్చు . నాలుగు దశాబ్దాల జర్నలిజంలో నేను చూసిన వారిలో అత్యధికంగా పరిచయాలు ఉన్న జర్నలిస్ట్ ఈ మధ్య మరణించిన సి హెచ్ వి ఎం కృష్ణారావు .
రిపోర్టర్ తిరగాల్సిందే , తిరగకుండా ఆఫీస్ లో కూర్చోని ఎవరో ఒకరి మీద ఆధారపడి వార్తలు రాస్తే ఆ వార్తల్లో జీవం ఉండదు . అందుకే రిపోర్టర్ తిరగక చెడిపోతాడు అంటాడు . మరి తిరిగి సబ్
ఎడిటర్ చెడిపోవడం ఏమిటీ ? అంటే వీరి సంఖ్య చాలా చాలా స్వల్పంగానే ఉండొచ్చు కానీ కొంతమంది సబ్ ఎడిటర్స్ , ఇంచార్జ్ లు నాయకుల వద్దకు తిరిగేవారు . పి . అశోక గజపతి రాజు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ ఎలాంటి పని చేయరు అని జర్నలిస్ట్ ల సర్కిల్స్ లో పేరు . అలాంటి అశోక గజపతి రాజు సైతం తమ ప్రాంతానికి చెందిన , హైదరాబాద్ లో పని చేసిన సబ్ ఎడిటర్ కు బాగానే పని చేసి పెట్టాడు అని చెప్పుకొనేవారు . ఎన్టీఆర్ మరణించిన కొత్తలో లక్ష్మీ పార్వతి , ఇంద్రా రెడ్డి ఓ సారి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుంటే ఒకరు కంగారుగా ఫోన్ చేసి పూర్వ జన్మ బంధం అన్నట్టుగా ఏదో చెబుతుంటే ఇంద్రారెడ్డి ల్యాండ్ లైన్ రిసీవర్ మీద చేయి పెట్టి ఫోన్ చేసిన జర్నలిస్ట్ పేరు చెప్పి ఎవరితను అని అక్కడున్న వారిని అడిగితే , ఓ పత్రికలో సబ్ ఎడిటర్ అని తెలిసింది . ఇంద్రారెడ్డి మనది జన్మ జన్మల బంధం అన్నట్టుగా తిరిగి అంతే ఆప్యాయంగా అతన్ని పేరు పెట్టి పలకరించి మాట్లాడితే ఆమ్మో ఇంద్రారెడ్డి అనిపించింది . ఈ సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోయాడు అనడానికి సజీవ ఉదాహరణగా నిలిచాడు .
********
ఇప్పుడు సబ్ ఎడిటర్ కాదు రిపోర్టర్ కూడా తిరిగే అవకాశాలు లేకుండా పోయాయి . సమాచారం క్షణాల్లో వాట్స్ ఆప్ లో పంపడమే . విలేకరుల సమావేశం అంటే కేవలం నాయకులు , అధికారులు చెప్పిన విషయం వినడానికి కాదు .. నిజానికి విలేకరుల సమావేశం తరువాత పిచ్చాపాటి మాట్లాడితే అనేక విషయాలు తెలిసేవి . రాజకీయ పరిణామాలు , పార్టీల్లో ఏం జరుగుతుందో పిచ్చాపాటి కబుర్లలోనే తెలిసేది . ఇప్పుడు అలాంటి అవకాశం పూర్తిగా తగ్గిపోయింది . ఒక వైపు సామాజిక మాధ్యమాల విస్తృతి , మరోవైపు రాజకీయ పక్షాలు , మీడియా అనుబంధం వల్ల మీడియా రూపురేఖలు మారిపోయాయి .
కెమెరాలు , ఫోటోలకు ఉపయోగించే పేపర్ అమ్మకాల్లో కోడాక్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండేది . ఇప్పుడు ప్రపంచంలో వందల కోట్లమంది రోజూ వందల కోట్ల ఫోటోలు తీస్తున్నారు . ఫోటోలు తీసేవారి సంఖ్య పెరిగింది కాబట్టి కొడాక్ వ్యాపారం పెరగాలి కానీ అలా జరగలేదు . మూత పడింది . కెమెరాలు , పేపర్ లు అవసరం లేకుండా సెల్ ఫోన్ లోనే ఫోటోలు తీసే రోజులు వచ్చాయి కాబట్టి కొడాక్ మూతపడింది . సాంకేతిక విప్లవం కూడా జర్నలిజం కు కొడాక్ లా కోలుకోలేని దెబ్బ తీసింది . జర్నలిజం ఉంటుంది . మీడియా ఉంటుంది కానీ అందులో గతంలోలా జీవం ఉందా ? అంటే ఏమో ..... ఎవరికి నచ్చినా , నచ్చక పోయినా మార్పు ఆగదు ..
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం