26, సెప్టెంబర్ 2023, మంగళవారం
శవం మీద టీడీపీ జెండా కప్పమని ప్రజారాజ్యం లోకి జంప్ .... మన్మోహన్ ను గెలిపించిన ...నేతల మాటల మర్మం చెప్పిన ఓషో జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 96
శవం మీద టీడీపీ జెండా కప్పమని ప్రజారాజ్యం లోకి జంప్ ....
మన్మోహన్ ను గెలిపించిన ...నేతల మాటల మర్మం చెప్పిన ఓషో
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 96
---------------------------------------------
జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివే వారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది .
నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి ఓషో రచనలు నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి . మాట్లాడే మాటల అర్థాలు వేరు కావచ్చు , కానీ వాటి వెనుక మతలబు వేరుగా ఉంటుంది .. ఆ మతలబును అర్థం చేసుకోవడంలో ఓషో రచనలు ఉపయోగపడ్డాయి .
********
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో ఎన్టీఆర్ భవన్ లో అప్పటి టీడీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం . సమావేశానికి ముందు , సమావేశం తరువాత నాయకులు మీడియాతో ఇష్టాగోష్టిగా మనసులో మాట మాట్లాడుతుంటారు . విలేకరుల సమావేశాల్లో పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినా అసలు విషయాలు ఇష్టాగోష్ఠిలోనే పంచుకుంటారు .
చిరంజీవి పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది ? అని సీతారాం విలేకరుల అభిప్రాయం అడిగారు . ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు . అంతంత మాత్రమే ప్రభావం ఉంటుంది .. నమ మాత్రంగానే సీట్లు గెలుస్తారు అని విలేఖరులు తమ అభిప్రాయం చెప్పారు . లేదు మీరు చూస్తూ ఉండండి ప్రజారాజ్యం ప్రభావం చాలా ఉంటుంది . బాగానే గెలుస్తారు అని తమ్మినేని చెప్పుకొచ్చారు .
విలేకరుల సమావేశం టైం కాగానే అదే తమ్మినేని స్టేజి మీదకు వెళ్లి వీరావేశంతో ప్రజారాజ్యంను , చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు . తమ్మినేని మాట తీరు ఏకపాత్రాభినయం లా గంభీరంగా ఉంటుంది . ఆవేశం తెచ్చిపెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించి .. అకారణంగా అంత ఆవేశంగా ప్రజారాజ్యంను తిడుతున్నారు అంటే చూస్తుంటే మీరు కూడా ప్రజారాజ్యం లోకి వెళుతున్నట్టు ఉంది అన్నాను . తమ్మినేని అంతే ఆవేశంగా ఏంటీ నేనా ? ప్రజారాజ్యం లోకి వెళ్లడమా ? చివరి వరకు టీడీపీలోనే ఉంటాను , నా శవం మీద టీడీపీ జెండా కప్పాలి అంటూ ఆవేశంగా చెప్పారు . విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన్ని మళ్ళీ పార్టీలో చూడలేదు . ఎందుకంటే అటుబుక్నుం లో చి ఆటే వెళ్లి ప్రజారాజ్యం లో చేరారు .
తమ్మినేని అంత ఆవేశంగా ప్రజారాజ్యంను విమర్శిస్తుంటే .. మీరు ప్రజారాజ్యంలోకి వెళ్లేట్టు ఉన్నారు అని ప్రశ్నించడం ఒక రకంగా చూస్తే అర్థం లేని ప్రశ్న అవుతుంది . కానీ ఓషో పుణ్యమా అని అలా ప్రశ్నించాను . నువ్వు ఏదైతే కాదో అది అని చెప్పడానికి ప్రయత్నిస్తావు అని ఓషో అంటాడు . మనసులో ఉన్నది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది అంటాడు ...
నాయకుడైన , మాములు వారైనా విలువల గురించి ఎక్కువగా మాట్లాడితే ఓషో చెప్పిన మాట ప్రకారం అతన్ని ఎక్కువగా అనుమానించడం నాకు అలవాటు .
కొల్లి ఇంటిపేరుతో ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . తెలంగాణ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ , అంతే ఘాడంగా టీడీపీని అభిమానించేవాడు . రాజకీయ పక్షాల్లో విలువలు ముఖ్యం అంటూ ఫేస్ బుక్ లో తెగరాసేవాడు . ఇప్పుడు ఎక్కడ ఉన్నడో తెలియదు కానీ .... తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు , బర్రెలు ఇప్పించే పథకం లో కొంతమంది తో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడితే అరెస్ట్ చేశారు . తరువాత ఏమైందో తెలియదు .
*************
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అణుఒప్పందం పై వామపక్షాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాయి . ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టారు . కోట్ల రూపాయలు ఇచ్చి టీడీపీ ఎంపిలను కొనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీడియాలో వార్తలు . ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఓ ఎంపీని పలకరిస్తే కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్నారని మీరు వార్తలు రాయడమే కానీ ఒక్కరు కూడా సంప్రదించలేదు అని నవ్వుతూ అనాన్రు . టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ , టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయం ఇంటి వ్యవహారం లా ఉండేది . వాళ్ళు వాళ్ళే కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకుంటారు . అదే కాంగ్రెస్ శాసన సభా పక్షం కార్యాలయం నానా జాతి సమితిలా ఉంటుంది . అన్ని పార్టీల నాయకులు , రిపోర్టర్ లు అక్కడికి చేరుకునే వారు . అన్ని పార్టీల వ్యవహారాలు అక్కడ చర్చకు వచ్చేవి .
పెళ్లి చేయుకుంటావా ? తాతా అంటే ఈ వయసులో పిల్లను ఎవడిస్తాడు అంటదు తాత . అంటే ఇస్తే చేసుకోవడానికి రెడీ అన్నమాట . మనసులో ఉన్నది ఇలా ఎలానో బయటకు వస్తుంది . ఓషో చెప్పిన దాని ప్రకారం .. ఇప్పటి వరకు ఒక్కరూ డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయలేదు అంటే ఆ ఎంపీ డబ్బులకు సిద్ధం అన్నమాట అని నా అభిప్రాయం నేను చెప్పాను .. తరువాత ఏం జరిగిందో , ఎవరు ఏం చేశారో , ఎంత ఇచ్చారో తెలియదు కానీ . టీడీపీ ఓట్లు రెండు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయి . ప్రభుత్వం నిలబడింది . ఎంపిలను కొనడం అనైతికం కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ దేశానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు .ఆ ను ఒప్పందం వల్ల దేశం ఈ రోజు శక్తి వంతంగా తయారు అయింది .. ధైర్యంగా నిలబడింది...
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం