29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

నూలు పోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తున్న మీడియా ... ఆ రోజుల్లో మీడియా అంతా కలిసి నాయకులను బహిష్కరించేవారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 97

నూలు పోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తున్న మీడియా ... ఆ రోజుల్లో మీడియా అంతా కలిసి నాయకులను బహిష్కరించేవారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 97 ------------------------- రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను, మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా ఉద్యోగం . అప్పుడు జిల్లాకు చెందిన బాగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం నాయకుడు జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు బీర్ తాగిస్తే ఏమైనా రాస్తారు అంటూ జర్నలిస్ట్ ను ఏదో తిట్టాడు . జిల్లా జర్నలిస్ట్ లకు చెప్పడంతో అంతా సమావేశం అయి ఆ నాయకుడిని మీడియాలో బహిష్కరించాలి అని నిర్ణయించారు . అటు నుంచి హైదరాబాద్ వచ్చి బాగారెడ్డిని కలిసి కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు . అప్పుడు నాయకులు ఏ మీడియా వారిని తిట్టినా అందరూ కలిసి బహిష్కరించేవాళ్ళు . బహిష్కరణ అంటే ఏ మీడియా కూడా ఆ నేత పేరు, అతని ప్రకటనలు ఉండవు . .93లో నల్లగొండలో పని చేసేప్పుడు నరసింహారావు అని జిల్లా కలెక్టర్ ఉండేవారు . ఈనాడు రిపోర్టర్ తో ఏదో వివాదం. అతని వార్తలు బహిష్కరించాలి అంటే ఎలా ? జిల్లాలో ప్రధాన వార్తలు కలెక్టర్ వే ఉంటాయి . కలెక్టెర్ వార్తలు రాయాలి కానీ , కలెక్టర్ పేరు రాయకూడదు అని నిర్ణయం . దాదాపు ఐదు ప్రధాన పత్రికల రిపోర్టర్ లు ముగ్గురు నలుగురు లోకల్ రిపోర్టర్ లు కాబట్టి నిర్ణయం అమలు ఈజీ . సాధారణంగా ఈనాడు రిపోర్టర్ లు యాజమాన్య నిర్ణయం మేరకు యూనియన్ కార్యకలాపాలకు దూరం , ఐతే ఇలాంటి దాడుల విషయంలో కలిసి వచ్చేవారు . ఓ వారం పాటు పట్టించుకోని కలెక్టర్ కు తరువాత తన పేరు లేకుండా తన వార్తలు రావడం చిరాకు వేసి అందరినీ పిలిచి ఏదో రాజీ పడ్డారు . డివిజన్ స్థాయి మొదలు కొని జిల్లా స్థాయి వరకు ఇలా బహిష్కరణలు ఆ రోజుల్లో కామన్ . ఓ సారి సదాశివపేట విలేకరులకు పొలిసు వారితో ఏదో వివాదం క్రైం వార్తలు బహిష్కరించాలి అని నిర్ణయం . సిఐ అత్యాచారం చేశాడు అనుకో ఆ వార్త రాయరా ? అని లోకల్ విలేకరులను అడిగితే ఏమీ చెప్పలేదు . ***** ఇప్పుడు బహిష్కరణలు మరింత ఉదృతంగా సాగుతున్నాయి . ఐతే జర్నలిస్ట్ లు అందరూ కలిసి నాయకుడిని బహిష్కరించడం కాదు . ఒక పార్టీ మీడియా మరో పార్టీ మీడియాను బహిష్కరిస్తోంది . ఆంధ్ర లో టీడీపీ వై యస్ ఆర్ పార్టీ మీడియాను బహిష్కరిస్తే , వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మీడియాను బహిష్కరించింది . మా మీటింగ్ కు మీరు రావద్దు అని చెప్పాము ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు . తెలంగాణ లో సైతం బి ఆర్ ఎస్ , బీజేపీ మీడియాలు పరస్పరం బహిష్కరించుకున్నాయి . మొదలుకొని దేశం వరకు ఇదే తీరు . తమిళనాడులో పార్టీ గుర్తు , ఆ పార్టీకి చెందిన ఛానల్ గుర్తు ఒకటే ఉంటుంది . మన రాష్ట్రం లో కొంత ముసుగు ఉండేది . పార్టీల ఆధ్వర్యంలో నడిచే మీడియా , పార్టీలకు మద్దతు ఇచ్చే మీడియాగా ఇప్పుడు రెండు మీడియాలు ఉన్నాయి . రెండు రాష్ట్రాల్లో చిన్న పార్టీ , పెద్ద పార్టీ అని కాదు అన్ని పార్టీలకు మీడియా ఉంది . శాసన సభలో ప్రాతినిధ్యం లేనికదా ? ఎందుకు వచ్చారు అని బహిరంగంగానే అడుగుతున్నారు . గతంలో ఆ రెండు పత్రికలు టీడీపీకి అనుకూలం , మాకు వ్యతిరేకం అంటూ వై యస్ ఆర్ బహిరంగంగానే అనేవారు కానీ బహిష్కరిద్దాం అంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక , అప్పటికి సొంత పత్రిక సాక్షి లేదు .. ఇప్పుడు ఏ పార్టీ పత్రిక ఆ పార్టీకి ఉండడం తో ఈజీ అయింది . . మీడియా రాజకీయ అనుబంధాలు కొత్తేమి కాదు కానీ ఇప్పుడు చిన్న నూలుపోగు కూడా అడ్డం లేకుండా మీడియా ఇప్పుడు నగ్న నృత్యం చేస్తోంది . 82లో టీడీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు బాధ్యతను ఈనాడు తన భుజాలపై వేసుకోంది . 82 నాటి టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఎం వి మైసూరారెడ్డి ఇంట్లో ఓ సారి చూశాను . ఈనాడు కార్యాలయంలో ముద్రించినట్టు మ్యానిఫెస్టో లోనే ఉంటుంది . టీడీపీ అనుకూల వార్తలు రాయడమే కాదు పెద్ద పెద్ద శీర్షికలతో ఈనాడులో టీడీపీకి ఓటు వేయండి , కాంగ్రెస్ ను ఓడించండి అని నినాదాలు ముద్రించేవారు . ఈ రోజులలో పార్టీ పత్రికలు కూడా అలా నినాదాలు ముద్రించవు .. ఐతే ఆ రోజుల్లో ఉన్న రాజకీయ వాతావరణంలో అది తప్పు అనిపించలేదు . ఈ తరం వారికి నమ్మశక్యం కాకపోవచ్చు ఇప్పుడు టీడీపీ కోసం ప్రాణాలు ఇచ్చే జ్యోతి ఆ రోజుల్లో కాంగ్రెస్ వైపు ఉండేది . ఆ పత్రిక యజమాని కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు . క్రమంగా మెజారిటీ మీడియా టీడీపీకి మద్దతుగా నిలవడం తమ సామాజిక బాధ్యతగా భావించింది . 95 లో ఎన్టీఆర్ ను దించే నాటికి అంతంత మాత్రంగానే సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రభూమి మినహా మెజారిటీ మీడియా బాబు కోసం , బాబు టీడీపీ కోసం అలుపెరుగని శ్రమ దానం చేసింది . ఎన్టీఆర్ లాంటి జనాకర్షణ గల నాయకుడు సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు . మీడియా తనను కుట్రతో దించేసింది అని .. ఈనాడు సంగతి తెలుస్తాను అని శ్రీశైలం లో మీడియాతో చెప్పిన వార్త ఈనాడులో చిన్నగా వచ్చింది . ఆలా చెప్పిన వారానికి ఎన్టీఆర్ మరణించారు . మీడియా మొత్తం టీడీపీ వైపు నిలవడం 95 నాటికి పీక్ స్టేజికి వెళితే .. ఆ తరువాత క్రమంగా రోజులు మారాయి .******** అన్ని పార్టీలకు సొంత మీడియా ఉంది . పార్టీలకే కాదు వ్యక్తులకూ ఉంది . ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు ఈనాడులో కనిపించవద్దు అని పేపర్ బాస్ హుకుం జారీ చేస్తే ఎంపీ యున్న ఎన్నికల్లో పోటీ చేసేవారి గురించి రాసేప్పుడు ఉండవల్లిని మినహాయించారు . యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఉండవల్లి సెలబ్రిటీ అయిపోయారు . ఈనాడులో పేరు కనిపించడం లేదు అని ఒకనాడు తపించిన ఆయన మాట్లాడితే యూ ట్యూబ్ లో లక్షల్లో చూస్తారు . ***** చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ తరువాత తెలుగు మీడియా కనీసం నూలుపోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తోంది . కొన్ని ఛానల్స్ , పత్రిక లు మొత్తం బట్టలు విప్పుకోలేదు కానీ .. కొన్ని ఛానల్స్ పత్రికలు జనం నవ్వుకుంటారు అని కూడా ఆలోచించకుండా నగ్న నృత్యాలు చేస్తున్నాయి . రాజమండ్రి జైలులో బాబుపై దోమలతో బయో వెపన్ ఉపయోగిస్తున్నారు , దోమలతో కుట్టించి చంపాలని చూస్తున్నారు అని మహా టివి చివరకు సీరియస్ వ్యవహారాన్ని నవ్వులాటగా మార్చేట్టు ఉన్నాయి . టివి 5 ఆవేశంతో పోతారేమో అన్నట్టుగా ఊగిపోతోంది . మేడం భువనేశ్వరీ నడుం బిగించండి అని అని టివి 5 పిలుపు ఇచ్చింది . మహా టివి , టివి 5, abn బాధ వర్ణనాతీతం . వీరికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఆంధ్ర లో రాష్ట్రపతి పాలన పెడుతున్నారు , అమిత్ షా తో అధికారుల తాట తీయిస్తున్నారు . సందట్లో సడేమియా అని మహా టివి ఏకంగా బాబుకు మద్దతుగా వంద దేశాల్లో ఉద్యమాలు చేయిస్తోంది . మా బాబు బంగారం అని టీడీపీ మీడియా 24 గంటలు కోడై కుస్తుంటే , బాబు దుర్మార్గుడు అని సాక్షి తీర్పులు ఇస్తోంది . శుక్రవారం ఆంధ్ర లో జరిగిన మీటింగ్ లో టీడీపీ పత్రికల పై జగన్ వ్యంగ్యోక్తులు విసిరారు . నిజానికి బాబు అరెస్ట్ ఎపిసోడ్ లో అన్ని ఛానల్స్ కన్నా మహా టివి ఎక్కువ వినోదాన్ని పంచుతోంది .ఐతే అన్ని ఛానల్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్ మహాటీవీ పేరు ఎత్తలేదు . పార్టీలు ఒకరినొకరు పొడుచుకొంటారేమో అనిపించేట్టుగా ఉంది . ప్రత్యర్థి పార్టీల మీడియాను పరస్పరం బహిష్కరించుకుంటున్నా .. తిట్టుకుంటున్నా .. క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్ట్ ల మధ్య అంత కక్షలు , పగలు ఏమీ లేవు . హాయిగా పని చేసుకుంటున్నారు . ఎందుకంటే యాజమాన్యాలు , యాజమాన్యాల పార్టీల రాజకీయాలు వారికి బాగా తెలుసు .. - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం