1, మే 2023, సోమవారం
మేధావులు పార్టీ పెడితే ....ఓ జ్ఞాపకం6
మేధావులు పార్టీ పెడితే ....
ఓ జ్ఞాపకం అసలే ఎన్నికల కాలం ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా , ఎవరికి సంతోషం వేసినా , ఎవరు ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వక పోయినా కొత్త పార్టీ పుడుతుంది . మంచి హోటల్ లో ఐదారుగురు కుటుంబ సభ్యులు డిన్నర్ కు వెళితే పది వేల బిల్ అవుతుంది . అలాంటిది ఓ పది వేల ఖర్చుతో ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేయవచ్చు . చేయవచ్చు కాదు అలా చేసిన వారు చాలా మంది ఉన్నారు . మేధావి పార్టీ పెడితే ఒక ఎలక్షన్ వరకు ఉంటుంది . అదే చాలా మంది మేధావులు కలిసి పార్టీ పెడితే ? పార్టీ పెట్టిన ఏడాదిలో చీలి పోయిన పార్టీలు , మూసేసిన పార్టీలు , కీచులాడుకున్న పార్టీల గురించి చాలా విని ఉంటారు . కానీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం లోనే , పార్టీ పుట్టుక , విభేదాలు , చీలిక , ఆవిర్భావ సమావేశమే ముగింపు సమావేశం కావడం .... ఒక్క సమావేశం లోనే అనేక ప్రత్యేకతలు నిలుపు కున్న పార్టీగా గద్దర్ , విమలక్కలతో పాటు పలువురు హేమా హేమీలు ఏర్పాటు చేసిన పార్టీకి దక్కుతుంది . తెలంగాణ ఉద్యమం ఉదృతం గా సాగుతున్న కాలం లో కెసిఆర్ వల్ల తెలంగాణ సాధ్యం కాదు , కెసిఆర్ సరైన రీతిలో ఉద్యమించడం లేదు అనే విమర్శలతో కొందరు మేధావులు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు . తమ పాటలతో లక్షలాది మందిని ఉర్రుత లూగించిన గద్దర్ , విమలక్క , ఇంకా చాలా మంది గాయకులు , ఉద్యమ కారులు పార్టీ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చారు . నిలోఫర్ ఆస్పత్రి దగ్గర లో ఉన్న ఒక హాలులో సమావేశం . పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు , తెలంగాణ అభిమానులు హాజరయ్యారు . గంటల తరబడి మేధావుల చర్చలు . లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నాలి అనే పాట విమలక్క అద్భుతం గా పాడారు . పలువురు మేధావులు ప్రసంగించారు . పార్టీ ఏర్పాటు చేయాలి, పార్టీ ఏర్పాటు చేసినా ఎన్నికల్లో పోటీ చేయవద్దు ఉద్యమానికే పరిమితం కావాలి అనేది ఓ వర్గం వాదన , ఎన్నికల్లో పోటీ చేయాలి అని గద్దర్ తదితరుల వాదన ... ***** వీరి వాదన సాగుతుండగానే ఓ పక్కన మీడియా ఓ పెద్దాయన తో మాటా ముచ్చట . ఆయన సుప్రీం కోర్ట్ న్యాయ వాది నృపేందర్ రెడ్డి . వారు మాజీ స్పీకర్ ఫై రామచంద్రా రెడ్డి కుమారుడు . వీరి పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని అడిగాను . మేధావులు పెడుతున్న పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు ఓ ఓ అంచనా ఉంది . ఐనా వారి అభిప్రాయం తెలుసుకోవాలి అని ఆసక్తితో అడిగాను .దానికి ఆయన ఆసక్తిగా అస్సాం గాయకుడు భూపేన్ హజారీకే తెలుసా అని అడిగి ఓ పాట చరణం వినిపించాడు . అస్సామీ అర్థం కాక పోయినా ఎప్పటి నుంచో ఆ పాట ఇష్టం . చాలా పాపులర్ కూడా ... తెలంగాణ , ఆంధ్ర ఏదైనా కావచ్చు ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఘంటసాల క్యాసెట్ ఉంటుంది . ఘంటసాల పాట ఇష్టపడతాం . మనకు ఘంటసాల ఎలాగో అస్సాం లో భూపేన్ హజారికా అలా . ప్రతి ఇంట్లో ఆయన పాట మారుమ్రోగుతుంది . అయన మరణించినప్పుడు భౌతిక కాయం దర్శించడానికి అస్సాం మొత్తం కదలి వచ్చింది . దర్శనానికి రోజులు పట్టింది . అలాంటి హజారికా బీజేపీ తరపున పార్లమెంట్ కు పోటీ చేస్తే ఐదు వేల ఓట్లు వచ్చాయి . గాయకుడిగా ఇష్టపడడం వేరు , ఎన్నికల్లో ఓట్లు వేరు . గద్దర్ , విమలక్క పార్టీ పెట్టి పోటీ చేసినా అంతే అన్నారు . గద్దర్ , విమలక్కపాట పాడితే లక్షల మంది వినడానికి వస్తారు . పాట వినడం వేరు ఎన్నికల్లో ఓటు వేయడం వేరు . అంతా తెలిసి మీరెందుకు వచ్చారు అనే కదా మీ సందేహం అని ఆయనే ప్రశ్నించి , ఆయనే సమాధానం చెప్పారు . ఢిల్లీలో తెలంగాణ వారు కొంత మంది ఉన్నారు . కెసిఆర్ అవకాశం ఇవ్వడం లేదు . వీళ్ళు పార్టీ పెడితే ఢిల్లీలో తెలంగాణ వారితో కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేయవచ్చు అనేది నా ఆలోచన అని ఆయన చెప్పుకొచ్చారు . **** ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత చర్చలు జరిగినా ఎన్నికల్లో పోటీ చేయాలి / చేయవద్దు అనే దానిపై ఏకాభిప్రాయం రాలేదు . రెండు విధాలుగా అర్థం చేసుకునే విధంగా ఓ తీర్మానం గద్దర్ చదివారు .. ఎటూ తేలకుండా , తేల్చకుండా సమావేశం ముగిసింది . మేధావులు పార్టీ పెట్టడానికి అదే మొదటి చివరి సమావేశం అయింది . ఈ బృందం మొత్తం అంతా కలిసి తిరిగి సమావేశం కాలేదు , పార్టీ పుట్టలేదు . ఆవిర్భావ సమావేశమే ముగింపు సమావేశం అయింది . కోదండరాం అయినా , మరెవరైనా పార్టీ పెట్టినప్పుడు ఈ ఉదంతాన్ని జర్నలిస్ట్ మిత్రులకు చెబితే అప్పుడే ఓ నిర్ణయానికి రాలేం , ఎన్నికలకు ఇంకా సమయం ఉంది అని మేధావులపై ఆశలు పెట్టుకొనే వారు . ఎన్నికలు వేరు , పాటలు వేరు , పత్రికలు వేరు , పత్రికల్లో వ్యాసాలు వేరు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం