2, మే 2023, మంగళవారం
లెక్కల తాబేలు - అంకెల మాంత్రికుడు
లెక్కల తాబేలు - అంకెల మాంత్రికుడు
ఓ జ్ఞాపకం 7
నాలుక పైనే అంకెలు , రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల్లో గొనె ప్రకాష్ వంటి వారు ఇంకొకరు లేరు .
పతంజలి గారు లెక్కల తాబేలు అని ఓ అద్భుతమైన కథ రాశారు . కథ సంక్షిప్తంగా . తాబేళ్ల రాజ్యం లో ఓ తాబేలు సరదాగా లెక్కలు నేర్చుకుంది. 27వ ఎక్కం ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఎలా అంటే అలా చెప్పగలదు . ఏ విషయం ఐనా లెక్కలతో చెప్పేస్తుంది . నృత్యం , భవన నిర్మాణం ఏదైనా కావచ్చు లెక్కలతో అద్భుతంగ చెబుతుంది ...లెక్కల్లో ఆ తాబేలును ఓడించే వారు లేరు . లెక్కల తాబేలు లెక్కల ప్రతిభ తాబేళ్ల రాజ్యం రాజుకు తెలుస్తుంది . రాజసభకు పిలిపించి ప్రతిభను పరీక్షించి ముగ్ధుడై రాజు తన కొలువులో ఉండమంటాడు ... ఏ విషయం ఐనా లెక్కల తాబేలు చెప్పే లెక్కలకు తిరుగు ఉండదు . లెక్కల తాబేలుతో చర్చించి రాజు నిర్ణయాలు తీసుకునే వారు . ఓ సారి లెక్కల తాబేలు రాజుతో రాజా మన దేశం లో తాబేళ్ల సంఖ్య పెరుగుతుంది . దేశం సరిపోదు పొరుగున ఉన్న కోతుల దేశం పై దండ యాత్ర చేసి ఆక్రమించు కుందాం అని లెక్కలు చెబుతారు .. తాబేళ్ల డిప్ప ఎంత బలంగా ఉంటుంది .కోతులు ఎంత శక్తితో ఎంత సమయం లో ఎన్ని సార్లు కొట్టగలవు . వాటిని తాబేళ్లు ఎలా తట్టుకోగలవు అని లెక్కలు చెబుతాడు ... రాజు ఆ లెక్కలకు సంతృప్తి చెంది పొరుగు దేశం పై దాడికి వెళ్తాడు తన తాబేళ్ల సైన్యం తో .....
***
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తెరాస పొత్తుతో పోటీ . కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది . మాతో పొత్తు వల్లే కెసిఆర్ గెలిచాడు అని ysr , ఇతర కాంగ్రెస్ నేతల విమర్శలు .. మాతో పొత్తు వల్లే మీకు అధికారం వచ్చింది అని తెరాస విమర్శ . దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి అని కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్ ..
సరే అని కెసిఆర్ రాజీనామా.... కరీంనగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ...
***
ఓ రోజు ఆంధ్రభూమి లో ఉండగా ఎడిటర్ శాస్త్రి పిలిచి కరీం నగర్ ఫలితం ఎలా ఉంటుంది అని అడిగితే ...
కెసిఆర్ గెలుస్తాడు అంటే తెలంగాణ వాదిగా కాదు మాములుగా చెప్పు అని అడిగాడు .. చాలా మందికి కోరిక , అంచనా ఈ రెండింటికి తేడా తెలియదు . నా కోరిక , అంచనా రెండూ ఒకటే ... అని బలంగా చెబితే .... లేదు ఓడిపోతున్నాడూ ఇదిగో లెక్కలు చూడు అని కొన్ని పేపర్లు ఇచ్చాడు . కరీం నగర్ చరిత్ర , గ్రామాలు , కులాలు , మతాలు , గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు గెలుపు ఓటముల వివరాలు .... దీని ప్రకారం తెరాస గెలువదు అని తేల్చారు .ఆలెక్కలు పాత చరిత్ర అన్నీ నిజాలే ... ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్ వద్ద కూడా లేక పోవచ్చు .. ఈ లెక్కలు మీకు ఇచ్చిన రిపోర్టర్ ఎవరో కానీ వాటిని తయారు చేసింది మాత్రం గొనె ప్రకాష్ ... మరెవరూ ఇలా తయారు చేయలేరు అని చెప్పాను ... ఈ లెక్కలు వేరు , ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పోరు వేరు అన్నాను ... నువ్వెంత చెప్పునా నా కెందుకో తెరాస ఓడి పోతుంది అనిపిస్తోంది అని ఎడిటర్ లెక్కల పేపర్ ను ఆసక్తిగా చూస్తూ అన్నారు . పైగా ysr సర్వశక్తులను కరీం నగర్ లో మోహరించాడు అన్నారు .
సార్ మీరు ఎడిటర్ నేను రిపోర్టర్ మీరు తలుచుకుంటే ఇప్పుడు నన్ను బదిలీ చేయవచ్చు , ఏమైనా చేయవచ్చు . నేను మీకు భయపడాలి ... అలాంటిది నేనే ఇలా ధైర్యం గా మీ అభిప్రాయానికి వ్యతిరేకం గా చెబుతుంటే .... కరీం నగర్ ఓటరు ఎవడికి భయపడతాడు ... ధైర్యంగా తెలంగాణకు ఓటు వేస్తాడు అని చెప్పాను ....
****
లెక్కల తాబేలు లెక్కలకు ముచ్చట పడి రాజు చేరదీసినట్టే ....
తెలంగాణ రానే రాదు ... ఢిల్లీ వెళ్లి వచ్చిన కెసిఆర్ ముఖ కవళికలు చూస్తే చెప్పేయ వచ్చు అంటూ గొనె చెప్పే అద్భుత మైన లెక్కలు గొనెను ysr కు సన్నిహితం చేశాయి . RTC ఛైర్మెన్ అయ్యారు ... లెక్కలతో చెలరేగి పోతున్నారు . కరీం నగర్ ఫలితం ఎలా రాబోతుందో గొనె చెప్పిన లెక్కలు వారందరికీ నచ్చాయి ..
కరీంనగర్ లో అంతకు ముందు ఎక్కడా పెట్టనంత ఖర్చు ... కాంగ్రెస్ తరఫున అన్ని కుల సంఘాలు మత సంఘాలు , చివరకు అసదుద్దీన్ ఒవైసి ని సైతం ysr రంగం లోకి దించారు . కరీంనగర్ లో తెరాస ఓడి పోతే తెలంగాణ వాదం అయిపోయినట్టే అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే వారు అనుకున్నారు . తెలంగాణ ఏర్పాటును కోరుకున్న వారు కూడా ఇదే అనుకున్నారు ..
****
తాబేళ్ల రాజ్యం రాజు కోతుల రాజ్యం పై దండయాత్రకు వెళ్లారు కదా ? ఏమైంది అంటారా ?
తాబేళ్లు దాడి చేయగానే కోతులు ప్రతిఘటించాయి .కోతులు తాబేళ్ల డిప్ప మీద కొడుతున్నా వాటికి ఏమీ కాలేదు ... అచ్చం లెక్కల తాబేలు చెప్పినట్టే జరుగుతోంది ..... ఓ సీనియర్ కోతి ముందుకు వచ్చి పిల్ల కోతుల్లారా తాబేలు తో పోరాడాల్సిన తీరు అది కాదు అని చెవిలో ఏదో చెప్పింది ... కోతులన్నీ సమరోత్సాహం తో తాబేళ్లను పట్టుకొని .... తలక్రిందులు చేసి కొట్టి చంపాయి ... డిప్ప మీద కొడితే ఏమవుతుందో లెక్కల తాబేలు చెప్పింది కానీ తల కిందులు చేసి కొట్టి చంపుతారని ఊహించ లేదు ...
****
కాంగ్రెస్ తెరాస పొత్తు తో పోటీ చేస్తే 50 వేల తో గెలిస్తే , తెరాస సొంతం గా పోటీ చేస్తే రెండున్నర లక్షల మెజారిటీ తో విజయం సాధించారు .
గొనె చెప్పిన లెక్కలకు ముగ్దులై చాలా మంది కరీంనగర్ పై పందెం కాసి పెద్ద మొత్తం లో నష్టపోయారు ... Clp వద్ద ఆ రోజు వినిపించిన మాటల్లో ఓ మార్వాడీ అతనే 50 లక్షలు నష్టపోయారు ...
తెలంగాణ రాదు అని గొనె చెప్పిన లెక్కలు . కరీంనగర్ లో తెరాస గెలువదు అని చెప్పిన లెక్కలు , తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా ,కరీంనగర్ గెలిచి 18 ఏళ్ళు అవుతున్నా , గొనె చెప్పిన ఈ లెక్కలు ఇప్పుడు విన్నా కన్విన్సింగ్ గా ఉంటాయి .
గొనె చెప్పే లెక్కలు , చరిత్ర లో ఒక్క అబద్దం ఉండదు . ఈ లెక్కలు , చరిత్ర ఆధారంగా భవిష్యత్తు లో ఏం జరగబోతుందో అతను చెప్పింది ఏదీ నిజం కాదు .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం