27, మే 2023, శనివారం
సకుటుంబ వెన్నుపోటు .. ^ ఇప్పుడు రాస్తున్నారు .. మరి అప్పుడెందుకు రాయలేదు ^ :: జర్నలిస్ట్ జ్ఞాపకం _________________
_________
`వెన్నుపోటు అని ఇప్పుడు రాస్తున్నారు . మరి అప్పుడెందుకు రాయలేదు ? మీ జర్నలిస్ట్ లంతా బాబు వైపే ఉన్నారు కదా ? `
అప్పటి జ్ఞాపకాలను రాస్తుంటే ఒకరు వ్యక్తం చేసిన సందేహం . 95 సంఘటన పై MIC టీవీ లో ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న అడిగారు . 90 శాతం మీడియా బాబు వైపే ఉన్నప్పుడు బాబు కోరుకున్నట్టుగానే మీడియాలో కవరేజ్ వస్తుంది . బాబు కోరుకున్నట్టు ఒక దుష్ట శక్తిపై బాబు సాధించిన విజయంగానే మీడియా చిత్రీకరించడం సహజం . ఐతే నేను ఇప్పుడే కాదు అప్పుడు కూడా వెన్నుపోటు అనే రాశాను . నా గొప్పతనం అని చెప్పడం లేదు . ఆంధ్రభూమిలో అప్పుడు నాకు లభించిన వకాశం జర్నలిస్ట్ మిత్రులు బుద్ధవరపు రామకృష్ణ వేటపాలెం గ్రంధాలయం నుంచి ఆగస్టు వెన్నుపోటుకు సంబంధించి అప్పటి అన్ని పత్రికల ఫోటోలు తీసుకున్నారు . ఆంధ్రభూమి కి సంబంధించి మొదటి పేజీ ఫోటోలు ఇచ్చారు . అప్పుడు ఎందుకు రాయలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాను కానీ అప్పటికప్పుడు ఆధారం చూపలేను కదా ? రామకృష్ణ పంపిన ఫొటోల్లో చూస్తే అల్లుడు ఒక్కరి వెన్నుపోటు కాదు , సకుటుంబ వెన్నుపోటు అని మొత్తం కుటుంబం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది నేను రాసిన వార్త 26 ఆగస్టు 1995 ఆంధ్ర భూమి లో కనిపించింది .
ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం , పత్రికా స్వేచ్ఛ వీటి మతలబు బాగానే తెలుసు . మీడియా స్వేచ్ఛ అంటే పెట్టుబడి పెట్టిన యజమాని స్వేచ్ఛ కానీ వార్తలు రాసే జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కాదు . తన మిత్రుడి అవినీతిని ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించే రోజులు ఇవి . సుప్రీం కోర్ట్ తీర్పును కూడా పక్కన పెట్టి ఢిల్లీ పై ఆర్డినెన్స్ తో అధికారం చెలాయిస్తున్న కాలం . ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన పాలకులే ఇలా ఉంటే .. తమ డబ్బు పెట్టుబడి పెట్టి , ఉద్యోగులకు జీతాలు ఇచ్చి లాభం కోసం పత్రిక నడిపే యజమానులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పత్రిక నడుపుతారు కానీ , న్యాయం , ధర్మం , పత్రికా స్వేచ్ఛ వంటి పడికట్టు పదాల కోసం పత్రిక నడపరు . ఐతే తమది వ్యాపారం , మాకు లాభం వచ్చేట్టు నడుపుతాం అని నిజాయితీగా ఒప్పుకోరు నిజాయితి , నీతి , పత్రికా స్వేచ్ఛ , ప్రజాస్వామ్యం అనే పడికట్టు పదాలను వాడుతూ పత్రికా వ్యాపారం నడుపుతారు . అప్పుడు మెజారిటీ మీడియా బాబు కోసం, బాబు చేత అన్నట్టుగా నడిచాయి . మిగిలిన పది శాతం లో ఆంధ్రభూమి స్వరం చిన్నది . అంతమందికి వినిపించే అవకాశం లేదు . అప్పటి వ్యవహారం లో మేజర్ మీడియా ఎన్టీఆర్ ను దించేయడం , బాబు ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు పెంచడం లో క్రియాశీలక పాత్ర వహించింది . ఆంధ్రభూమి యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదు . ఎడిటర్ కు వదిలేసింది . యాజమాన్యం ది విచిత్రమైన తత్త్వం . నమ్మితే పత్రిక ఓనర్ ఎడిటర్ నే అన్నంత గౌరవం ఇస్తారు . ఎవరు చెప్పినా వినరు . ఒక్కసారి నమ్మకం పోయింది అంటే గేటు బయట నుంచి అటు నుంచి ఆటే పంపిస్తారు . లోపలి వచ్చి ఛాంబర్ లో సొరుగు సర్దుకునేంత అవకాశం కూడా ఇవ్వరు . ముందుగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు భూమి వారి దృష్టికి రాలేదో మరేంటో కానీ ఆంధ్రభూమిలో వెన్నుపోటుపై స్వేచ్ఛగా రాసుకునే అవకాశం ఉండేది . కాంగ్రెస్ పేపర్ అని ఠక్కున అనేస్తారు .డీసీ యజమాని , ఆంధ్రజ్యోతి యజమాని ఇద్దరూ గతం లో కాంగ్రెస్ తరపున రాజ్య సభ సభ్యులుగా ఉన్న వారే . కాంగ్రెస్ రాజ్యసభ సభ్యునిగా డీసీ యజమాని ఉండేవారు , ఆంధ్ర జ్యోతి యజమాని ఉండేవారు . ఐతే జ్యోతి టీడీపీని భుజాన వేసుకుంది . డిసి యాజమాన్యం ఎన్నో కీలక సందర్భాల్లో వైయస్ ఆర్ కు , msr కు వ్యతిరేకంగా , టీడీపీకి అనుకూలంగా రాసింది . ఆ వివరాలు మరోసారి . 95 ఆగస్టు లో ఆంధ్రభూమి ఇచ్చిన స్వేచ్ఛను నేను పూర్తిగా ఉపయోగించుకున్నాను . స్వేచ్ఛ ఇచ్చినా ఉపయోగించు కోలేని వారిని చూశాను . ఆగస్టు సంక్షోభం అయినా , తెలంగాణ ఉద్యమం ఐనా అనుమతించిన మేరకు స్వేచ్ఛను జర్నలిస్ట్ గా ఉపయోగించుకున్నాను . నా జీవితంలో అదో గొప్ప సంతృప్తి . ఒక సీనియర్ దాదాపు 20 ఏళ్ళ తరువాత వెన్నుపోటు అని ఓ వ్యాసం లో రాస్తే నేను 95లోనే రాశాను అని గుర్తు చేశా ...
వెన్నుపోటుకు నెల ముందు మీడియాలో విపరీతంగా ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతికి వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి . బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ మిత్రుడితో ఈ అంశం పై అప్పుడు మాట్లాడితే మీడియా బాధితుడి వైపు ఉండాలి . అందుకే ఆ రాతలు అన్నారు . వాదన బాగానే ఉంది అనిపించింది . ఎన్టీఆర్ ను దించేశాక , ఇప్పుడు ఎన్టీఆర్ బాధితుడు కదా మరి ఇప్పుడు మీడియా ఎన్టీఆర్ వైపు ఉండాలి కదా ? బాబు వైపే ఉందేమిటి అని అడిగాను . గతంలో అయన వాదన గుర్తు చేస్తూ ... మిత్రుడు భుజం తట్టి రాజకీయాల్లో తమకు అనుకూలంగా ఉండే అనేక వాదనలు ఆ సమయానికి అనుకూలంగా ఉండేవి వినిపిస్తారు అని నవ్వారు .
చంద్రబాబు ఒక్కరే కాదు దగ్గుబాటి , ఎన్టీఆర్ కుమారులు , కుమార్తెలు అందరూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు అని సకుటుంబ వెన్నుపోటు అని రాశాను . ఎన్టీఆర్ కుమార్తె పురంద్రేశ్వరీ అప్పుడు దగ్గుబాటి ని ప్రోత్సహించి బాబు శిబిరంలోకి పంపించారు అని ప్రచారం . ఓ వ్యాసంలో ఈ మాట నేను అప్పుడు రాస్తే ఫోన్ చేసి , మిమ్ములను ఖండించమని అడగడం లేదు . మీకు విషయం తెలియాలి అని చెబుతున్నాను . ఆమె వెళ్ళమని నన్ను ప్రోత్సహించలేదు . నేనే నిర్ణయం తీసుకున్నాను . తండ్రి పరిస్థితిపై ఆమె బాధపడ్డారు అని చెప్పారు . ఇది మీరు రాయాలి అని చెప్పడం లేదు . మీకు వాస్తవం తెలియాలి అని చెబుతున్నాను అన్నారు .
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన మొత్తం కుటుంబం ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడు , పండుగ చేసుకోండి పూజించండి అని పిలుపునిస్తోంది . దేవుడు కాదు అని కోర్ట్ కు వెళ్లిన చిన్న నటిని మా నుంచి బహిష్కరించి పొట్టకొడుతున్నారు . దేవుడు కాదు అన్నందుకే మా నుంచి తరిమేసిన ఈ సినీ పెద్దలు వెన్నుపోటులో ఎన్టీఆర్ కు కాదు బాబుకు అండగా నిలిచారు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అప్పటి జర్నలిస్ట్ లలో , ఇప్పటికి రాసేది మీలాంటి అతి కొద్దీ మంది మాత్రమే , ఆ అతి కొద్దీ మంది లో, ఎదో ఒక స్టాండ్ తీసుకుని , రాసేది ఒకరో ఇద్దరో . వెటరన్ జర్నలిస్ట్ లలో , చాల మంది, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు , ఎదో ఒకటి సుత్తి రాసే జనాల కన్నా, మీరు వేయి రేట్లు మెరుగు.
రిప్లయితొలగించండి